Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue263/704/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... భగవంతుడా! నువ్వున్నావయ్యా!’ మనసు లోనే సింహాద్రి నాథునికి మొక్కుకుని ఫోన్‌ రింగ్‌ చేసింది.
చీర చెంగు లోనే ఫోన్‌ దాచుకుని చెవి దగ్గర సెల్‌ ఆనించింది.

‘‘హలో!....’’ నెమ్మదిగా అంది ఆమె.

‘‘బాగున్నావా తల్లి?...’’ అవతల్నుండి ఖంగుమంది గొంతు.

‘‘చెప్పండి అత్తమ్మ!....మీరు నా కోసం ఫోన్‌ చేసారంటే శుభ వార్తేగా?!’’ ఆనందంగా అంది ఆమె.

‘‘అంత అదృష్టమా తల్లీ! లేదు. మనందరి అన్వేషణ అదేగా తల్లీ!’’ అట్నుంచి బాధగా అంది అత్తమ్మ.

‘భగవంతుడా!....’ అంటూ ఒక్కసారే మ్రాన్పడి పోయింది.

‘‘మీరిప్పుడు ఏ ఆలయంలో ఉన్నారు?’’ అడిగింది అత్తమ్మ.

‘‘సింహాచలంలో....’’ అందామె.

‘‘శుభం! జాగ్రత్త! నీ ఉనికి ఎవరికీ తెలీనీకు తల్లీ!’’

‘‘అలాగే అత్తమ్మా!’’ అంది.

ఫోన్‌ తిరిగి బ్యాగ్‌లో దాచేసింది.

ఆలోచిస్తూనే బ్యాగ్‌ భుజాన తగిలించుకుని నడుస్తూ కొండ బస్సు స్టాప్‌ దగ్గరకు వచ్చిందామె. బస్సు టాండ్‌ నిండా భక్తులు తండోప తండాలుగా ఉన్నారు. ఒకో బస్సు వస్తోంది. జనాలతో కిక్కిరిసి పోతోంది. ఒక దాని తర్వాత ఒకటి వచ్చి వెళ్తున్నాయి గానీ, క్యూలో ఉన్న భక్తులు తరగటం లేదు.

ఎదురుగా ఉన్న అన్న దాన సత్రం కేసి చూసింది. దాని ప్రక్కనే ఊడల మర్రి చెట్టు దెయ్యంలా జడలు విర బోసుకుని ఉంది. ఆ ప్రాంతం అంతా చీకటి మింగేసింది.

ఐమ్యాక్స్‌ లైట్ల కాంతి ఆ ప్రాంతమంతా అలుముకుని ఉంది. అన్న దానం ఎదురు గానే ఫేన్సీ దుకాణాలు, ఫోటో దుకాణాలు. శనగలు, ఖర్జూరం దుకాణాలు బారులు తీరి ఉన్నాయి.

క్యూ లైన్లో నిలబడ లేక ఒంటరిగా ఓ మూల నిలబడింది ఆమె. జనాలతో నిండుకుంటున్న బస్సుల కేసి చూస్తూ నిలబడింది. ‘నడిచి వెళ్ళి పోతేనో!’ మనసు లోనే అనుకుంది. మళ్ళీ తనకి తనే ‘వద్దులే! బస్సు ఎక్కేయ్యడమే మేలు’ అనుకుంటూ టిక్కెట్లు బుకింగ్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్ళి టిక్కెట్టు తీసుకుంది.

టిక్కెట్టు పట్టుకుని భక్తుల వెనక క్యూలో నిలబడీ నిలబడనట్టు ఒక ప్రక్కగా నిలబడి మర్రి చెట్టు కేసి చూసింది.

ఒక్క సారే ఉలిక్కి పడింది ఆమె.

గత రాత్రి జరిగిన సంఘటనలే వరుసగా కళ్ల ముందు కదలాడాయి. చేతిలో పుష్కలంగా డబ్బు ఉన్నా ఆ రాత్రి విశ్రమించడానికి ఒక గది అద్దెకు తీసుకో లేక పోయింది. నెల రోజులుగా ఇదే అవస్థ ఎక్కడడగిన ఇవ్వ కూడదనే సమాధానం.

చీకటి పడగానే ఒక గది కావాలని దేవస్థానం విశ్రాంతి మందిరంలో ఉన్న బుకింగ్‌ క్లర్క్‌ని ఎంతగా ప్రాథేయ పడింది! ఒక్కరికి గది అద్దెకు ఇవ్వడం కుదరదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి బయటకు తగిలేసాడు. అంతేనా! తనని ఓ పిచ్చి దాన్ని చూసినట్టు చూసాడు. దేవాలయం కదా ఇస్తారనుకుంది. అన్ని చోట్ల ఒకటే మాట. భగవంతుడా ఒంటరిగా వచ్చేవాళ్ళ గతి ఏం కాను. మనసు లోనే బాధ పడింది.
‘‘గాలి గోపురం దగ్గర సత్రం ఉంటుంది. నీలాంటి వాళ్లంతా అక్కడ పడుకుంటారు. అక్కడికి పోమ్మా’’ అంటూ చీదరించుకున్నాడు ఆ బుకింగ్‌ క్లర్క్‌.

అతనన్నట్టు సత్రం వెదుక్కుంటూ వెళ్ళింది. అది ఓ పెద్ద రేకు షెడ్డు. అప్పటికే ఆ షెడ్డు నిండా ఈగల్లా భక్తులు మూటా ముల్లెలు ప్రక్కన పెట్టుకుని ఆక్రమించేసి ఉన్నారు.

తను ఒక్కర్తే విశ్రమించడానికి పిసరంత జాగా కూడా కాన రాలేదు. లక్షల్లో వచ్చే భక్తులకు ఒక్క రేకు షెడ్డు ఏం సరి పోతుంది. ఇక అక్కడ ఇమడ లేక....నిలబడ లేక తిరిగి వెనక్కి వచ్చేసింది.

కన్ను మూస్తే తెల్లారి పోయే ఈ రాత్రి ఎక్కడో ఒక దగ్గర చేరగిల బడితే సరి అనుకుంటూ అన్నదానం భవనం దగ్గరున్న మర్రి చెట్టు నీడని ఎంచుకుంది. తోడుగా ముసలమ్మ ఉందని ఎంతో ఆనంద పడింది.

కానీ....?! అంత ఘోరం జరుగుతుందని ఊహించ లేక పోయింది.

కొండ బస్సు ముందుకు కదులుతూ చేసిన హారన్‌ శబ్దానికి ఉలిక్కి పడింది ఆమె.

భక్తులు పల్చబడ్డారు. ఒక్కరొక్కరుగా మరో బస్సు ఎక్కుతున్నారు. క్యూలో లేక పోయినా అందరూ బస్సు ఎక్కుతుంటే ఆఖర్న నడుస్తూ ముందుకు వెళ్తోంది ఆమె. ఉన్నట్టుండి తన వెనుకే ఎవరో ఏదో మాట్లాడుకోవడం చెవిన సోకే సరికి ఉలిక్కి పడింది మహా శ్వేత. ఒక్క సారిగా వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరు యువకులు ఆమెనే చూస్తూ ఒకరికొకరు ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్లని చూస్తూనే అదిరి పడింది ఆమె.
‘‘అరేయ్‌ చూడరా! ముసుగేసుకుని బస్సు ఎక్కుతోందే! అదే లాగుంది కదా!’’ ఒకడంటున్నాడు.

‘‘ఆ బస్సు ఎక్కుతున్న వాళ్లంతా చలికి ఒణుకుతూ ముసుగులేసుకుని బస్సులెక్కుతున్నారు చూడు’’ అన్నాడు రెండో వాడు.
‘‘లేదురా! నాకెందుకో...రాత్రి మనల్ని గాయ పరిచింది ఆమె అన్పిస్తోంది’’ మొదటి వాడు అంటున్నాడు.

ఆ మాటలు వింటూనే ఆమెకి అర్థమై పోయింది. ఆ యువకులిద్దరూ తన గురించే వెదుకుతున్నారని గ్రహించింది.

ఆ యువకులకి అరడుగు దూరంలో మరో ఇద్దరు యువకులు ఆతృతగా వారినే గమనిస్తూ నిలబడ్డారు. సివిల్‌ డ్రస్‌లో ఉన్న పోలీసులు ఆ ఇద్దరూ. వాళ్ళ వాటం... వాలకం చూసి ఇట్టే గ్రహించేసిందామె.

ఆఖరున బస్సు ఎక్కుతూ ఒక సారి వెనక్కి తిరిగి చూసింది ఆమె. తల నిండుగా కప్పుకున్న చీర కొంగు నున్నగా ఉన్న గుండు మీద నుండి సర్రున జారి పోయింది.

బస్సు ఎక్కుతూ తమనే చూసిన ‘ఆమె ’ని యువకులిద్దరూ చూసి ఉలిక్కి పడ్డారు. అందంగా అప్సరసలా వున్న ‘ఆమె’ తల నున్నగా గుండు చేయించుకుని కనిపించే సరికి ‘అయ్యో!’ అనుకున్నారు. తమ వైపే చురుగ్గా చూస్తున్న ఆమెని గుర్తు పట్టి అయోమయంగా చూస్తూ నిలబడ్డారిద్దరూ.

ఆ యువకులిద్దరూ తన కేసే పరీక్షగా చూడడం గమనించిన ఆమె గిర్రున తిరిగి బస్సులో కిక్కిరిసి ఉన్న భక్తుల్ని చీల్చుకుంటూ లోపలకు చొరబడి ఆ యువకుల కంట పడకుండా దాక్కుంది.

బస్సు కిక్కిరిసి పోవడంతో క్రింద బస్సు డోర్‌ దగ్గర నిలబడి టిక్కెట్లు చెక్‌ చేసిన క్లీనర్‌ కుర్రాడు చేత్తో దబ దబా రైట్‌ చెప్పాడు. అప్పటికే బస్సు స్టార్ట్‌ చేసి ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్న డ్రైవర్‌ ఒక్క సారే బస్సుని ముందుకు కదిలిస్తూ స్పీడు పెంచాడు. బస్సు ఎక్కుతూ వెనక్కి తిరిగి తమ వైపే చూస్తూ నిలబడ్డ ఆమెనే గుర్తు చేసుకుంటూ తన్మయంగా నిలబడి పోయారు ఆ యువకులిద్దరూ.

అంత అందగత్తె....ఆ అందానికే అందాన్ని చేకూర్చే ‘జుత్తు’ ను దేవుడికి కానుకగా సమర్పించి గుండు చేయించుకుందేమిటబ్బా అనుకుంటూ నిలబడ్డ యువకుల్లో ఒకడు ఏదో గుర్తొచ్చిన వాడిలా అదిరి పడ్డాడు.

‘‘ఒరేయ్‌! రాత్రి మన మీద దాడి చేసింది ఆమేరా! ఆమె....ఆ కళ్ళు....చింత నిప్పుల్లా మెరుస్తూ మన మీద కసిగా కత్తితో దాడి చేసిన ఆమె....ఆమె కళ్ళు...నాకింకా గుర్తేరా! అదే!....ఆ రాక్షసే!’’ అంటూ గట్టిగా అరిచాడు ఒక యువకుడు.అప్పటికే బస్సు కొండ చరియల్లోనుండి పాములా మెలికలు తిరుగుతూ సరసరా పరిగెడుతున్న కొండ చిలువలా ముందుకు దూసుకు పోతోంది.

ఆ యువకుడు అరవగానే వారి వెనుకే నిలబడ్డ పోలీసులు ఇద్దరూ పరుగున వారి దగ్గరకు వచ్చారు.నలుగురూ ఆందోళనగా కనుమరుగైన బస్సు కోసం కొండ కేసి చూస్తూ స్థాణువులై నిలబడి పోయారు.

****************

ఏ.సి.పి. ఆఫీసులో రిపోర్ట్‌ చేసి బయటకు వచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. కొండ మీద ముసలమ్మ మరణం గురించి తన పరిశోధనలో తేలిన విషయమంతా ఏ.సి.పి., సి.ఐ కి రిపోర్ట్‌ చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

బుల్లెట్‌ మీద గోపాల పట్నం కేసి బయల్దేరాడు.

ఇంతలో సెల్‌ ఫోన్‌ రింగయింది. ‘ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ రోడ్డు ప్రక్కన బుల్లెట్‌ ఆపి సెల్‌ తీసి చూసాడు.

మధ్యాహ్నం ఆ ఇద్దరు యువకుల వెంట సివిల్‌ డ్రస్‌ల్లో వెళ్లిన కానిస్టేబుల్స్‌లో ఒకడు. వెంటనే కాల్‌ రిసీవ్‌ చేసుకుని సెల్‌ చెవి దగ్గర పెట్టుకున్నాడు.

‘‘చెప్పు టు నాట్‌ టు’’ హుందాగా అన్నాడు ఎస్సై.

‘‘సార్‌!....ఆమె కనిపించింది.’’ అట్నుండి ఆతృతగా అన్నాడు కానిస్టేబుల్‌.

‘‘వెల్‌! వెంటనే ఆమెని పట్టుకుని స్టేషన్‌కి తీసుకు రండి.’’ ఆనందంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘కనిపించింది సార్‌! కానీ....’’ నీళ్ళు నములుతూ అన్నాడు అట్నుండి కానిస్టేబుల్‌. ‘ కానీ ’ మాట వినగానే ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి  చిర్రెత్తి పోయింది.

‘‘యూస్‌లెస్‌ ఫెలో! కానీ....ఏమిటీ! ఏమైందో చెప్పు.’’ అసహనంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘కొండ బస్సులో క్రిందకు వెళ్లి పోతోంది సార్‌!’’ అన్నాడు కానిస్టేబుల్‌

‘‘షటప్‌! ముందు ఎవరిదైనా బైక్‌ తీసుకుని బస్సుని ఫాలో అవ్వండి. నేను క్రింద బస్సు స్టాండ్‌ దగ్గర ఆ బస్సుని కేచ్‌ చేస్తాను. హరియప్‌! ఆమె మిస్‌ కాకూడదు’’ కోపంగా అరుస్తూనే కాల్‌ కట్‌ చేసి సెల్‌ జేబులో పెట్టుకున్నాడు.

‘ఎలాగైనా ఆమెని పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితు ల్లోనూ ఆమెని వదిలి పెట్ట కూడదు. కొండపై నుండి బస్సు కొండ దిగువ బస్సు స్టాండ్‌కు చేరే లోపు వెళ్ళాలి!’ అనుకుంటూనే బుల్లెట్‌ స్టార్ట్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*************

ఎస్సై ఫోన్‌ లోనే తిట్టే సరికి కానిస్టేబుల్స్‌ ఇద్దరికీ ముచ్చెమటలు పోసాయి. ఇప్పుడు ‘ఆమె’ని పట్టుకో లేక పోతే తమ ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుందని భయంతో ఆందోళన చెందారు ఇద్దరూ.

(చిక్కినట్టే చిక్కి జారి పోయిన మహాశ్వేత పోలీసులకందినట్టేనా? ఆమె పని అయిపోయినట్టేనా?? అసలామె అన్వేశణ దేనికోసం?? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్