Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nammakam - Telugu Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda

షికాగో ప్రయాణం
షికాగో విశ్వమత మహాసభకు రోజులు సమీపిస్తున్న కొద్దీ వివేకానందుని ఆవేదన పెరగసాగింది. ఇంతలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పండితులైన 'రైట్' స్వామితో ప్రసంగించటం జరిగింది. అతను వివేకానందుని ప్రతిభను గుర్తించి హిందూమత ప్రతినిధిగా సభలో పాల్గొనడానికి వివేకానందుని మించినవారు లేరని ఆ సభాధక్ష్యునకు తెలియచేసి మన స్వామికి అవకాశం కల్పించాడు. వివేకానందుడు బ్రహ్మానంద భరితుడయ్యి, మహాసభ రోజు ఉదయానికి షికాగో చేరుకున్నాడు. కాని మాసిన బట్టలతో వున్న స్వామిని ఎవరూ ఆదరించలేదు. ఆకలి బాధతో అతడు యాచించినా ఎవరూ కనికరించలేదు. ఇంతలో ఒక యువతి వచ్చి వివేకానందుని చూసి విశ్వమతసభకు అతను ప్రతినిధి అని తెల్సుకుని సాదరంతో ఆహ్వానించింది. అక్కడ వివేకానందునకు భోజన సదుపాయాలన్నీ చేయబడ్డాయి. భోజనానంతరం ఆవనితయే సభాస్థలికి తీసుకువెళ్ళింది. ఆకరుణా స్వరూపిణి "జార్జి హేల్ సతి".

మత మహాసభ
సెప్టెంబర్ నెల 1893 వ సంవత్సరం నాడు విశ్వమత మహాసభ ప్రారంభ దినం. వివిధ దేశాల నుంచి పేరు ప్రఖ్యాతులుగల తత్వవేత్తలెందరో దానికి హాజరయ్యారు. వారంతా ముందుగా తమ తమ ప్రసంగాలను సిద్ధం చేసుకుని మరీ వెళ్ళారు. కానీ మన వివేకానందుడు మాత్రం ఏమీ సిద్ధపడలేదు. ఉపన్యాసకులలో వివేకానందుని వంతు వచ్చినది. అతడు తన స్థానం నుండి లేచి ఒక్కసారి సభానంతనూ కలయచూసి "సోదర సోదరీ మణులారా" అని సంబోధించాడు. దానితో సభలో ఆనందోత్సాహాలు అతిశయించాయి. కళతార ధ్వనులు మిన్నుమిట్టాయి. సుమారు అరగంటసేపు ఆ సందడి ముగియనేలేదు. తర్వాత సనాతన ధర్మప్రాశస్త్యాన్ని గురించీ, సర్వమత సహనాన్ని గురించి స్వామి తన గంభీరోపన్యాసం ప్రారంభించాడు. నయాగరా జలపాతం వలె మహావేగంతో సాగిపోతున్న ఆ వుపన్యాసం అన్ని దేశాల ప్రతినిధుల్ని నిశ్చేష్టుల్ని చేసి బొమ్మవలె కూర్చోబెట్టింది. ఆ ప్రసంగ సారంశ విషయాలివి.

సర్వధర్మ సమన్వయ స్వరూపమే వేదాంతం - అన్ని మతాల ఆరాధనలూ భగవంతుని తత్వాన్ని తెలిపేమార్గాలే.

ఆత్మ నిత్యశుద్ధమైనది - జనన మరణాతీతమైనది - అద్వితీయమైనది. బేధాలన్నీ అజ్ఞానం వల్లే కనిపిస్తాయి.

ఆత్మ ఎల్లప్పుడూ సృష్టించబడేది కాదు. మరణం అంటే ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరించటమే.

మానవుని ప్రస్తుతస్థితి అతని పూర్వకర్మ ఫలితం. ఇప్పటి కర్మలు భావస్థితిని నిర్ణయిస్తాయి.

భగవంతుని దర్శనం కావాలంటే ముందుగా అహంకారాన్ని చంపుకోవాలి. జీవుని వ్యక్తిత్వమనేది బుద్ధిభ్రాంతి.

మానవుని "పాపి" అనడం కన్నా మహాపాపం లేదు. అతడు అమృతపుత్రుడు - ప్రకృతికి అధీనుడు కాడు - ప్రకృతియే అతని దాసి.

వేదాలు మనల్ని బంధించే నిర్జీవ శాసనాలు కావు. ఎవరి ఆజ్ఞవల్ల గాలివీస్తుందో, అగ్ని దహిస్తుందో, మేఘాలు వర్షిస్తాయో, మృత్యువు ప్రాణాల్ని తీసివేస్తుందో ఆ భగవానుని చేరే మార్గాలను ప్రకటించడమే వేదాల ఉద్దేశ్యం.

ఇలా అనేక మహోపదేశాలను తన ఉపన్యాసం ద్వారా వివేకానందుడు విశ్వమత మహాసభలో వెల్లడించి మహా ప్రవక్తగా ప్రసిద్ధికెక్కాడు. షికాగోలో స్వామికి బ్రహ్మరధం పట్టారు. షికాగోలోనికోటీశ్వరులు స్వామికి ఆతిద్యమీయడానికి పోటీపడుతూ ముందుకు వచ్చారు. అయితే అక్కడ వారి భొగలాలస జీవితాన్ని చూడగానే తన సోదర భారతీయుల దుస్థితి స్వామిని ప్రతినిమిషం కలవరపెట్టేది. వాటిని ఉద్ధరించడం కోసం తన ఉద్యమాన్ని ఎలా సాగించాలని ఆయన ఆలోచిస్తూ ఉండగా పెద్ద ఉపన్యాసంస్థ ఒకటి అమెరికా దేశమంతటా పర్యటించి ఉపన్యాసాలీయవలసిందిగా వివేకానందుని కోరింది. ఆయన అందుకంగీకరించి షికాగో, బోస్టన్, కేంబ్రిడ్జి, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాలలో ఉపన్యాసాలిచ్చాడు.

స్వామి ప్రతిభావిశేషాలను తెల్సుకుని కొందరు ప్రముఖులు ఇంగ్లాండు కు రావలసినదిగా ఆహ్వానించారు. అక్కడి ఆయన ఉపన్యాసానికి అందరూ సమ్మోహితులయ్యారు. అక్కడే గుడ్విన్, సెవియర్, మిసెస్, సెవియర్ అబే నలుగురు ఇంగ్లాండు దేశీయులు స్వామికి శిష్యులయ్యారు. ఈ నలుగురూ తర్వాత భారతదేశానికి వచ్చి అమోఘమైన సేవ చేసారు.

నాలుగు సంవత్సరాలు అమెరికాలోను, ఇంగ్లాండు లోను పర్యటించిన స్వామి తిరిగి భారతదేశానికి ప్రయాణమయ్యారని తెలియగానే, లండనులో ఆయనకు బ్రహ్మాండమైన వీడ్కోలు సభ ఏర్పాటుచేశారు. ఒక ఆంగ్ల మిత్రుడు స్వామిని "స్వామీ! సర్వ విశ్వర్యాలకు నిలయమైన పాశ్చాత్య ఖండంలో 4 సంవత్సరాలు నివసించిన తర్వాత మీ దేశాన్ని గురించి మీరేమని తలుస్తున్నారు?" అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా వివేకానందుడు "నేనిక్కడకు రాకముందు నాదేశాన్ని, ఊరినే ప్రేమించాను. ఇప్పుడు భారతదేశపు ధూళి కూడా పవిత్రమైనది. అక్కడ గాలి నాకు మహాభాగ్యము. ఇప్పుడు నాకు పావన పుణ్యక్షేత్రం భారతదేశమే" అన్నాడు.

మరిన్ని శీర్షికలు
Smt. Dokka Seethamma biography