Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue263/703/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... ఆ రాత్రి గాయత్రికి చెప్పింది. మరు నాడు తను వెళ్ళే టైం కి బాబుని సిద్ధం చేసి ఆమెని కూడా రెడీ గా ఉండమంది.

“ఎక్కడికక్కా”  అడిగింది గాయత్రి.

“అంగన్ వాడిలని ఉన్నాయి తెలుసుగా..” అడిగింది.

సంశయంగా చూస్తూ “లేదు అంటే ఏంటి” అడిగింది.

జాలేసింది శరణ్యకి... బొత్తిగా లోక జ్ఞానం లేని పిల్ల ఎలా బతుకుతుందో అనుకుంది. మెత్తటి స్వరంతో అంగన్ వాడిల గురించి వివరంగా చెప్ప సాగింది.

“ ప్రభుత్వం పేద వారి  పిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా మాతా, శిశు సంక్షేమ పధకం ఏర్పాటు చేసింది. ఈ పధకం కింద గ్రామాల్లో అంగన్ వాడి సెంటర్స్ అని కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి, మురికి వాడలు, గిరి జనులు, ఆర్ధికంగా వెనక బడిన వారి పిల్లలు, గర్భిణి స్త్రీలు, బాలింతలు వీళ్ళ  సంక్షేమ నిమిత్తం  ఉచిత వైద్య సేవలు, ఉచిత  పోషకాహారం, ఉచిత విద్య ఇలాంటివన్నీ అందించడానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.  అవన్నీ సవ్యంగా  అమలు చేయడానికి అధికారులను నియమించింది.

అంతే కాక ప్రైమరీ టీచర్స్ ని, ఆయాలని, నర్సులని  వీళ్ళని పర్యవేక్షించడానికి మరి కొందరిని నియమించింది. వీళ్ళ అందరికి ప్రభుత్వమే జీతం ఇస్తుంది. అదంతా ఒక ప్రాసెస్. కాకపోతే ఒక కార్యకర్తగా నీకు ఒక అంగన్ వాడిలో నీకు ఉద్యోగం వేయిస్తాను.

అక్కడ పసి పిల్లల నుంచి ఆరేళ్ళ  పిల్లలు ఉంటారు.. ఆ పిల్లల ఆలనా, పాలనా చూసుకోడం తో పాటు  వాళ్ళకి ప్రభుత్వం అందచేస్తున్న భోజనం, పాలు, గుడ్లు సరిగా అందచేయడం, పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత అన్నీ చూసుకోవాలి.

చిన్న, చిన్న పద్యాలూ, పాటలు, ఆటలు నేర్పిస్తూ  అన్ని రకాలుగా ప్రేమగా చూసుకోవాలి.. ఆయాలు కూడా ఉంటారు.. వాళ్ళ సహాయంతో అన్ని విధాలుగా నీ కొడుకుని చూసుకున్నంత శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి.. నీ కొడుకుని కూడా అక్కడే చేర్పిస్తే నీకు వీలుగా ఉంటుంది.  
నీకు జీతం ఇస్తారు. ప్రస్తుతం చాలా తక్కువ జీతమే ఇస్తారు. కానీ నీ కొడుక్కి, నీకు చిల్లర ఖర్చులు వెళ్ళి పోతాయి. నీతో పాటు మరో ఇద్దరు ఆయాలు ఉంటారు.. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు, మూడున్నర దాకా ఉంటుంది. పిల్లలు మధ్యాహ్నం ఇళ్ళకు వెళ్ళి పోతారు. నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నీకు సెంటర్ కి  దగ్గరలో ఒక గది చూపిస్తాను. ఎందుకంటే రోజు విజయవాడ వచ్చి వెళ్ళడం చాలా కష్టం నీకు. ఆ ఊళ్లోనే  నువ్వు హాయిగా ఉండచ్చు...అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు.. నీకు  భయం లేదు”  అంటూ చెప్పి ఓకేనా అని అడిగింది.
గాయత్రి కన్నీళ్ళతో ఆమె పాదాలు తాకింది. “మీరు దేవత “ అంది..

శరణ్య గాయత్రిని లేవనెత్తి “ఈ సెంటిమెంట్స్ వదిలేసి  ప్రైవేటుగా డిగ్రీ కి కట్టు.. మంచి ఉద్యోగం వస్తుంది..  నేను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ వచ్చు” అంది.

మరు నాడు ఉదయం బాబుని తీసుకుని శరణ్యతో కారులో వెళ్తోంటే ఎన్నడూ కలగని ఒక నిశ్చింత ఆమెలో కలిగింది.

గాయత్రి ని అంగన్ వాడిలో అక్కడ ఉన్న కార్యకర్తలకి అప్పచెప్పి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. గాయత్రికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పి మళ్ళి వస్తానని చెప్పి తను ఆఫీస్ కి వెళ్ళి పోయింది.

ఇప్పుడు ఆమెకి కొంత రిలీఫ్ గా అనిపించింది.  గాయత్రికి ఇల్లు చూసిం దాకా అక్కడే పని చేస్తున్న ఒక కార్య కర్త ఇంట్లో ఆశ్రయం కల్పించింది.
తేజకి ఫోన్ చేసి తను చేసిన పని చెప్పింది. అతను అభినందిస్తూ అన్నాడు.

“నేనే చెప్పాలనుకున్నాను.. నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు బాగానే ఉంది.. కానీ ఎంత కాలం ఆమె అలా నీ రక్షణలో ఉంటుంది.. ఆమెకంటూ ఒక ఇండివిడ్యువల్ లైఫ్ ఉండాలి కదా. నువ్వు ఈ రోజు విజయవాడలో ఉన్నావు.. మరో ఆరునెల్లకి ఇంకో దగ్గరికి బదిలీ అవచ్చు.. అప్పుడు ఆమె సంగతి ఏంటి? సో నువ్వు చేసింది చాలా మంచి పని ..

“ థాంక్స్ తేజా” అంది శరణ్య.

“ ఒక పని చేయి బాబు పేరు మీద యాభై వేలు ఎఫ్ డి చేయి నేను ఇస్తాను డబ్బు.. ఏదో చేసామన్న తృప్తి ఉంటుంది” అన్నాడు.
శరణ్యకి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు.. యాభై వేలు ... ఎంత పెద్ద మనసు ఇతనిది.

“నువ్విస్తావా” అంది సంభ్రమంగా.

నవ్వాడు తేజ. “ఇవ్వ లేని స్థితిలో లేను కదా..డోంట్ వర్రీ” అన్నాడు.

ఇతనిలో ఇంకో కోణం చూసాను ఇవాళ అనుకుంది. అతని ఔదార్యానికి, విశాల హృదయానికి ముగ్దురాలైంది. డబ్బున్నా ఇచ్చే మనసు అందరికి ఉండాలి కదా. నా తేజకి ఉంది అనుకుంది.

“అలాగే తేజా థాంక్స్”  అంది.

“నీ మొహం ఇది నీ డబ్బే ... కాక పోతే నా దగ్గర ఉంది. నీ ఎకౌంటు డీటెయిల్స్ ఇవ్వు రేపే నీ ఎకౌంటుకి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తాను” అన్నాడు.

శరణ్య సంతోషంతో ఉప్పొంగి పోయింది.

ఎంత మంచి వాడు తేజ అనుకుంది మరో సారి.

అన్నట్టే మరునాడు రెండు లక్షలు ట్రాన్స్ ఫర్ చేసాడు.

“అదేంటి అంత చేసావు” ఆశ్చర్యంగా అడిగింది ఫోన్ చేసి.

“ఉండని నీకేదన్నా అవసరం వస్తే ఉంటుంది.. యాభై వేలు బాబు పేరు మీద ఎఫ్ డి చేయి” అన్నాడు.

శరణ్యకి నోట మాట రాలేదు.. పెళ్లి కాకుండానే ఇంత డబ్బు ఇస్తున్నాడు.. పెళ్లి అయాక పూల పల్లకిలో తిప్పుతాడు కాబోలు అనుకుంది పెదవుల మీద చిరు నవ్వుల పూలు రాలుతోంటే.

అయితే విజయవాడలో అనుకోకుండా రాజకీయాల్లో మొదలైన కుల వర్గ పోరాటాలు శృతి మించి సామాన్య ప్రజల దాకా పాకడంతో పెద్ద ఎత్తున అల్లర్లు మొదలు అయాయి.

శరణ్య బాగా బిజీ అయి పోయింది. విజయవాడనుంచి కదల లేక పోయింది. ఎం ఆర్ ఓ గారితో కలిసి కలెక్టర్ గారితో, మంత్రులతో మీటింగ్స్ కి వెళ్ళడం వాటికి సంబంధించిన మొత్తం పనులతో వారం రోజులు నిద్ర పోడానికి తప్ప, ఇంటికి కూడా వెళ్ళ లేక పోయింది.

గాయత్రిని అంగన్ వాడిలో చేర్చాక ఆమె ఎలా ఉందో, ఆమె పరిస్థితి ఏమిటో కూడా తెలుసుకునే సమయం లేదు. బాంక్ కి తీసుకుని వెళ్లి  అకౌంట్ ఓపెన్ చేయించే పని వాయిదా పడింది.

వారం తరవాత పరిస్థితులు కొద్దిగా చక్క బడ్డాక సనత కుమార్ దగ్గర నందివాడ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోడానికి అతని ఆఫీస్ కి వెళ్ళింది.
రండి శరణ్య గారు మీకే కాల్ చేద్దామనుకుంటున్నాను అని ఆహ్వానించాడు.

ఆమె నమస్కరించి కుర్చీలో  కూర్చుంటూ చిరు నవ్వుతో అడిగింది  “నేను ఇవాళ నందిగామ వెళ్ళాలనుకుంటున్నా సర్ .. అల్లర్లు సద్దుమణిగాయనుకోవచ్చా !”

అతను కూడా తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు “ఇవన్నీ  వస్తుంటాయి... పోతుంటాయి ... మీకు ఇంకా ప్రారంభమే కదా ముందు ముందు బాగా తెలుస్తుంది.”

శరణ్య నుదుటి మీద పడ్డ ముంగురులు సరి చేసుకుంటూ  అంది “బాబోయ్ ... నన్ను బెదరగొట్టేస్తున్నారు...”

“తప్పదు మేడం ... భయ పడితే ఎలా ? కాబోయే కలెక్టర్ మీరు...”

అతని మాటలకి కొంచెం సిగ్గు పడి నవ్వుతూ “మీ తరవాతే కదా సర్.. మీ శిష్యరికంలో అన్ని నేర్చుకుంటాను” అంది.

అతను కూడా నవ్వేసి “ ఓకే బై ద వే ... మీరు ఇప్పుడు మీ ఆఫీసుకి  వెళ్ళగానే మీకొక సిట్యుయేషన్ ఎదురవుతుంది... అది సక్సెస్ ఫుల్ గా డీల్ చేయ గలిగితే అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని నిలబడ గలుగుతారని నేను చాలెంజ్ చేస్తాను” అన్నాడు.

“సిట్యుయేషన్ ... ఏంటది?” ఆశ్చర్యంగా చూసింది.

అతని కళ్ళు నవ్వుతున్నాయి.. “చూసారా భయపడుతున్నారు” అన్నాడు.

తేలిగ్గా నవ్వేస్తూ “అదేం లేదు చెప్పండి” అంది.

“మీరు ఒకమ్మాయిని లాస్ట్ వీక్ అంగన్వాడి లో చేర్చారు కదా..”

“అవును”  ఏం చెప్పబోతున్నాడా అన్నట్టు చూస్తూ తల ఊపింది.

“ఆ విషయంలో  నాకు ఫిర్యాదు వచ్చింది... రిటెన్ కంప్లైంట్ ఫ్రం సూపర్ వైజర్.  మీరు అధికార దుర్వినియోగం చేశారని, అనధికారంగా, ఇల్లీగల్ గా ఒక అమ్మాయిని అప్పాయింట్ చేశారని ..”

“వాట్? నేను మిమ్మల్ని అడిగే చేసాను కదా..”

“అడిగారు కానీ అధికారికంగా  రాత పూర్వకంగా అనుమతి తీసుకో లేదు కదా.. ఎలా ఆమెని కార్యకర్తగా నియమించారు.. ఇది ఎగైనెస్ట్ రూల్స్

... అవునా..”

శరణ్య మొహం పాలి పోయింది.  అయోమయంగా చూసింది..

(మానవత్వానికీ అధికారానికీ మధ్య శరణ్య గమనించని ఇంకో కొత్త కోణమేదైనా ఉందా? సనత కుమార్ లోని కొత్త కోణమేదైనా చూపించబోతున్నాడా?? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana