Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue268/713/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి).. కొవ్వొత్తి వెలుగులో గదంతా పరిశీలనగా చూసాడు ఎస్సై. రాజుల కాలం నాటి భవనం కావడం వలన గదే పెద్ద హాలంత  ఉంది.  ఓ మూల చిరిగిన చాప పరిచి ఉంది. మరో మూల గోనె పట్టాలు...సినిమా వాల్‌ పోస్టర్లు గదంతా పరిచి
ఉన్నాయి.

అంబులెన్స్‌ సిబ్బంది స్ట్రెచర్‌తో లోపలకు వచ్చి స్పృహ తప్పి పడి ఉన్న సోముని పడుకో బెట్టి తీసుకు వెళ్లారు. రాము కూడా లేచి సోము వెంట వెళ్ల బోయాడు.

పోలీసు రాముని అటకాయించి పట్టుకుని నిలబడ్డారు.

‘‘ఈ కుర్రాణ్ణి , ఆ దొంగల్ని స్టేషన్‌లో అప్పగించండి.’’ అంటూనే గదంతా కాలి బూట్‌తో చిందర వందరగా కెలుకుతూ పోస్టర్లు, గోనె పట్టాలు ప్రక్కకు తప్పిస్తూ క్రిందంతా వెదికాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! అవన్నీ తీసి ప్రక్కన పడెయ్యనా?’’ అంటూనే ఎస్సై వెనుకే వున్న కానిస్టేబుల్‌ చక చకా గదిలో క్రింద పరిచి వున్న గోనె సంచులు, సినిమా పోస్టర్లు తీసేసాడు.

కానిస్టేబుల్‌ క్రింద పరిచిన సంచులు, పోస్టర్లు ఓ మూల పరిచిన చీర లాగేసి ప్రక్కకి పెడుతున్నప్పుడు వాటి క్రింద ఉన్న తుపాకీ క్రింద పడి ఠంగున శబ్దం అయింది.

ఏదో వస్తువు క్రింద పడ్డ శబ్దానికి ఎస్సై, కానిస్టేబుల్‌ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు.

అప్పటికే టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది దొంగలు ముగ్గుర్నీ రాముని తీసుకుని అక్కడ నుండి వెళ్లి పోయారు. వారితో పాటే అంబులెన్స్‌ కూడా సైరన్‌ చేసుకుంటూ వెళ్లి పోయింది.

శబ్దం వచ్చిన దిక్కుల కేసి చూస్తూ అదిరి పడ్డాడు ఎస్సై. మిణుకు మిణుకు మంటూ వెలుగుతున్న దీపపు కాంతిలో నల్లగా నిగ నిగ లాడుతూ కనిపించిన తుపాకీని చూసి ఉలిక్కి పడ్డాడు.

అప్పటికే కానిస్టేబుల్‌ కూడా క్రింద పడ్డ తుపాకీని గమనించి పరుగున వెళ్లి తీసుకు వచ్చి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చేతికిచ్చాడు.
కానిస్టేబుల్‌ ఇచ్చిన గన్‌ చూస్తూనే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

మోడరన్‌గా ఉందా గన్‌. ఇలాంటి పిస్టల్‌ తానెప్పుడూ చూడ లేదనుకున్నాడు మనసు లోనే.

‘ఈ కుర్రాళ్ళు... యాచక బాలలు తల దాచుకునే ఈ గదిలో ఇలాంటి మోడరన్‌ పిస్టల్‌ దొరికిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గన్‌ ఇక్కడికెలా వచ్చింది?’ ఆలోచిస్తూంటే ఊహకందని వింతలా ఉంది. అని అనుకున్నాడు.

‘‘కానిస్టేబుల్‌! గదంతా క్షుణ్ణంగా వెతుకు. ఇంకా ఇంత కంటే విలువైన వస్తువులేమన్నా దొరుకుతాయేమో!’’ ఆతృతగా అరిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇద్దరూ గదంతా అంగుళం వదలకుండా జల్లెడ పట్టి మరీ వెదికారు. ఎక్కడా అనుమానించ దగ్గ వస్తువు ఏదీ దొరక లేదు. కుర్రాళ్లు దాచుకున్న డిబ్బీలో చిల్లర కాగితాలతో పాటు రెండు వేల నోట్లు రెండున్నాయి. అవి కూడా తిరిగి డిబ్బీలో వేసి పట్టుకున్నాడు కానిస్టేబుల్‌. అది ప్లాస్టిక్‌ డిబ్బీ తెరవడానికి వీలుగా క్రింద చిన్న కన్నం పెట్టి దానికి మూత అమర్చి ఉంది.

‘‘పద! ఇక వెళ్దాం.’’ అంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ బుల్లెట్‌ పార్క్‌ చేసి ఉన్న ఘాట్‌ రోడ్‌ కేసి నడిచాడు. మౌనంగా ఎస్సైని అనుసరించాడు కానిస్టేబుల్‌. అ పిస్టల్‌ ఇక్కడికెలా వచ్చింది? దేవుడి దర్శనానికి విదేశీయులు వస్తూంటారు. వాళ్ల దగ్గర ఈ కుర్రాళ్ళు దొంగిలించారా?! ఆలోచిస్తూ నడుస్తున్న ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఉన్నట్టుండి ఉలిక్కి పడి క్షణం మౌనంగా ఎక్కడి వాడక్కడే బొమ్మలా నిలబడి పోయాడు.
ఎస్సై వెనుకే మౌనంగా అనుసరిస్తున్న కానిస్టేబుల్‌ తన పై అధికారి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ఒక్క సారే బొమ్మలా నిలబడి పోయే సరికి అదిరి పడి తను కూడా ఎక్కడి వాడక్కడే గప్‌ చుప్‌ గా నిలబడి ఉండి పోయాడు.

‘కొంప దీసి ఈ పిస్టల్‌ ఈ కుర్రాళ్ళని ఏటిఎమ్‌ నుండి డబ్బు డ్రా చేసి తీసుకు రమ్మన్న ‘ఆమె’ది కాదు కదా! ఆమెదే అయితే ?! అమ్మో! ఆమె ఏ తీవ్ర వాదో ఉగ్ర వాదో కాదు కదా!’

ఒక్క క్షణం భయంతో బిగుసుకు పోయి నిలబడి పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో కొండ పై నుండి యాత్రీకులతో దిగుతున్న కొండ బస్సు హెడ్‌ లైట్లు మొహం మీద పడే సరికి ఇహాని కొచ్చి ముందుకు నడిచాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

మర బొమ్మలా నడుస్తున్న ఎస్సై వెనుకే కదిలాడు కానిస్టేబుల్‌.

ఘాట్‌ రోడ్‌ ప్రక్కనే ఎత్తుగా వున్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందున్న హైమాక్స్‌ లైట్ల క్రింద పార్క్‌ చేసి ఉన్న బుల్లెట్‌ కేసి చూస్తూ నడుస్తున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

*****

ఆర్టీసీ బస్సు స్టాండ్‌లో కొచ్చి నిలబడింది ఆమె.

చేతిలో చిన్న బ్యాగ్‌  ఓసారి తడిమి చూసుకుంది. రాముకి డబ్బు తెమ్మని ఏటిఎమ్‌కు కార్డు ఇచ్చింది. ఇంతలో ఈ గొడవ...పెద్ద బ్యాగ్‌ దొంగలెత్తుకు పోయారు. అందులో అంత విలువైన వస్తువు లేవీ లేవు బట్టలు తప్ప. తనకి అవసరమైనవన్నీ ఈ చిన్న బ్యాగ్‌ లోనే సర్దుకుంది. అదృష్టం కొద్దీ ఇది తన దగ్గరే ఉంది.’

ఆలోచిస్తూ నిలబడిందే గాని రోడ్‌ వైపు దృష్టి పెట్టింది. ‘ఏ క్షణాన్నైనా పోలీసులు తనని వెదుక్కుంటూ రావచ్చు. ఏటిఎమ్‌ దగ్గర డబ్బు డ్రా చేసిన రాముని పోలీసు పట్టుకుని తన కోసం వెదుక్కుంటూ తామున్న చోటికే వచ్చేసారు. పోలీసులు ఆ సమయానికి రాక పోయి వుంటే...ఆ ముగ్గురు దుండగులు తనని నాశనం చేసి ఉండేవారు.

పాపం! సోము! తనకి రక్షణగా నిలబడ్డాడని తల పగలగొట్టేసారా వెధవలు. ఇప్పుడు సోము ఎలా ఉన్నాడో!’ మనసు లోనే బాధ పడింది ఆమె. సోము చెప్పిన వారి అనాథ గాథ ఆమెని బాగా కలిచి వేసింది. రామూ సోమూ పట్ల ఆమెకి అమితమైన అభిమానం ఏర్పడింది.
తనూ ఇప్పుడు ఓ అనాథేగా! నా అన్న వాళ్లకి దూరమై పిచ్చి దానిలా తిరుగుతోంది. రామూ సోమూ ఒకే ఈడు వాళ్ళు. ఒక్క దగ్గరే పెరిగిన వాళ్లు. అనాథలు. అక్కున చేర్చుకునే వాళ్లు లేక వీధిన పడ్డారు. పాపం పసిపిల్లలు.

ఇంతలో సైరన్‌ చేసుకుంటూ అంబులెన్స్‌ రావడం గమనించింది ఆమె. ఉత్సుకతగా రోడ్డు కేసి తదేక దీక్షతో చూస్తూ నిలబడింది. సిటీ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. వెళ్తున్నాయి. బస్టాండ్‌ అంతా యాత్రికులతో రద్దీగా ఉంది.

ఆ అంబులెన్స్‌ వెనుకే టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు జీపు...దానిలో వెనుక సీట్లో రాముతో పాటు ముగ్గురు దొంగలు, వారి ప్రక్కనే పోలీసు కూర్చుని ఉండడం గమనించింది ఆమె.

‘అయ్యో! రాముని పోలీసులు లాక్కు పోతున్నారే! ఆ దొంగ వెధవలు కూడా దొరికి పోయారు. ఆ దొంగలు ఎత్తుకు పోయిన తన బ్యాగ్‌....పోలీసుల దగ్గరుందా?! అయినా, అందులో ఏముంది? చీరలేగా? రాము దగ్గరున్న ఏటిఎమ్‌ కార్డు....దాని ద్వారా తన ఉనికి తెలిసి పోతుంది. పూర్తి బయోడేటా పోలీసుకి చిక్కి పోతుందే! ఎలా?!  ఏటిఎమ్‌ కార్డు పోయినా ఫర్లేదు. అందులో డబ్బు పోయినా ఫర్లేదు. కానీ, దాని ద్వారా...తనెవరో తెలిసి పోతుంది! తెలిస్తే....?!...తెలిస్తే....?! అమ్మో! తన ఆచూకీ తెలిస్తే ఇంకేమన్నా ఉందా?! తన ఆశ...అన్వేషణ మరుగున పడిపోవూ?!’ ఆలోచిస్తూనే బస్సు స్టాండ్‌లో నుండి రోడ్డు మీదకు వచ్చింది. అప్పటికే అంబులెన్స్‌, దాని వెనుక పోలీస్‌ జీపు గోపాల పట్నం కేసి వెళ్లి పోయాయి.

రోడ్డు మీద కొచ్చే సరికి ఆటోలు వరదలా ఒకటి తర్వాత ఒకటి ఖాళీగా వస్తూ బస్సు ఎక్కడానికి బస్సు స్టాండ్‌లోకెళ్తున్న యాత్రీకుల్ని అడ్డగించి మరీ గోపాల పట్నం...ఎన్‌.ఎ.డి. అంటూ అరుస్తూ బస్సు ఛార్జీకే రండి రండంటూ వారిని ఆటో ఎక్కించుకుని తీసుకు పోతున్నారు ఆటో వాళ్ళు.

గుంపులు గుంపులుగా కొండ మీద నుండి వచ్చిన యాత్రీకుల దగ్గర దగ్గర ప్రాంతాల వాళ్ళంతా ఆటోల్లోనే ఎక్కి వెళ్లి పోతున్నారు. దూర ప్రాంతాల యాత్రికులు మాత్రం బస్సు కోసం బస్టాండ్‌ లోపలకు పరుగులు తీస్తున్నారు.

ఖాళీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చుంది ఆమె.

‘‘బాబూ! పోనియ్యవయ్యా!’’ అంది ధీమాగా ఆమె.

‘‘మీరొక్కరే అయితే వంద అవుద్ది! ఎన్‌.ఏ.డి. వరకే వెళ్తాను.’’ చెప్పాడు ఆటో అబ్బాయి.

‘‘వెళ్ళు! వందేగా! ఇస్తాలే!’’ అంటూనే ఎదర వెళ్తున్న అంబులెన్స్‌ కేసి చూసింది ఆమె. కను చూపు మేరలో వెళ్తున్న అంబులెన్స్‌ సైరన్‌ ఇంకా విన్పిస్తూనే ఉంది.

‘‘పాపం! ఎవరికేమైందో?!’ అంబులెన్స్‌ సైరన్‌ వింటూ ఏమీ తెలీని దానికి మల్లే అంది ఆమె.

‘‘ఏముందమ్మా! ఎవడికో మూడుంటుంది. అదృష్టం కొద్దీ అంబులెన్స్‌ సకాలంలో వచ్చుంటుంది. ఇంకా వాడెవడికో భూమ్మీద నూకలు ఉన్నాయనుకుంటా’’ వేదాంత ధోరణిలో అన్నాడు ఆటోవాలా.

‘‘ఇక్కడెక్కడా దగ్గర్లో హాస్పిటల్స్‌ లేవా?’’ ఆ అంబులెన్స్‌ ఎటు వెళ్తుందో తొసుకుకోవాలనే ఆతృతతో అంది ఆమె.

‘‘డబ్బున్న వాళ్ళైతే బోల్డన్ని ప్రైవేటు అసుపత్రులున్నాయమ్మా! అనాథనుకోండి. ఒక్కటేగా ఆసుపత్రి. తిన్నగా తీసుకెళ్లి కె.జి.హెచ్‌లో పడేస్తారు.’’ అంటూనే ఆటో స్టార్ట్‌ చేసాడు ఆటోవాలా.

కెజిహెచ్‌!

‘ఎస్‌! బ్రిటిష్‌ కాలం నుండి వైద్య సేవలందిస్తున్న పెద్ద హాస్పిటల్‌. ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా చుట్టు ప్రక్కల ఉన్న ఆరేడు జిల్లాల ప్రజలకే కాదు. ఒరిస్సా...జార్ఖండ్‌ రాష్ట్రాల నుండి కూడా రోగులు ఇక్కడికే వస్తారని చెప్తుంటారు. చదువుకున్న రోజుల్లో తోటి విద్యార్ధులతో ఒక సారి విశాఖ పట్నం వచ్చింది. ఈ ప్రాంతమంతా తిరిగి చూసింది. ఆటోలో ఆలోచిస్తూ కూర్చుంది.

ఆటో శర వేగంగా దూసుకు పోతోంది. మూడు చక్రాల బండైనా ఆరు చక్రాల బస్సు లాగా బరి తెగించి పరిగెడుతోంది.

‘‘బాబూ! జాగ్రత్తమ్మా! తొందర లేదు.’’ అంబులెన్స్‌ ఎటు వెళ్తుందో తెలిసాక హాయిగా సీటుకు జేరగిల బడి అంది ఆమె.

‘‘రాత్రి పది లోగా రెండు మూడు సర్వీసులన్నా చెయ్యాలి కదమ్మా! మిమ్మల్ని ఎన్‌.ఏ.డిలో దించేసి తిరిగి ఇక్కడికి బేరం చూసుకుని వెంటనే వచ్చెయ్యాలి. నాలుగు రాళ్ళు సంపాదించాలంటే తప్పదు కదమ్మా!’’ స్పీడు తగ్గించక పోగా ముందు కెళ్తున్న బైక్‌ల్ని, ఆటోల్ని ఓవర్‌ టేక్‌ చేస్తూ సర్రున దూసుకు పోతూనే అన్నాడు ఆటో వాలా.

‘ఇక వాడితో వాదన చెయ్య కూడదనుకుంది. మాటల్లో పడి ఏకాగ్రత కోల్పోయాడంటే అప్పుడు నష్టపోయేది వాడే కాదు. ఆటోలో ఉన్న నేనూ....రోడ్డు మీద అన్నెం పున్నెం ఎరుగని జనం...ఎందుకొచ్చిన వాగుడు...ఊరుకుంటేనే నయం’ అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఆమె.
చేతిలో ఉన్న చిన్న బ్యాగ్‌లో ఎంతుందో లెక్క చూసుకుంది. నాలుగైదు వందల కన్నా ఎక్కువ లేవు. పెద్ద నోట్లన్నీ దేవుడి హుండీలో వేసేసింది.

(అప్పటి దాకా ఆమెకు రక్షణగా ఉన్న ఒకే ఒక్క ఆయుధం......ఆమె పిస్టల్....అది కోల్పోవడమే కాక.....ఆమెను పోలీసులకు చిక్కేలా చేసింది......ఆ తర్వాతేం జరగబోతోంది.....????? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే......)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్