Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
lemon grass tea

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు థాయిలాండ్ - కర్రా నాగలక్ష్మి

viharayatra

(పట్టయ )

కోరల్ ద్వీపం లో స్పీడు బోటు లో సుమారు ముప్పై కిలోమీటర్లు సముద్రంలో వెళ్లిన తరువాత లంగరు వేసుకొని పర్యాటకులు అక్కడ సముద్రంమీద తేలుతూ లోపల కనిపించే కోరల్స్ , జలజీవాలను చూసే ట్రిప్పు లో మేం కూడా వెళ్లేం . సముద్ర జలాలమీద స్పీడుబోటు నీటిని చీల్చుకుంటూ వెళ్తూ , మనమీద నీళ్లు చిమ్ముతూవుంటే ఆ అనుభూతేవేరు . వివిధదేశాలనుంచి వచ్చిన ఓ పదిహేనుమందిమి వున్నాం . అందరకీ ఫ్లోటింగ్ ఎక్విప్ మెంటు యిచ్చేరు , అవి వేసుకొని అందరూ నీళ్లలోకి దూకి నీటిలోకి చూడసాగేరు . అక్కడి నీరు యెంత స్వఛ్చంగా వుందంటే నీరు లోపల భాగం అంటే కనుచూపు చేరగలిగేంత వరకు వున్న జలచరాలు చక్కగా కనిపిస్తున్నాయి . అక్కడ  సుమారు వంద అడుగులలోతు వుందట , ఫ్లోటర్స్ వేసుకుంటే యీతరాకపోయినా ఫరవాలేదనే అజజ్ఞానంతో నేను నీటిలోకి దూకి మిగతావారిలానే కింద జలచరాలను చూడ్డం లో మునిగిపోయేను . కొంతసమయం గడిచేక యేదోభయం నాలో ప్రవేశించింది . అప్పుటికే మా బోటు అలల తాకిడికి కాస్త ముందుకి పోయింది , యెలాగో కాళ్లు చేతులు ఆడించి బోటు చేరుకున్నాను , తలుచుకుంటే యిప్పటికీ భయంతో ఒళ్లు జలదరిస్తుంది

మధ్యాహ్నానికి భోజనం కోసం మరో చిన్న దీవికి తీసుకువెళ్లేరు , పడవ దిగిన తరువాత నీళ్లమీద కట్టిన సన్నని వెదురులతో నిర్మించిన వంతెన మీద నడుస్తూ చిన్న పాకలలోకి వెళ్లాలి , కన్నుచెదిరి కాలు జారితే సముద్రంలో పడి జలచరాలకు ఆహారమౌతాం .  ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లేం . నీళ్లపైన కట్టిన పాకలాంటి హోటలు , అందులో టేబుల్స్ , కుర్చీలు బల్లలపై వున్నాయి , కుర్చీలో కూర్చుంటే కాళ్లు నీటికి తగులుతూ వుంటాయి . మాంసాహారులకి అక్కడ చిన్న కంచెలు కట్టి పెంచుతున్న జలచరాలలో ( జలచరాలు అని యెందకన్నాను అంటే నాకు తెలిసినవి చేపలు మాత్రమే అక్కడ యెన్నో రకాలు వున్నాయి ) యెవరికి కావలసినది వారు చూపించిగాని , గాలం వేసి పట్టుకొని గాని వారికిస్తే వారు వండిపెడతారు . జలచరాలు కాలుతున్న వాసన భరించలేక బయటకి వెళ్లేదారిలేక ( చుట్టూసముద్రమే ) ఆ కంపుభరించేం . అయితే ఆ హోటలు సెటప్ కొత్తగా వుండి చాలా నచ్చింది . భోజనాలు అయిన తరువాత తిరిగి ముందు మేం వెళ్లిన ద్వీపానికి తెచ్చేరు సాయంత్రం వరకు అదే ద్వీపం లో గడిపేం . ఓ పావు కిలో మీటరు వరకు యిసుక ఆ తరువాత చిన్నచిన్న గుబురులతో కూడిన అడవి మొదలయి పోనుపోనూ దట్టమైన అడవిగా మారుతుంది కాస్త దూరం నడిచి తెలియని దారులలో పయనించకూడదని వెనుకకి మరలేం . బీచ్ ని ఆనుకొని వున్న షాపులు తప్ప ఆ దీవిలో మానవనివాసాలు లేవు . 

సాయంత్రం అవుతున్నకొద్దీ సముద్రం లో నీటిమట్టం పెరగనారంభించింది . నాలుగు నాలుగున్నరకల్లా ఆ దీవి లోని వారు షాపులు మూసేసి మేమెక్కిన నావలలోనే సామానులు తీసుకు పట్టయ వచ్చేసేరు .

పట్టయ లో బీచ్ ని జోంతియన్ బీచ్ అని అంటారు . ఒడ్డున నీరు అంత స్వఛ్చంగా వుండదు . బీచ్ లో టెంపరరీ బార్లు , థాయ్ మసాజ్ లు , టాటూ సెంటర్లు రోజంతా సాగుతూనే వుంటాయి . ‘ పట్టయ కి ఓ నాలుగు అయిదు మైళ్ల దూరంలో వున్న మూడు దీవులను దగ్గర దీవులని , యేడు యెనిమిది మైళ్ల దూరంలో వున్న నాలుగు దీవులని దూరం దీవులని పట్టయ లోని సైట్ సీయింగు టూరు ఆపరేటర్లు వ్యవహరిస్తూవుంటారు . మేం అన్ని దీవులకి వెళ్లేం , యెక్కువగా పర్యాటకులు వెళ్లేది ‘ కోరల్ అయిలెండ్ ‘

పట్టయ లో స్కూబా డైవింగ్ కూడా వుంది , వుత్సాహం వున్న వారు స్కూబా డైవింగ్ కూడా ట్రై చెయ్యొచ్చు . పట్టయ లో ఫ్రూట్ మార్కెట్ లో యెన్నో రకాలైన పళ్లు సీజను తో సంబంధం లేకుండా దొరకుతాయి . చాలా రుచిగా కూడా వుంటాయి . ఇక్కడ దొరికే అనాస , పనస , జామ , రంబుతాన్ , పంపరపనస పళ్లు చాలా రుచిగా వుంటాయి . ఇంకా పేరు తెలీని యెన్నో రకాల పళ్లు యిక్కడ మొదటిమారు రుచి చూసేం . పట్టయ నగరానికి మూడు వైపులా ( నాలుగో వైపు సముద్రం వుంది ) అనాసపనస తోటలు కొన్ని వందల యెకరాలలో వున్నాయి . రచ్చాబురి వైపు వెళ్లేవారు , బేంకాక్ వైపు వెళ్లేవారు హైవేకి ఆనుకొని వున్న పళ్ల దుకాణాలలో దొరికే పళ్లు కొనుక్కుంటూ వుంటారు . ఇక్కడ జీడితోటలు కూడా యెక్కువే , యిక్కడి జీడిపప్పు చాలా రుచిగా వుంటుంది . మామిడి , పనస , జీడిమామిడిమొదలయిన పళ్లు సీజను తో సంబంధం లేకుండా పండుతూ వుంటాయి . వరి , చెరుకు వీరి ముఖ్య పంటలు . సారవంతమైన నేల , కావలసినంతగా కురిసే వాన పంటలు బాగా పండటానికి వుపకరిస్తోంది . 

థాయిలాండు లో విన్న మరో ముఖ్య మైన విషయం యేమిటంటే వర్షాకాలంలో నదులలోకి బంగారం లోహం కొట్టుకు వస్తుందట , బాగా వర్షాలు పడే సమయంలో కొన్ని వందల కుటుంబాలు నదులలోకి కొత్తగా వచ్చి చేరే బురదనీటిని జల్లెడ పడతారు . అలా జల్లెడ పడితే వారికి బాగా బంగారం దొరుకుతూ వుంటుందట .

చైనా దగ్గరగా వుండడం వల్ల థాయిలాండులో చైనా లో తయారయే యెలక్ట్రానికి వస్తువలు చాలా తక్కువ ధరకు దొరకుతాయి , అలాగే కల్చర్డ్ పర్ల్స్ కూడా విరివిగా అమ్మడం కనిపిస్తుంది . ముత్యాలతో చేసిన పర్స్ లు , టై లు మొదలయినవి చూపరులను బాగా ఆకట్టుకుంటాయి , అలాగే అప్పట్లో ఓ బంగారం షాపులో బంగారం తో చేసిన లక్ష్మి , గణపతి , బుద్దుడు కృష్ణుడు , శివుడు మొదలయిన విగ్రహాలను చూసేం . వాటి పనితనం నచ్చి గణపతి , లక్ష్మి విగ్రహాలను కొని పూజలో పెట్టుకున్నాను . 

థాయిలాండు కెంపులు ( రుబి ) , పచ్చలు ( సఫైర్ లు ) , నీలం ( బ్లు సఫైర్) లకి ప్రసిధ్ది , యీ గనులని న్యూ బర్మీస్ గనులు అని అంటారు . పట్టయలో యీ రంగురాళ్ల వ్యాపారం బాగా జరుగుతూ వుంటుంది . మోసాలుకూడా బాగా వుంటాయి .

జోంతియన్ బీచ్ దాటుకొని వెళితే రివాల్వింగ్ రెస్టొరెంట్ వుంది . చాలా యెత్తుగా కట్టిన టవరుపైన , హోటలు 360 డిగ్రీలలో తిరుగుతూ వుంటుంది . జోంతియన్ పార్క్ లోంచి యీ రెస్టొరెంట్ కి చేరుకోవచ్చు . టవరు పైకి చేరుకోడానికి నాలుగు వైపులా లిఫ్ట్ లు వున్నాయి , ప్రైవేటు సంస్థ నడుపుతున్న హోటలు , ఉత్తినే కూర్చోడానికి వీలులేకుండా ముందుగా మనం తినబోయే అయిటమ్ కి డబ్బుకట్టి రసీదు తీసుకున్న తరువాతే లిఫ్ట్ లోకి ప్రవేశం దొరుకుతుంది . యీ టవరు దగ్గర కొన్ని యెడ్వంచరస్ గేమ్స్ కూడా నడపబడుతున్నాయి . సుమారు వంద అడుగుల యెత్తున్న యీ టవరు పైన కేబుల్క్ కట్టిన కుర్చీలో కూర్చొని కిందకి జారుతూ వుంటారు , గాలిలో ఆ కుర్చీ ఒక్క కేబుల్ ఆధారంగా జారడం నాకు గగుర్పాటును కలుగజేసింది . యీ టవరుకి యెదురుగా వున్న మరో టవరు చుట్టూరా వున్న కుర్చీలలో కూర్చొని చాలా స్పీడుగా పైకి లాగి జీరో గ్రావిటీలో కిందకి వదిలేయడం నాకు చాలా భయాన్ని కలుగ జేసింది , తరువాత కొన్ని డిస్నీలాండ్స్ లో యీ విధమైన రైడ్ ని చూసేం కాని అవి అంత యెత్తుకి తీసుకెళ్లటం లేదు . ఈ మధ్య పారిస్ డిస్నీలాండులో కాస్త తక్కువ యెత్తుకి వెళ్లేవాటిలో యెక్కి చచ్చేంత భయపడ్డాను .

సాయంత్రం అయిదుకి ముందు  రివాల్వింగ్ రెస్టొరెంట్ కి వెళితే వెలుగు వుండగా పట్టయ నగరాన్ని మొదటి రౌండులో చూసుకొని , చీకటి పడ్డాకా దీపాల వెలుగులో పట్టయ నగరాన్ని మరో రౌండులో చూసుకొని వచ్చేయొచ్చు .

ఈ రివాల్వింగ్ రెస్టొరెంట్లో శాఖాహారులకి తినడానికి యెక్కువగా యేమీ వుండవు , అయినా మనం తినడానికి వెళ్లటం లేదుకదా ? .     పట్టయ నగరం లో సిటీ బస్సులతో పాటు భాట్ బండిలు వుంటాయి , భాట్ బళ్లు అంటే వేన్స్ లాంటివి వెనకాల రెండువైపులా నిలువుగా కూర్చోడానికి బెంచీలు వేసి వుంటాయి , చిన్నచిన్న రోడ్లలో కూడా సులువుగా వీటిల్లో తిరగొచ్చు , వీటికి రూట్స్ వుంటాయి . అక్కడ కొన్నాళ్లు వుంటే యెక్కడ యే రూటు బండి ఆగుతుందో తెలిసిపోతుంది . టిక్కెట్టు యివ్వడం లాంటివి వుండవు . తక్కువ దూరాలకి 5 భాట్లు , యెక్కువదూరానికి 10 భాట్లు తీసుకుంటారు . 

బీచ్ రోడ్డు మీద వున్న రెండు హోటల్స్ ని ఆ మధ్య ఓ సినిమాలో చూసేను , ‘ ఎవడిగోలవాడిది ‘ అనే సినిమా లో చాలా భాగం పట్టయ లో చిత్రీకరించేరు . ఈ సినిమా రాక ముందు మేం అక్కడ వుండేవారం . అదే వరుసలో ‘ హరర్ హౌస్ ‘ వుంటుంది . ప్రజలకి భయం కలిగించే విధంగా నడుస్తున్న శవాలు లాంటివి వుంటాయి . బయటనే యెన్నేళ్లో సమాధులలో వుంచి బయట పడేసినట్లున్న శవాలు కనిపిస్తాయి , నిజంవా ? కాదా ? అని మనం పరిశీలించే లోపు అవి మన మీదకి దూకడం , మనమీద పడడం చేస్తాయి . పర్యాటకులకు భయం కలిగించడమే యీ హరర్ హౌసుల ముఖ్యోద్దేశం . నేను మీద వుదహరించినది హరర్ హౌసు బయట మనకు కనిపించే మచ్చు తునక , లోపల యిలాంటివి మరెన్నో వుంటాయి , వారు చూపించిన మచ్చుకే మాకు భయం వెయ్యడంతో లోపలకి వెళ్లే సాహసం చెయ్యలేదు .

బీచ్ కి దగ్గరగా వున్న మూడు వీధులలో అడుగడుగుకీ బారులే , యిద్దరు ముగ్గురుకి తక్కువ లేకుండా డాన్సర్లు కేబరే డాన్సులు చేస్తూ వుంటారు . ఇవి కాకుండా రెండువేల రూపాయల టికెట్ తో పేరున్న హోటల్స్ లో కేబరేలు జరుగుతూవుంటాయి . వీటిలో ఆల్కజార్ షొ , టిఫ్పిని షో లు పేరుపొందినవి . ఆ డాన్సర్లు సాయంత్రం షో కోసం కారు దిగి హోటల్ లోకి వెళ్లే టప్పుడు వారిని చూడ్డానికి జనం విపరీతంగా పోగవుతారు . ఓ సారి మేం మార్కెట్ నుంచి వస్తూవుంటే ఆ డాన్సర్ల దర్శన భాగ్యం కలిగింది , వారు ట్రాన్స్ జెండర్స్ , వారి రూపు రేఖలతో స్పష్టంగా ఆ విషయం తెలుస్తోంది . పట్టయా లో యీ ట్రాన్స్ జెండర్స్ చాలా యెక్కువ సంఖ్యలో కనబడతారు . మగవారు ఆడవారిగా మారడానికి సుమారు యెనిమిది లేక పది పర్జరీలు జరుగుతాయట , ఖర్చుకూడా బాగా భారీగానే అవుతుందట . ఖర్చుని మించి ఆదాయం వుంటుందట , అందుకే చాలా మంది యిలా మారుతూవుంటారు . పట్టయ లో థాయిలాండు ( ఆసియా దేశాలలో పెద్దదని కొందరంటారు ఆ వివరం నాకు తెలీదు  ) లోనే అతి పెద్ద ప్లాస్టిక్ సర్జరీ హాస్పటల్ వుంది . బరులలో చాలామంది మనదేశస్థులు కేబరేలు చెయ్యడం కనిపించింది , కుతూహలంతో అడిగితే బొంబాయినుంచి వచ్చేం అని చెప్పేరు . పట్టయలో సర్దార్జీలు యెక్కువ సంఖ్యలో కనిపిస్తారు .

వచ్చే సంచికలో లోకల్ మార్కట్ గురించి , పట్టయ జెమ్ స్టోను సెంటర్ టూరు గురించి చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
pampu-sompu