Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహార యాత్రలు (థాయ్ లాండ్ ) - కర్రా నాగలక్ష్మి

thailand

బేంకాక్ ( వాట్ ట్రైమిట్ )

కిందటి సంచికలో మనం ‘ ఎమరాల్డ్ బుద్ద ‘ గురించి చదివేం కదా , ఎమరాల్డ్ బుద్ద చూసిన తరువాత రాజభవన దర్శనం పూర్తయింది .      మావారు పని చేసిన కంపెనీ బ్రాంచ్ థాయిలాండు లో ‘ పట్టాయా ‘ నగరంలో వుండేది . అగ్రిమెంటు ప్రకారం బ్రాంచి మేనెజింగ్ డైరెక్టరుతో సమానమైన హోదాలో వుండేవారు , కాబట్టి మాకు మేం ఆ దేశం లో వున్నన్ని రోజులు కారు డ్రైవరుతో సహా యివ్వడం జరిగింది . ప్రతీ వీకెండుకి థాయిలాండులో పర్యాటక ప్రదేశాలు చూడడానికి వెళ్లేవారం . సాధారణంగా మనదేశం నుంచి వచ్చేవారు తక్కువరోజులలో చూడదగ్గ ప్రదేశాలను మీకు తెలియజెయ్యాలనే ఉద్దేశ్యంతో ముందుగా బాగా పేరుపొందిన ప్రదేశాలను పరిచయం చేస్తున్నాను .

రాజ భవనం తరువాత రాజభవనానికి సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలో వున్న వాట్ ట్రైమిట్ అనే బౌద్దమందిరానికి వెళ్లేం . వాట్ అంటే మందిరం అని అర్దం . ఈ మందిరాన్ని అధికారికంగా ‘ ప్ర ఫుద్ద  మహా సువన పతిమ కోన్ ( పరమ బుద్ద మహా సువర్ణ ప్రతిమ  యీ అర్దం అవొచ్చు కాకపోవచ్చు , నాకు యిలా అనిపించింది ) అని  అధికారికంగా పిలుస్తారు .

మందిరం మొత్తం మిగతా బుద్ద మందిరాలలానే వుంది . రాజ భవనం లో వున్న మందిరం లానే కర్రతో చెక్కిన ఆర్చీలు పాలరాతి విగ్రహాలు , బంగారు రంగులో తీర్చిదిద్దిన స్థంభాలతోనే వుంది . లోపల యెత్తైన అరుగు మీద బంగారు బుద్ద విగ్రహం స్థాపించబడి వుంది .

బుద్దుడు ‘ శాక్యముని బుద్ద ‘ ముద్రలో వున్నట్లు మలిచేరు . ఈ ముద్రని ‘ భూమి స్పర్శ ముద్ర ‘ అని కూడా అంటారు . తీర్చిదిద్దిన ఉంగరాల జుట్టు  వీపు వెనుక ‘ V ‘ ఆకారం లో వున్నట్లు  , విశాలమైన కనుబొమలు భృకుటి దగ్గర కలిసినట్లు , యోగ సమాధిలో వున్నట్లు మూసుకొని వున్న చేరడేసి కళ్లు , భుజాలను తాకుతున్నట్లు వుండే పొడవైన చెవులు , విశాలమైన భుజాలు  , మెడదగ్గర మూడు ముడుతలు చక్కగా కనబడుతూ విగ్రహాన్ని తీర్చిదిద్దిన అనామిక శిల్పికి జోహర్లు చెప్పకండా వుండలేము . అయితే విగ్రహాన్ని యెలా చెక్కితే ఆ విగ్రహానికి ప్రత్యేక శక్తులు చేకూరుతాయో అలాంటి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని యీ విగ్రహాన్ని మలచినట్లు శిల్పులు తీర్మానించేరు . ఈ నిముషమో మరో నిముషమో కనులు తెరిచి చూస్తాడేమో అన్నంత సజీవంగా వుంటుంది మూర్తి . ఎందరో యిలాంటి మహా శిల్పులు కాలగర్భం లో కలసి పోయినా వారి శిల్పాలు తరతరాలవరకు నిలచి వారిని స్మరించుకొనేలా చేస్తున్నాయి కదూ ? .
              ఈ విగ్రహాన్ని మలచడానికి 5.5 టన్నుల బంగారాన్ని వుపయోగించారు . నిర్మించిన కాలం , శిల్పి , ప్రదేశం వివరాలు చరిత్రలో దొరకలేదు . విగ్రహాన్ని పరిశీలించిన చరిత్రకారుల ప్రకారం యీ విగ్రహం భారతదేశంలో చెక్కి వుండవచ్చు లేదా భారత చక్రవర్తులు యీ ప్రాంతాలను పరిరాలించే కాలంలో అంటే సుమారు అశోకుని కాలంలో బౌద్దమతం ప్రాముఖ్యత సంతరించుకున్న కాలం లో చెక్కివుండవచ్చు అని అభిప్రాయం తెలియజేసేరు . విగ్రహాన్ని పరిశీలించిన కొందరు యీ విగ్రహం తయారీలో అధిక శాతం 18 కేరట్ల బంగారం వుపయోగించినట్లు , 45 కేజీలు మాత్రమే మేలిమి బంగారం వుపయోగించి నట్లు అభిప్రాయపడ్డారు . ఎవరు యెలా చెప్పినా పర్యాటకులుగా మనం ఆ విగ్రహం చెక్కడం లో శిల్పి చూపించిన శ్రద్ద అందం చూడాలి గాని మిగతా విషయాలు కాదు అని నా అభిప్రాయం .

బంగారు బుద్దని విగ్రహం యెత్తు సుమారు 3.91 మీటర్లని కొందరి అంచనా , అలాగే కూర్చున్నప్పుడు ఈ ముణుకు నుండి ఆ ముణుకు వరకు సుమారు 3.1 మీటర్ల పొడవు వున్న విగ్రహం .

ఈ విగ్రహాన్ని గురించిన కథ తెలుసుకుందాం . సుఖొథాయి రాజుల పరిపాలనలో యీ విగ్రహం అంటే 13 , 14 శతాబ్దాల మధ్యకాలంలో కనుగొనబడింది . ఈ విగ్రహం విలువ చాలా వుండడం తో యీ విగ్రహాన్ని సొంతం చేసుకోవాలనే కోరికతో అనేక యుధ్దాలు జరిగినట్లుగా చరిత్ర చెప్తోంది . అలాంటి యుధ్దకాలంలో యుధ్దాలను అరికట్టే వుద్దేశ్యంతో యీ విగ్రహానికి గాజులా మెరిసే లేపనం పూయబడింది . తరువాత అయోధియ లో బౌద్ద ఆరామంలో పడి వుండేది . బర్మారాజులు అయోధియ ని గెలుచుకొని మొత్తం అయోథియ ని కాల్చివేయగా భవనాలు మందిరాలు శిధిలాలుగా మారేయి . 1801 లో రామ-1 బర్మా రాజులనుంచి థాయిలాండుని గెలుచుకొని బేంకాక్ ని రాజధానిగా చేసుకున్న తరువాత అయోధియ లో వున్న బౌద్ద విగ్రహాలను రాజధానికి తరలించేరు , అలా చాలా విగ్రహాలమధ్య అనామకంగా పడివుండిపోయింది బంగారు బౌద్దవిగ్రహం . రామ -3 కాలంలో మిగతా విగ్రహాలతో పాటు ‘ వాట్ ఛోటన్ రామ్ ‘ లో  ప్రతిష్టించేరు . కాలాంతరాన వాట్ ఛోటన్ రామ్ శిధిలమవగా శిధిలాలతోపాటు బంగారు బుద్ద విగ్రహం కూడా పడివుండిపోయింది .

1935 లో ‘ వాట్ ట్రిమిట్ ‘ చాలా చిన్న బౌద్ద ఆరామం లో శిధిలాలలో పడివున్న బౌద్ద విగ్రహాలను చిన్న రేకులషడ్డు నిర్మించి అందులో 1955 వరకు వుంచేరు . 1955 లో పక్కా భవనం నిర్మించి అందులోకి విగ్రహాలను మార్చ నిశ్చయించుకొని విగ్రహాలను తరలించసాగేరు . 25 మే 1955 లో బంగారు బుద్దుని విగ్రహాన్ని తరలిస్తూ వుండగా విగ్రహం యొక్క పై పూత కొంతమేర తొలగి బంగారు రంగు కనిపించింది . అధికారికంగా ఆరోజునుంచి పూత యెలా తొలగింపబడింది , కాస్తకాస్త పూత తొలగిస్తున్నప్పటి విగ్రహాన్ని అంచలవారీగా ఫొటోలు తీసి వాటిని యిప్పటిమందిరంలో పర్యాటకులకు అందుబాటులో వుంచేరు . పూర్తిగా పూత తొలగించిన తరువాత యీ విగ్రహం తొమ్మిది భాగాలుగా తయారుచేసి ఆభాగాలను అతికించి నట్లు తెలుసుకున్నారు .  విగ్రహం క్రింది భాగంలో విగ్రహాన్ని యెలా విడదియ్యాలో , తిరిగి యెలా జోడించాలో వివరం యివ్వబడిందని గుర్తించేరు .

బంగారు విగ్రహం బయటపడిన సంవత్సరం 2500 BE కి దగ్గరగా వుండడం కూడా బౌద్దులు ఓ అధ్బుతమని చెప్తారు . BE అంటే బౌద్ద యెరా అని బుద్దని మరణానంతరం అని అర్దం , థాయులాండులో యీ BE లనే అధికారికంగా వాడుతున్నారు .

బంగారు బుద్దుని విగ్రహం బయట పడ్డ తరువాత అప్పటి రాజు ‘ వాట్ ట్రిమిట్ ‘ లో ప్రత్యేక మందిరం నిర్మించి అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్టించేరు . బౌద్దులకు , పర్యాటకులకు యిది ఓ ప్రత్యేక ఆకర్షణ .

ఇప్పుడున్న యీ ఆకర్షణీయమైన భవనం 2010 లో నిర్మింప బడింది . భవన నిర్మాణం చూస్తే యిక్కడి ప్రజల మనస్సులలో బుద్దుని పట్లగల భక్తిభావం తెలుస్తుంది .

బేంకాక్ లో ఆకాశాన్నంటే భవనాలు , తీర్చిదిద్దినట్లుండే రోడ్లు కూడా చాలా బాగుంటాయి . బేంకాక్ లో ఏడు నక్షత్రాల హోటల్స్ నుంచి యే నక్షత్రం లేని హోటల్స్ వరకు యెన్నో వున్నాయి . యెక్కువకాలం వుండేవారికి సర్వీసుడు అపార్ట్మెంట్స్ కూడా దొరకుతాయి . హోటల్స్ లో వండుకునే అవకాశం వుండదు కాని యీ అపార్ట్ మెంట్స్ లో కిచెన్ తోపాటు పాత్రసామగ్రి అంతా వుంటుంది . కిరాణా సామాను మనం తెచ్చుకుంటే వండుకోవచ్చు ప్రతీ రోజు వారి మనిషి వచ్చి పాత్రలు కడిగి యిల్లు శుభ్రపరచి వెళ్లి పోతుంది . కొన్ని అపార్ట్ మెంట్లలో వాషింగు మెషిన్ కామన్ గా వుండేది వుంటుందిల. అందులో బట్టలు వేసుకొని మన సోపు పౌడరు వేసుకొని మెషిన్ లో వారు చెప్పిన సొమ్ము పడేస్తే మెషీను బట్టలు వుతికి పెడుతుంది గంట తరువాత మనం వెళ్లి బట్టలు తెచ్చుకోడమే . కొన్ని చోట్ల పది పదిహేను వాషింగు మెషీనులతో వాషింగు స్టోర్లు కూడా వుంటాయి . బట్టలు , సోపు , డబ్బులు పడేసి ఓ గంట అటూ యిటూ షాపింగు చేసుకొని వచ్చి మీ బట్టలు మీరు తీసుకు పోవచ్చు . షాపులో మనిషి వుండేవాడు కాదు . ఇలాంటివి మన దేశంలో వుంటే మన బట్టలు మాయమవడం ఖాయం , అక్కడ అలాంటి పరిస్థితి యెప్పుడూ యెదురుకాలేదు . ఈ అపార్ట్ మెంట్స్ యెప్పుడూ బుక్ అయిపోయే వుండేవి . కారణం యురోపియన్లు చలికాలంలో వచ్చి ఆరునెలలు యిక్కడ వుండిపోవడమే కారణం . అన్నాళ్లు యెందుకు అంటే చలి దేశాలలో హీటర్లు గట్రా వేసుకుంటే వారి దేశం లో చాలా ఖర్చవుతుందట , యీ దేశంలో అయితే చాలా తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలూ పొందవచ్చునట , యింకా వివరంగా అడిగితే వారికి వారి దేశంలో ఒక నెలకి అయే ఖర్చు తో  యిక్కడకి రావడానికి పోవడానికి ఫ్లైటు తో సహా ఆరు మాసాలకి సరిపోతుందట . అందుకని యిలా వచ్చి యిక్కడి యెండని అనుభవించి వెళ్తారుట .

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి . థాయ్ లాండు లో డబ్బు పడేస్తే అన్ని సుఖాలను చాలా సులువుగా అందుకోవచ్చు . సరే ఆవిషయాలు ‘ పట్టయ ‘ నగరం గురించి చదివేటప్పుడు తెలియజేస్తాను .

ప్రస్తుతం లోకి వస్తే అన్ని తరగతులవారికీ అందుబాటులో వుండే కొన్ని వేల  హోటల్స్ వున్నాయి . తిండి విషయానికి వస్తే రోడ్డు మీద పెట్టుకున్న బడ్డీల దగ్గరనుంచి యేడు నక్షత్రాల రెస్టొరాంట్స్ వరకు రకరకాలైన తిండి దొరకుతుంది . అయితే వెజిటేరియన్లకి మాత్రం చుక్కెదురే .

ఇక షాపింగు విషయానికి వస్తే లోకలు మార్కెట్లు , బిగ్ సి , కెర్ ఫర్ లాంటి సూపర్ మార్కెట్లు కాక స్వర్గాన్ని తలపింపజేసే షాపింగి మాల్స్ కి కొదవలేదు బేంకాక్ లో . అందులో కొన్ని షాపింగ్ మాల్స్ గురించి చెప్పుకుందాం .

బేంకాక్ లో మధ్య నగరం లో సులువుగా తిరగడానికి స్కై ట్రైను అందుబాటులో వుంటుంది .

మన దేశం నుండి వచ్చే పర్యాటకులు యెక్కువగా షాపింగుకే వస్తారు . రేపు మీలో యెవరు బేంకాక్ వెళ్లినా షాపింగ్ యెక్కడ చెయ్యాలి అనే ప్రశ్న మీలో వస్తుంది . పేరెన్నిక గల పదో పదిహేనో మాల్స్ వున్నా మనకి కాలసిన మన అభిరుచికి తగ్గట్టు వుండే కొన్ని ముఖ్యమైన మాల్స్ చెప్తాను అందులో ముఖ్యమైనది ‘ MBK మాల్ . చుట్టూరా ఆకాశాలను అంటే భవనాల మధ్య యెత్తైన హోటల్ ‘ ఫాతుమ్వాన్ ప్రిన్స్స్ ‘ భవనానికి ఆనుకొని వుంటుంది . ఈ మాల్ స్థానికులలోనూ , పర్యాటకులలోనూ బాగా పేరు బడ్జ మాల్ . ఈ మాల్ యెనిమిది అంతస్థలతో 2000 షాపులతో కూడుకొని వుంది . కాని యీ షాపింగు మాల్ కి వెళ్లే దారిలో లెక్కలేనన్ని చిన్నచిన్న షాపులు వుంటాయి . ఇక్కడ దొరకని వస్తువలేదు అంటే అతి శయోక్తి కాదు , వంటింటికి కావలసిన వస్తువులనుంచి , ఫాషన్ , దుస్తులు , నగలు , ఎలక్ట్రానిక్స్ , జోళ్లు , బేగులు , లగేజ్ బాగులు , లెదర్ వస్తువులు ఒకటేమిటి ? నిత్యావసరం నుంచి లగ్జరీ వరకు అన్ని వస్తువలు దొరుకుతాయి . అయితే బేంకాక్ లో యేదైనా కొనడానికి సిధ్దమైనప్పుడు బాగా బేరం చెయ్యాలని మరచిపోకూడదు . ఎంతలా అంటే నూరురూపాయలని వారు చెప్తే పది రూపాయలకి ఆవస్తువ కొనవచ్చు మా వారి భాషలో అయితే అదికూడా చాలా యెక్కువే అంటారు .

వచ్చేవారం మిగతా వివరాలు చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
pratapabhavalu