Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాపసుబ్బారాయుడు

prataapabhavalu

మా నాన్నగారు లే లడక్ లాంటి మంచు ప్రదేశాల్లో ఉన్నా మందు అలవాటు కాలేదుగానీ, సిగరెట్ల అలవాటు మాత్రం బాగానే ఉండేది. దాదాపు చైన్ స్మోకరే! 

ఆ ఒక్క అలవాటు తప్ప మిగతావన్నీ మితమే! చాలా తక్కువగా తినేవాడు. ఉప్పు, కారాలూ తక్కువగానే! నాకు తెలిసి నాకు ఇదిష్టం మరి కాస్త వడ్డించండి అని ఆయన అనడం ఏనాడూ వినలేదు. డికాషన్ (బ్లాక్ టీ)అంటే మాత్రం ప్రాణం. సెలవు రోజున ఓ పది సార్లన్నా తనకు తనే స్టౌ మీద పెట్టుకుని మరీ తాగేవాడు. ఆఫీసులో మాత్రం టీ ఎక్కువగా తాగేవారు. ఆయన తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకోవడం కూడా నేనెరగను. అంతటి ఆరోగ్యవంతులు. అయితే సిగరెట్లు తాగడం వల్లనో ఏమో దగ్గు మాత్రం బాగా వస్తుండేది. 

అప్పట్లో మేము హెచ్ ఏ ఎల్ కాలనీ(బాలానగర్-హైదరాబాదు) క్వార్టర్లో ఉండేవాళ్లం. నేను అక్కడి టి టి సీ లో అప్రెంటిస్ షిప్ చేస్తుండేవాణ్ని. ఇదిలా ఉండగా ఒకరోజు- నాకిప్పటికీ గుర్తే, మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదని నన్ను ఇంటికి త్వరగా వెళ్లమని మా ఇంఛార్జ్ నా దగ్గరకొచ్చి చెప్పారు. నా మనసంతా ఒకటే ఆందోళన, అలాంటిది నేనెప్పుడూ వినలేదు మరి. టి టి సి నుంచి మా ఇంటికి నడుచు కుంటూ పదిహేను నిముషాల్లో వెళ్లిపోవచ్చు. నేను వేగంగా నడుస్తున్నాను. అంతలో మా అమ్మా, నాన్నలు నాకెదురు వస్తున్నారు. ‘హమ్మయ్యా, మా నాన్నగారు బాగానే ఉన్నారు’ అని నేననుకునేలోగా మా నాన్నగారి చొక్కా మీద, ముక్కు పక్క బుగ్గల మీదుగా రక్తం మరకలు కనిపించాయి. అంతే నా గుండె ఆగిపోయింది. ‘ఏవైంది నాన్నా?’ అన్నాను దాదాపు ఏడుస్తున్నట్టుగా. ’బానే ఉన్నానుగా, ఏం కాలేదు" అన్నారు నవ్వుతూ. మా అమ్మ వంటింట్లో ఏదో తయారు చేస్తూ హాల్లో కూర్చున్న మా నాన్నతో ఏదో మాట్లాడుతోందట, ఆయన ’ఊ’ ’ఊ" అని వింటున్నట్టు ఊగొడుతూ మధ్యలో ఆపేశాట్ట. సర్లే ఆయన పుస్తకం చదవడంలో మునుగిపోయి ఉంటాడనుకుని ఓ పది నిముషాల తర్వాత హాల్లోకి వెళ్లి చూస్తే ఆయన పక్కకి వాలిపోయి ఉన్నార్ట. ముక్కులోంచి రక్తం కారుతోందట. అంతే మా అమ్మ గట్టిగా ఏడుస్తూ పక్కింటి వాళ్లకి చెబితే, ఆ ఇంటాయన హుటా హుటిన సిక్ బే(కాలనీ హాస్పిటల్)కి వెళ్లి అంబులెన్స్ తేవడానికి వెళ్లాట్ట. ఈ లోపల ముఖం మీద నీళ్లు చల్లితే మా నాన్నగారు లేచి తన చుట్టూ ఉన్నవాళ్లు తనను ఆందోళనగా చూడడం గమనించి ‘నాకేమైంది?’ అన్నార్ట. మా అమ్మ జరిగింది చెబితే, ఇంతోటి దానికి అంబులెన్స్ ఎందుకు? పద మనం వెళ్లి డాక్టరు చూపించుకుందాం అన్నార్ట. అదీ సంగతి.

మేము వెళ్లేసరికీ డాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. మా నాన్న సెక్యూరిటీ ఇన్స్ పెక్టర్ కాబట్టీ అందరికీ తెలుసు. 
ఆయన నాన్నగారి బి పి చెక్ చేశాక ‘మీకెప్పుడైనా తలనొప్పీ..వికారం అనిపించేదా?’ అడిగాడు. 

‘ఊహూ’

’మీకెప్పుడైనా కళ్లు తిరగడం, ఒళ్ళు తిరగడం..’ 

‘ఊహూ’

’ఒక్కోసారి ఇర్రిటేటింగ్ గా..విసుగ్గా..చిరాగ్గా అనిపించేదా?’

‘ఊహూ’

‘స్ట్రేంజ్..మీకు హై బీ పి ఉంది. ఇవన్నీ సింప్టమ్స్..మీకు అప్పుడప్పుడూ అనిపిస్తుండాలే’సాలోచనగా అన్నాడు.

‘నో డాక్టర్..’

‘సరే, ఇంత హై బీ పీ తో ఇంటికెళ్లడం మంచిది కాదు. మిమ్మల్ని సెయింట్ థెరిసా (ఎర్రగడ్డ) హాస్పిటల్ కి (అది ఎంప్లాయిస్ ప్యానెల్ హాస్పిటల్) రిఫర్ చేస్తున్నాను. వెళ్లి అడ్మిట్ అవ్వండి’ అన్నాడు.

’లేదు డాక్టర్, నాకు అక్కడ కంఫర్ట బుల్ గా ఉండదు. మీరు మందులిస్తే వేసుకుంటాను’ అన్నాడు.
డాక్టర్ మొదట ఒప్పుకోలేదు, తర్వాత మందులు రాసిచ్చి ‘ఒకవేళ మళ్లీ ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా సెయింట్ థెరిసా కి తీసుకుని వెళ్లిపోమ’ని మాకు సజెస్ట్ చేశాడు.

అర్ధరాత్రి సరిగ్గా పన్నెండుంపావు అయింది. మా నాన్నగారికి బాగా దగ్గు వచ్చింది. అదీ ఎంతంటే తీవ్రంగా అంటే ఆయన మళ్లీ పడిపోయారు. మేము ఆయన ముఖం మీద నీల్లు చిలకరించి లేచాక అంబులెన్స్ లో అప్పటి కప్పుడు సెయింట్ థెరిసా కి తీసుకెళ్లి జాయిన్ చేశాం.

అక్కడి డాక్టర్ క్షుణ్నంగా పరీక్షలు చేసి ఆయనకు హై బీ పీ, క్రానిక్ భ్రాంకైటీస్ ఉండని చెప్పారు. అది స్మోకింగ్ చేయడం వల్ల వస్తుందట. రెండు రోజులుండి డిస్చార్జ్ అయి వచ్చేశాం. ఆయణ్ని దగ్గుమాత్రం వదల్లేదు. చాలా తీవ్రంగా వచ్చి అంతలాంతి మనిషినీ కదిపి కుదిపేసేది. మాకేమో భయం ఆయన మళ్లీ ఎక్కడ పడిపోతాడో అని. కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఒకరోజు మధ్యాహ్నం మళ్ళీ పడిపోయారు. మళ్లీ అదే హాస్పిటల్, ఆయనే డాక్టర్. మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ అవడం చేత, ఎందుకో డాక్టర్ కి ఇష్టం గౌరవం ఉండేది. 

ఒకసారి బెడ్డు పక్కనున్న స్టూల్ మీద కూర్చుని "మీరు స్మోకింగ్ తో భ్రాంకైటీస్ తెచ్చుకున్నారు. స్టిల్ యు ఆర్ స్మోకింగ్. మీ డిఫెన్స్ వాళ్లకు విల్ పవర్ ఎక్కువంటారు కదండీ, వై డోంట్ యూ స్టాప్ స్మోకింగ్?"అన్నాడు సూటిగా చూస్తూ.

మా నాన్నగారు ఏమనుకున్నారో్గాని "ఒకే డాక్టర్, నౌ ఆన్వార్డ్స్ ఈ వోంట్ స్మోక్"అన్నాడు దృఢంగా.
అంతే అప్పటి నుంచి ఒక్క సిగిరెట్ కూడా వెలిగించలేదు. ఒకవేళ ఆఫీసులో తాగుతున్నాడేమోనని ఆయన కలీగ్స్ ను, ఫ్రెండ్స్ నూ అడిగాను అందరూ చెప్పినదొక్కటే ‘మీ నాన్నగారు వేళ్ల మధ్య వెలిగే సిగరెట్ లేకుండా ఉండలెరనుకున్నాం. కానీ ఒక్కటంటే ఒక్క సిగిరెట్ వెలిగించలేదు. మేము ఒకవేళ ఆఫర్ చేస్తున్నా సున్నితంగా రెఫ్యూజ్ చేస్తున్నాడు"అన్నారు.

అదీ మా నాన్నగారు. 

సిగరెట్ మానినా ఆ దగ్గు మా నాన్నను ఊపిరి సలపనిచ్చేది కాదు. ముఖం ఎర్రగా అయిపోయేది, నరాలన్నీ తేలి కనిపించేవి. కళ్లు నీళ్లతో బాగా ఎరుపెక్కేవి. గుండె టక టకమంటూ భయంకర వేగంతో కొట్టుకునేది. అతలాకుతలం చేసేది.

ఆయన్నలా చూస్తుంటే హృదయం ద్రవించిపోయేది.

కొన్ని అలవాట్లు అంతే మనిషిని పీల్చి పిప్పిచేస్తాయి. చుట్టూ ఉన్న వాళ్లకి తీవ్రమైన వేదన మిగులుస్తాయి.
అప్పటి నుంచి ఎవరు సిగరెట్ తాగుతున్నా వెళ్లి, బ్రాంకైటీస్ గురించి చెప్పి ‘దయచేసి పొగతాగడం మానెయ్యండని’ చెప్పడం అలవాటయ్యింది.

***

 

మరిన్ని శీర్షికలు
weekly-horoscope-may-25th-to-may-31st