Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue261/700/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి).... బాబుకి వేడి నీళ్ళు స్నానం చేయించి, పాలు పట్టి మెత్తటి పరుపు మీద వెచ్చగా పడుకోబెడుతుంటే గాయత్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.

ఎవరీ శరణ్య... ఇలాంటి ఆపద సమయంలో కనిపించి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన ఈమె దేవత కాదు కదా.. దిక్కు లేని తను ఇంకా చావే దిక్కు అనుకున్న సమయంలో ఎంత విచిత్రంగా కలిసింది.  తానెవరో, తన కధ ఏంటో కూడా తెలుసుకోకుండా టికెట్ కొని మరీ తన ఇంటికి తీసుకు వచ్చిన ఈమె ఖచ్చితంగా దేవతే..

గాయత్రికి తెరలు, తెరలుగా దుఃఖం వచ్చింది.

అప్పుడే తను కూడా స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చిన శరణ్య ఏడుస్తున్న గాయత్రి భుజం మీద చేయేసి ఓదార్పుగా అంది ఏడవకు వెళ్లి నువ్వు కూడా ఫ్రెషప్ అయి రా భోజనం చేద్దాం ..అంది.

గాయత్రి గభాల్న ఆమె పాదాల మీద పడిపోయింది. అక్కా ... మీరు దేవత... మీ ఋణం ఎలా తీర్చుకోను..

శరణ్య చిరునవ్వుతో ఆమెని లేపి కళ్ళు తుడుస్తూ అంది అన్ని మాట్లాడుకుందాం వెళ్ళు స్నానం చేసిరా... నేను డిన్నర్ రెడీ చేస్తాను.
గాయత్రి కళ్ళు తుడుచుకుని శరణ్య అందించిన టవల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళిపోయింది.

శరణ్యకి కూడా అంతా విచిత్రంగా, ఏదో సినిమాలా అనిపించింది.

ఎవరీ గాయత్రి..

ఎప్పుడో ఏడాదిన్నర క్రితం యాదాలాపంగా పార్క్ లో చూసిన ఒక జంట.

ఆ జంటని చూసి తను సరదాగా తేజకి చెప్పిన భవిష్యత్తు..

ఆ భవిష్యత్తు నిజం కావడం ఏంటి? వంటరిగా మిగిలిన ఈమె ఇప్పుడు ఇలా తన ప్రయాణంలో తారసపడడం ఏంటి?  తను అనాలోచితంగా ఈమెని ఇంటికి తీసుకు రావడం ఏంటి? తప్పు చేయలేదు కదా..

ఆమె ఎవరో ... ఏంటో ... అసలు ఆ రోజు తనకి  అలా ఎందుకు అనిపించింది.

తను అన్నందుకు ఈమె జీవితం ఇలా అయిందా.. లేక అలా అవుతుందనే తను ఊహించిందా.. తనకి ప్రిడిక్షన్ తెలుసా.. శరణ్యకి బాధతో కూడిన నవ్వొచ్చింది.

ఆ రోజు గుల్ మొహర్ చెట్టు కింద బెదురు కళ్ళతో, బిడియంగా తనకి ఏ మాత్రం జంటగా సరితూగని  ఒక కుర్రాడితో కూర్చున్న ముగ్దమనోహర రూపం కళ్ళ ముందు కదిలింది.

అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పూవు లాంటి అమ్మాయి ఒక లోఫర్ తో కనిపిస్తే అంతకన్నా వాళ్ళ గురించి గొప్పగా ఊహించడానికి మనస్కరించలేదు.

ఆ రోజు ఈ అమ్మాయిలో కనిపించిన సౌకుమార్యం ఏది? ఆ అందం ఏది? కోటి నక్షత్రాల కాంతితో వెలిగిపోయిన ఆ కళ్ళల్లో వెలుగేది?
ఆ కళ్ళు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోతూ తనని ఒడ్డుకి చేర్చి కాపాడే  ఒక ఆత్మీయ హస్తం  కోసం నిరీక్షిస్తున్నాయి.
చంకలో ఇంకా కళ్ళు తెరవని పసివాడు..

గాయత్రి రావడంతో శరణ్య ఆలోచనల నుంచి బయటపడి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ రా అంది గాయత్రిని.

గాయత్రి వచ్చి ఒదిగి కూర్చుంది కుర్చీలో.

శరణ్య వంట మనిషి సిద్ధం చేసి ఉంచిన చపాతీ, టమాట కూర ప్లేట్స్ లో వేసి, తిను అంది గాయత్రితో.

గాయత్రి తలవంచుకుని ప్లేట్ దగ్గరకు జరుపుకుంది.

శరణ్య చపాతీ ముక్క తుంచుకుని తింటూ “ఇప్పుడు చెప్పు” అంది. గాయత్రి కొన్ని సెకన్లు మాట్లాడలేదు.. తరవాత  వెక్కి వెక్కి ఏడుస్తూ అంది.

“నేను చాలా తప్పు చేశానక్కా...పెద్ద తప్పు చేసాను. ఎప్పటికి దిద్దుకోలేని తప్పు చేసాను. “

“ఏం తప్పు చేసావు.. “

గాయత్రి వెక్కుతూ జరిగింది అంతా చెప్తూ అంది “ అమ్మ, నాన్నలు నన్ను నాలుగు గోడల మధ్య బంధించి నా స్వేచ్చని, స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారన్న కోపంతో నాలుగు రోజులు నేను కనిపించకుండా పోతే వాళ్ళకే తెలుస్తుందని అలా వెళ్ళిపోయాను..

నా నిర్ణయం నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేస్తుందని అనుకోలేదు.. నాలుగు రోజులు కనిపించకుండా పోవాలనుకున్న నాకు జీవితాంతం కనిపించకుండా వాళ్ళు పెద్ద శిక్ష వేసారు.. ఇంక ఈ జీవితంలో నేను వాళ్ళని చూడలేను ...”

రెండు చేతులతో మొహం కప్పుకుని వెక్కి, వెక్కి ఏడవసాగింది గాయత్రి.

శరణ్య హృదయం బరువెక్కింది ...ఏమని ఓదార్చాలో, ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు. గొంతు సవరించుకుని అంది “ పోనీ ఒక్కసారి మీ వాళ్ళ దగ్గరకు వెళ్లి ప్రయత్నించక పోయావా... ఎంత కాదనుకున్నా నిన్ను కన్నవాళ్ళు.. మమకారం ఎక్కడికి పోతుంది? ఈ ఆపద సమయంలో కాదంటారా..”

“లేదు... నాకా అదృష్టం లేదు.. మా వాళ్ళు అక్కడ లేరు.. ఎక్కడ ఉన్నారో తెలియదు.. నాన్న చనిపోయాడని చెప్పాడు మా పక్కింటి అంకుల్. నిజమో అబద్ధమో నాకు తెలియదు.. తెలుసుకోవాలన్నా చెప్పేవాళ్ళు కూడా లేరు.  హైదరాబాద్ ఒక మహాపట్నం .. ఆ మహాపట్నం లో ఎక్కడని వెతకను.. నాకు తెలుసు నాన్న చాలా పట్టుదల మనిషి.. సంప్రదాయాలను, ఆచారాలను నిష్టగా పాటించేవారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను క్షమించరు. అమ్మ అక్షరాలా నాన్నకి సహధర్మచారిణి.. ఆయన మాట జవదాటే ధైర్యం ఆవిడకు లేదు.. ఇంక అన్నయ్య సంగతి చెప్పక్కర్లేదు.. శ్రీరాముడి లాంటివాడు.. నాన్న మాటకి విరుద్ధంగా అసలు ప్రవర్తించడు.. నేనే తప్ప పుట్టాను ఆ ఇంట్లో.. నా వల్లనే ఆ ఇంట్లో సుఖశాంతులు నశించాయి. “

“ మీ అమ్మ, నాన్నగారి పేరేంటి... అనుమానం నిర్ధారించుకోడానికి అడిగింది శరణ్య.

“నాన్న పేరు కోటేశ్వరరావు  అమ్మ అన్నపూర్ణ..”

“ అన్నపూర్ణ ... అన్నపూర్ణ...” రెండుసార్లు గోణుక్కుని అడిగింది.. “మీ అమ్మగారు ఎలా ఉంటారు..”

గాయత్రి శరణ్య వైపు వింతగా చూస్తూ అంది “ చాలా కళగా ఉంటుంది.. నాకు అమ్మ పోలికే అంటారు అందరూ.. ఎందుకలా అడుగుతున్నారు..”

శరణ్య సమాధానం చెప్పకుండా నిశితంగా గాయత్రి మొహంలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయి తరవాత అంది  “ ఇంక ఏమీ ఆలోచించకుండా తిని పడుకో విశ్రాంతి తీసుకో రేపు ఏం  చేయాలో ఆలోచిద్దాం”

గాయత్రి ఆమె వైపు కృతజ్ఞతగా .

శరణ్య డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని తేజకి ఫోన్ చేసింది. 

శరణ్యకు, అన్నపూర్ణమ్మగారు ఎలా పరిచయమో తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం ఒంటిగంట వరకూ ఆగాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana