Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Piracy Prevention Program

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతి గుర్తుంచు కోవలసిన ఆదర్శ నేత - శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి - జె వి కుమార్ చేపూరి

Lal Bahadur Shastri Biography

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశపు రెండవ ప్రధాన మంత్రి (9th June 1964 – 11 January 1966)

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ లోని ముఘల్సరాయిలో 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన శ్రీవాస్తవ  కాయస్థ కుటుంబంలో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామదులారి దేవి దంపతులకు జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి మొదట బడి పంతులు గా పనిచేసి తరువాత అలహాబాద్ లోని రెవిన్యూ కార్యాలయంలో గుమాస్తాగా స్థిర పడ్డారు. లాల్ బహదూర్ శాస్త్రి సంవత్సరం వయసులోనే తండ్రిని కోల్పోయారు. లాల్ బహదూర్ శాస్త్రి తల్లి రామదులారి దేవి కొడుకుని (లాల్ బహదూర్ శాస్త్రి) మరియు తన ఇద్దరు కూతుళ్ళను తీసుకుని తన తండ్రి గారింటికి చేరుకొని అక్కడే స్థిరపడి పోయింది. శాస్త్రి గారి చదువు మొగల్సరాయి మరియు వారణాసిలలో కొనసాగింది.

1926వ సంవత్సరంలో శాస్త్రి కాశీ విద్యాపీటం నుండి ప్రధమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. కాశీ విద్యాపీటం ఇచ్చే పట్టాను ఆ రోజులలో "శాస్త్రి" అనే పదంతో గౌరవంగా సంభోదించే వారు. ఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమై పోయింది. శాస్త్రి గారు మహాత్మా గాంధి, బాల గంగాధర తిలక్ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1921వ సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాని శాస్త్రి గారు అప్పటికి ఇంకా మైనర్ కావడంతో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను జైలు నుండి విడుదల చేసింది.

శాస్త్రి గారి వివాహం 1928 మే 16వ తేదీన మీర్జాపూర్లో లలితా దేవితో జరిగింది.

శాస్త్రి గారు 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. 1937వ సంవత్సరంలో శాస్త్రి గారు ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేసారు. 1940వ సంవత్సరంలో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనడంవల్ల తిరిగి జైలు పాలయ్యారు. ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదల అయిన తరువాత శాస్త్రి గారు మహాత్మా గాంధి చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత అలహాబాద్ చేరుకొని జవహర్ లాల్ నెహ్రుతో కలసి అనేక స్వాతంత్రోద్యమ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఫలితంగా తిరిగి జైలుపాలై  1946 వరకు జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయన దాదాపు తొమ్మిది సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలు శిక్షను గడుపుతున్న కాలంలో శాస్త్రి గారు ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చించారు. ఆ సమయంలోనే ఆయన విప్లవాత్మకతను, వేదాంతాన్ని, వివిధ సంస్కరణలను ఆకళింపు చేసుకున్నారు.

1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం సిద్దించిన తరువాత శాస్త్రి గారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రెటరీగా నియమిం చ బడ్డారు. ఆ వెంటనే ఆయన గోవింద వల్లభ పంత్ ముఖ్య మంత్రిత్వంలో పోలీసు మరియు రవాణా శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేసారు. పోలీసు మరియు రవాణా శాఖా మంత్రిగా అనేక విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. రవాణా శాఖా మంత్రిగా రవాణా వ్యవస్థలో మొట్ట మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించారు. పోలీసు శాఖా మంత్రిగా (ఆ రోజుల్లో హోం శాఖను పోలీసు శాఖగా పిలిచే వారు), అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాటీలకు బదులు నీటి గొట్టాలను (water jet) వినియోగించాలని ఆదేశించారు. ఆ సమయంలో ఎక్కువగా చెలరేగిన మత కలహాలను, సామూహిక వలసలను, అత్యంత సమర్ధవంతంగా అరికట్టి, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.

1951లొ నెహ్రు ప్రధాన మంత్రి నేతృత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జెనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలోనూ, 1952, 1957, 1962 లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించి అందరి మన్ననలను అందుకున్నారు. 1952లొ ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్య సభకు ఎన్నికయ్యారు. మే 13 1952 నుండి డిసెంబర్ 7 1956 వరకు కేంద్ర రైల్వే మరియు రవాణా శాఖా మంత్రిగా పనిచేసారు. 1956 సెప్టెంబర్ నెల మహబూబ్ నగర్లో  జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి. అయితే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆ రాజీనామాను తిరస్కరించడం జరిగింది. మూడు నెలల అనంతరం తమిళనాడు లోని అరియాలూర్లో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తిరిగి రాజీనామా సమర్పించారు.

జరిగిన ప్రమాదానికి శాస్త్రి గారికి సంబంధం లేకపోయినప్పటికీ, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ప్రకటిస్తూ నాటి ప్రధాని ఆ రాజీనామాను అంగీకరించడం జరిగింది. 1957లొ జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలుపొంది రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగాను, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖా మంత్రి గాను ఆ తరువాత హోం శాఖ మంత్రి (1961)  గాను దేశానికి సేవలనందించారు.  1964వ సంవత్సరం మే 27వ తేదీన నాటి ప్రధాని నెహ్రూ కన్ను మూయడంతో, ప్రధాని పదవి శాస్త్రి గారిని వరించింది. 1964 జూన్ 9వ తేదీన శాస్త్రి గారు ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ఇంగ్లీష్ భాషను అధికార భాషగా చేస్తూ తమిళనాడులో ఊపందుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించారు. జాతీయ స్తాయిలో పాల ఉత్పత్తిని పెంచే దిశగా శ్వేత  విప్లవాన్ని ప్రోత్సహించి, జాతీయ పాడిపరిశ్రామాభి వృద్ది సంస్థను (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) మరియు  అముల్ సహకార సొసైటీ  ఏర్పాటుకు ఎనలేని కృషి చేసారు.

1965వ సంవత్సరంలో జరిగిన 22 రోజుల భారత పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరో ఘనతను సాధించారు. యుద్దానతరం చిన్నాభిన్నమైన దేశ ఆర్ధిక మరియు రక్షణ వ్యవస్థలను  సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జై జవాన్, జై కిసాన్ అనే పిలుపునిచ్చారు. చైనా దేశంతో తలెత్తిన రక్షణ సమస్యలను శాంతియుతంగా, సమయస్పూర్తితో  పరిష్కరించారు. పాకిస్తాన్ యుద్ధానంతరం, శాంతి స్థాపన దిశగా శాస్త్రి గారు వివిధ దేశాల్లో పర్యటించారు. ఆ ఆశయ సాధన దిశగా శాస్త్రి గారు ఆనాటి పాకిస్తాన్ రాష్ట్రపతి మొహమ్మద్ ఆయుబ్ ఖాన్ తో కలసి తాష్కెంట్ (ఆనాటి USSR నేటి ఉజ్బెకిస్తాన్) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. 1966 జనవరీ 10వ తేదీన శాస్త్రి గారు, ఖాన్ గారు తాష్కెంట్ వాన్గ్మూలంపై సంతకాలు చేసారు. ఆ మరుసటి రోజే (1966 జనవరీ 11వ  తేదీ) శాస్త్రి గారు తాష్కెంట్ లోనే గుండె పోటుతో మరణించారు.  శాస్త్రిగారి ఆకస్మిక మరణం భారత ప్రజలు జీర్ణించు కోలేక పోయారు. ఆయన మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు మరియు అనుమానాలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా వుండే శాస్త్రి గారు పాకిస్తాన్ రాష్ట్రపతి తో కలసి తాష్కెంట్ వాన్గ్మూలంపై సంతకం చేసిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో  మరణించడం పలు అనుమాలకు తెరదించింది. తాష్కెంట్లో ఆయనపై విష ప్రయోగం జరిగిందనే బలమైన వాదన కుడా ప్రజల్లో వుంది. ఏది ఏమైనప్పటికీ భారత దేశం ఒక ఆదర్శ మూర్తిని, మహా నేతను,  గొప్ప దేశ భక్తుడిని  శాశ్వతంగా కోల్పోయింది.

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతి గుర్తుంచు కోవలసిన ఆదర్శ నేత. ఆ మహా నేతను ఆయన జయంతి (అక్టోబర్ 2వ తేదీ) సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం.

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi