Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు థాయిలాండ్ - కర్రా నాగలక్ష్మి

thailand

 ( కాంచనబురి )

కాంచనబురి ( కాంచనపురి ) సి సమట్ నది , ఖ్వాయి నది సంగమించిన ప్రదేశంలో 18 వ శతాబ్దంలో రామ-1 చే నిర్మింపబడ్డ నగరం . ధాయ్ లాండు దేశానికి పశ్చిమంగా నిర్మింపబడ్డ నగరం . సాధారణంగా థాయిలాండు ట్రిప్పు అంటే బేంకాక్ , పట్టయ గాని లేక బేంకాక్ ఫుకేత్ గాని తీసుకు వెడతారు బేంకాక్ ని విడిచి పెడితే పట్టయ , ఫుకేత్ లు బీచ్ లు , విచ్చలవిడి జీవితాన్ని చూపిస్తాయి . దాంతో  ఆ దేశం మీద మనకి చాలా చిన్నచూపు కలుగుతుంది కాని థాయిలాండు కల్చర్ ని నిజంగా చూడాలంటే దేశం లోని మరికొన్ని ప్రదేశాలను చూస్తే మనకి అర్దం అవుతుంది . బేంకాక్  నగరం వీకెండ్స్ లో కాల్ గర్ల్స్ అడ్డాగా మారిపోతుంది . పట్టయ , ఫుకేత్ అయితే యెప్పుడూ కాల్ గర్ల్స్ తో నిండే వుంటుంది . తాగుడు డ్రగ్స్ , మాంసాహారాలకి అడ్డేలేదు . ఈ మార్పు యీస్టిండియా కంపెనీ ఓడలు థాయిలాండు మీదుగా వెళ్లేటప్పుడు పల్లెప్రజలకి డబ్బాశ చూపించడం వల్ల యీ దేశంలో వేశ్యావృత్తి పెరిగిపోయింది . ఎంతలా పెరిగిపోయిందంటే అది ఒక దురాచారంగా వాళ్లకి కనబడడం మానేసింది .

పట్టయ పక్కనే వున్న ‘ శ్రీరచ ‘ అనే నగరంలో మనకి సాంప్రదాయమైన థాయి మహిళలు కనబడతారు .కాంచనబురి కూడా చాలా సాంప్రదాయక మైన థాయిలాండుని చూడొచ్చు . ప్రజలు మర్యాదలు వంటలు అన్నీ చాలా బాగుంటాయి . థాయిలాండు పశ్చిమ ప్రాంతం కొండలు దట్టమైన అడవులతో నిండి వుంటుంది . ఈ అడవులలో దొరికే కలప చాలా మన్నిక కలది అని అంటారు . కాంచనబురి చాలా ప్రశాంతంగా వుండే నగరం . కొండలపై కొండలకు దగ్గరగా వుండడం వల్ల దేశం లో మిగతా ప్రదేశాలకంటే చల్లగా వుంటుంది . ఇక్కడ అడవులలో ప్రకృతికి దగ్గరగా జీవించ దలచుకున్న  వారికి అడవులలో ఆధునిక వసతులు లేని పాకలు , టెంటులు నడుపుతున్న అనేక సంస్థలు వున్నాయి . కర్రలమీద వండిన థాయి సాంప్రదాయ వంటలు వడ్డించడం యిక్కడి ప్రత్యేక ఆకర్షణ .అక్కడి అడవులలో ‘ తెల్ల యేనుగ స్వారి ‘ ఓ ఆకర్షణ . థాయిలాండు లో యిలాంటి యేనుగ సఫారీలు చాలా వున్నాయి . మా టూరులో వారు తీసుకువెళ్లిన ఓ ‘ వైట్ యెలిఫెంటు సఫారి ‘ కి వెళ్లేం . అక్కడి వుద్యోగులు ముందు మనకి యేనుగుల గురించి కాస్త భ్రీఫింగు యిస్తారు , వాటి పెంపకానికి  , యేనుగుల సంఖ్య పెంచడానికి వారు తీసుకుంటున్న చర్యల గురించి చెప్తారు . తరవాత యేనుగు మీద  ఖోయి నదీ తీరంలోను , అడవులలోను ఓ గంట సేపు తిప్పుతారు . ముందు యేనుగు మీద కూర్చోడం భయం అనిపించినా దట్టమైన అడవులలో , ఎగుడు దిగుడు దారులలో  తిరగటం బాగుంది . తెల్లయేనుగులు అంటే తెల్లగా సున్నం రాసినట్లు వుంటుంది అనుకున్న నాకు మరీ ముదురు రంగుకాక కాస్త రంగు తక్కువగా వుండడం వల్ల తెల్ల యేనుగ అనడం కాస్త మింగుడు పడలే .

కాంచనబురి వార్ సిమెట్రి —

రెండవ ప్రపంచయుద్ధం జరిగినప్పుడు జర్మనీ తో చేతులు కలిపిన జపాను యీ ప్రాంతం లో ఆధిపత్యం సాధించి ఆంగ్ల , డచ్ వారిని యుధ్దఖైదీలుగా చేసుకొని వారితో బర్మా కి రైలు లైను వేయించడానికి వాడుకున్న సమయంలో ఆనారోగ్య కారణాలవల్ల రాజకీయ కారణాల వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు . అలాటివారి జ్ఞాపకార్ధం థాయిలాండు ప్రభుత్వం కట్టించిన సమాధులు . పెద్ద గేటు లోపల వరుసగా సమాధులు వాటిపై వారిపేర్లు మరణించిన తేదీలు రాసివున్నాయి . అన్ని సమాధులు ఒక్కసారి చూడగానే మనసు వికమవడం ఖాయం .  సుమారు 13వేల ఖైదీలు మరణించినట్లు అంచనా , యెక్కువకూడా కావచ్చు . ప్రవేశ ద్వారానికి పక్కగా పెట్టిన బోర్డులో పేర్లు వరుసగా రాసి వారి మరణ తేదీలను కూడా వేసి బోర్డులు పెట్టేరు . చాలా మంది విదేశీయులు వారి పూర్వీకుల సమాధులు చూడ్డానికి వస్తూవుంటారు . వారివారి పూర్వీకుల పేర్లు చూసి వుద్వేగానికి గురి అవడం మన చేత కన్నీళ్లు పెట్టిస్తుంది . వేలవేల కిలోమీటర్లు ప్రయాణించి వారి పూర్వీకుల సమాధులు చూడ్డానికి రావడం అంటే చాలా గొప్పగా అనిపించింది . ఎక్కడో పుట్టి యెక్కడో పెరిగి యింతదూరంలో తెలీని ప్రదేశం లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు యెందుకొచ్చాయి అంటే కొందరి నియంతల నిర్ణయాల వల్ల కదా ? .         ఈ విషయం లో మాత్రం థాయిలాండు ప్రభుత్వాన్ని మెచ్చుకోక తప్పదు , మరణించిన వారి గౌరవార్ధం యిలా సమాధులు కట్టి వాటిని పరిశుభ్రంగా వుంచి రక్షించడం మెచ్చుకోదగ్గది .

ఆ కాలంలో ఖైదీలను బంధీలుగా వుంచిన ప్రదేశాలు యెలావుండేవి , యెలాంటి హీన స్థితిలో వుండేవారు , యెలాంటి ఆహారం యిచ్చేవారు, అప్పట్లో ఆ అడవులలో యెలావుండేది మొదలైన విషయాలు వివరంగా రాసి అప్పటి కొన్ని ఫొటోలు , చిత్రాలు పెట్టేరు . ఖైదీలపై చూపే అత్యాచారం భరించలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు . అవన్నీ చూస్తే రాజులకాలంలో రాజు యుధ్దం లో ఓడిపోయే స్థితిలో వున్నప్పుడు  రాజపరివారపు స్త్రీలు అగ్నిప్రవేశం చెయ్యడం సబబే అని పిస్తుంది .

ఓ గంట అక్కడ గడిపేక మేం ‘ ఖ్వాయి ‘ నది చూడ్డానికి వెళ్లేం . దట్టమైన అడవుల మధ్య ప్రవహిస్తున్న నది . బాగా బురదనీటితో ప్రవహిస్తోంది . దాని మీద వెదుళ్లతో కట్టి గడ్డి పరచిన బల్లమీద కూర్చొని ప్రయాణం , కూర్చోడానికి కుర్చీలు వేసేరు . ములుగుతూ తేలుతూ ప్రయాణిస్తోంది ఓ క్షణం గడ్డి పైకి నీళ్లు వచ్చెస్తున్నాయి . ఆ నడిపే అతను భయంలేదు అని చెప్తున్నా మాప్రాణాలు అరచేతిలోనే వున్నాయి . చుట్టూరా యెత్తైన కొండల మధ్య ప్రయాణం అహ్లాదకరంగా మాత్రం లేదు , పకృతిని ఆస్వాదించేంత హాయిగా లేదు ప్రయాణం . నది వొడ్డున పేరుతెలియని రిసార్ట్ రెల్లుగడ్డితో కట్టిన గుడిసెలు బాగున్నాయి . అడవిలోంచి వినిపిస్తున్న పక్షి అరుపులు కూడా భయాన్ని పెంచేయిగాని , అహ్లాదాన్ని యివ్వలేదు . బల్లకట్టు ప్రయాణం చేస్తూనే నది మీద కట్టిన బ్రిడ్జ్ ని చూసేం . నది పైన కర్రతో కట్టిన బ్రిడ్జ్ , సుమారు నీటి పైన 50 అడుగుల యెత్తున వుంది , సుమారు 450 అడుగుల పొడవు వున్న వంతెన . రెండవ ప్రపంచ యుధ్దం సమయం లో కట్టిన వంతెన , రెండవ ప్రపంచ యుధ్దం సమయంలో జపాను జర్మను సహకారంతో బర్మా , థాయిలాండు , సుమిత్ర , జావా బోర్నియో , చైనా లో కొంతభాగం వారి ఆధీనంలో కి వచ్చేయి . బర్మ కి థాయిలాండు మధ్య కొండలు అగాధాలు వుండడంతో బరువైన సామాను చేరవెయ్యడం కష్టమౌతూ వుండేది ,  బర్మా లో జపాను సేనలు వారి ఆయుధాగారం నుంచి ఆయుధాలను  థాయిలాండుకి తరలించేందుకు రైలు మార్గం నిర్మించేరు . ఆ నిర్మాణం గురించి తరవాత తెలుసుకుందాం . అలా భయపడుతూ మా నదీ విహారం ముగించేం .

రాత్రి ఖ్వాయి నది వొడ్డున వున్న రిసార్ట్ లో బస యేర్పాటు చేసేరు . ముందుగా చెప్పడం వల్ల మాకు శాఖాహార భోజనం వడ్డించేరు . హాలులో లైవ్ మ్యూజిక్ వినిపిస్తున్నారు . అందులో వయొలిన్ వాయించే అతను మా దంపతుల దగ్గరకు వచ్చి రాజ్ కపూర్ నర్గీస్ పాట ‘ ప్యార్ హువా హై , ఇకరార్ హువాహై ‘ పాట వాయించేడు . అలా మాకోసం కొన్ని రాజ్ కపూర్ , శమ్మికపూర్ పాటలు వాయించేడు .  మరునాడు ప్రొద్దట ఖ్వాయి నది పైన కట్టిన ‘ డెత్ రైల్వే ‘ ని చూడ్డానికి వెళ్లేం .

అందులో భాగం గా ముందుగా మమ్మల్ని ‘ వార్ మ్యూజియమ్ ‘ కి తీసుకు వెళ్లేరు .

అక్కడ  రెండవ ప్రపంచయుధ్ద సమయంలో జపాను మిలిటరీ అధికారులు డచ్చ్ , ఆంగ్లేయులను ఖైదీలుగా చేసుకొని వారి చేత బర్మానుంచి థాయిలాండు కి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారు . 1942 లో మొదలుపెట్టి 1943 లో పూర్తిచేసేరు . అప్పటి పరిస్థితులు యెలా వుండేవో  ఫొటోలు , బొమ్మల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసేరు . ఖైదీలను బంధించి వుంచిన  వెదురుతో కట్టిన చిన్నచిన్న గదులు , గదులు అనకూడదేమో మూడడుగుల పొడుగు మూడడుగుల వెడల్పు వున్న వెదురు డబ్బాలు అనవచ్చేమో ? , ఆ అడవులలో కనీససౌకర్యాలు కూడా లేక మలేరియా , కలరా వ్యాదులు సోకి , సరయిన మందులు లేక ఖైదీలు యెలా బాధలు పడ్డారో ఫొటోలు పెట్టి అప్పటి కాలాన్ని చూపించే ప్రయత్నం చేసేరు .

ఖ్వాయి నది మీద బ్రిడ్జి కట్టడానికి వప్పుకోని ఖైదీలను కాల్చి చంపేస్తూ వుంటారు , ఆంగ్ల యింజనీర్ల సహాయంతో పని ప్రారంభిస్తారు . ఆ అడవులలో రాత్రి పగలు పని చెయ్యడం వలన చాలా మంది ఖైదీలు జబ్బుపడి మరణిస్తారు . అప్పట్లో పూర్తిగా కలపతో నిర్మించేరు . అడవులలో కలప దుంగలను తరలించడానికి కూడా ఖైదీలనే వుపయోగించేవారు , ఖైదీలపట్ల వారు చూపించిన జులం చిత్రపటాల ద్వారా వివరించేరు , ఒక్కసారి రెండో ప్రపంచ యుధ్ద దృశ్యాలను మన కళ్ల ముందుకు తెప్పించేరు . యుధ్దసమయంలో సైనికుల బతుకు యెంత దుర్భరంగా వుంటుందో సాక్షాత్కరించేరు . రెండవ ప్రపంచ యుధ్ద సమయంలో కొన్ని వందల లక్షల మంది మరణించేరు . ఈ ప్రాంతంలోనే సుమారుగా లక్షకు పైబడి ఖైదీలు మరణించినట్లు అంచనా . ఒక్క యీ రైల్వే నిర్మాణం లో 13 వేల మంది మరణించేరు . అంత కష్టపడి కట్టిన రైల్వే లైనుని జపాను వారు యుధ్దం ఓడిపోతున్న సమయంలో తిరిగి పడగొట్టమని ఇంజనీర్లని బలవంతం చేస్తారు . ఒప్పుకోని వారిని చాలా దారుణంగా చంపెస్తారు . బర్మా భూభాగం జపాను చేతులలోంచి జారిపోగానే యీ బ్రిడ్జ్ ని బాంబులతో పడగొట్టేస్తారు . బాంబుల దాడికి బర్మా వైపునున్న రైల్వే లైను కూలిపోగా థాయిలాండు వైపు వున్న లైనుకి యెటువంటి క్షతి కలుగలేదు .మ్యూజియం తిరుగుతున్నంత సేపు మనసు వికలమైంది .

అక్కడ నుంచి రైల్వే స్టేషనుకి వెళ్లేం . ప్రతీ రోజూ నిర్ణీత సమయాలలో రైలు నడపబడుతోంది . సుమారు అరకిలోమీటరు దూరం వున్నలైను . ట్రైను రావడానికి యింకా సమయం వుండడంతో కొంత మంది ఔత్సాహికులు ట్రాక్ మీద నడుస్తూ చివరవరకు వెళ్ల సాగేరు . మేం కూడా వారివెనుకే వెళ్లేం . బర్మా థాయ్లాండుల మధ్య వున్న లోయపైన నిర్మించిన నిర్మాణం . నేలనుంచి , నది పైన కాంక్రీటు స్థంబాల జాగాలో కర్ర దుంగలను వాడడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది . ఆ దుంగలు యివాళకూడా పటిష్ఠంగా వుండడం , యివాళటకి కూడా రైలుబండి నడుస్తూ వుండడం ఆశ్చర్యం . దీనిని వండర్ రైల్వే అని ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది .  ఇవాళటికి కూడా యీ రైల్వేని జాగ్రత్తగా కాపాడుకుంటున్న థాయి ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేము . వెనుకకి వచ్చేక మా రైలు ప్రయాణం సాగింది . మూడు కంపార్ట్ మెంట్లను లాగుతున్న స్టీము ఇంజను , కిక్కిరిసి ప్రయాణిస్తున్న పర్యాటకులు . కర్రల మీద బండి చేస్తున్న దడదడ సబ్ధం , అడవిలోంచి వీస్తున్న చల్లగాలి మాలో ఉద్వేగాన్ని నింపింది . ఆ ప్రయాణాన్ని , ఆ అద్భుతమైన బ్రిడ్జ్ ని జన్మలో మరచిపోలేను .

రెండవ ప్రపంపంచ యుధ్దం మీద వేరువేరు భాషలలో యెన్నో సినిమాలు వచ్చేయి . ఈ రైల్వే నే పధ్యం గా తీసుకొని నిర్మింపబడ్డ సినిమా ‘ బ్రిడ్జ్ ఆన్ ద రివర్ ఖ్వాయ్ ‘ . అయితే యీ సినిమా నిర్మాణం చాలా గోప్యం గా జరిగింది . సినిమా రిలీజ్ చెయ్యడానికి ఆ సంస్థ వారు చాలా కష్ట పడ్డారట , కాని యివాళ ప్రపంచ వ్యాప్తంగా నిర్మింపబడ్డ మంచి సినిమాల జాబితాలో పదకొండవ స్థానాన్ని సంపాదించుకొంది . అయితే అందులో చూపించిన బ్రిడ్జి యిదికాదని సీనీ విమర్శకులు అంటారు కాని ఆ సినిమా చూసిన తరువాత యీ ప్రదేశాలను , వార్ మ్యూజియం , సిమెట్రి లను సందర్శిస్తే బాగా కనెక్ట్ అవుతాము . ఆ సినిమాలో చూపించిన ఖైదీలపై జపాను వారి జులుం , యిక్కడ మ్యూజియం లో పెట్టిన చిత్రాలలో కనిపిస్తాయి . ఆ సినిమా సంస్థవారు యీ మ్యూజియంను చూసి  స్పూర్తి పొందే తీసివుంటారు .

థాయిలాండు లో నాకు నచ్చిన పర్యాటక స్థలం యిది . వీలుచేసుకుని మీరు కూడా చూడండి .

పై వారం మరో పర్దేశాన్ని సందర్శిద్దాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
pratapabhavalu