Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అర్హత

arhata

వివేక్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుండి ఎవరికి ఏ అవసరమున్నా సహాయ పడే మనస్తత్వం అతనిది. తనకి లేక పోయినా పర్వా లేదు ప్రక్క వాడికి ఇచ్చేసేంత  దాన గుణం. ఆ సుగుణాలే ‘ సదా మీ సేవలో సంస్థ ’ నుండి  ఈ సంవత్సరానికి  గాను “ది మోస్ట్ హెల్పింగ్ హ్యాండ్” అవార్డు  తనని వరించేలా చేశాయి.

ఉదయం ఎనిమిది గంటల సమయంలో వివేక్ ఇంట్లో హాల్లో కూర్చుని వున్న సంస్థ ప్రెసిడెంట్ “ఈ నెల 17న సన్మాన కార్యక్రమం లో మీ  గురించి  చిన్న  ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మీ డీటెయిల్స్ కొన్ని మాకు కావాలి.  మీ వూరు, మీ తల్లి తండ్రులు గురించిన మొదలగు వివరాలు కావాలి. వివేక్ గారు!  మీ  పేరెంట్స్  ఏక్కడ  వుంటారు ? ఏం చేస్తుంటారు? ఇంతటి ఉత్తమమైన గుణాలు  వున్న మీ  లాంటి  కొడుకు  ఉండటం  నిజంగా  వాళ్ళ  అదృష్టం” అంటూ పొగిడాడు.

సోఫాలో ప్రక్కనే వున్న సెక్రటరీ అందుకొని “మేము సిటీ మేయర్ గారి చేత మీకు అవార్డు ఇప్పించాలనుకున్నాము. కానీ  మీరు పట్టుబట్టారు కాబట్టి, మీరు చెప్పినట్టే సుందరమ్మ గారి చేతనే మీకు సన్మానం చేయిస్తాము. కావాల్సిన డీటెయిల్స్ మళ్ళీ కలిసినప్పుడు తీసుకుంటాము” అంటూ లేచి బయల్దేరారు  వాళ్లిద్దరూ.

వీరి సంభాషణ అంతా వంటింట్లోంచి విన్న భార్య జ్ఞాన ప్రసూనాంబ, వారు వెళ్ళీ వెళ్ళ గానే  వచ్చేసి  వివేకాతో  “సుందరమ్మ ఎవరు? సెలబ్రిటీ ఆ? బిజినెస్ విమెనా ?” కొంచెం వెటకారం, కొంచెం ఆతృత కలగలిపి  గుక్క తిప్పుకోకుండా అడిగేసింది.

“అదేం కాదు. ఓ తల్లి, గృహిణి” అన్నాడు చాలా కూల్ గా  వివేక్.

ఉక్రోషంతో ఆమె “అదేంటి! మరి ఆవిడతో సన్మానం ఏంటి? ఇంత చేసుకుంటూ ఆర్గనైజర్స్ అంటున్నట్టు స్టేటస్ వుండే ఏ సెలబ్రిటీనో, ఏ పొలిటీషనో అయితే, ఫంక్షన్ కి వచ్చే హుందా, కళే వేరు” అంటూ  వాపోయింది.

ఆ మాటలకి మౌనంగా ఏ స్పందన లేని వివేక్ ని చూసిన ఆమె “సెలబ్రిటీ లేని, పబ్లిసిటీ లేని సన్మానం ఎందుకు? హు..కాఫీ తీసుకొస్తా..” అని చీర చెంగుని విసురుగా విదిలిస్తూ వెళ్ళింది.

ప్రసూన కి ఆర్భాటం, డబ్బు, స్టేటస్ ఇవ్వంటే పిచ్చి. వివేక్ చేసే ఈ దానాలు, సహాయాలు ఇష్టం లేక పోయినా, అవార్డు వచ్చిన తరువాత మాత్రం ఆమె ఆనందంతో భూమ్మీద నడవటం లేదు.

కాఫీ వచ్చే లోపు ఆమె అడిగిన ప్రశ్నలకి, వివేక్ ఆలోచనలు ఎక్కడికో వెళ్లాయి.

****************

ఆ రోజు సిగ్నల్ పడే సరికి వివేక్ కారు టక్కున ఆగింది. వివేక్ కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి.  అప్పటికి నాలుగు రోజుల నుండి రోడ్డుకి ఓ ప్రక్క నుంచుని వున్న ఓ పెద్దావిడని అదే టైం కి రోజూ చూస్తున్నాడు.  తెల్లని ఛాయలో, పెద్ద గుండ్రటి ఎర్ర తిలకం బొట్టు నుదుటి మీద పెట్టుకుని, ఎంతో హుందాగా ఉంటుంది ఆవిడ. ఆ రోజు కనపడకపోయే సరికి వివేక్ ఆమె కోసం చూస్తుండగా గ్రీన్ సిగ్నల్ పడే సరికి కార్ ని సర్రున ముందుకు నడిపించాడు.

మరుసటి రోజు అదే టైం కి వివేక్ కార్ ఆ సిగ్నల్ చేరే సరికి, ఆ పెద్దావిడ కార్ల మధ్య  నుండి జాగ్రత్తగా నడుస్తూ, మెల్లగా తన కారు వైపు రావడం వివేక్ చూసాడు.  సరా సరి తన కారు విండో తట్టగా తనతో ఏమి పనో అనుకుంటూ ఆశ్చర్యంతో విండో దించాడు. ఆమె చేతులు చాచి అడుక్కోవడం అతను ఒక్క క్షణం నమ్మ లేక పోయాడు. 

“ఇంత చక్కటి మోము కలిగి చూడటానికి పెద్దింటావిడలా వున్న ఈవిడ అడుక్కోవడం ఏంటి..???” మనసులో బాధ పడ్డాడు. 

ఇంతలో సిగ్నల్ పడడంతో వెనక నుండి వేరే వెహికల్స్ హార్న్ తో హోరెత్తించేస్తుంటే, కారుని సిగ్నల్ దాటించి దగ్గర్లో ఓ చోటు పార్క్ చేసి వెనక్కి వచ్చాడు ఈ కన్ ఫ్యూషన్ తొలగించుకో దలచి. ఆమె సిగ్నల్ దగ్గర కార్ల మధ్య నడుస్తూ ఇంకా అడుక్కుంటూ కనపడింది.

ఓ గంట తరువాత ఆమెతో సహా వివేక్ సదా మీ సేవ ఆఫీస్ రూమ్ లో ఓ ఫారం నింపడానికి ఆమె ప్రక్కన కూర్చుని "అమ్మ మీరెవరు? పేరేంటి? మీరెందుకలా...? నాకు ఏదన్న డీటెయిల్స్ చెప్తే నేను మీకు సహాయ పడ గలను" అడగ లేక అడిగాడు.

మౌనంగా తల దించుకుని వున్న ఆమె కళ్ళ లోంచి ధారగా కన్నీరు కారడం చుసిన వివేక్ చలించి పోయి "అమ్మా! విషయాలడిగి మిమల్ని భాద పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు. మీకు సహాయ పడాలన్న ఆలోచన అంతే. చెప్పండమ్మా" అంటూ భుజం మీద చెయ్యి వేసి ఓ కొడుకులా ఓదారుస్తూ మాట్లాడాడు.

అతని మాటలకి ఆమె మెల్లగా తేరుకుని చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ "నా పేరు సుందరమ్మ. మాకు ముగ్గురు కొడుకులు. రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బులు అంతా ఇంటి మీద పెట్టాము. మా వారు వున్న ఒకే ఒక ఇంటిని, ఎలాగూ మా తరువాత వారికే కదా అని పిల్లల పేర వ్రాసేసారు. ఆ నిర్ణయమే మా జీవితాలని ఇంత దయనీయ స్థితికి చేర్చింది” మెల్లగా తన కథ చెప్పడం ప్రారంభించింది.

“మొదట్లో ముగ్గురూ తమ స్థితి గతులు బాగున్నాయి, కాబట్టి వారికి ఇల్లు అవసరం లేదు అన్నారు. దానికి మా పిచ్చి మారాజు మా తరువాత వద్దన్నా వారిదే కదా ఇల్లు అంటూ ఉండేవారు”.

"కొంత కాలం తరువాత, ఓ రోజు రెండో వాడు వచ్చి తనకి కంపెనీ అమెరికా టికెట్ ఇచ్చింది. కానీ భార్య పిల్లల్ని తీసుకెళ్లాలంటే డబ్బులకి కష్టంగా వుంది అన్నాడు. వాడితో మూడో వాడు గొంతు కలిపి తనకి ఫ్లాట్ కొనడానికి కొంచెం డబ్బులు తక్కువ పడ్డాయి, కాబట్టి కొంచెం డబ్బవసరం అన్నాడు. పెద్దాడు పూణే లో ఖర్చులు బాగా ఎక్కువగా వున్నాయి, తనకి చేతిలో కొంచెం డబ్బుంటే పిల్లల చదువులకి వాటికి బాగుంటుంది అన్నాడు".

"దాంతో మా దగ్గర డబ్బులు లేవని వాళ్లకి చెప్పాము. ఎలాగూ తరువాతైనా ఇల్లు వారికే కదా, అందుకని ఇల్లు అమ్మమని, మమల్ని ముగ్గురూ బాగా చూసుకుంటామని నమ్మబలికించి బలవంతంగా ఒప్పించి అమ్మేయించారు. అక్కడ నుండి మా కష్టాలు మొదలు..” అని ఆవిడ చెప్తుండగా ఆమె కళ్ళ లోంచి నీళ్ల ప్రవాహం....వివేక్ కొంచెం తేరుకుని ఆమె చెయ్యి పట్టుకుని ఓదార్చాడు.

“ఈ వయసులో వాళ్లకి వూడిగం చెయ్య లేక, వాళ్ళ దగ్గర ఉండ లేక బయటికొచ్చేసాము. చేతిలో వున్న కొద్ది పాటి డబ్బు అయి పోయింది. ఏ పని చెయ్య లేని ఆరోగ్య పరిస్థితులు. పెన్షన్ లేదు. ఏమి చెయ్యాలో తే ..తెలీక…ఇలా బి..బిచ్చం ఎత్తి…ఆయనకి ఓ రెండు ము..ముద్దలు పెడుతున్నా..” అంటూ ఘోరమైన తమ పరిస్థితిని ఏడుపు ఆపుకోవాలని ప్రయత్నిస్తూ చెప్పింది.

ఉప్పెనలా పొంగుతున్న ఆమె బాధని ఎలా ఓదార్చాలి, ఏమి చెప్పాలి అనుకుంటూ చెమ్మగిల్లిన తన కళ్ళని తుడుచుకుంటుండగా ప్రెసిడెంట్ గారు ఆఫీస్ రూంలోకి వచ్చారు.

కుశల ప్రశ్నలయ్యాక, వివేక్ సుందరమ్మ గారి గురించి వివరించాడు. భార్య భర్తలిద్దర్నీ అక్కడ చేర్పించడానికి ఏర్పాట్లు చేసి, యదా ప్రకారం తన వంతు డబ్బు సహాయం సంస్థకి అందించాడు.

“ఎందరికో సహాయం చేసాను. కానీ సుందరమ్మ గారి విషయంలో వచ్చిన తృప్తి నాకు ఎన్ని కోట్లిచ్చినా రాదు. వాళ్లిప్పుడు కడుపు నిండా రోజూ తిండి తిన గలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా వుంది” అనుకుంటూ ఆలోచనల్లోంచి బయటకొచ్చి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్ కి బయల్దేరాడు.

*****

నిన్నటి ఆదివారం పేపర్లో వివేక్ కి అవార్డు వచ్చిందన్న న్యూస్ దావానంలా పాకి, బాస్, కొలీగ్స్ అంతా అతన్ని అభినందనలతో, పొగడ్తలతో ముంచెత్తారు. హడావిడి అంతా ముగిశాక తన సీట్లో కొచ్చి సంస్థ కి ఇవ్వాల్సిన డీటెయిల్స్ అవి గుర్తొచ్చి ఎదో చేయ్య బోయాడు గానీ, మనసు మాత్రం సహకరించడం లేదు.

“ఇంత మంది మెచ్చుకుంటున్నా, ఎందుకో అవార్డు అన్న సంతోషం నా  హృదయాన్ని తాకడం లేదు. అవార్డుకి నేను నిజంగా అర్హుడినా అన్న ప్రశ్న నన్ను వేదిస్తోంది. ఏదో అడ్డు తెర, ఏదో వెలితి. ఈ సంఘర్షణ కి కారణం?” రక రకాల ఆలోచనలు, ప్రశ్నలు అతని మదిలో పరుగెడుతున్నాయి.

సీట్ లోనే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు.

ఎక్కడో సబ్ కాన్షియస్ లో ప్రెసిడెంట్ గారి మాటలు “మీ  పేరెంట్స్  ఏక్కడ  వుంటారు?........ ఇంతటి ఉత్తమమైన గుణాలు  వున్న మీ  లాంటి  కొడుకు  ఉండటం…….” లీలగా తనకి విన పడుతున్నాయి.

టక్కున కళ్ళు తెరిచాడు. మనసులో సంఘర్షణ పొరలు తొలిగి, మొహంలో ఆనందం తాండవిస్తోంది.

************

రామాపురం లో బస్సు దిగి తన ఇంటి తలుపు తట్టాడు వివేక్. ఎంతకీ తెరుచుకోక పోయే సరికి, అటూ ఇటూ చూస్తుండగా తలుపుకి తాళం కన పడింది. ఇంతలో ప్రక్కింటి వాళ్ళనడిగితే, తమకు తెలీదనడంతో కొంచెం కంగారు మొదలైంది.

ఎం చేయాలా అనుకునే లోపు, వివేక్ కి రామం మాష్టారు గుర్తొచ్చారు.

ఆయన తన చిన్నప్పటి లెక్కల మాష్టారు. వివేక్ చురుకు పిల్లవాడవడం వల్ల చిన్నప్పటి నుండి మాష్టారుకి తనంటే బాగా ఇష్టం. వివేక్ని ఏమి చదివించాలి, ఎక్కడ చదివించాలి అన్న విషయంలో ఆయనది కీలక పాత్ర.

అడుగుల వేగం మాష్టారింటికి ఆట్టే చేర్చింది. కొంగరుగా తలుపు కొడుతుండగా, ఆయనే తలుపు తీశారు. వివేక్ ని చూసి ఒకింత షాక్ అయ్యారు, అతని రాక వూహించనిది కావడంవల్ల. వివేక్ " మాష్టారు! బాగున్నారా? ఇంటికెళ్ళొచ్చాను. అమ్మా నాన్నలు లేరు. మీకేమైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళుంటారు?" కొంచెం ఆదుర్దాగా అడిగాడు.

ఈ అనుకోని సంఘటనలోంచి మాష్టారు వెంటనే తేరుకుని “వివేక్ !  ముందిలా కూర్చో..” అని హాల్లో కుర్చీ  చూపించాడు. కూర్చున్నాక "వివేక్! అమ్మా నాన్నలు ఇక్కడ లేరు …” అని మెల్లగా అసలు విషయం బయట  పెట్టాడు.

వివేక్ కి అర్ధం కాక కంగారుగా "అదేంటి! ఎక్కడకు వెళ్లారు? నాకేం చెప్ప లేదే? నాకు తెలిసి వెళ్ల గలిగే బంధువులు కుడా పెద్దగా ఎవరూ లేరే? మరి నాకేదో అనుమానంగా వుంది. మాష్టారు మీకు తెలిస్తే దయ చేసి చెప్పండి. నాకు చాలా భయంగా వుంది. వాళ్ళకేమైనా...?" అంటూ ఇక తన ఆలోచనలని ముందుకు వెళ్లనీయ్య లేక పోయాడు.

కంటి అంచునే ఆగిన నీరు చుసిన మాష్టారు వివేక్ చెయ్యి పట్టుకుని " ఏమీ కంగారు పడకు. వాళ్ళు క్షేమంగా వున్నారు. నాతోరా.." అని తన వెంట తీసుకుని ఇంటి నుండి బయల్దేరారు.

**********

ఓ పెద్ద భవంతి ముందు ఆగిన కార్లోంచి దిగుతున్న వివేక్ దాని పేరు "సాయి వృద్ధాశ్రమం" అని చదివాడు. ఇక్కడకెందుకు వచ్చాము అన్నట్టు ప్రశ్నర్ధకంగా వున్న అతని మొహం చుసిన మాష్టారు రమ్మన్నట్టు సైగ చేసాడు.

లోపలి కెళ్ళాక పెద్ద హాలు అందులో కూర్చోడానికి కుర్చీలు, కుడి వైపుకి ఆఫీస్ రూమ్ వున్నాయి. ఆఫీస్ వైపు వెళ్ళ బోతున్న మాష్టారు చెయ్యి పట్టి ఆపి "అమ్మా నాన్నల గురించి అడిగితే, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ముందు మీరు వాళ్ళ గురించి చెప్పండి, అపుడే నేను మిమ్మల్ని వెళ్లనిస్తా" అని పసి పిల్లవాడిలా మారాం చేసాడు వివేక్.

గత్యంతరం లేక మాష్టారు పెదవి విప్పి “వివేక్ ! నేను చెప్పేది విని నువ్వు ఆందోళన పడకూడదు. నీ  తల్లి తండ్రులు ఈ మధ్యే ఇక్కడ చేరారు. ఈ విషయం నాకు తప్ప వూర్లో కానీ, వేరెవరికి గానీ తెలీదు.”అన్న భయంకరమైన నిజాన్ని చెప్పాడు.

ఆ మాటలకి వివేక్ “మీ..మీరు….ఎవరి గురించి, ఏం మాట్లాడుతున్నారు! ఈ కొడుకుండగా వారి కేంటి ఖర్మ. నేను మా అమ్మానాన్నల సంగతి అడుగుతున్నా. మీకు తెలిస్తే చెప్పండి” అంటూ తల అడ్డంగా వూపుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు.

ఏమైతే అది అవుతుందని మాష్టారు గంభీరంగా "నేను చెప్పేది నిజం" చెయ్యి పట్టుకుని ఆఫీస్ రూమ్ వైపు తీసుకెళ్తుండగా, వివేక్ ఆగని కన్నీరుతో ప్రక్కనే వున్న కుర్చీని ఆనుకుని నిలబడి పోయాడు.

అతన్ని చూసి గుండె చెలించి పోయిన మాష్టారు, ఓ చిన్న పిల్లవాడిలా దగ్గర తీసుకుని, ఓదారుస్తూ " నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు ఇది వరకు ప్రాజెక్ట్ పని మీద జర్మనీ వెళ్ళావు కదా. నీ భార్య, పిల్లాడి దగ్గర వీళ్ళని తోడుగా పెట్టావ్ కదా. కానీ నీ భార్య వీళ్ళని భారంగా అనుకుంది. నీకు అవన్నీ తెలీకుండా ఇన్నాళ్లు వీళ్ళు ఆ బాధని దిగమింగుకున్నారు. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయట పడేదే”.

"నువ్వు ఎన్నో సార్లు ఫోన్ లో నీ దగ్గరకి రమ్మని చెప్తూనే వున్నావ్ కూడా”.

“నేను కుడా అన్నీ పక్కన పెట్టి నీ దగ్గరికెళ్ళమన్నాను. మీ నాన్నకి ఈ మధ్య కొంచెం నలతగా ఉంటోంది. బలవంతం చేశా నీకు ఫోన్ చేసి చెప్తానని. అపుడు మీ అమ్మ చాలా ఉక్రోషంగా 'అంతగా ఆధార పడవలసి వస్తే బిచ్చమెత్తుకుని బ్రతుకుతాం తప్ప, ఎక్కడా ఉండం. ఎవరితోనూ ఉండం' చెప్పిన మాటల వల్ల నాకు అర్థమైంది వారి మనసు ఎంత గాయ పడిందో” అంటుండగా అక్కడికక్కడే వివేక్ కుప్ప కూలి పోయాడు.

అది చూసి ఒణికి పోయిన మాష్టారు క్రిందకి ఒంగి "వివేక్! వివేక్! ఏమైంది? వాళ్ళు బాగున్నారు. నేను చెప్పేది విను" చెంపలు తడుతూ  చెప్పాడు.

ఇదంతా చూసిన అక్కడి అటెండర్ టక్కున గ్లాస్ తో నీళ్లు అందించగా, బాగా చెమటలు పోసేసి  వున్న వివేక్ మొహం మీద చల్లి, అటెండర్ సాయంతో వివేక్ని మెల్లగా లేపి కుర్చీలో  కూర్చోబెట్టాడు మాష్టారు.

కన్నీళ్ల రూపంలో తన బాధని బయటకి పంపే ప్రయత్నం చేస్తూ వివేక్ మనసులో "ఎవరో తెలీని సుందరమ్మ గారు బిచ్చమెత్తుకుంటేనే తల్లడిల్లి పోయిన నేను, నా తల్లి తండ్రులు నోటా ఆ మాట వింటుంటే గుండెలు బ్రద్దలై పోతున్నాయి. నేను బ్రతికుండి ఏమి లాభం" తనని తను నిందించుకున్నాడు.

"మాష్టారు! ఇంత జరిగినా తెలుసుకో లేని అవివేకం నాది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నేను ఆ విషయం లో ఓడి పోయాను. సిగ్గుతో చచ్చి పోవాలని వుంది. వారికి నా మొహం ఇక చూపించ లేను. వాళ్ళు నన్ను క్షమించరు " అంటూ బరువెక్కిన గుండెతో లేచి వెళ్ళ బోయాడు.

మాష్టారు అతన్ని ఆపి “పిచ్చి వాడా! పిల్లలు ఏమి చేసినా భరించే శక్తినీ, ఎమన్నా కడుపులో దాచుకునే ఓర్పునీ, ఏ తప్పు చేసినా క్షమించే గుణాన్నీ ఆ భగవంతుడు తల్లి తండ్రులకి మాత్రమే ఇచ్చాడు. పిచ్చి ఆలోచనలు మాను. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. వాళ్ళు నీ రాకతో, నీ పలకరింపుతో పులకించి పోతారు.” అని వివేక్ ని బలవంతంగా ఆఫీస్ రూమ్ వైపు నడిపించాడు.

     *     *    *

వివేక్ ఇంట్లో హాల్లో సోఫాలో తల్లి తండ్రులని కూర్చో బెట్టి, వాళ్ళ పాదాలకి మ్రొక్కి మనసులో “ఇక సదా మీ సేవలో..!” అనుకున్నాడు.
నిలబడి మౌనంగా చూస్తున్న భార్య కళ్ళలోకి కొర కొర మని చూసాడు. ఆ చూపుల వెనక భావం అర్ధమైన భార్య, జరిగింది అతనికి తెలిసే ఉంటుందని గ్రహించింది. ఒక్క ఉదుటున వాళ్ళ పాదాల మీద పడి క్షమాపణ కోసం అన్నట్టు కాళ్ళకి దణ్ణం పెట్టింది.

అజ్ఞానంతో మూసుకున్న జ్ఞాన ప్రసూనాంబ కళ్ళు ఒక్క మాటతో తెరిపించదలచి, ప్రక్కనే వున్న ఎనిమిదేళ్ల  కొడుకు తల నిమురుతూ, “మనకున్నదీ  …కొడుకే …” అని చెప్పి వెళ్ళి పోయాడు.

తమకీ తమ తల్లి తండ్రుల పరిస్థితి కలగ కూడదని ఆమెకి చెప్పాలని బహుశా అతని ప్రయత్నం.

బాల్కనీ లో నిలబడి ఆకాశం వైపు చూస్తున్న వివేక్ మనసు అవార్డు వచ్చినందుకు పరిపూర్ణమైన సంతోషాన్ని, అంతులేని ఆనందాన్ని ఇపుడు అనుభవిస్తోంది. “అవార్డు  తీసుకునేందుకు ఇప్పుడు నాకు పరిపూర్ణమైన అర్హత లభించింది” అని తృప్తి గా అనుకున్నాడు.

*    *    *

మరిన్ని కథలు
software sarigamalu