Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...   http://www.gotelugu.com/issue264/706/telugu-serials/anveshana/anveshana/

 


(గత సంచిక తరువాయి)... ఆ యువకులిద్దర్నీ తీసుకుని వర్తకుల దగ్గర ఎవరి దగ్గరన్నా బైకు ఉంటే అడగాలని పరుగు పెట్టారు. ఎట్టకేలకు కిరాణా దుకాణం వరహాల శెట్టి దగ్గరున్న హీరో హోండా బైక్‌ అడిగి తీసుకున్నారు.

ఒక కానిస్టేబుల్‌ని వెనకే ఎవరినన్నా లిఫ్ట్‌ అడిగి రమ్మని యువకులిద్దరూ, మరో కానిస్టేబుల్‌ బైక్‌ మీద కొండ దిగువకు వెళ్తున్న బస్సుని పట్టుకోడానికి బయలు దేరారు.

కొండ ఘాట్‌ రోడ్‌లో స్టార్ట్‌ చెయ్యకుండానే న్యూట్రల్లో పెడితే చాలు క్రిందకు సర్రున జారి పోతాయి బైకు. కానిస్టేబుల్‌ బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. మిగతా ఇద్దరు యువకుల వెనక ఒకరి వెనుక ఒకరు ఇరికించుకు కూర్చున్నారు.

కానిస్టేబుల్‌కి ఆందోళన గానే ఉంది.  కొండ బస్సు క్రిందకి చేరుకుని ‘ఆమె’ బస్సు దిగి వెళ్ళి పోతే.... ఇంత మంది భక్తుల సందోహంలో.....యాత్రీకుల రద్దీలో ‘ఆమె’ని తాము పట్టుకో గలరా! ఇటు గోపాల పట్నం కేసి వెళ్ళే బస్సు ఎక్కుతుందో? అటు ఆరిలోవ కేసి వెళ్ళే బస్సు ఎక్కుతుందో ఈ రెండు దారుల్లో కాకుండా విజయ నగరం రూట్లో వెళ్ళే బస్సు ఎక్కేస్తుందో.....భగవంతుడా! ‘ఆమె’ ఈ రోజు మా చేతికి చిక్కేలా చెయ్యి స్వామి.

మనసులో పిచ్చిగా ఆలోచించుకుంటూ బైక్‌ని న్యూట్రల్‌లో నడిపిస్తే వేగం తగ్గి దానికి నచ్చినట్టు వెళ్తుందని బైక్‌ ముందుకు పరిగెడుతున్నప్పుడు సడెన్‌గా గేర్‌ లోకి మార్చి బైక్‌ ఇంజన్‌ ఆన్‌ చేసాడు కానిస్టేబుల్‌.

పరిగెడుతున్న బైక్‌ని గేర్‌లోకి మార్చే సరికి ఒక్క సారే ఆగి సర్రున ఇంజన్‌ స్టార్ట్‌ అయి మరింత వేగం పుంజుకుంది బైక్‌. ఘాట్‌ రోడ్‌ అంతా పల్లంగా మలుపు మలుపులుగా ఉన్నా కానిస్టేబుల్‌ అదేదీ పట్టించుకో కుండా బైక్‌ని రెయిజ్‌ చేసి స్పీడు పెంచుకుంటూ ముందుకురికించాడు.

ఎదురుగా అంతే వేగంగా దూసుకువస్తున్న కార్లని, బైక్‌ను తప్పించుకుంటూ ముందుకు దూసుకు పోతున్నాడు.

కానిస్టేబుల్‌ వెనుకే కూర్చున్న యువకులిద్దరికీ ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. గాల్లో విమానంలా దూసుకు పోతున్న బైక్‌ మీద కూర్చున్నారే గాని గుండెలు అర చేతిలో పెట్టుకున్నారు. ఎదురుగా వస్తున్న బైకులు, కార్లు ఎక్కడ గుద్దుకుంటాయోనని భయంతో జడిసి పోతూ ఒకర్నొకరు గట్టిగా వాటేసుకుని కూర్చున్నారు.

కను చూపు మేరలో కొండ బస్సు క్రిందకు దిగుతూ కనిపించే సరికి బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న కానిస్టేబుల్‌కి ఆనందంతో మనసు ఉప్పొంగి పోయింది. హమ్మయ్య అనుకున్నాడు.

కొండ దిగుతున్న బస్సు కొంచెం నెమ్మదిగా వెళ్తోందని గ్రహించిన కానిస్టేబుల్‌ బైక్‌ స్పీడు మరింతగా పెంచి ముందుకు ఉరికించాడు. ఎదురుగా మరో కొండ బస్సు పైకి ఎగ బ్రాకుతున్న కొండ చిలువలా కొండపైకి వెళ్లడానికి ఎదురవడంతో కొండ దిగుతున్న బస్సు స్పీడు తగ్గించి ఆ బస్సుకి దారి ఇవ్వడం గమనించ లేక పోయాడు బైక్‌ నడుపుతన్న కానిస్టేబుల్‌.

కొండ దిగుతున్న బస్సు మీదే దృష్టి పెట్టి బైక్‌ స్పీడ్‌ పెంచడం వలన ఎదురుగా వస్తున్న బస్సుని గమనించ లేక పోయాడు. స్పీడ్‌ కంట్రోల్‌ చెయ్య లేక బస్సు మీదకు వెళ్లి గుద్దెయ్య బోతూ బైక్‌ని రోడ్డు ప్రక్కకి మళ్ళించాడు కానిస్టేబుల్‌.

ఇంతలో కొండ పైకి ఎక్కుతున్న కొండ బస్సుని ఓవర్‌ టేక్‌ చేస్తూ కొండ పైకి వెళ్ళ డానికి అతి వేగంగా వస్తున్న కారుని బలంగా గుద్దేస్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్ప ల్లోకి లోయలా ఉన్న పల్లం లోకి బైక్‌ తో పాటు ముగ్గురూ దొర్లుకుంటూ వెళ్ళి పోయారు. హఠాత్తుగా కొండ దిగుతున్న బైక్‌ కారును గుద్దుకుని క్రింద పల్లంలో ఉన్న తుప్పల్లో నుండి బండ మీద నుండి లోయ లోకి దొర్లుకుంటూ వెళ్లడం చూసిన బస్సు డ్రైవర్‌ టక్కున బస్సు ఆపేసాడు. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా ఆశ్చర్యంతో....ఆందోళనతో బైక్‌తో లోయలో పడి పోయిన ముగ్గురు యువకులను రక్షించడానికి సమాయత్తమయ్యారు. కొండ దిగువకు ముందుకు వెళ్తున్న కొండ బస్సు డ్రైవర్‌ కూడా బైక్‌ ప్రమాదం గమనించి వారగా బస్సు ఆపేసాడు.

దారిన పోతున్న కార్లు, బైక్‌లు అన్నీ ఎక్కడి వక్కడ ఆపేసి అందరూ కొండ చరియల్లో పడి పోయిన బైక్‌ మీద వున్న యువకుల్ని రక్షించాలని రాళ్ళు, ముళ్లను కూడా లెక్క చేయ కుండా లోయ లోకి దిగారు.

కొండ దిగుతున్న బస్సులో ఉన్న ‘ఆమె’ కూడా అందరితో పాటు బస్సు దిగింది. బైక్‌ మీద ముగ్గురు యువకులు కొండ దిగుతూ కారును గుద్దుకుని లోయ లోకి దొర్లి పోయారని తెలిసి ‘అయ్యో! పాపం!’ అనుకుంటూ తన మానాన తను కొండ దిగువకు రోడ్డు మార్గాన ముందుకు సాగి పోయింది.

కొద్ది దూరంలో ఘాట్‌ రోడ్‌ మలుపులో ఎత్తుగా ఎవరెస్టు అంత ఎత్తులో అభయ హస్తం చూపిస్తూ నిలబడ్డ ఆంజనేయ స్వామి విగ్రహం చూసి హమ్మయ్య అనుకుంది ఆమె.

దానికి ఎదురు గానే స్వామి వారి తొలి పావంచా ఉంది. ముందు రోజు ఉదయం అక్కడ నుండి కొండ పైకి నడక ప్రారంభించిన విషయం గుర్తుకొచ్చి కొండ దిగువకు చేరుకున్నాననుకుంది ఆమె.

‘తొలి పావంచా మెట్లు, ఘాట్‌ రోడ్‌ మలుపుకి ఆనుకుని ఉన్నాయి. నేరుగా ఘాట్‌ రోడ్‌లో కొద్ది దూరం ముందుకు నడిస్తే టోల్‌ గేట్‌ వస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర మలుపును ఆనుకుని ఉన్న మెట్ల దారి లోకి మళ్లితే దిగువ కొండ బస్సు స్టాండుకి చేరుకోవచ్చు’. అనుకుందామె.

ఘాట్‌ రోడ్‌ లో నుండి తొలి పావంచా దగ్గరకు చేరుకుంది ఆమె.

అప్పటికే చీకటి చిక్క బడి పోయింది. ఘాట్‌ రోడ్‌లో ఉన్న వీధి లైట్లు ఒకటి అర వెలిగి ఉన్నాయి. తొలి పావంచా దగ్గరకు వెళ్ళి నిలబడింది ఆమె.

ఇంతలో ఎక్కడ నుంచి వచ్చారో రాము, సోమూ పరుగు పరుగున ఆమె దగ్గరకు వచ్చారు.

‘‘అమ్మా! అనాథ పిల్లలమమ్మా! ఓ పది రూపాయుంటే దానం చెయ్యమ్మా! ఆకలేస్తోంది! దయ చూపించడమ్మా’’ అంటూ ఆమె కి చెరో వైపు నిలబడి ఒకరి తర్వాత ఒకరు స్విర్‌ పళ్ళాలు వూపుతూ యాచించారు.

కొండ దిగుతున్న భక్తులు ఇద్దరు, ముగ్గురు నెమ్మదిగా దిగుతున్నారు. ఒకరిద్దరు యాత్రీకులు తొలి పావంచా దగ్గర కాలభైరవ స్వామికి దండం పెట్టుకుని కొబ్బరి కాయలు కొట్టి కొండ పైకి వెళుతున్నారు. 

ఘాట్‌ రోడ్డు మలుపు దగ్గర హైమాక్స్‌ లైటు వెలుగు తొలిపావంచా దగ్గర షెడ్డులోకి చొచ్చుకు వస్తుంది. షెడ్డులోనున్న లైటు మినుకు మినుకుమని వెలిగి ఆరుతుంది. పడీ పడని వెలుగులో ఆమె మొహం కేసి చూసిన రాము ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు.

‘‘ఒరేయ్‌ సోమూ! అమ్మగార్రా! నిన్న మనకి వెయ్యి రూపాయలు దానం చేసిన దేవతరా’’ అన్నాడు ఆనందంగా.

ఆ యాచక బాుడు అలా అనే సరికి ఆమె ఛటుక్కున ఆ కుర్రాళ్ల కేసి చూసింది.  తల నిండుగా ముసుగేసుకున్న ఆమె మొహంలో ఆ ఇద్దరు బాల యాచకుల్ని చూడగానే సంతోషం కలిగింది.

ఆ బాల యాచకులిద్దర్నీ కళ్ళ తోనే ప్రక్కకు రమ్మని సైగ చేసి చీకటిగా ఉన్న ఓ మూలకు వెళ్లింది ఆమె.

ఆమె అలా సైగ చెయ్యడం గమనిస్తూనే ఇద్దరు బాల యాచకులు ఆమె వెంట వెళ్లారు.

‘‘బాబూ! మీరు నాకో సహాయం చేస్తారా?’’ అడిగింది ఆమె.

‘‘చెప్పండమ్మా!’’ ఆనందంగా అన్నాడు రాము.

‘‘ఇక్కడ డబ్బులిచ్చే బ్యాంకు మిషన్‌ ఎక్కడుందో మీకు తొసా?’’ తొలి పావంచా ప్రక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రింద వున్న బండ మీద కూర్చుంటూ అడిగింది ఆమె.

‘‘బ్యాంకు ఏ.టి.ఎమ్‌. గురించా అమ్మా మీరు అడుగుతున్నారు?’’ ఆశ్చర్యంగా ఆమె కేసి చూస్తూ అన్నాడు సోము.

‘ఇంత అందంగా...గొప్పగా....మహా రాణిలా ఉన్న ఈ దేవతకి బ్యాంక్‌ ఏ.టి.ఎమ్‌ పేరే తెలీదా?! తెలిసే ఆలా అడుగుతుందా?

సోముకు ఆ ఆలోచన కలగ గానే అనుమానంగా ఆమెకేసి చూసాడు.

‘‘ఆ!...ఏ.టి.ఎమ్‌ గురించే అడుగుతున్నా. మీకు తెలీదనుకుని అలా అడిగాను.’’ చిన్నగా నవ్వుతూ అంది ఆమె.

‘‘మాకా...! హ్హహ్హ!’’ ఫకాలున నవ్వాడు రాము.

‘‘ఇదిగో! చూసారా!’’ అంటూ ఆండ్రాయిడ్‌ సెల్‌ ఫోన్‌ తీసి ఆమెకి చూపించాడు సోము.

‘‘మీకు సెల్‌ ఫోన్‌ ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

‘‘ఎందుకంటారేంటమ్మా!  ఇంటర్నెట్‌ ఫ్రీగా ఇస్తున్నారు కదా! అందుకే ఇద్దరం డబ్బు పోగేసి ఈ సెల్‌ కొనుక్కున్నాం. సినిమాలు అన్నీ ఫ్రీగా చూసేస్తున్నాం తెలుసా?!’’ ఆనందంగా అన్నాడు రాము.

‘‘సరే! నాకు ఏటిఎమ్‌ ఎక్కడుందో చూపిస్తారా?’’ అడిగింది ఆమె.

‘‘అయ్యో! రా అమ్మా! మీరు మా దేవత! మీకు ఏ సహాయం కావాన్నా చెప్పండమ్మా! చిటికెలో చేసేస్తాం’’ అన్నాడు సోము సంతోషంగా.

అలా అనడమే తరువాయి రాము ముందు నడుస్తూ దారి చూపిస్తుంటే వెనుక ఆమె నీడలా నడిచాడు సోము. ఇద్దరూ ఆమెని తీసుకుని బజార్లో కొచ్చేసరికి రయ్‌ రయ్‌మని పోలీసు జీపులు ఇటు గోపాల పట్నం నుండి ఒకటి, ఇటు ఆరి లోవ రూట్‌లో నుండి రక్షక వాహనం ఒకే సారి కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు దూసుకు వచ్చాయి. అప్పటికే కొండ పై నుండి వస్తున్న మోటారు సైకిల్‌ తో పాటు ముగ్గురు యువకులు ఘాట్‌ రోడ్‌ లోయ లోకి పడి పోయారన్న వార్త పొగలా అల్లుకు పోయింది.

అదే సమయంలో ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దిగువ బస్సు స్టాండ్‌లో పై నుండి దిగుతున్న కొండ బస్సు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ నిలబడ్డాడు.

ఎవరో ముగ్గురు యువకులు బైక్‌ తో పాటు లోయ లోకి పడి పోయారని తెలియ గానే అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌

తొలి పావంచా దగ్గర నుండి బజార్లోకొచ్చిన ఆమె పోలీసు జీపు చూడ గానే టక్కున చీకట్లోకి వెళ్లి నక్కి నిలబడింది.రామూ సోమూ ఇద్దరూ ప్రక్క ప్రక్కనే హైమాక్స్‌ లైటు క్రింద నిలబడి చీకట్లో నక్కి నిలబడ్డ ఆమె కేసి చూసారు.

‘‘రండమ్మా! అదిగో! ఆ పురూరవ సత్రాల ప్రక్కనే వుంది. బ్యాంక్‌ ఏటిఎమ్‌. రండి!’’ ఆమె కేసి చూస్తూ అన్నాడు రాము. 

‘‘ఇలారా బాబూ!’’ రాము కేసి చూసి దగ్గరగా రమ్మని సైగ చేసింది ఆమె. మౌనంగా సైగ చేసి దగ్గరకు రమ్మని పిలవడం చూసి రామూ, సోమూ ఇద్దరూ చీకట్లో నిలబడ్డ ఆమె దగ్గరకు వెళ్లారు.

‘‘మీలో ఎవరికి ఏటిఎమ్‌లో డబ్బు తియ్యడం వచ్చు?’’ ఇద్దరి కేసి చూస్తూ అడిగింది ఆమె.

పల్లంలోకి పడిపోయిన పోలీసుతోబాటు ఆ యువకులిద్దరూ బ్రతికి బయట పడ్డారా? ఆమెని పట్టుకోగలిగారా? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్