Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Ramayya Vasthavayya

ఈ సంచికలో >> సినిమా >>

రఘు కుంచెతో ముఖాముఖి

Interview with Raghu Kunche

గాయకుడిగా గొంతు విప్పి జనం గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది. గాయకుడిగా కొనసాగుతూనే సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందే యోగం అతి కొద్దిమందికే దక్కుతుంది. సంగీత దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన తొలి నాలుగేళ్లలోనే బంపర్ ఆఫర్, అహనా పెళ్లంట, దేవుడు చేసిన మనుషులు లాంటి గుర్తింపు పొందిన సంగీతాన్ని అందించిన స్వరకర్తగా కీర్తి గడించడం మరో విశేషం. అలా అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుని ఎదుగుతున్నకొద్దీ ఒదుగుతూ, ఒదిగే కొద్దీ ఎదుగుతూ అభిమానుల్ని పెంచుకుంటూ ముందుకెళ్తున్న రఘు కుంచె తో గోతెలుగు జరిపిన ముఖా ముఖీ ఈ వారం మీ కోసం.

జెమిని టీవీ లో 'యువర్స్ లవింగ్లీ' కార్యక్రమంతో మీరు రాష్ట్ర స్థాయి ప్రముఖులు అయ్యారు. ఆ కార్యక్రమం ముందు, దాని తర్వాత మీలోను, మీ చుట్టూ జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
వేరే ఛాయిస్ లేకుండా దూరదర్శన్ మాత్రమే చూడాల్సిన రోజుల్లో తొలిసారిగా శాటిలైట్ ఛానల్ జెమిని వచ్చి వీక్షకుల్ని తన వైపుకు తిప్పుకుంది. అందులో ఉత్తర ప్రత్యుత్తరాల కార్యక్రమానికి "యువర్స్ లవింగ్లీ" అని టైటిల్ పెట్టి "క్షేమమా నేస్తం" అనే చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్ ని నా చేత పాడించారు. యువతకి బాగా దగ్గరైన ఆ కార్యక్రమం నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ని ఇచ్చింది. వేరు వేరు దేశాల్లో షోస్ కి వెళ్లినప్పుడు ఇప్పటికీ ఆ షో గురించి చెబుతూ ఉంటారు చాలా మంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ కార్యక్రమం తర్వాత నాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది.

మీకు స్ఫూర్తినిచ్చిన గాయకుడు, నటుడు, స్వరకర్త ఎవరెవరు?
గాయకుడు కిశోర్ కుమార్. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప నటుడు, ఆల్ రౌండర్. ఇక స్వర కర్త అంటే ఘంటసాల గారు. ఆయన స్వరపరిచిన "హిమగిరి సొగసులు.." (పాండవ వనవాసం), ఇంకా మాయాబజార్ లోని పాటలు నా దృష్టిలో అద్భుతం. నిజానికి స్వర కల్పన అంటే జనం పాడుకోగలిగేలాగ, మనసుకు హత్తుకునే లాగ స్వర రచన చెయ్యడమే. అంతే గాని పాండిత్యాన్ని ప్రదర్శించడం కాదు. ఇక నటుడంటే చెప్పేదేముంది.. మెగా స్టార్ చిరంజీవి.

నటన, గానం, స్వర కల్పన... మీ మనసుకు వీటిల్లో బాగా దగ్గరైనది ఏది?
గానం. ఎందుకంటే గాయకుడిగానే నాకు గుర్తింపు ఎక్కువ వచ్చింది. కాబట్టి నాకు పాటే మనసుకు దగ్గరగా ఉంటుంది. అదే నాకు మ్యూజిక్ డైరక్టర్ కావడానికి కూడా తోడ్పడింది. అయితే నటన అనేది సినిమా పరంగా అన్నిటికన్నా పవర్ ఫుల్. నటుడికి ఉండే ఇమేజ్ ఎవ్వరికీ ఉండదు. అది మిస్ అవుతున్నాననే వెలితి మాత్రం ఉంది. దానిని వదిలేది మాత్రం లేదు. నటుడిగా నా తృష్ణ తీర్చుకోవడం ఖాయం.

ఫేస్ బుక్ లో తరచూ ఫోటోలు తీసి పెడుతుంటారు. ఫోటొగ్రఫీ మీద కూడా మక్కువ ఎక్కువేనా?
చాలా ఎక్కువ. చిన్నప్పుడు నా దగ్గర హాట్ షాట్ అనే కెమెరా ఉండేది. దాంట్లో రీల్ వెయ్యాలి. ఇప్పటిలాగ డిజిటల్ కాదు. రీల్ కి 24 ఫొటోలు మాత్రమే తియ్యగలం. దానితో చుట్టాలవి, మిత్రులవి ఫోటోలు తీసి, కడిగించి వాళ్లకి ఇచ్చేవాడిని. అప్పటినుంచి మొదలైన సరదా ఇప్పటికీ వదలట్లేదు. నా దగ్గర ప్రస్తుతం 11 రకాల కెమేరాలు ఉన్నాయి... రాం గోపాల్ వర్మ తన సినిమాల్లో ఎంతో ఇష్టంగా వాడే అతి చిన్నదైన గోప్రోతో సహా. ఈ ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టడానికి కారణం నా ట్యాలెంట్ ప్రదర్శించడానికి మాత్రం కాదు. కేవలం హాబీగా మాత్రమే. ఆ ఫోటొలు నేను తీసినవి, నన్ను నేను తీసుకున్నవి, లేదా వేరే వాళ్లు నన్ను బాగా తీసినవి. బహుశా ఈ సరదా నన్ను దర్శకుడిని చేస్తుందేమో చూడాలి.

ఆ సరదా కూడా ఉందా?
అది మాత్రం కేవలం సరదా కాదు. ఒక తపన, ఒక తపస్సు. నా జీవితాశయం అదే. 2-3 ఏళ్లల్లో సినిమా దర్శకత్వం చేస్తా.

మీకు ఇప్పటిదాకా పాడటానికి బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన పాట ఏది?
ఇప్పటిదాకా నేను క్లాసికల్ సాంగ్స్ పెద్దగా పాడలేదు. అన్నీ తేలిగ్గా ఉండేవే పాడాను..నా సొంత పాటలైనా, వేరే వాళ్లవైనా. కాబట్టి ఇప్పటిదాకా పెద్ద ఛాలెంజ్ అంటూ ఏదీ ఎదురవ్వలేదు. అయితే ఒక్కసారి మాత్రం విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో "నీ మాట తెలిసే..." అనే పాట "ప్రియా ప్రియతమా" చిత్రం కోసం పాడాను. అది హిందీ లో హిట్ అయిన "జబ్ వుయ్ మెట్" సినిమాని తమిళంలో రీమేక్ గా తియ్యగా, తెలుగులోకి డబ్బింగ్ అయిన చిత్రం. అది మాత్రం చాలా కష్టపడి పాడాల్సి వచ్చింది. ఒక పట్టాన తెగలేదు. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆ కష్టం చెప్పుకున్నా ఎవరికీ అర్థం కాదు.

పూరి జగన్నాథ్ వంటి అగ్రదర్శకులు మిత్రులుగా ఉన్నా మీకు ఆశించినన్ని అవకాశాలు ఎందుకు రాలేదు?
నిజానికి గాయకుడిగా అయినా, సంగీత దర్శకుడిగా అయినా నా మెడలో గంట కట్టింది పూరీ జగన్నాథ్ మాత్రమే. "బాచి" లో "లచ్చిమి లచ్చిమి" పాటతో నేపధ్య గాయకుడిని అయ్యాను. "బంపర్ ఆఫర్" తో సంగీత దర్శకుడిని అయ్యాను. రెండూ పూరీ చలవే. అయితే నేను పాడిన పాటలు, చేసిన సంగీతం హిట్ అయినా కూడా మీరన్నట్టు ఆశించిన అవకాశాలు పెద్దగా రాలేదు. దానికి ఎందుకో నాకు ఇప్పటికీ లాజిక్ దొరకదు. దానికి ఏదో కారణం వెతుక్కోవడం తప్ప సత్యం బోధపడట్లేదు. నామటుకు నేను అనుకుంటున్న కారణం ఏమిటంటే కొందరికి కొందరు నచ్చరు. ఒకవేళ నచ్చినా నచ్చని వాళ్లకి దగ్గరైనందుకు నచ్చకపోవచ్చు. అలా కూడా కొన్ని అవకాశాలు మిస్ అయ్యాను. ఒకసారి అవకాశం ఇచ్చారు కదా అని మళ్లీ మళ్లీ అడిగితే అసలుకే దూరం పెడతారేమొనని ఒక భయం కూడా ఉంది. అలా అని భజన చేసి అవకాశాలు అందిపుచ్చుకోవలనుకునే తత్వం కాదు నాది. గుర్తించి అవకాశం ఇచ్చినప్పుడు న్యాయం చెయ్యాలనే తపన మాత్రం విపరీతంగా ఉంటుంది. కేవలం డబ్బు కోసం అనుకుంటే సినిమా రంగం ఒక్కటే కాదు.. ఎన్నో రంగాలున్నాయి. ఇక్కడికొచ్చేది ప్రధానంగా గుర్తింపు కోసం, మెప్పుకోలు కోసం.

"బంపర్ ఆఫర్", "దేవుడు చేసిన మనుషులు", "అహనా పెళ్ళంట", "దగ్గరగా దూరంగా" సినిమాల పాటల రికార్డింగ్ నాటి ఆసక్తి కరమైన అనుభవాలు చెప్పండి.
"బంపర్ ఆఫర్" లో "ఎందుకే రవణమ్మా" అంత హిట్ అవుతుంది అనుకోలేదు. చేసే ముందు ఆర్ధిక మాంద్యం పైన కొంత రీసర్చ్ చేసి స్వర రచన చేసాను. భాస్కరభట్ల అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. అలాగే "అహనా పెళ్ళంట" టైం లో చిత్ర గారితోను పని చెయ్యడం గొప్పగా అనిపించింది. చిత్రగారితో "మృగరాజు" సినిమాలో 'హంగామ' పాట కలిసి పాడాను. ఆ తర్వాత ఆ సంగీత సరస్వతితో పనిచెయ్యడం "అహనా పెళ్లంట"లోనే. అలాగే "దేవుడు చేసిన మనుషులు" కోసం ఉదిత్ నారాయణ్, శ్రేయా గోషల్ తో పనిచెయ్యడం ఒక అనుభూతి. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ని సంతోష పెట్టే పాటలు చెయ్యడం తృప్తినిచ్చింది.

ఔత్సాహిక గాయకులకు, సంగీత దర్శకులకు మీరిచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా?
కొత్త గాయకులకి చెప్పేది ఒక్కటే. అనుకరణ మానేసి సొంత ముద్రతో పాడాలి. నేను కొత్తల్లో బాలు గారిని బాగా అనుకరించేవాడిని. చాలా మంది చెబితే ఆ ప్రభావం నుంచి బయటకు రావడానికి రెండేళ్లు బాలూ గారి పాటలు పాడలేదు. క్రమంగా సొంత ముద్ర బయటపడింది. ఇక మ్యూజిక్ డైరక్టర్స్ కి చెప్పే స్థాయి నాకు ఇంకా రాలేదు. నా అభిప్రాయం చెప్పాలంటే ఏదైనా కాన్సెప్ట్ బేస్ ఉండేలా ట్రై చేస్తే బాగుంటుంది.

మీరు తరచూ అమెరికా వెళ్తూ ఉంటారు. ఎందుకు?
అమెరికాలో తెలుగు వాళ్లు విపరీతంగా పెరిగారు. ఊరికొక తెలుగు సంఘం ఉంది. అందరిలోనూ పోటీ తత్వం పెరిగింది. ఒకరిని చూసి ఒకరు దసరాకి, దీపావళికి, న్యూ ఇయర్ కి, ఉగాదికి అన్న తేడా లేకుండా ఇంచు మించు అన్ని అకేషన్లకి ప్రోగ్రాం లు పెడుతున్నారు. పైగా ఫండ్స్ కూడా వారికి బాగున్నాయి. ఇక అక్కడ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్లు నాతో బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి నన్ను తరచూ పిలుస్తున్నారు. వెళ్తున్నాను.

మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువని టాలీవుడ్ అంతా చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనా?
నిజమే. ఇది నేను అదృష్టంగా భావిస్తాను. లేడీస్ ఫాలోయింగ్ అందరికీ సాధ్యం కాదు. ఆ ఫాలోయింగ్ ఉన్న కళాకారులు ఎవరికైనా అమ్మవారి కటాక్షం ఉన్నట్టే అనుకుంటాను.

మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాను. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాను.

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka