Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై రెండవ భాగం

Anubandhaalu twenty second Part

"చూస్తాను... వాడికి వుంది... చెప్తా" అంటూ విసవిసా బయటకొచ్చేసింది. ఆ కోపంలోనే ఆమె నవీన్ ని వెదుకుతూ మండువా లోగిట్లోకి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే అనంతసాయి లోనకొస్తూ కన్పించాడు.

"అన్నయ్యా! బావ కన్పించాడా...?" కోపంగా అడిగింది.

"మేం వచ్చేసరికి బైక్ మీద పోతుంటే చూశాను. ఏమైంది?" ఆశ్చర్యంగా అడిగాడు.

"వెళ్ళిపోయాడా?... పారిపోయాడు... ఇంటికొస్తాడుగా అప్పుడు చెప్తా అంటూ అరిచింది.

"ఇంతకీ ఏమైందో చెప్పవేమిటి? అంటూ కసురుకున్నాడు.

"అరే అనంత్ నేను చెప్తా విను" అంటూ వెనక్కి వచ్చింది భ్రమరాంబ.

ఈలోపల మహేశ్వరి కూడా అక్కడికి వచ్చింది.

చెప్పొద్దని అడ్డుపడింది శివాని.

"అయినా ఏం జరిగిందో చెప్పేసింది భ్రమరాంబ. అంతే ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిసాయి. బావామరదళ్ళ సరసాలు తమాషాగా ఉంటాయి.

నవీన్ చేసిన కొంటెపనికి శివానికి కోపం వచ్చిన మాట నిజమే. అంతా నవ్వుతుంటే కూడా మరింత కోపం వచ్చిన మాట కూడా నిజమే. కానీ ఆ కోపంలోనే ఏదో తెలియని
తమాషాని, ఒక ఇంపైన అనుభూతిని మనసు గ్రహించగల్గుతోంది. ఒకరినొకరు టీజ్ చేసుకోవడంలో ఉండే కొత్త ఆనందమేదో ఆమె మనసు లోతుల్లో ఎక్కడో గిలిగింతలు పెడుతోంది. అందుకే కావచ్చు కాసేపటికే ఆమె కోపం కాస్త కర్పూరంలా కరిగిపోయి అందరితోబాటు తనూ హాయిగా నవ్వేసింది...

ఆ రాత్రి పదిగంటలకి అనంతసాయి సెల్ ఫోన్ రింగయ్యింది.

అది ఈ మధ్యనే హైదరాబాద్ లో పరిచయమైన ఫ్రెండ్స్ సర్కిల్లో గణపతి అనే మిత్రుడిది. అతను రంగారెడ్డి ఎం.పి. కొడుకు.

"హలో గణపతి ఏం చేస్తున్నావు?" అంటూ అడిగాడు అనంత్.

"చాలా బాధగా ఉంది మై ఫ్రెండ్. ఏమిటిది? మీరు హైదరాబాద్ వచ్చి మూడు రోజులు దాటింది. ఏమిటిది? రాకూడదనుకున్నావా? శివాని ఏం చేస్తుంది?"

"గదిలో ఉంది. నిద్రపోతుందేమో? రావడం వీలుకాలేదు సారీ."

"సారీ కాదు ఎప్పుడొస్తున్నావో చెప్పు?"

"రావడానికి టైం పట్టొచ్చు. డబ్బు టైట్."

"ఓ షిట్ డబ్బు రాలేదని రావడం మానేసావా? మేం చచ్చిపోయామనుకున్నారా?"

"అదికాదు గణపతి..."

"ఇంకేం చెప్పొద్దు మన వాళ్లు తీసుకున్న మూడు లక్షలు కూడా మీరొస్తే తిరిగి ఇచ్చేద్దామని తీసిపెట్టాం. రేపు నా బర్త్ డే పార్టీ ఉంది. మీరు రాకపోతే పార్టీ కాన్సిల్. అర్ధమైందా? మీ ఖర్చంతా నాదే. ఎంత కావాలో నేనిస్తాను. రేపు రావాలి అంతే."

ఓ.కే. ఎన్నిగంటలకి, పార్టీ ఎక్కడ?"

చెప్పాడు గణపతి.

"నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తోంది. పరిచయం చేస్తాను. గ్రాండ్ పార్టీ రావాలి" హెచ్చరించాడు.

"ఓ.కే. వస్తాం."

"శివానీని పిలువు. తనని పర్సనల్ గా పిలవలేదని నిష్టూరం వేస్తుంది."

"ఒక్క నిమిషం" సెల్ ఫోన్ తో చెల్లెలి గదిలోకి వెళ్లి సెల్ ఫోన్ ని చెల్లెలి చేతికి అందించాడు అనంత్.

ఆమె వస్తున్నట్టు ప్రామిస్ చేశాక అవతల లైన్ కట్ చేసాడు గణపతి.

"ఏమిటన్నయ్యా! ఇక్కడ బోర్ కొడుతుంది. నో బీర్, నో డ్యాన్స్. రేపు ఎలాగైనా మనం వెళ్ళాలి" అడిగింది శివాని.

"నేనూ అదే ఆలోచిస్తున్నాను. కానీ ఎలా?"

"ఎలా అంటే ఎలా అన్నయ్యా! వెళ్లకపోతే వాళ్ళు చాలా ఫీలవుతారు. పైగా మనమిచ్చిన మూడు లక్షలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉంచామంటున్నారు గదా!" ఆలోచిస్తూ గుర్తుచేసింది శివాని. "నిజమే. కానీ మనం బయల్దేరాలంటే కనీసం చేతిలో పదివేలుండాలి. ఏ.సి. కారు మాట్లాడుకోవాలి. కారుదేముందిలే ఫోన్ చేస్తే వచ్చేస్తుంది. మూడు లక్షలు చేతికి రాగానే కార్ రెంట్ ఇచ్చేయొచ్చు.

ఓ పని చేస్తే...! పెదనాన్నని అడిగి చూస్తే...?"

"ఇస్తాడని నాకు నమ్మకం లేదు? మొన్నే చెప్పేసాడుగా? నాయనమ్మ అమెరికా నుంచి వచ్చి లెక్కలడిగితే ఏం చెప్పాలో తెలియనంతగా ఇప్పటికే పది లక్షలు తగలేసామని గొడవచేశాడు."

"మరేం చేద్దాం?"

"ఓ పని చేద్దాం. ప్రయత్నించి చూద్దాం. నేను పెదనాన్నను అడిగి చూస్తాను. నువ్వు నవీన్ ను అడిగి చూడు."

"బావనా...?"

"అవును. నువ్వు ఎప్పుడూ అడగలేదుగా కాదనడు."

"అడగను ఇవాళ వాడు నన్ను చాలా ఏడ్పించాడు."

"బావే కదా ఏమైందని? ఇలాంటివి సరదాగా తీసుకోవాలి? ఫోన్ చేసి పిలిచి ఇక్కడే మాట్లాడు. ఈ లోపల నేను పెదనాన్న దగ్గరకు వెళ్లొస్తాను ఓకే." అంటూ సలహా ఇచ్చి తను రామలింగేశ్వర్రావుని డబ్బు అడగడం కోసం మండువా లోగిట్లోకి వెళ్లాడు.

శివానీ నైటీ సరిచేసుకుని, జుట్టు లాగి ముడివేసుకొని, సెల్ ఫోన్ అందుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది. నవీన్ సెల్ కి ఫోన్ చేసింది.

"ఏమిటే ఈ టైమ్ లో ఫోన్ చేసావ్?" అవతలి నుంచి నవీన్ గొంతు విన్పించింది.

"బావ నీతో మాట్లాడాలి. ఓసారిక్కడికి రాగలవా?" అడిగింది.

"రాలేనంటే నువ్వే ఇక్కడికి వచ్చేస్తావా?"

"ఫ్లీజ్ బావా... వేళాకోళం కాదు. ఒక్కసారి రావా."

"నాకు నిద్రొస్తోంది. ఇప్పుడే పడుకున్నాను కూడా. పొద్దుటే వస్తానులే.

"పొద్దుట కాదు ఇప్పుడే రావాలి."

"ప్రతీకారమా? నిన్న అటకమీద వదిలేసానని ఏ కర్రతోనే నా బుర్ర పగలగొట్టాలనా?"

"నాకలాంటి ఉద్దేశం ఏమీ లేదు. వస్తున్నావా? లేదా?"

"రానంటున్నా కదా. ఒరే విసిగించకు రా. బావా రారా..."

"ఏమిటే రాను రాను మర్యాద తగ్గిపోతుంది? సరే వస్తున్నాలే"

"ఎప్పుడు?"

"ఇప్పుడేగా రమ్మన్నావు. మళ్ళీ ఎప్పుడంటావేమిటి?" అంటూ విసుక్కుంటూ అవతల లైన్  కట్ చేసాడు నవీన్.

మూడు నిమిషాల తర్వాత లోనకొచ్చి ఎదురుగా కూర్చున్నాడు.

"చెప్పవే అమెరికా పిల్ల. ఎందుకు అర్జంటుగా పిలిచావ్?" అడిగాడు.

"నాకు నీ సహాయం కావాలి." బుంగమూతి పెట్టి అడిగింది.

"డబ్బు సాయం తప్ప ఇంకే సాయమైనా అడుగు చేస్తాను."

"నాకు డబ్బు సహాయమే కావాలి."

"ఎందుకు?"

"హైదరాబాద్ వెళ్లాలి. మూడు లక్షలు ఫ్ర్రెండ్స్ దగ్గరుంది. రేపు ఇచ్చేస్తారు. రాగానే నీ డబ్బు ఇచ్చేస్తాను."

"మూడు లక్షలు నా దగ్గర ఎక్కడిది?"

"అంత అక్కర్లేదు. పదివేలు చాలు."

"ఎవరా ఫ్రెండ్?"

"వివరంగా చెప్తేగానీ ఇవ్వవా?"

"ఓ.కే." అంటూ అక్కడ ఫ్రెండ్స్ వివరాలు చెప్పింది శివానీ.

ఒక్క నిమిషం ఆలోచించాడు నవీన్.

"ఓ.కే. మీకు డబ్బు విలువ తెలీదు. ఎంత తగలేసారో మీఎకు తెలుసు. పదివేలు ఇస్తాను. రాగానే ఇచ్చెయ్."

"అనంత్ ఎక్కడ?"

"పెదనాన్న దగ్గరున్నాడు."

"పొద్దుట తొమ్మిది గంటలకి బ్యాంక్ తీయగానే డబ్బు తెచ్చిస్తాను. ఎవరికీ చెప్పక... ఇంట్లో వాళ్లు నన్ను తిడతారు. ఇక వెళ్లనా?" అంటూ లేచాడు.

ఇంత సులువుగా నవీన్ సాయం చేస్తాడని శివానీ ఊహించలేదు. అందుకే అతని మీద అభిమానం ఏర్పడింది.

"బావా!" అంటూ పిలిచింది.

గుమ్మం దాటబోతూ ఆగి తిరిగి చూసాడు నవీన్.

"థ్యాంక్స్" అంది ముచ్చటగా నవ్వుతూ. గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయాడు నవీన్.

అతను వెళ్లి పదినిమిషాలకి పెదనాన్నతో మాట్లాడి తిరిగి వచ్చాడు అనంతసాయి.

అతడి ముఖం చూస్తేనే అర్ధమౌతుంది. వెళ్లిన పని కాలేదని.

"ఏమైందన్నయ్యా? పెదనాన్న ఏమన్నారు?" ఆత్రంగా అడిగింది.

"మామూలే డబ్బు లేదన్నాడు. పైసా కూడా ఇవ్వలేనన్నాడు. ఇప్పటికే మనకి ఇలా చాలా ఇచ్చాడంట. నాయనమ్మ వస్తే ఏం చెప్పాలో తెలియడం లేదు ఇంక డబ్బు ఎక్కడ్నుంచి తేగలను అంటున్నారు" అంటూ నీరసంగా సోఫాలో కూర్చున్నాడు.

"డోంట్ వర్రీ. నేను బావను అడిగాను. ఉదయం తొమ్మిదిగంటలకు బ్యాంక్ తీయగానే డబ్బు తెచ్చిస్తాను అన్నాడు. ఈసారి హైదరాబాద్ కి వెళ్లినప్పుడు మనకి రావలసిన మూడు లక్షలు తెచ్చుకుంటే తర్వాత డాడీకి ఫోన్ చేసి కొంత డబ్బు తెప్పించుకోవచ్చు" అంది శివాని.

"వద్దు. డాడీ పేరు చెప్పకు నాకు చాలా కోపంగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్లు షేర్ల మీద పెట్టి నాశనం చేసారు. షేర్ల వ్యాపారం చేసి దివాళా తీసారు. మనమేం కావాలని ఆ పని చేసారో అర్ధం కావడం లేదు. మనకి డబ్బు పంపిస్తారన్న ఆశ లేదు" అన్నాడు ఆవేదనగా. "అన్నయ్యా! డాడీ చేసింది తప్పే కావచ్చు. కానీ తలచుకుంటే తిరిగి సంపాదించగలరు డాడీ. అమెరికాలో డాడీకున్న పేరు ప్రతిష్టలు తెలియదా? శస్త్ర చికిత్సలో ఆయన తర్వాతే ఎవరైనా." "ఓ.కే. ఈ విషయంలో మనం వాదించుకోవడం అనవసరం. రేపు హైద్రాబాద్ వెళ్తున్నాం. బావ డబ్బులు ఇస్తాడన్నావ్. కాస్త ఊరట కల్గింది. బీరు తాగి నాలుగు రోజులైంది. ఈ పల్లెటూళ్లో పడేసి మన ప్రాణం తీస్తున్నారు. బావకి థాంక్స్ చెప్పాలి."

"అవును. మొరటోడు అనుకున్నా గానీ బావలోనూ కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను బాయ్." అంటూ తన గదిలోకి వెళ్లిపోయింది శివాని.

అనంతసాయి కూడా లేచి తన గదివైపు అడుగులేసాడు.

మరునాడు ఉదయం ఎనిమిది గంటలకే విజయవాడకి ఫోన్ చేసాడు అనంతసాయి.

ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఏ.సి. కారు పంపించమని. ఇచ్చిన మాట ప్రకారం నవీన్ బ్యాంక్ నుంచి పదివేలు డ్రా చేసి తెచ్చి సాయి శివాని చేతికిచ్చాడు. ఇంట్లో ఎవరికీ హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పలేదు. చెప్తే ఇప్పటికే కోపంగా ఉన్న పెదనాన్న రామలింగేశ్వర్రావు మొహం వాచేలా చివాట్లు పెడతారని తెలుసు.

ఈ మధ్య మావయ్య రఘునాథ్ కూడా తమకు బాధ్యత లేదంటూ చిరాకుపడుతున్నారు. అందుకే కామ్ గా కారెక్కి బయల్దేరి పోయారు. వెళ్తున్న కారును చూస్తూ తను ఇంటి నుంచి బయల్దేరాడు నవీన్.

రెక్కలు సాచి యూత్ విహంగం ఎగురుతుంటే లోకమంతా ఆనందమయంగా కన్పిస్తుంది. ఆ ఆనందంలో వెనక ఏముంది తెలియకుండా పోతుంది. ఆనందం, సంతోషం, కేరింతలు, కుప్పిగంతులు, చీకు చింతా లేని తమ కోసం సృష్టించుకున్న ప్రత్యేక ప్రపంచం అనుకుంటారు గానీ స్వార్ధం వెర్రితలలు వేస్తున్న ఈ సమాజంలో అక్కడ విష సర్ఫాలు ఉంటాయని, అమాయకుల్ని కాటు వేస్తాయని గ్రహించలేదు.

మధ్యాహ్నానికి అన్నాచెల్లెళ్ళు అనంతసాయి, సాయి శివానీలు హైద్రాబాద్ కు చేరుకున్నారు. డ్రైవర్ కు పేమెంట్ ఇచ్చి పంపించేశారు. తమ ఫ్రెండ్స్ గణపతితో పాటు నలుగురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. బర్త్ డే పార్టీ సాయంత్రం ఏర్పాటు చేసినట్టు చెప్పాడు. గణపతి ఇవ్వాల్సిన మూడు లక్షలు కూడా రెడీగా ఉంచినట్టు చెప్పాడు.

ఫైవ్ స్టార్ హోటల్లో బీర్లు తాగారు. డ్యాన్స్ లు చేశారు. భోజనాలు చేశారు. ఒకటే ఆనందం. ఒకటే కోలాహలం. సాయంకాలం వరకూ సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గణపతి బర్త్ డే పార్టీ కోసం అంతా అతడి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అతడి తండ్రి ఎం.పీ. గదా! వాళ్ళకి సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళే దారిలో ప్రశాంతమైన తోటలో ఉంది అందమైన గెస్ట్ హౌస్.

"ఏయ్. గణపతి... ఇక్కడేదో భారీగా బర్త్ డే పార్టీలు ఉన్నాయని చెప్పావ్! ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు?" అని అడిగాడు కారు దిగుతూ అనంతసాయి.

"అంతా వస్తే మనం ఎంజాయ్ చెయ్యలేం. నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరంతా ఉన్నారు. ఇంకేం కావాలి? మనం తినడానికి ఏ లోటూ లేకుండా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి చాలదా... కమాన్" అంటూ లోనకు దారితీశాడు గణపతి.

అక్కడ ఇద్దరు పని వాళ్ళున్నారు. వాళ్లు గెస్ట్ హౌస్ హాల్ ని చక్కగా అలంకరించి ఉంచారు. బర్త్ డే కేక్ తో పాటు తాగడానికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచారు. ఫ్రెండ్స్ కేరింతల మధ్య కేక్ కట్ చేసాడు గణపతి. మ్యూజిక్ సిస్టం ఆన్ చేసారు. బీరు, విస్కీ, బ్రాందీ అన్నీ పెట్టారు. అన్నాచెల్లెల్లిద్దరికీ బీరు మాత్రమే అలవాటు. అలాగే డ్యాన్స్ కూడా. వాళ్ళు ఎవరికి వారే సోలోగానే డ్యాన్స్ చేసారు. అబ్బాయిలతో చెట్టాపట్టాలేసుకుని డ్యాన్స్ చేసే అలవాటు శివానీకి తెలియదు. ఒంటిమీద చెయ్యి వెయ్యనివ్వదు. ఆ ఛాన్స్ తీసుకోవాలని, ఆమె నడుం పుచ్చుకుని గిరగిరా తిప్పుతూ డ్యాన్స్ చేయాలని గణపతి చాలాసార్లు ఆశపడ్డాడు కానీ, శివానీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడూ అంతే. కేకలు, అరుపులతో ఉత్సాహంగా తిని తాగుతూ చిందులు వేస్తున్నారు. అప్పటికీ బాగా చీకటిపడింది. గెస్ట్ హౌస్ లో లైట్లన్నీ పట్టపగల్లా వెలుగుతున్నాయి. అంతలో తల తిరుగుతున్నట్టు అన్పించింది అనంతసాయికి. సోఫాలో కూలబడిపోయాడు. అది చూసి పరిగెత్తుకు వచ్చింది శివాని.

"అన్నయ్యా ఏమయ్యింది?" అడిగింది గాబరాతో.

"ఏం లేదు. కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఒళ్ళు తూలుతోంది అన్నాడు.

అప్పటికే గణపతి వచ్చేసాడు దగ్గరకు. "అనంత్ నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావ్. నీకు విశ్రాంతి అవసరం. కాస్సేపు పడుకొని కళ్ళు మూసుకుంటే అదే తగ్గిపోతుంది. కమాన్" అంటూ భుజం పట్టుకొని లేపాడు.

మిత్రబృందం అతడిని విశాలమైన బెడ్ రూమ్ లోకి తీసుకువచ్చి అక్కడ సోఫాలో పడుకోబెట్టారు. ఉన్నట్టుండి అనంత్ కి ఏమయిందో అర్ధం కాక కంగారుగా నిలబడింది శివాని. గణపతి మాత్రం మిగిలిన వాళ్లవంక వంకరగా నవ్వి కన్ను కొట్టాడు. దాంతో అంతవరకు వాళ్లతో ఉన్న అమ్మాయిలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు. వాళ్ల వెనకే డోర్ వరకూ వెళ్లి తలుపు మూసి, గొళ్ళెం పెట్టాడు.

"ఏయ్ ఏం చేస్తున్నారు?" అనుమానంగా అడిగింది. అంతలోనే కళ్ళు గిర్రున తిరిగినట్టు అనిపించింది. అది చూసి ఉత్సాహంగా నవ్వాడు గణపతి.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
kasi bugga telugu story by eetakota subbarao