Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

గుర్తుకొస్తున్నాయి...

ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాస్ గారు ఓ ఇంటర్వ్యూ లో చెబితే చదివాను. సినిమా ఇండస్ట్రీలో మనకి టైం వచ్చినపుడు దేనికీ టైం ఉండదని. ఏ రంగంలో అయినా మనం చేసే పనిని మనమే కమాండ్ చేస్తాం. ఈ రంగంలో మాత్రమే పని మనల్ని డిమాండ్ చేస్తుంది. దాన్ని బట్టే మనం పని చేయాలి. పని లేనప్పుడు ఇలా పాత జ్ఞాపకాల్ని తలుచుకుని రీఛార్జ్ అవ్వాలి. అదే ఈ వారం పని.

1987 నుండి 92 దాకా విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో ఇంటర్ రెండేళ్ళు, బిఎస్సీ. మూడేళ్ళు చదివిన స్టూడెంట్ ని నేను. కాలేజీలో క్లాసులకన్నా ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి కాలేజీని రిప్రెజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ప్రముఖ కాలేజీలనీ, వాటి ప్రత్యేకతలని, అక్కడ చదివిన, ఉద్యిగం చేసిన చారిత్రక పురుషుల్ని నేను చదివేశాను. వరంగల్ లో ఆర్. ఈ. సీ., హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ. రాజమండ్రి కె.ఆర్. కాలేజీ ఫర్ విమెన్, అమలాపురం ఎస్కెబిఆర్ కాలేజీ, విశాఖపట్నం బి.వి.కె. కాలేజీ. గుంటూరు హిందూ కాలేజీ, విజ్ఞాన్ కాలేజీ, విజయవాడలో శారద, లయోలా, సిద్ధార్థ ఇంజనీరింగ్, కోనేరు లక్ష్మయ్య  ఇంజనీరింగ్, సయ్యద్ అప్పలస్వామి, కె.బి.ఎన్ కాలేజీలు, కల్చరల్ అసోసియేషన్స్ లో నగరం, చీరాల, రేపల్లె, తిరువూరు, మచిలీపట్నం, వుయ్యూరు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు, కాకినాడ, ఖమ్మం, తదితర ప్రదేశాలు కాలేజీ ఖర్చులతో చూసేశాం. నాతో పాటు కల్చరల్ కాంపిటీషన్స్ కి నా ఫ్రెండ్స్ కొందరు, ఎకంపనీ అయ్యేవారు. వారిలో వివేక్, వంశీ, శేషశాయి, హనుమంత్, శివ, కేశవ్, మూర్తి (మామ), మా రెండో అన్నయ్య సుధాకర్, రవికాంత్. మల్లాది రవి, గిరి, కె.వి.ఎల్. నరసింహారావు(సింహం బావ) కె.ఎస్.వి. డి. శ్రీనివాస్, సురేష్ పాయ్, జంగా రవి ముఖ్యులు.

మల్లాది రవి అంటే ఈ రోజు కర్నాటక సంగీత విద్వాంసులుగా ప్రపంచమంతా పర్యటిస్తున్న ప్రముఖ సోదర ద్వయం 'మల్లాది బ్రదర్స్'లో చిన్నవాడు. నా 'నేనున్నాను' సినిమా లో హీరోయిన్ శ్రియ ఇంట్రడక్షన్ సాంగ్ 'మహా గణపతియే మనసాస్మరామి' పాటలో తండ్రి పాత్రకి పాడిన గాయకుడు. విజయవాడ ఆల్ ఇండియా రేడియో నిలయ విద్వాంసులైన శ్రీ మల్లాది సూరిబాబు గారి అబ్బాయి. వాళ్లన్నయ్య శ్రీరాం ప్రసాద్ లయోలా కాలేజీ నుంచి సింగింగ్  కాంపిటీషన్స్ కి వెళ్లి ప్రైజులు కొడుతుంటే, మా కాలేజీకి ఆ విభాగంలో లోటుందని, రవి టెన్త్ పాసవ్వగానే నేను వాళ్ళింటికి వెళ్ళి గొడవ పెట్టి మా సిద్ధార్థ కాలేజీలో చేరేట్టు చేశాను. తర్వాత అదే సింగింగ్ లో సింహంలా జూలు విదిలించాడు రవి. మా కాలేజీకి ఎన్నో ట్రోఫీలు తెచ్చాడు. వంశీ ఖమ్మం లో ఎస్.బి.హెచ్ లో బ్యాంక్ ఆఫీసర్ గా సెటిలైనా, ఇప్పటికీ అర్ధ రాత్రి ఫోన్ చేసి నిద్రలో లేపి, మనం స్టేజి మీద పాడిన ఫలానా పాటలో రెండో చరణం నాలుగో లైను ఏంటని అడిగితే తడుముకోకుండా చెప్పేస్తాడు.

కేశవ్ ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్రవర్తుల జగన్నాధాచారి గారబ్బాయి. అద్భుతమైన సోలో వయొలిన్ ప్లేయర్. జవహర్ కేంద్రీయ విద్యాలయంలో మ్యుజిక్ హెడ్ ఇప్పుడు. వివేక్ ఎకనామిక్స్ లో దిట్ట. ఆడిటింగ్ అసోసియేట్ గా బ్రహ్మయ్య అండ్ కో లాంటి పెద్ద కంపెనీ ఆఫర్ కూడా వదులుకుని నాతో చెన్నయ్ వచ్చి సినిమా ఆడిటర్ అయిన శ్రీ సుబ్బారావు దగ్గర చేరి ఇప్పుడు సతీష్ తో కలిసి సొంతంగా ఫర్మ్ పెట్టుకుని సినిమా రంగాన్ని వదలకుండా సహ నిర్మాతగా స్థిరపడ్డాడు. మా ఫ్రెండ్స్ అందరిలో ఇదే పరిశ్రమని నమ్ముకుని ఇవాళ్టికీ ఇక్కడే కంటిన్యూ అవుతున్న వాళ్ళం ముగ్గురం. నేను, వివేక్, మోహన్.

నాది, వివేక్ ది విచిత్రమైన స్నేహం. పూర్తిగా పరస్పర విరుద్ధమైన ఐడియాలజీ. అయినా ఇండివిడ్యూల్ గా చాలా ఎఫెక్షన్. ఒకపని చేసే ముందు దానిలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ లేకపోతే ఆ పని చేయకూడదన్నది అతని సిద్ధాంతం. లాభనష్టాలతో సంబంధం లేకుండా నచ్చిన పని చేసి దానిలో మజాని ఆస్వాదించడం నా నైజం. ఒక సృజనాత్మక శక్తికి, ఒక వ్యాపార దృక్పధానికి ఉన్నంత వ్యత్యాసమే మా మధ్య కూడా ఉంది. కానీ దాన్ని మించి ఒకరిపైన ఒకరికి వ్యక్తిగతంగా గౌరవం, అభిమానం ఉండడం వల్ల ఇప్పుడు కూడా స్నేహితులం అని చెప్పగలుగుతున్నాం. మూర్తి మామ అమెరికాలోని ర్యాలీలో, శివరామారావు కెనెడాలో, గిరిధర్ అబ్బరాజు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్  కంపెనీలో, సింహం బావ రెడ్డి ల్యాబ్స్ లో, శేషు ముంబై లోని హిందుస్తాన్ లివర్స్ లిమిటెడ్ లో, హనుమంత్ అహ్మదాబాద్ లో, మా రెండో అన్నయ్య సుధాకర్ హైదరబాద్ హెచ్ ఎస్ బి సి లో స్థిరపడిపోయారు.  మోహన్ ది మా గ్రూప్ లో విభిన్నమైన శైలి. వాళ్ళమ్మ గారు, నాన్నగార్ల నుంచి వచ్చిన గొప్ప లక్షణం అతని మంచితనం. బిఎస్సీ కంప్యుటర్స్ చదివి , ఎమ్మెస్సీ చేయాల్సిన టైం లో నా దగ్గరికి వచ్చేసి ఎడిటింగ్ అసిస్టెంట్ గా జాయినై, అవిడ్  ఎడిటరై సింగపూర్లో కొన్నేళ్ళు 'హవా'యించి ఇప్పుడు హైద్రాబాద్ వచ్చి దర్శకుడవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. రవికాంత్ 'మాటివీ'లో ప్రోగ్రామింగ్ హెడ్ గా స్థిరపడ్డాడు. మేమందరం కలిసి సిద్ధార్థ కాలేజ్ లో సృజనోత్సవ్ - ఏ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల విద్యార్థినీ విద్యార్థులకు రెండ్రోజుల యూత్ ఫెస్టివల్ నిర్వహించేవాళ్ళం. వరంగల్ ఆర్. ఈ.సీ.లో స్ప్రింగ్ స్ప్రీ ఇచ్చిన స్ఫూర్తితో. అలా మొదటిసంవత్సరం సృజనోత్సవ్ లో డిబేట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కులశేఖర్ తరవాత కాలంలో ప్రముఖ గీత రచయిత అయ్యాడు. లైట్ క్లాసికల్ లో  ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సునీత 'గులాబి' సినిమాతో ప్రముఖ నేపధ్య గాయని అయ్యింది. వీళ్ళిద్దరూ అంతకుముందే మా స్నేహితులందరికీ సుపరిచితులు. సునీత, రవి వాళ్ళకి దూరపు బంధువు కూడా.

క్లాస్ మేట్స్ లో స్నేహితులు చాల మందే వున్నా, కల్చరల్ యాక్టివిటీస్ లో ఈ స్నేహితులందరూ వేరే వేరే గ్రూపులు, సీనియర్లు, జూనియర్లు అయినా, మా మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువ. లయోలా కాలేజీ నుంచి ఇంద్రగంటి మోహనకృష్ణ (ఇవాల్టి ప్రముఖ దర్శకుడు, రచయిత) డిబేట్స్ లో నాకు ప్రత్యర్ధి. కానీ అంతకుముందే వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో క్లాస్మేట్స్ అవ్వటం, మంచి ఫామిలీ ఫ్రెండ్స్ అవ్వటం మూలంగా నాకు, మోహనకృష్ణ కి వైరం కన్నా, స్నేహం ఎక్కువ వుంది.

కొంతమంది వాళ్ళ మంచితనం వల్ల పేరు తెచ్చుకుంటారు ... మా నాన్న గారి లాంటి వాళ్ళు ! ఇంకొంతమంది వాళ్ళ చుట్టూ వున్న మంచివాళ్ల వల్ల పేరు తెచ్చుకుంటారు... నాలాంటి వాళ్ళు. నేను పైన ఉదహరించిన నా స్నేహితులే నా ఆస్థి. వాళ్ళు లేకపోతే నేను నాస్తి. మనసంతా నువ్వే, శ్రీరామ్ సినిమాల షూటింగ్ లప్పుడు ఉదయ్ కిరణ్, ఆట సినిమా అప్పుడు సిద్ధార్థ్ నాతో అంటుండేవారు "యూ ఆర్ రిచ్ బై  ఫ్రెండ్స్ - యూ ఆర్ లక్కీ" అని. అది నిజం.

నేను సినిమా దర్శకుడిని అవుతా అని కాలేజ్ పేరునే బ్యానర్ గా పెట్టి నిర్మాతగా మారి (ఆ బాధ్యత వివేక్ తీసుకుంటాడని), సొంత సినిమాలు తీస్తానని 92లో విజయవాడ లో రాజీవ్ గాంధీ పార్క్ లో సర్వ స్నేహ సభ్య సమావేశం పెట్టి మొట్టమొదట సారి వీళ్ళకే చెప్పాను. అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎంట్రీ లేదు. జస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అంతే . తర్వాత నేను చెన్నై వెళ్లి ''భైరవ ద్వీపం" కి పనిచేసాక రెండో సినిమా 'నమ్మవర్' కి జీతం రావటం మొదలైన వెంటనే రూమ్ నుంచి ఫ్లాట్ కి మారి వివేక్ ని, మోహన్ ని, మోహన్ వాళ్ళ అన్నయ్య రాజశేఖర్ ని, మా రెండో అన్నయ్య సుధాకర్ ని, కొన్ని రోజులు వంశీ ని, ఇంకొంచెం ఎక్కువ రోజులు కేశవ్ ని చెన్నై షిఫ్ట్ చేసేసాను . మిగిలిన వాళ్ళంతా గెస్ట్ ఎప్పియరెన్స్ లు .

మేం ఏడుగురు వుద్యోగస్తులం. అప్పుడే మా దగ్గరున్న డబ్బులతో 'ఐకమత్యం' అనే షార్ట్ ఫిలిం ని వీ హెచ్ ఎస్ కెమెరా లో షూట్ చేసి (ఇప్పుడు ఫేమస్ ఫోటోగ్రాఫర్ ప్రసాద్ గారబ్బాయి వేణు మా కెమెరామెన్. యు ఎస్ లో స్థిరపడ్డాడని విన్నాను.) మోహన్ ఎడిటింగ్ చెయ్యగా నేను స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేశాను. అలా డబ్బులు పాడిచేయ్యటం కూడా వివేక్ కి ఇష్టం లేదు. ఇలా 'రెయిన్ బో ' తీయటం కూడా వివేక్ కి ఇష్టం లేదు. అయినా అనుకున్నది చేసి దాని ఫలితాన్ని మంచైనా , చెడైనా అనుభవించాలన్న మొండితనమే దర్శకుడిగా నన్ను తృప్తిపరిచే అంశం. నా గమ్యం నేను చేసేపని. నేను సంపాదించే ఆస్థులు కావు. ఆ దారిలో వస్తూ పోతూ ఉంటాయ్ ఆస్థులు, మర్యాదలు, అవమానాలు. కానీ ఈరోజుల్లో మనిషి గౌరవం, విలువ అతని వెనుకున్న డబ్బు. డబ్బుకు చరించే గుణం ఉన్నది. స్థిరత్వం లేదు. అందుకే గౌరవాలు కూడా మనిషి టు మనిషి మారిపోతూ ఉన్నాయి. అది నాకు నచ్చదు. అందుకే, నేను చాలా మందికి నచ్చను. తప్పులేదు. కొందరు ఈ రోజులకి తగినట్టు ఉంటారు ప్రాక్టికల్ గా. ఇంకొందరు ఏ రోజైనా ఒకేలా ఉంటారు థియరిటికల్ గా. రెండూ కరెక్టే. ఎలాగోలా ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం ప్రధానం.

అన్ని వ్యాసాలూ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల గురించే రాస్తున్నాను. కానీ, నన్ను ప్రముఖణ్ణి చేయడం కోసం పరిశ్రమించిన నా స్నేహితుల కోసం ఈ వ్యాసం రాయాలనిపించింది. బలభద్రపాత్రుని రమణి గారు కౌముదిలో వాళ్ళన్నయ్యతో ఆమె చిన్నప్పటి సాన్నిహిత్యం గురించి అందంగా రాసింది చదివాక, నాకీ ఐడియా వచ్చింది. ఆమెకి థాంక్స్.

(వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Superhit movie in five languages