Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu twenty second Part

ఈ సంచికలో >> సీరియల్స్

కాశీబుగ్గ - ఈతకోట సుబ్బారావు

kasi bugga telugu story by eetakota subbarao

కాశీబుగ్గ... నల్లమల దట్టమైన అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. ఆదివాసులనడానికి వీల్లేదు. కోయలనడానికీ అవకాశం లేదు. పల్లెలకీ పట్నాలకీ దూరంగా వున్నా, అది నాగరికత నీడ పడని వూరే. చిన్న పల్లెటూరు. పాతిక గడపలు దాటని చిన్న గ్రామం. సీతారాంపురం వెళ్ళే తారు రోడ్డు కోసం తొమ్మిది కిలోమీటర్లు, ఎగువ మిట్ట రైలు మార్గం చేరుకోవడానికి పదమూడు కిలోమీటర్లూ చిట్టడవిలో అడ్డంగా నడవాలి. అదీ ఒంటరిగా నడవడానికి వీల్లేదు. ఏ నలుగురో, అయిదుమందో బృందంగా కలిసి వెళ్ళాలి. కర్రా, కత్తీ, బాణం, బరిసెల్లాంటివి ఆత్మరక్షణకి తీసుకెళ్ళకపోతే చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలాంటివి వెంటపడి మరీ తరుముతుంటాయి.

అడవిలో పాములకి కొరత లేకపోయినా వాగులు - వంకలూ దాటేటప్పుడు జెలగల కోసం కొరకంచులు అలుపూ సొలుపూ లేకుండా మండుతూనే ఉండాలి. వాటి సెగకు అవి దూరంగా వెళ్ళిపోతాయి. ఎన్ని ప్రమాదాల కత్తులు మొలిచినా కడుపాకలి తీర్చడానికి రోజూ అడవి బాటమ్మటా నడిచి మండల కేంద్రంలో కూలో నాలో వెతుక్కోవలసిందే. సంపాదించిన నాలుక్కాసులకి ఉప్పు, పప్పూ మూట కట్టుకొని చీకటి పడకముందే మళ్ళీ అడవితల్లి వొడికి చేరుకోవలసిందే.

కాశీబుగ్గ మగాళ్ళ దినచర్య సరే. ఆడాళ్ళకి పూరి కొంపల్లోనే పడుంటే గడవదు. అడవికెళ్ళి కర్రా పుల్లా యేరుకొస్తేనే గాని పొయ్యి వెలగదు. పిల్లల్ని వూళ్ళో ముసలీ ముతకా జనం సంరక్షణలో వదిలేసి ఎండ పొద్దువేళ ఆడజనం అడవిలో కెళ్తుంటారు. వీలైనంత బిరాన పుల్లలేరుకొని తిరిగి గూడు చేరుకుంటూ వుంటారు.

వంటా వార్పు పూర్తయ్యాక ఆడమేళమంతా చేరేది ఆ పాతిక గుమ్మాలకి మధ్యన వందల సంవత్సరాల కిందట మొలిచిన పెద్ద మద్ది చెట్టు కిందకి. వంగిన ఆ చెట్టుకొమ్మ ఒకదానికి పోపుల పెట్టెంత సైజులో ఓ ట్రాన్సిస్టరు వేలాడుతుంటుంది. దాంట్లో పలికేది ఒకేఒక్క ఆకాశవాణి కేంద్రం. అదీ కడపది. ఆ లెక్కన ఆ వూరూ అక్కడి నల్లమల అడవి ప్రాంతం కడప పరిసర ప్రాంతానికి చెందిందై వుండొచ్చు.

ఓ ఏడాది క్రితం అర్దరాత్రి వేళ వేటకోసం వచ్చిన ఒకానొక వేటగాడు అల్పపీడనం కారణంగా అడవిలో దారి తప్పి, ఆ వూరు చేరుకున్నాడు. ఆ వూరు తనకు ఆశ్రయమిచ్చి, ఆ రాత్రి కాపాడిన దాఖలాగ తన చేతిలోని ట్రాన్సిస్టర్ని బహుకరించి వెళ్ళిపోయాడు. వెళ్తూ, వెళ్తూ ట్రాన్సిస్టర్ తాలూకూ వివరాలన్నీ చిందులుకి సవివరంగా వివరించి వెళ్ళాడు. ఆ రోజు నుంచి సదరు చిందులు పూరి ఆడజనం కాలక్షేపం కొరకు దాన్నలా చెట్టుకి వేలాడదీశాడు.

కాశీబుగ్గ అది ఎనిమిదో వింత.

కాని -

సదరు చిందులు ఆ రోజు వంట్లో నలత కారణంగా వూరి మగ సమూహంతో కలిసి కూలీపని కోసం ఇటు సీతారాంపురం కాని అటు ఎగువ మిట్టక్కాని వెళ్ళలేదు.

"అదేంటి పెనిమిటి! ఇట్లా పనికిపోకపోతివి. అట్లా నూకలు తేకపోతివి. పూట గడిసేదెట్లా?" అని నిలదీసింది.

నిలదీయటమే కాదు "ఇద్దరు పిల్లల్ని కంటివి. కూడెట్టవద్దూ?" అంటూ ప్రశ్నాకారం సంధించింది చిందులు పెళ్ళాం తోకమ్మ. "పిడికెడు నూకలు పక్కింట్ల  అడిగి తేయే..." అంటూ సలహా ఇచ్చాడు చిందులు.

 ఆ పేర్లనీ, వాటి అర్ధాలనీ గూర్చి అడక్కండి. ఎవరూ చెప్పలేరు. అంత పాండిత్యం ఆ వూళ్ళో ఏ వయసు పైబడ్డ ముసలీముతక తరానికీ లేదు. ఆ పేర్లంతే. వాటి అర్ధాలంతే.

చిందులు సలహా పాటించింది తోకమ్మ. ఆదెమ్మ ఇంట్లోంచి నూకలు తెచ్చి వండి వార్చి పిల్లలకి బువ్వ పెట్టింది తోకమ్మ.

"మరి నాకో...?" అని చిందులు అడగలేదు.

"అడవిలో పుల్లలకి పోయి, ఆడ యే గడ్డలో పెరుక్కు తిందాం" అని తోకమ్మ బదులివ్వలేదు.

కుంటి కోలయ్య పాక వూరికి చివరగా వుంటుంది. అది గనక దాటితే అడవిలో పడ్డట్లే. అడవిలో వెళ్తున్నప్పుడు ఓ తోడేలు మీద పడి కోలయ్య పిక్కని నోట కరచుకెళ్ళింది. ఆ రోజు నుండి ప్రాణాలతో బైటపడ్డ కోలయ్య కాస్తా కుంటి అయ్యాడు. ఇప్పుడాయన వయసు అరవైఐదు. పెళ్ళాం పోయినేడాదే పుల్లలేరడానికి అడవికెళ్ళి ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు పోగొట్టుకుంది. నాలుగేళ్ళ 'ముందటి'ని, మూడేళ్ళ 'ఎన్నటి'ని కోలయ్య దగ్గర వదిలిపెట్టి, తోకమ్మ, చిందులు అడవికెళ్ళారు. పుల్లల కోసం వెళ్తూ వెళ్తూ తోకమ్మ "ఎప్పట్లాగే పిల్కాయలు జాగ్రత్త. యెల్ల దాట్తరేమో. సూపులుంచు" అంటూ హెచ్చరికలు చేసి పిల్లలిద్దర్నీ కోలయ్యకు అప్పగించింది.

"పెనిమిటి పాట్న యెల్తుంటివి. భూసెక్కిరం తవ్వుకురాయే తోకమ్మా!" మనసులో చానాళ్ళ బట్టి పీకుతున్న కోరిక అది.

"అట్టాగే దొరికితే పట్కొస్తా" అంటూ హామీ అనాలోచితంగా ఇచ్చేసి దంపతులిద్దరూ నల్లమల యెల్ల దాటారు.

అప్పటికి పదకొండు కావస్తోంది.

అడవి బాటలు విచిత్రంగా వుంటాయి. తిన్నగా వెళ్తున్న కాలిదోవ ఫర్లాంగు దాటకుండానే అమాంతం ఐదు తొవ్వలుగా చీలిపోతుంది. బాగా అలవాటు పడ్డవాళ్ళకి తప్ప యే తోవ ఎటువెళ్తుందో కొత్త బాటసారికి తెలియటం కొంచెం కష్టమే. ఎరుకలేనోళ్ళ కాళ్ళు దారి తప్పిపోతే చిందేరి మొక్క తొక్కి మాయలో పడిపోయారంటారు కాశీబుగ్గ జనం. రోజూ బిక్కుబిక్కుమంటూ ఆడవాళ్ళతో కలిసి భయంభయంగా అడవిలో దిక్కులు చూస్తూ నడిచేది తోకమ్మ. ఈ పూట భర్త వెంట నడుస్తుంటే తనకు బాగా మాలిమైన పులిని వెంటబెట్టుకొని నడుస్తున్నంత ధైర్యంగా వుంది. అడవి బాగా పరిచయం వున్న తోపులా అనిపించింది. కొండంత అండ తన నీడగా నడిచొస్తున్నట్టుంది. అదే ధైర్యంతో లోయలోకి దిగింది.

చిందులు భూ చెక్కెర గడ్డ కోసం గుట్టలు తవ్వుతున్నారు. తోకమ్మ ఎండుపుల్లలు పోగు చేస్తోంది. అడవిలో సాలచెట్ల నెత్తిమీది నుండి సూర్యుడు దూరంగా మలచాటుకి దిగిపోయే లోపల రెండు బరువైన మోపుల్ని ఆకాశతీగల పేనుడుతో కట్టకట్టింది.

"గెడ్ల తవ్వాట సాల్గాని, సూర్యుడు మాటు బడ్తుండు. సీకటి కమ్ముతావుంది. మోపెత్తుకో. ఎల్దాం" భార్య మాట వినగానే ఆకాశం కేసి చూశాడు చిందులు. సూర్యుడు కనిపించట్లేదు. చెట్లనీడ చీకటిజాడలో సంగమిస్తున్నట్టనిపించింది.

"వస్తి... వస్తి" అంటూ గుట్టమీంచి కిందకి దూకాడు చిందులు.

"మోపెత్తు" అంది భర్త రాగానే. చిందులు ఒక మోపు తోకమ్మ నెత్తిన పెట్టి, రెండో కట్టెల మోపు తనెత్తుకున్నాడు.

"బిరాన పదే. సీకటై పోనాది" అన్నాడు.

అప్పుడు కొద్దిగా వొళ్ళు జలదరించినట్టైంది తోకమ్మకి. పైగా ఆ వేళకే ఎక్కణ్ణుంచో సన్నగా వినిపించింది. అయినా భయం పైకి కన్పించనీయకుండా వేగంగా నడవడం మొదలెట్టింది. ఎంత వేగంగా నడిచినా భర్తకి వెనకబడే వుంది.

అడవి దారి. పైగా పల్చటి చీకటి తెర. దట్టమైన అడవిలో పైగా నిశ్శబ్దమే సర్వం వ్యాపించిన అడవిలో చీకటి వేళ ఎంతటి రాతి గుండెకైనా వణుకు పుట్టిస్తుంది. అంత పొద్దుగూకిందాకా తోకమ్మ ఏనాడు అడవిలో వుండిపోలేదు, అదే మొదటి అనుభవం. అయితే నెత్తిమీద మోపుకి చేతులు వూతంగా పెట్టిన పెనిమిటి ఖండలు చూసి పిడికెడంత ధైర్యం గుండెల్లో కుమ్మరించినట్టైంది. దాంతో వేగం పెంచి భర్త అడుగుల్ని చేరుకునే ప్రయత్నం చేసింది తోకమ్మ.

చిందులుకి అడవి బాటలన్నీ కొట్టిన పిండే. అర్ధరాత్రి కళ్ళకి గంతలు కట్టి నల్లమలలో వదిలేసినా క్షేమంగా ఇంటికి చేరుకోగలడు. అదే కారణం కావచ్చు. కాలిబాట వదిలేసి గుట్టదారి పట్టాడు. తోకమ్మ కూడా భర్త మీది నమ్మకంతో అనుసరించింది. అది కొత్తదారే అనిపించినా అడుగులో అడుగు పడకుండానే మెట్టదిగి కాశీబుగ్గలో కాలు పెట్టారు చిందులు, తోకమ్మలు.

"తోకమ్మ చాటు తడిక పక్కకి తీసి గుడిసెలోకెళ్ళింది దీపం పెట్టడానికి.

*****     
                         
చీకటి చిక్కనైపోయింది. నలుపు తెర మందమైపోయింది. అప్పుడే నల్లమలలోంచి దూరంగా నక్కల వూళలు వినిపిస్తున్నాయి. మద్ది చెట్టు కొమ్మకి వేలాడుతున్న ట్రాన్సిస్టరు వార్తలు వినిపిస్తుంది. చిందులు తవ్వి తెచ్చిన కావిరిగెడ్డలు కాలి వుడికిపోయాయి. వాటిని నిప్పుల్లోంచి బైటికి తీస్తున్నప్పుడు అసంకల్పితంగానే తోకమ్మ చెవి వార్తల వైపు మళ్ళింది.

"ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న దురాశ, దయాకర్, రమణ, కృష్ణమూర్తి అనే ముగ్గురు యువకుల్ని హంతకులుగా మార్చేసింది. నాలుగేళ్లయినా నిండని మేనమామ కూతరు మనీషని కిడ్నాప్ చేసి, అడిగిన డబ్బు ఇవ్వకపోయేసరికి ఆ ముగ్గురు యువకులు పసిపాపను దారుణంగా గొంతు నులిమి చంపి, పాడుబడ్డ గోతిలో పడేసి వెళ్ళిపోయారు. హంతకుల కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు..."

ఆకాశవాణిలో వార్తలు... అడవిలో జంతువుల అరుపులు... చిమ్మ చీకటి... మరోపక్క గంటసేపైనా పిల్లల్ని తీసుకునిరాని పెనిమిటి... తోకమ్మకి ఎడమకన్ను అదురుతున్నట్టనిపించింది. ఈ మానవుడు ఇప్పసారా కోసం సందులు కొట్టుకైతే వెళ్ళలేదు కదా అనుకుంది అనాలోచితంగానే, ఆ పాకవైపు నడిచింది తోకమ్మ పిల్లలకోసం.

కోలయ్య పాకకి తడిక అడ్డం పెట్టి వుంది. లోపల దీపం కూడా వెలగడం లేదు. పక్క కొట్టంలోకి దారి తీసింది తోకమ్మ.

"అత్తా!" అంది బైట నుండే.

"ఏందే తోకీ! పిల్లగొండ్లు కన్పించినారా!" సంకటి కలుపుతున్న చేతుల్తోనే లేచి వచ్చింది సుందత్త.

"ఏ పిల్లగొండ్లత్తా!" పెదాలు వణికాయి.

"ముందటి, యెన్నట్లేనే... సందేల ఆడ్తా ఆడ్తా ఆడ నిలబడి పోయినారంట. వాండ్లని ఎత్కటానికి నీ పెనిమిటి కూడా పోయినాడు గంద" అంటూ అంటూనే అడవికేసి చూసింది సుందత్త. అడవిలో మెట్లమీద కొరకంచులు కదులుతున్నాయి.

తోకమ్మకి విషయం అర్ధమైపోయింది. గుండెలు అవిసిపోయాయి. మిట్టమీది కొరకంచుల్ని చూస్తున్న కళ్ళలో కన్నీళ్ళు తన్నుకొస్తున్నాయి.

"పట్నంలో మడుసులే మేకలైపోతున్నారు. అడవి మొకాలకి కనికరం వుంటదా?"

జల జలా కళ్ళు సెయేర్లయ్యాయి తోకమ్మకి.

గుండె మీద ఎవరో నిప్పుకణిక పెట్టినట్టు " సామయ్య! నా పిల్లకాయలు..." అంటూ గావుకేక పెట్టి ఏడ్పు లంకించుకుంది. తల్లి మనసు పడే వేదన వర్ణించడానికి అచ్చులు, హల్లులు, గుణింతాలు లోతు సరిపోదు.

నిజమే కావచ్చు. కాలం కంటే వేగంగా మారిపోతున్న సంస్కృతీ పరిణామాల నేపధ్యంలో, మనిషి అవసరాల కోసం క్షణం క్షణం మృగలక్షణాలకి దగ్గరవుతూ వుండవచ్చు. మృగంగా మారిపోతుండవచ్చు. మృగం కంటే కర్కోటకంగాను ప్రవర్తించవచ్చు. ఎటొచ్చీ ఒక చివర మానవత్వం, మరో చివర మృగత్వం కారాదు.

కాని అడవిలో మృగాలకు ఆలోచనా శక్తి వుండదు. ఆశువు ఆశువే. హింస దాని ప్రవృత్తి. అమ్మా - నాన్న కోసం నిరీక్షించి సూర్యుడు కొండల చాటుకి వెళ్తుండగా నాలుగేళ్ళ ముందటి, మూడేళ్ళ ఎన్కటి అడవిలోకి వెళ్ళారు.

ఆకలి నకనకలాడుతున్న పచ్చి మృగాల అడవి. విషసర్పాల బుస గాలిలా హోరెత్తే అడవి. గుండె లేని అడవి.

గుండె లేని అడవి నుండి చిందులు తిరిగొచ్చాడు. అడవితో పాటు వెళ్ళిన పాతిక మంది మగాళ్ళూ తిరిగొచ్చారు. కాని పిల్లలిద్దరూ మాత్రం రాలేదు. ఏనక్కల పాలబడ్డారో? ఏ చిరుతలెత్తుకుపోయాయో?

"పెనిమిటీ! నా పిల్లకాయలేరి..." చిందులు గుండెల మీద వాలి కంటికి ధారగా ఏడ్చింది.

"వూకో... వూకో పొద్దుగాల్నే ఎదుకుదాం. అడవి తల్లి సంటి పిల్లకాయల జోలికెల్లదు..." తోకమ్మని సముదాయించే ప్రయత్నం చేశాడు చిందులు.

తల్లి మనసు కుదుట పడలేదు. కన్న కడుపు మాడలతో, స్వాంతనలతో చల్లారలేదు. రాత్రంతా ఏడుస్తూ, వక్కుతూ కునుకు మరిచి జాగారం చేసింది. క్షణం క్షణం నరకం అనుభవిస్తూ మేల్కొంది తోకమ్మ. ఆవిడ మొక్కుబళ్ళే ఫలితం కాకపోయిన రాత్రి గడిచి తెల్లారింది.

అమ్మవారు పూనిందా అన్నంత ఆవేశంగా నిద్రపోతున్న భర్త పైన పడి రక్కుతున్నట్టుగా నిద్రలేపింది తెల్లారగట్టే తోకమ్మ. "ఎహే... లెయ్యే... తెల్లారిపోనాది పిల్లకాయల్ని ఎదుకుదాం లెయ్యి..." అంటూ హడావుడి చేసింది.

ఆమె కేకల్లాంటి మాటలకి వులిక్కిపడి నిద్ర లేచాడు చిందులు. అప్పటికే తోకమ్మ గుమ్మంలో ఠంచనుగా నిలబడివుంది అడవికేసి చూస్తూ.

గతరాత్రి తను వెళ్ళిన తోవగుండా కాకుండా, తూర్పుబాట వైపుగా అడవిలోకి దారి తీశాడు చిందులు. తోకమ్మ అనుసరించింది. ఇద్దరూ ఎల్లదాటి, ఆ పైన మిట్ట దిగి, నక్కల కాలువ పక్కనుంచి గుట్ట పైకి చేరుకున్నారు. అక్కణ్ణుంచి అడవిని చాలా దూరం మేరా సృష్టంగా చూడొచ్చు. అక్కడక్కడా చెట్లు దట్టంగా ఉన్న ప్రాంతాలు, పొదలు అల్లుకున్న మైదానాలు రెండో, మూడో తప్ప మిగతా ప్రదేశమంతా స్పష్టాతిస్పష్టంగా కనిపిస్తుంది.

భార్యా, భర్తలిద్దరూ నిశితంగా చూపు సారించారు. కనిపించిన ప్రతి అణువూ చూపుల సూదుల్తో గుచ్చారు. ఎక్కడా పిల్లల జాడ కనిపించలేదు. తోకమ్మ కళ్ళు కలువల చెరువైంది.

"నాకు... నా పిల్లకాయలుకావాలి..." ఆవేశంగా మొగుడి చొక్కా పట్టి చింపేసింది తోకమ్మ. చిందులేం మాట్లాడలేదు. అడవిలాగే మౌనంగా వున్నాడు. ఆ మౌనంలోంచే స్వచ్ఛమైన, అమాయకమైన, అందమైన చిన్ని నవ్వు వినిపించింది.

ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

ఆ నవ్వు వాళ్ళ కిందనించే, సరిగ్గా తమ వెనకవైపు గుట్టకింద ఆ జానెడు రాతిబండ పైన ముందటి, ఎన్కటి కూర్చోని వున్నారు. చెట్టెక్కి కూర్చున్న కోతి ఒకటి వాళ్ళపైన అడవిపండ్లు విసురుతూంది. దాని చేష్టలకు పిల్లలిద్దరూ నవ్వుతున్నారు.

తోకమ్మకి సామయ్య మీద తొలిసారి నమ్మకం కుదిరింది. సామయ్య అంటే మద్ది చెట్టు కింద వాళ్ళు పూజించే రాయి. సామయ్య కాపాడబట్టే అడవిలో రాత్రంతా పిల్లలు బతికి బట్టకట్టగలిగారు. ఏ తోడేళ్ళూ వాళ్ళని పీక్కు తినలేదు. ఏ చిరుతలూ పంజా విసరలేదు. ఏ ఎలుగుబంటి చూపులూ వాళ్ళ మీద పడలేదు. సామయ్య దయ ఉండబట్టే అంతా.

తోకమ్మ నమ్మకమే నిజమా? ఏమో? నాకు తెలిసి పిల్లలపైన లైంగిక దాడి చేసే అవలక్షణం అడవికి లేదు. స్వార్ధప్రయోజనాల అత్యాశలో పడి ధనవంతుల బిడ్డల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించు కోవాలనుకునే వక్ర బుద్ధి అడవికి లేదు. కిడ్నీలు, కళ్ళూ అమ్ముకుని సొమ్ము చేసుకునే దుష్ట ఆలోచన అడవికి లేదు. అడవి ఎవర్నీ ద్వేషించదు. ప్రేమించని అమ్మాయిల ముఖాలపైన యాసిడ్ చల్లదు. నిలువునా పెట్రోలు పోసి సజీవ దహనం చేయదు. ఫ్యాక్షన్ కక్షలతో బాంబులు విసరదు. అందుకే ఆ పిల్లలిద్దరూ క్షేమంగా బతికున్నారు.

కాని జనారణ్యంలో పెరిగిపోతున్న క్రూర మృగాలని వేటాడడానికి ఎవరైనా మృగయావినోది పుడతాడో, లేదో?
 


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్