Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue268/714/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... ఆ రోజు ఆదివారం.. సమయం మధ్యాన్నం మూడున్నర అయింది.

శరణ్య సోఫాలో రిలాక్సింగ్ గా పడుకుని టివి చూస్తోంటే తేజ వేడి,వేడి ఉల్లిపాయ పకోడీలు చేసి, అల్లం వేసి చేసిన టీ తో సహా ట్రే లో పెట్టుకుని వచ్చి సెంటర్ టేబుల్ మీద పెట్టి, శరణ్య కాళ్ళు తన వొళ్ళో పెట్టుకుని సోఫాలో సెటిల్ అయాడు.

శరణ్య “ఏయ్ ఏంటిది”  అని కాళ్ళు లాగేసుకుంటుంటే “దేవి గారికి ఈ మాత్రం సేవలు చేసుకునే అదృష్టం మాకు లేదా” అన్నాడు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని.

అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని కళ్ళ మీదా, చెంపల మీదా ముద్దులు పెట్టుకుని లేచి కూర్చుంది శరణ్య.

“కమాన్ వేడి, వేడి పకోడీలు ... మంచి టీ ఎంజాయ్” అంటూ వంగి సెంటర్ టేబుల్ మీద నుంచి పకోడిల ప్లేట్ తీసి ఆమె నోటికి పకోడీ అందిస్తూ అన్నాడు..

“నీకో శుభవార్త..”

“శుభవార్తా ... ఏంటది...” పకోడీ తింటూ అతని వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

“ ఫోర్ నాట్ ఫోర్ ఫ్లాట్ నేను తీసుకున్నాను .. నిన్ననే అడ్వాన్సు ఇచ్చాను.”

“ఎక్కడ? ఈ అపార్ట్ మెంట్ లోనా ... ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగింది.

“నా ఆఫీస్ ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నా.. అన్ని షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు ఇక్కడే తీయాలని నిశ్చయించుకున్నాను. విజయవాడ, విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో బోలెడన్ని రిసోర్సెస్ ఉన్నాయి .. మంచి కధలు కూడా లభిస్తాయి.. ఫ్యూచర్ లో మంచి ఆర్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను” అన్నాడు.

“ఎందుకలా సడన్ గా “.. కుతూహలంగా చూసింది.

“ ఎందుకా మా ఆవిడ వేళా , పాళా లేకుండా , తన మీద తను శ్రద్ధ చూపించకుండా డెడికేట్ అయి పోయి పని చేస్తుంటే చూడ లేక పోతున్నా అందుకు..”

శరణ్య అదా సంగతి అన్నట్టు పకోడీ తింటూ “బాగుంది ఉద్యోగం అన్నాక కష్టపడక పోతే ఎలా” అంది.

ఆమెకి మరి కొంచెం దగ్గరకు జరిగి నుదుటి మీద ముంగురులు సవరిస్తూ “ఇంత గానా శరణ్యా ... నువ్వింతగా కష్ట పడుతుంటే చూడ లేక పోతున్నా..అలాగని నీ ఉజ్జ్వలమైన భవిష్యత్తు పాడు చేయడం కూడా నాకు ఇష్టం లేదు.  అందుకే ఎట్టి  పరిస్తితుల్లో ఇంకా నిన్ను వంటరిగా వదిలేయ దలచుకో లేదు.”

అతని స్వరంలో వినిపిస్తున్న బాధ ఆమె మనసుని తాకింది. అతని కళ్ళల్లో నిజాయితీకి చలించి పోయింది.

నెల రోజులు క్యాంప్ లు, ఇన్స్పెక్షన్లు, మీటింగ్స్ తో టైం కి తిండి కూడా తినకుండా బాగా అలసి పోయిన శరణ్య ఆరోజే కొంచెం ఖాళీగా ఉంది.  పెళ్లి అయి కాపురం పెట్టాక ఒక నెల రోజులు మాత్రం ఇద్దరూ ఆడుతూ, పాడుతూ , షికార్లు, సినిమాలు తిరుగుతూ గడిపారు.. ఆ తరవాత నగరంలోని రాజకీయాల్లో అనిశ్చితి, అల్లర్లు, గొడవలు వీటితో బిజీ అయి పోయింది.

తేజకి ఒక పక్క తన భార్య అంత ఉన్నతమైన, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నందుకు ఆనందంగా అనిపించినా వేళకి తిండి, నిద్రా లేకుండా పని చేయాల్సి రావడం, ఇంట్లో ఉన్న కాసేపు ఫోన్ లు, ఇక్కడ మీటింగ్, అక్కడ గొడవలు అంటూ వెంటనే పిలిపించడం చిరాకుతో పాటు శరణ్య పట్ల సానుభూతి కలిగింది.

రోజూ వంట మనిషి వచ్చి ఆవిడకు చేతనైనట్టు  ఏదో వండి పెట్టి వెళ్ళడం, ఎప్పుడో రాత్రి పొద్దు పోయాక వచ్చిన శరణ్య చల్లారి పోయి, రుచి, పచి లేని ఆ తిండి తినడం అతనికి నచ్చలేదు.

అందుకే అదే అపార్ట్ మెంట్ లో ఖాళీ అయిన రెండు పడక గదుల ఫ్లాట్ కి ఆఫీస్ షిఫ్ట్ చేసేద్దాం అనుకుని అడ్వాన్సు ఇచ్చేసాడు.
శరణ్య అతని చేయి అందుకుని పెదాలకి ఆనించుకుని “ఇంత ప్రేమా నామీద” అంది.

“ఎంత ప్రేమో ముందు, ముందు ఇంకా చూస్తావు.. అది చూపించడానికే ఈ ఏర్పాట్లు”  అన్నాడు.

“మంచి పని చేసావు కాని నీ ప్రోఫ్ఫెషన్ కి  హైదరాబాద్ నుంచి రావడం అంత కరెక్ట్ కాదేమో” అంది.

“నిన్ను వదిలి పెట్టి హైదరాబాద్ లో  కాదు కదా ఎక్కడా ఉండ లేను శరణ్యా.. ఇంత కాలం వేరు.. ఇప్పుడు నువ్వు నా భార్యవి.. నీ మంచి చెడ్డలు చూడ వలసిన అవసరం, బాధ్యతా నాకుంది. ఇంత బిజీగా ఉండి వేళకి తిండి కూడా తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను ... అందుకే దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. “

శరణ్య అతని ప్రేమకి పరవశించి పోతూ కొంచెం కొంటెగా అంది “అయితే నీ పనులన్నీమానేసి, వంట చేస్తావా... వంట మనిషిని మానిపించనా.”

“హాపీగా... ఆవిడ వంట నాకసలు నచ్చడం లేదు. నేనే చేస్తాను..మానిపించేయ్” అన్నాడు. శరణ్య పక, పకా నవ్వి “ ఇంకా నయం పని మనిషిని కూడా మానిపించమన లేదు.. పనులన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటావా ఏం”  అంది.

“ నా పనులు బయట తిరిగేవి తక్కువ.. ఆఫీస్ లో కూర్చుని గ్రౌండ్ వర్క్ చేసుకో వచ్చు.. ఫోన్స్ ద్వారా, వాట్స్ అప్ ద్వారా అందరిని కాంటాక్ట్ చేయచ్చు. షూటింగ్ సమయానికి రెండు రోజులు బయటికి వెళ్తా.. కొన్ని ఇండోర్ షూటింగ్ అవచ్చు. “

“బాగుంది కాని బొత్తిగా జోరూకా గులాం అనిపించు కోకు” అంది అల్లరిగా అతని క్రాఫ్ చెరిపేస్తూ..

“ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ ..” నిర్లక్ష్యంగా  అంటూ ఆమెని ఒడిలోకి లాక్కున్నాడు.

అప్పుడే తేజ ఫోన్ మోగింది..

అబ్బా ఇప్పుడే మోగాలా విసుక్కుంటూ పక్కన కాబినెట్ మీద పెట్టిన ఫోన్ తీసుకున్నాడు.

అతను ఫోన్ మాట్లాడుతుంటే శరణ్య ప్లేట్ లోని పకోడీలు ఒక్కొక్కటే అతని నోటికి అందిస్తూ, తనూ తింటూ కూర్చుంది. ఫోన్ మాట్లాడడం అయి పోయాక తేజ హుషారుగా చెప్పాడు..” నా కజిన్ అనిరుద్  అని ఉండేవాడు... నా చిన్నప్పుడు మేము, వాళ్ళు పక్క, పక్క ఇళ్ళల్లో ఉండే వాళ్ళం .. వాడు ఇరవై ఏళ్ల వయసు లోనే వాళ్ళ నాన్నతో గొడవ పడి మిలట్రికి వెళ్లి పోయాడు. ఈ మధ్యే రిటైర్ మెంట్ తీసుకుని వచ్చాట్ట.. ఫోన్ చేసాడు.. వాడు రేపు మన ఇంటికి వస్తా అన్నాడు..”

“ఇక్కడికా..” అడిగింది శరణ్య..

“ యా ... చాలా మంచి వాడు.. వెరీ సెన్సిటివ్ మాన్.. నేనంటే చాలా ఇష్టం. నా షార్ట్ ఫిలిం కూడా వాడికి పంపాను.. చూసి చాలా ఎమోషన్ అయానని నాకు లెటర్ రాసాడు. నాకన్నా ఐదారేళ్ళు పెద్ద.  అయినా నాతొ మంచి ఫ్రెండ్ లాగా ఉండేవాడు... చాలా ముద్దు చేసేవాడు.  అతనితో  గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ అన్నాడు తేజ.

“సో అయ్య గారు రెండు రోజులు బిజీ అన్న మాట” అంది.

“ నువ్వు ఇంటికి వచ్చే సరికి ఇంట్లోనే ఉంటాములే ... చాలా జోవియల్ కూడా వాడు. పది నిమిషాలు మాట్లాడావంటే పడి, పడి  నవ్వుతావు.. చిన్నప్పటి నుంచి పెద్ద కమెడియన్..”

అతని గురించి చెప్తున్నప్పుడు తేజ మొహంలో వెల్లి  విరుస్తున్న ఆనందం చూస్తుంటే శరణ్యకి ఆ కజిన్ తేజకి ఎంత సన్నిహితుడో అర్ధం అయింది.

(ఎవరా అనిరుద్ధ్...? అతని రాకతో కథలో ఏం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.....ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం దాకా వేచి చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana