Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

మహానటి చిత్రసమీక్ష

mahanati movie review

చిత్రం: మహానటి 
తారాగణం: కీర్తి సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్రప్రసాద్‌, తనికెళ్ళ భరణి, భానుప్రియ, మాళవికా నాయర్‌, షాలిని పాండే, తులసి, దివ్య వాణి, మోహన్‌బాబు, నాగచైతన్య, ప్రకాష్‌ రాజ్‌, నరేష్‌, క్రిష్‌, శ్రీనివాస్‌ అవసరాల, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు. 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
సినిమాటోగ్రఫీ: డానీ శాంచెజ్‌ లోపెజ్‌ 
దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌ 
నిర్మాతలు: ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ 
నిర్మాణం: స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌ 
విడుదల తేదీ: 09 మే 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌ స్టార్‌గా సావిత్రి గురించి చెబుతుంటారు. మహానటి అన్న బిరుదు సావిత్రికి కాక ఇంకొకరికి ఇవ్వలేం. అంతటి గొప్ప నటి సావిత్రి, కెరీర్‌లో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించినా, ఆమె జీవితంలోనూ విషాధ సంఘటనలు కన్పిస్తాయి. సావిత్రి జీవితం తెరిచిన పుస్తకమే అయినా, ఆమె గురించి తెలుసుకోవాలన్న నేటితరం ఆకాంక్షకు అనుగుణంగా సినిమా తీర్చిదిద్దబడింది. శిఖరమంత ఎత్తుకు ఎదిగిన సావిత్రి, జీవిత చరమాంకంలో పాతాళం లోతుల్ని ఎందుకు చూడాల్సి వచ్చింది? సావిత్రి జీవితాన్ని మధురవాణి అనే ఓ జర్నలిస్ట్‌ ఎలా వెలుగులోకి తెచ్చిందన్నదే 'మహానటి' కథ. 
మొత్తంగా చెప్పాలంటే 
ఒకరా ఇద్దరా? సినిమా నిండా మేటి నటీనటులే వున్నారు. దర్శకులూ నటులుగా మారి తెరపై కన్పించారు. స్టార్‌ కాస్టింగ్‌ పరంగా చూస్తే ఈ సినిమా చాలా ప్రత్యేకం. అందరికన్నా ముందు మాట్లాడుకోవాల్సింది 'సావిత్రి' కీర్తి సురేష్‌ గురించే. మహానటి పాత్రలో కీర్తి సురేష్‌ ఒదిగిపోయింది. భావోద్వేగాల్ని పండించడంలో టాప్‌ క్లాస్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చింది. సావిత్రి పాత్రకు న్యాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు, అన్యాయం చెయ్యకూడదని ఆమెపై సినిమా విడుదలకు ముందు సెటైర్లు పడ్డాయి. కానీ, తెరపై సావిత్రిని చూస్తున్నట్లే వుందని సినిమా చూసినవారంతా అంటున్నారంటే, ఆ ఘనత కీర్తి సురేష్‌కే దక్కుతుంది.

కీర్తి సురేష్‌ తర్వాత మాట్లాడుకోవాల్సింది జెమినీ గణేశన్‌ పాత్రలో కన్పించిన దుల్కర్‌ సల్మాన్‌ గురించి. దుల్కర్‌ మంచి నటుడు. ఈ సినిమాలో అతనికి ఇంకా మంచి పాత్ర దక్కింది. అద్భుతంగా నటించాడు. మధురవాణి పాత్రలో సమంత నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కెరీర్‌లో ది బెస్ట్‌ రోల్‌ అనదగ్గ పాత్రని సమంత ఈ సినిమాలో దక్కించుకుంది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగతా పాత్రల్లో చాలావరకు తక్కువ నిడివి వున్నవే. సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్‌ అద్భుతమైన నటనా ప్రతిభను కనబర్చారు. 
మోహన్‌బాబు, నాగచైతన్య, షాలిని పాండే, తరుణ్‌ భాస్కర్‌, ప్రకాష్‌ రాజ్‌, క్రిష్‌ తదితరులంతా సినిమాకి తమవంతు 'సాయం' చేశారని చెప్పొచ్చు. 'మహానటి' అనే ఓ యజ్ఞంలో వీరంతా భాగమయ్యారు.

జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలంటే, అది చాలా పెద్ద సాహసం. రెండున్నర గంటల నిడివి గల సినిమాగా, ఓ జీవితాన్ని చూపించడం ఆషామాషీ విషయం కాదు. నాగ్‌ అశ్విన్‌ కథ ఎంపిక, కథ ప్రారంభంతోనే సగం సక్సెస్‌ అయిపోయాడు. నటీనటుల ఎంపికతో పూర్తి విజయాన్ని సాధించేశాడు. కథ, కథనం అద్భుతంగా సాగాయి. మాటలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్‌. నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్‌ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ దర్శకుడికి పూర్తి సహకారం అందించాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

పెద్దగా అనుభవం లేని ఓ యంగ్‌ డైరెక్టర్‌, మహానటి సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నాడగానే చాలామందికి చాలా చాలా అనుమానాలు కలిగాయి. అయితే, అతను తీసిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా చూస్తే, అందులో భావోద్వేగాల్ని, మెయిన్‌ ఎలిమెంట్‌నీ దర్శకుడు వర్కవుట్‌ చేసిన తీరు చూస్తే, 'మహానటి'ని బాగా డీల్‌ చేయగలడనే విశ్వాసం కొందరికైనా కలుగుతుంది. తన మీద చాలా పెద్ద బాధ్యత వుందన్న విషయం దర్శకుడికి తెలుసు. అందుకే ఆ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలనుకున్నాడు, ఆ పనే చేశాడు. కథ మొదలు పెట్టడం దగ్గర్నుంచి, ఒక్కో పాత్రనీ పరిచయం చేయడం, కథను నడిపించడం, కథలోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళేందుకు ప్రయత్నించడం ఇవన్నీ 'మహానటి'కి బాగా కుదిరాయి. ఈ తరం ప్రేక్షకులు, ఆనాటి మహానటి జీవితాన్ని తెరపై ఆస్వాదించేలా చేశాడంటే అతని దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ అని వేరుగా చూడలేం. ఆద్యంతం ప్రేక్షకుల్ని థియేటర్లలోని కుర్చీల్లో కూర్చోబెట్టేసిందంతే. ఓ మంచి సినిమా, ఓ అద్భుతం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కమర్షియల్‌ స్టామినా విషయంలోనూ 'మహానటి' సత్తా చాటే అవకాశాలెక్కువ. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
మహానటి ఓ అద్భుత దృశ్య కావ్యం 
అంకెల్లో చెప్పాలంటే: 4.25/5

మరిన్ని సినిమా కబుర్లు
mahanati won