Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue261/699/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...  ‘‘అందరూ ఉన్న అనాథను నేను. ఆస్తి ఐశ్వర్యాలున్న బికారిని. భిక్షగత్తెను. ‘నా’ అన్నవారు ఉన్నా ‘నా’ ఆస్తి మీద కన్నేసిన వారే ఎక్కువ. ముఖ్యంగా నా బిడ్డలు. కొడుకులు ఇద్దరూ స్వార్ధ పరులే. తండ్రి పోయి ఒంటరిదైన తల్లి ఎలా బ్రతుకుతుందో అని కూడా ఆలోచించకుండా పెళ్ళాలతో విదేశాలకి చెక్కేసిన ఘనులు.

నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎవరూ లేని అనాథ. అయినా, అందరికన్నా గొప్పగా బ్రతకాలని ఎన్నో ఆశలతో ఒక్కటయ్యాం. అలాగే బ్రతికాము. ముగురు పిల్లల్ని గొప్పగా పెంచాము. పెద్ద చదువులు చదివించాము. అబ్బాయిలిద్దరికి వారికి నచ్చిన అమ్మాయిల్నే ఇచ్చి పెళ్లిళ్ళు చేసాము.

ఆ రోజుల్లో...నగరానికి దూరంగా ఎకరం మామిడి తోట కొని అందులో పర్ణశాలా ఇల్లు కట్టుకున్నాం. పిల్లల్తో పాటూ ప్రేమగా పెంచుకుంటూ  దాన్ని రెండంతస్థుల భవనంగా మార్చుకున్నాం.

ఇప్పుడు అది నగరం నడిబొడ్డునుంది. దాన్ని అమ్మేసి డబ్బు చేసుకుందామని నా కొడుకుల ఆలోచన. కానీ....కానీ....నా ప్రాణం పోయినా ఆ ఆస్తిని అమ్మేది లేదని నేను.

అది నా భర్త ఆస్తి. నా భర్త కల. ఆయన పోతూ పోతూ నాకు చెప్పిన మాట ఒక్కటే.

‘‘సత్యా! మనం ఇద్దరం అనాథల. తల్లెవరో తండ్రెవరో తెలీకుండా ఒకే దగ్గర పెరిగాము. మనల్ని కన్నతల్లిలా ఆదరించిన ‘ప్రేమ సమాజం’ లో మనలాగే ఇంకా ఎందరో అనాథలు పెరుగుతూనే ఉన్నారు.

మన పిల్లలు ఇప్పుడు అనాథలు కాదు. పెళ్ళాం పిల్లలతో ఎంతో గొప్పగా బ్రతుకుతున్నారు. వాళ్లకి ఈ ఆస్తితో అవసరం లేదు. రాదు. అందుకే నీ తదనంతరం ఈ ఆస్తిని ఎలాగైనా ‘ప్రేమ సమాజాని’కి అప్పగించు. మన లాంటి వాళ్లకి ఇది ఆసరా కావాలి అదే నా చివరి...చిరకాల వాంఛ!’’ అంటూనే నా చేతుల్లో కన్ను మూసారాయన.

నా కొడుకులు నాతో యుద్ధం చేసి నా ఆస్తిని స్వాధీనం చేసుకోబోయారు. ఎదిరించాను. చివరికి నన్ను ఒంటర్ని చేసి నా ఇల్లు, తోట వారు స్వాధీనం చేసుకుందామనుకున్నారు. నాతో ఎలాగైనా ఆస్తి రాయించుకుందామని ఎన్నో విధాల ప్రయత్నించారు. వాళ్ళకి కనిపించకుండా ఇలా దేశంలో వున్న దేవాలయాల్ని తిరుగుతున్నాను. నా కొడుకు నా కోసం వెదుకుతారు. చివరికి నన్ను చంపైనా చేజిక్కించుకోవాలనుకుంటారని నాకు తెలుసు.

అందుకే నేను అక్కడ నుండి బయట పడి దేవాలయాలన్నీ తిరుగుతూ మేము చిన్నప్పుడు పెరిగిన ప్రేమ సమాజానికి వెళ్ళాను. విషయం చెప్పి నా దగ్గరున్న ఈ డాక్యుమెంట్లు ఇచ్చాను.

అక్కడ....ఇప్పుడు....ప్రేమ సమాజానికి పెద్ద దిక్కుగా నిలబడ్డ వ్యక్తి ఈ ఆస్తిని తన పేర రాసెయ్యమన్నాడు. నేను బ్రతికినంత కాలం ‘ప్రేమ సమాజం’లో అనాథలకి సేవ చేస్తూ ఉండొచ్చన్నాడు. నా ఇద్దరు కొడుకులకి చెరో కోటి రూపాయలు ఇస్తానన్నాడు.

అప్పుడే నాకు ఏదో మోసం జరగబోతోందని గ్రహించాను. నా కొడుకులకు కూడా డబ్బు ఇస్తానన్నప్పుడే నా ఆస్తి మీద అతను కన్నేసాడని గ్రహించి ఇదిగో....ఇలా సింహాద్రి అప్పన్న చెంతకు చేరి భిక్ష గత్తెలా నా చివరి ఘడియలు గడిపేస్తున్నాను.

పుణ్యాత్ములారా! చదివారు కదా నా గోడు. ఈ ఆస్తిని నా కొడుకుల కబంధ హస్తాల నుండి విడిపించి నా భర్త ఆత్మకు శాంతి చేకూరేలా మా ఇద్దరి మనోభీష్టం ప్రకారం ‘ప్రేమసమాజం’లో అనాథలకి చెందేలా సహాయ పడగలరు.

ఈ లేఖతో పాటు నా బట్టల్లో ప్లాస్టిక్ కవరులో వెలునామా కూడా రాసి పెట్టాను. దయ చేసి తమరైనా మా కోరిక తీర్చ గలరు.’’ అంటూ లేఖ రాసి క్రింద ‘సత్యవతి’ అని సంతకం చేసి ఉంది.

ముసలమ్మ రాసిన ఉత్తరం చదువుతూనే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఛటుక్కున ఎదురుగా వున్న డాక్యుమెంట్లు తీసి చక చకా అన్ని పేజీలు తిరగేసాడు.

ఎక్కడా వీలునామా పేపర్లు కనిపించ లేదు. ఉత్తరంలో ముసలమ్మ రాసిన వాక్యాలు గుర్తు చేసుకున్నాడు. గబ గబా ఉత్తరం మరో సారి చదివాడు.

వీలునామా పేపర్లు ప్లాస్టిక్ కవరులో భద్ర పరిచినట్టు రాసింది ముసలమ్మ. వెంటనే ప్రక్కనే ఉన్న బజర్ మీట నొక్కాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సర్!’’ బజర్ సౌండ్ వినగానే పరిగెత్తుకు వచ్చాడు కానిస్టేబుల్.

‘‘రైటర్ ని ఇలా రమ్మను.’’ ఆతృతగా అన్నాడు ఎస్సై.

కానిస్టేబుల్ ఎంత వేగంగా వెళ్లాడో అంతే వేగంగా రైటర్ ని వెంట బెట్టుకు వచ్చాడు.

‘‘సార్! పిలిచారట?!’’ వినయంగా అడిగాడు రైటర్.

‘‘రైటర్ గారూ! ముసలమ్మ గుడ్డల మూటలో ఏమేమి దొరికాయో ఇలా పట్రండి.’’ ఆర్డర్ జారీ చేసాడు ఎస్సై అక్బర్ ఖాన్. ఎస్సై అక్బర్ ఖాన్ మాట వింటూనే అర క్షణంలో తన దగ్గరున్న ముసలమ్మ గుడ్డల మూట, ఆమె దగ్గర దొరికిన ‘ఎలిబీ’లన్నీ తెచ్చి ఎస్సై ముందుంచాడు రైటర్.
రొట్టె కవరు, జామ్ కవర్ లు ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టి ప్యాక్ చేసి ఉంచాడు రైటర్. ముసలమ్మ కప్పుకున్న ‘శాలువా’ ని కూడా ప్లాస్టిక్ కవరులో భద్ర పరిచాడు.

బట్టల మూటలో నాలుగు చీరలు, జాకెట్లు, చిరిగిన లంగాలు, చిన్న పర్సు, అందులో ఒక ఏభై రూపాయల నోటు, అయిదు పది రూపాయ నోట్లు, మిగతా అంతా చిల్లర నాణాలు ఉన్నాయి.

ముసలమ్మ బట్టల మూటంతా చిందర వందరగా కెలుకుతూ వెదికాడు ఎస్సై అక్బర్ ఖాన్. భిక్షమెత్తుకునే ముసలమ్మ బట్టల మూటనంతా ఎస్సై గబ గబా కెలికేస్తూ దేని కోసమో వెతుకుతుంటే రైటర్ విస్తు పోయాడు.

‘‘సార్! అందులో అంత ముఖ్యమైన వస్తువులేవీ లేవండి! ఆ డాక్యుమెంటు ఒకటే ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఉంది.’’ అన్నాడు రైటర్.   

‘‘అదే....ఆ ప్లాస్టిక్ కవరు ఏది?’’ ఆందోళనగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అదిగో! అదే సర్! ‘శాలువా ఉంది కదా. అదే కవరులో భద్రంగా దాచి ఉన్నాయి ఈ డాక్యుమెంట్లు.’’ అన్నాడు రైటర్.

‘శాలువా’ ఉన్న కవరు తీసి అంతా దులిపి చూసాడు ఎస్సై.

‘‘కొంప మునిగింది. ఇందులో ప్లాస్టిక్ కవరు చుట్టి వీలునామా దాచి ఉంచానని ముసలమ్మ తన ఉత్తరంలో రాసింది. ఇప్పుడా కవరు దొరక్క పోతే కొంపంటుకుంటాయి. ముసలమ్మ యావదాస్తికి హక్కు దారులెవరో తేల్చాల్సింది ఆ వీలునామాయే. అది కనిపించక పోతే....?! ఎవరికి లాభం? ముసలమ్మ తదనంతరం ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది?’ ఆలోచిస్తూనే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్! వీలునామా కనిపించక పోతే ఆ యావదాస్తి ఆ ముసలమ్మ కుమారులకే చెందుతుంది. ఇప్పటికే ఆస్తిని తమ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళు.

అంటే....?! ముసలమ్మ కొడుకులే తమ తల్లిని చంపించేసారా? కిరాయి హంతకుతో ఈ ఘోరానికి పాల్పడ్డారా?! వాళ్ళే ముసలమ్మ దగ్గరుండాల్సిన వీలునామాని ఎత్తుకు పోయారా? మరి ఈ డాక్యుమెంట్లు ఎందుకు వదిలేసారు?

ఎక్కడివక్కడ వదిలేసి రివాల్వింగ్ చైర్ కి చేరగిల బడి తల మీద...నుదురు మీద రుద్దుకుంటూ కణతలు నొక్కుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
‘‘ఏమైంది సార్! ఎందుకంత ఆందోళనగా ఉన్నారు?’’ ఆత్రుతగా అడిగాడు రైటర్.

‘‘ముందు ఈ క్లూసన్నీ జాగ్రత్త చెయ్యి.’’ అంటూనే ‘‘ఇంతకీ రైటర్ గారూ! ముసలమ్మ చావుకు కారణమైన హత్యాయుధం దొరక లేదు కదూ? వెంటనే మన వాళ్లిద్దర్ని పంపించి హత్య జరిగిన చుట్టు ప్రక్కల ప్రాంతం అంతా వెతికించండి. ముఖ్యంగా ప్లాస్టిక్ కవరులో భద్ర పరిచిన కాగితం ఏదన్నా దొరికితే వదిలెయ్యొద్దని చెప్పండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! అదంతా కొండలు....గుట్టలతో నిండిన అడవి ప్రాంతం సార్. క్రింద పడితే ఎటు దొర్లుకెళ్తుందో తెలీని లోయలు కూడా. మన వాళ్ళు ఎక్కడని వెతక గలరు?’’ నమ్రతగా అన్నాడు రైటర్.

‘‘నాకు తెలీదంటారా?! కానీ వెతకాలి. హత్యాయుధం కన్నా ప్లాస్టిక్ కవరులో చుట్టిన పేపరు చాలా అవసరం. అది లేక పోతే ముందు మనం ముద్దాయిమవుతాం. వెళ్లండి! అప్రమత్తంగా ఉండే చురుకైన కానిస్టేబుల్స్ని పంపించండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్ సార్!’’ అంటూ అక్కడ నుండి తన సీటు దగ్గరకు వెళ్ళాడు రైటర్. రైటర్ వెళ్లగానే ఉలిక్కి పడి సీట్లో నుండి లేచి నిలబడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ముసలమ్మతో పాటు ఎవరో మరొకామె ఉంది అదే ప్రదేశంలో. ఎవరామె?! ఆమెనే కదా! ఈ యువకులిద్దరూ చెరచ బోయింది. ఆమె చేతిలో చావు దెబ్బలు తిని పారి పోయామన్నారు. చుర కత్తితో వారి మీద దాడి చేసిన ‘ఆమె’ సాధారణ స్త్రీ కాదు. కత్తి బొడ్లో దోపుకు తిరుగుతూందంటే సాదా సీదా సంసారి కాదు. మరి ఎవరామె?

ఎస్! ఆమె....ఆమె సాధారణ స్త్రీ కాదు’ అనుకుంటూనే రైటర్ వెనుకే  గదిలో నుండి బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్. స్టేషన్ అంతా ఫిర్యాదు దారులతో కిక్కిరిసి పోయి వుంది. లా అండ్ ఆర్డర్ ఎస్సై గది ముందు నలుగురైదుగురు బాధితులు నిలుబడి ఉన్నారు.
అందర్నీ తప్పించుకుంటూ జేబు దొంగల్ని, ముద్దాయిల్ని నిర్బంధించే సెల్ దగ్గరకు వెళ్లాడు ఎస్సై అక్బర్ ఖాన్..

సెల్ లో నలుగురైదుగురితో పాటు కొండల మీద నుండి లాక్కొచ్చిన యువకులిద్దరూ సిగ్గుతో ఓమూల నక్కి కూర్చున్నారు. వారి ఒంటి మీద ఒక్క కట్ డ్రాయర్ తప్ప మరే ఆచ్ఛాదన లేదు. అర్ధ నగ్నంగా కూర్చొని తలలు మోకాళ్ళలో దాచేసుకున్నారు.

క్రైమ్ ఎస్సై అక్బర్ ఖాన్ సెల్ దగ్గరకు రావడం చూస్తూనే అక్కడే కాపలాగా ఉండాల్సిన సెంట్రీలు బయట నిలబడి ఎవరి తోనో మంతనాలు చేస్తున్న వాళ్ళు పరుగు పరుగున సెల్ దగ్గరకు వచ్చారు.

‘‘సార్!’’ ఇద్దరు సెంట్రీలు వినయంగా ఎస్సైకి సెల్యూట్ చేసారు.

‘‘వాళ్లిద్దర్నీ మేడ మీద ఇంటరాగేషన్ సెల్ దగ్గరకు తీసుకురండి’’ అంటూ మేడ మీదకు టక టక బూట్ల శబ్దం చేసుకుంటూ హుందాగా నడిచి వెళ్ళాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఆ యువకులిద్దర్నీ అలా సెల్లో పడేసి ఉంచ కూడదు. వారిద్దరూ ఏం నేరం చేసారని వారిని బంధించ గలడు? వాళ్ళకు వాళ్ళే ఎవరో ఒకామెని చెరచ బోయామని చెప్పారు. కాని, ఆమె ఎక్కడ?! ఆమె ఫిర్యాదు చేస్తేనే గాని వీళ్ళ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఆ ముసలమ్మ హత్యకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని రూఢీగా తెలుస్తూనే ఉంది. కానీ, రాత్రి ఆ ముసలమ్మతో ఎవరో ఒకామె ఉందన్న గట్టి ఆధారం వాళ్ళే. ఈ ఇద్దరు యువకులే ఆమె ఎవరో కనిపెట్టి పట్టుకో గలరు.

ఆలోచిస్తూనే ఇంటరాగేషన్ సెల్ దగ్గరకెళ్ళాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ఇంటరాగేషన్ సెల్ దగ్గరకు వెళ్ళారని సెంట్రీలు ఇద్దరూ రైటర్ కి చెప్పి సెల్లో ఉన్న యువకుల్ని తీసుకుని మేడ మీదకు వెళ్ళారు.

అందినట్టే అంది...చిక్కినట్టే చిక్కి....అంతలోనే అర్తహం కాని ప్రశ్నార్థకమైపోతున్న కేసు ఎన్ని మలుపులు తిరగబోతుంది......ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం దాకా ఆగాల్సిందే....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్