Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఆఫీసర్‌ చిత్రసమీక్ష

officer movie review

 

చిత్రం: ఆఫీసర్‌ 

తారాగణం: నాగార్జున, మైరా సరీన్‌, ఫెరోజ్‌ అబ్బాసీ, షయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, ప్రియదర్శి, బేబీ కావ్య తదితరులు. 
సంగీతం: రవి శంకర్‌ 
సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ 
నిర్మాత: రామ్‌గోపాల్‌ వర్మ 
నిర్మాణం: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 01 జూన్‌ 2018 

క్లుప్తంగా చెప్పాలంటే 
నారాయణ పసారి (ఫెరోజ్‌ అబ్బాసీ) ఓ పోలీస్‌ అధికారి. అతను చేసిన ఎన్‌కౌంటర్‌పై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి అనుమానమొస్తుంది. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అన్న కోణంలో, మరో పోలీస్‌ అధికారి శివాజీరావు (నాగార్జున)తో ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్‌ చేస్తారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ అనుమానాలు నిజమేనని శివాజీరావు విచారణలో తేల్చుతాడు. తనపై శివాజీరావు ఇచ్చిన రిపోర్ట్‌ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, కక్ష పెంచుకుంటాడు నారాయణ పసారీ. డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఈ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది తెరపై చూడాల్సిన మిగతా కథ. 

మొత్తంగా చెప్పాలంటే 
ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం నాగార్జున ప్రత్యేకత. ఛాలెంజింగ్‌ రోల్స్‌ అంటే నాగార్జునకి ప్రత్యేకమైన అభిమానం. ఎప్పుడూ ఫిట్‌గా వుండే నాగార్జున, ఐపీఎస్‌ అధికారి పాత్రలో పెర్‌ఫెక్ట్‌గా సూటయిపోయారు. ఆ లుక్స్‌, ఆ బాడీ లాంగ్వేజ్‌.. అన్నీ ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కి వుండాల్సిన వుందిగానే వున్నాయి. ఈ వయసులో కూడా నాగార్జున ఫిట్‌నెస్‌ లెవల్స్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. యాక్షన్‌ సీన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌, పవర్‌ చూపించాల్సిన సీన్స్‌.. ఒకటేంటి, అన్నిట్లోనూ నాగ్‌ అదరగొట్టేశాడంతే. 

మిరా సరీన్‌ జస్ట్‌ ఓకే అన్పిస్తుంది. నాగార్జున కూతురిగా నటించిన కావ్య చాలా బాగా చేసింది. ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కావ్య మంచి మార్కులేయించుకుంది. మిగతా పాత్రల్లో నారాయణ పసారిగా కన్పించిన ఫెరోజ్‌ గుర్తుండిపోతాడు. మిగిలిన పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

కథ పరంగా చూస్తే, చాలా చిన్న లైన్‌. దాన్ని ఇంకాస్త పెంచితే బాగుండేదన్పిస్తుంది. కథనం రామ్‌గోపాల్‌ వర్మ స్టయిల్‌లో సాగుతుంది. అయితే, సెకెండాఫ్‌లో కొంత డల్‌నెస్‌ ఆవరిస్తుంది. ఫస్టాఫ్‌లో మాత్రం మునుపటి రామ్‌గోపాల్‌ వర్మ టేకింగ్‌ని చూస్తాం. వర్మ సినిమాలకే ప్రత్యేకమైనవి అన్నట్లుగా వుండే డైలాగ్స్‌ మెప్పిస్తాయి. ముందే చెప్పుకున్నట్లు సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ కాస్త అవసరం అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్‌ హైలైట్‌ అయ్యింది. సౌండింగ్‌ గురించి వర్మ పదే పదే చెబుతూ వచ్చాడు. ఆ ప్రత్యేకతని మనం ఫీల్‌ అవుతాం. కెమెరా యాంగిల్స్‌ కొత్తగా అన్పిస్తాయి. సినిమా ఇంకాస్త రిచ్‌గా వుంటే బావుండేది. 

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తెరకెక్కించడం వర్మకి ఎంతో ఇష్టం. ఈ క్రమంలో వర్మ, సహజత్వం కోసం 'క్వాలిటీ' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే ఆ 'క్వాలిటీ'లో రిచ్‌నెస్‌ని ఆశించలేం. ఇక్కడ వర్మ ఆలోచనల్లోని రిచ్‌నెస్‌ వేరు. దాన్ని అర్థం చేసుకుంటే డల్‌నెస్‌ని ఫీల్‌ అవం. నాగార్జున లాంటి స్టార్‌తో సినిమా తీయాలనుకున్నప్పుడు వర్మ, కథ విషయంలో ఇంకాస్త 'రీచ్‌'ని పరిగణనలోకి తీసుకుని వుండాల్సింది. ఇలాంటి సినిమాలనుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆశించలేం. దాంతో సినిమా అక్కడక్కడా డల్‌నెస్‌తో కూడుకుని వున్నట్లు అన్పిస్తుంది. ఓవరాల్‌గా వర్మ సినిమాల్ని మెచ్చేవారికి వర్మలో జ్యూస్‌ ఇంకా అయిపోలేదన్పిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
రామ్‌గోపాల్‌ వర్మలో జ్యూస్‌ అయిపోలేదుగానీ.. 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka