Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

అసలైన సిసలైన బంగారం లాంటి మంచి మనిషికి అశ్రునివాళి

aaditya hrudayam - vn adithya

రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి రీల్ లైఫ్ లో ఎన్ని పాత్రలు పోషించారో, రియల్ లైఫ్ లో చాలమంది జీవితాల్లో వెలుగులు నింపే మంచి పాత్రలు మరిన్ని ఎక్కువ పోషించారు. ఈ వారం వేరే కాలం రాసినవాణ్ని కాస్తా, హరిగారి హఠాన్మరణంతో నాకు తెలిసిన శ్రీహరి గారి గురించి రాయాలనిపించి, కాలం తిరగ రాస్తున్నాను.

ఆ దేవుడు కూడా తన నిర్ణయాన్ని తిరగరాసి, నిన్నటి కేలండర్ లో ఈ సంఘటనని సుఖాంతంగా మారిస్తే, నిరాటంకంగా ఇంకో 30,40 ఏళ్లకు పైగా చాలా మందికి మేలు జరిగేది.

1994లో చెన్నై నుంచి రాజమండ్రి వెళ్ళాను. చుట్టాలింట్లో పెళ్ళికని. ప్రక్కనే శ్యామలా టాకీస్ లో కె.రాఘవేంద్రరావుగారు, హీరో జగపతిబాబుతో తీసిన 'అల్లరి ప్రేమికుడు' రిలీజైంది. రిలీజు రోజు మార్నింగ్ షో చూడకపోతే ప్రాణం ఒప్పుకోదు కాబట్టి, చూసేశాను. ఆ సినిమాలో సర్ ఫ్రైజ్ ఎలిమెంట్ అప్పుడే కొత్తగా విలన్ వేషాలు వేస్తున్న శ్రీహరి అనే నటుడు. 'ఈ హరి బీరుతాగి బాటిలిరగ్గొడితే ఎవడైనా హరీ మనాల్సిందే' అంటూ రిథమిక్ డైలాగుల్ని కామెడీగా మాడ్యులేట్ చేస్తూ, ఫైట్స్ లో మంచి బాడీ బిల్డర్ లా కనిపించారు.

చెన్నై వెళ్ళగానే 'శ్రీకృష్ణార్జున విజయం' సినిమా ఆడిషన్స్ కి దుర్యోధనుడి పాత్రకి పిలిపించాను. సింగీతంగారు, రావికొండలరావుగారు, బి.వెంకట్రామిరెడ్డి గారు ముగ్గురూ కూర్చుని శ్రీహరిగారు వచ్చి టీషర్ట్ తీసేసి, బేర్ బాడీతో కనపడగానే దుర్యోధనుడి పాత్రకి ఓకే అనేశారు. అప్పట్నుంచి ఆయనకి నేనంటే ప్రత్యేకమైన అభిమానం. తర్వాత జయంత్ గారు వెంకటేష్ బాబుతో 'ప్రేమించుకుందాం రా' చేసినప్పుడు చిరంజీవి గారితో 'బావగారూ బాగున్నారా' చేసినప్పుడు, మళ్ళీ వెంకటేష్ బాబుతో 'ప్రేమంటే ఇదేరా' చేసినప్పుడూ శ్రీహరి గారితో అనుబంధం పెరిగి, పెద్దదై కుటుంబ సభ్యుడిలా ఆయన నన్నాదరించే స్థాయికొచ్చింది.

సురేష్ వర్మ డైరెక్షన్ లో 'మనసిచ్చి చూడు' చిత్రానికి శ్రీహరి గారు, శ్రీమతి శాంతి గారు రాజమండ్రి వెళ్తున్నారు. అందులో వేషం వేస్తున్న పరుచూరి వెంకటేశ్వరరావు గారు 'ప్రేమంటే ఇదేరా' డైలాగ్ వెర్షన్ రాజమండ్రిలో రాసుకుందాం అని జయంత్ గారి నడిగి అసోసియేట్ డైరెక్టరైన నన్ను కూడా ఆయనతో తీసుకెళ్ళారు. రైల్లో సెకండ్ ఏసీలో అందరం ట్రావెల్ చేస్తుంటె ఓ వెయిటర్ వచ్చి శ్రీహరిగారి దగ్గర, శాంతి గారి దగ్గర, పరుచూరి గారి దగ్గర, చలపతి రావుగారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళబోయాడు. శ్రీహరిగారు అతన్నాపి, ఈయన పేరు ఆదిత్యగారు. ఏడాదిలోపు ఓ సూపర్ హిట్ సినిమాకి డైరెక్టర్ అవుతాడు. తర్వాత ఇలా ట్రైన్ లు ఎక్కడు. ఫ్లైట్ లో తిరుగుతాడు. అప్పుడు నీకు ఈయన ఆటోగ్రాఫ్ దొరకదు. ఇప్పుడే తీసుకుని దాచుకో అన్నారు. నేను సిగ్గుపడి పోయాను. అతను చిరాకు పడిపోయాడు. అయినా ఆయన నా ఆటోగ్రాఫ్ తీసుకునేదాకా అతన్ని వదల్లేదు. సినిమాల్లోకి వచ్చాక సెలిబ్రిటీ అవ్వకుండానే నేనిచ్చిన మొట్టమొదటి ఆటోగ్రాఫ్ అది. సినిమాల్లోకి రాక ముందు నా లైఫ్ లో ఒకే ఒక్కసారి బలవంతం మీద సిద్ధార్ధ మహిళా కాలేజీలో చదువుతున్న స్నేహితురాలు శిరీషకి మాత్రం ఆటోగ్రాఫ్ ఇచ్చాను. శ్రీహరిగారు ఇప్పించిన ఆటోగ్రాఫ్, తీసుకున్న వాడికన్నా పదిలంగా నేను మనసులో దాచుకున్నాను. ఆ సంఘటన, ఆయన మంచితనం, నేను పెద్ద డైరెక్టర్ ని అవుతానన్న ఆయన నమ్మకం, ఆశీర్వచనం నా మనసు మీద ఆయన చేసిన మధురమైన సంతకం.

పరిశ్రమలోను, పరిశ్రమేతర వ్యక్తుల్లోను చాలామందికి ఎన్నో సమస్యలొచ్చినపుడు శ్రీహరిగారు సామరస్యపూర్వకంగా సొల్యూషన్స్ చూపించేవారు. ఆయన అనారోగ్యం అనే చిన్న సమస్యను సాల్వ్ చేసుకోలేక నిర్లక్ష్యం వహించడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఇది ఒక గుణపాఠం కూడా.

'పోలీస్' సినిమా షూటింగ్ కి వెళ్తే, నన్ను తన కారెక్కించుకుని ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఆఫర్ నేనిస్తాను. నాతో యాక్షన్ మూవీ చెయ్యి అని అన్నారు. నేను లవ్ స్టోరీతోనే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, యాక్షన్ మూవీ నెక్స్ట్ చేస్తానంటే, నీకు విజన్ లేదు. ఒక్క మాస్ సినిమా తీసి ప్రూవ్ చేస్కో, అందరు హీరోలతోనూ వర్క్ చెయ్యి - పెద్ద దైరెక్టరవ్వు - లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు కష్టపడి తియ్యాలి - ఆడేదాకా రిస్కే. తర్వాత అలాగే కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది - అని నచ్చచెప్పారు. నేనంత దూరం ఆలోచించనండీ... నా మొదటి సినిమా లవ్ స్టోరీ అంతే... తర్వాతేం చేయాలని తర్వాతే ఆలోచిస్తాను అని వచ్చేశాను. ఇవ్వాళ చూసుకుంటే అర్ధమైంది ఆయన నా శ్రేయస్సుని ఎంత కాక్షించారో. ఈ రోజున అందరు హీరోలతో కమర్షియల్ సినిమాలు తీస్తున్న నా సమకాలీన దర్శకులందరి సరసనా ఆయన నన్ను ఊహించారు. నేనే ఆ ఊహని అర్ధం చేసుకోలేకపోయాను. ఈ మధ్యే అర్ధమైంది. ఆచరణలో పెడుతున్నాను.

ఒక వ్యక్తి ఎదురుగా గానీ, పరోక్షంలో గానీ ఒక్క చెడుమాట కూడా మాట్లాడని మంచి మనిషి శ్రీహరిగారు. తన సంపాదనలో సమాజానికి కూడా ఉపయోగపడే సేవ చేయాలన్న ఆశయం అరుదుగా ఉంటుంది ఎవరికైనా. ఏకంగా నాలుగు గ్రామాలు దత్తత తీసుకోవడం, సాయమడిగిన వారందరికీ చేతనైన చేయూతనివ్వడం ఆయనకీ అభిమానులిచ్చిన రియల్ స్టార్ బిరుదుని రియల్ నేమ్ గా మార్చాయి. తొందరపడ్డారు ఆ దేవుడూ, ఈ శ్రీహరిగారూను.

'ప్రేమంటే ఇదేరా' సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం కోసం బొజ్జ తగ్గించి, కండలు పెంచి 'ద్రోహి' సినిమాలో కమల్ హాసన్ లా స్టైల్ గా తయారవ్వమంటే పదిహేను రోజుల్లోనే అలా తయారై వచ్చిన క్రమశిక్షణపరుడు, కష్టజీవి, నెలల తరబడి అనారోగ్యానికి ఇంత చిన్న వయసులో లొంగి 'పోతా'రని ఊహించగలమా? ఆరోగ్యరీత్యా, నిత్య అలవాట్లని నియంత్రించుకోవలసిన అవసరాన్ని అకాలమరణం నొక్కి వక్కాణిస్తోంది. నాకు, నాలాంటి చాలామందికి ఎన్నో విషయాల్లో శ్రీహరిగారు కావాలి. ముఖ్యంగా వారి అర్ధాంగి, కుమారులు, ఆయన తల్లిగారు, అన్నదమ్ములు, మిగిలిన బంధుమిత్ర వర్గానికి కూడా శ్రీహరిగారు చాలా చాలా కావాలి. ఎవ్వరూ అక్కర్లేదని ఆయనెందుకనుకోవాలి?

వేరే వారివల్ల కన్నీల్లొస్తే తుడవగలిగిన చేతులు, తామే గట్టిగా చెంపదెబ్బ కొట్టి కన్నీళ్లు తెప్పించినట్టుంది. నాతో పరిచయమైన నా స్నేహితుడు వివేక్ గురించి నాకే చాలా గొప్పగా చెప్తూ, ఈ కుర్రాడికి నేనో సొంత ఆఫీస్ కొని గిఫ్ట్ గా ఇస్తాననడం ఆయన సంస్కారానికి నిదర్శనం.

కొంతమంది ఎదిగేకొద్దీ తెలిసో తెలియకో కొందరు శత్రువులౌతారు.

కొంతమంది ఎదిగే కొద్దీ మిత్రుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది. రెండో కోవ శ్రీహరిగారిది. భిన్నమైన దోవ శ్రీహరిగారిది.

సాధారణంగా చెట్టంత మనిషి చనిపోతే ఏడిచేవాళ్ళని చూస్తాం - శ్రీహరిగారింట్లో అలాంటి వాళ్ళనీ చూశాను - ఆయన అండలేకపోతే మా పరిస్థితేంటని ఏడిచేవాళ్లనీ చూశాను. హీరోల సినిమాలకి మార్నింగ్ షో టికెట్స్ కోసం క్యూలో చొక్కాలు చింపుకోవడం చూశాను.

తన రియల్ హీరోని కడసారి చూపులకి నోచుకోవడం కోసం చొక్కాలు చింపుకుని ఆయనింటికి వచ్చిన అభిమాన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, రాజకీయ నాయకుల్ని, అభిమానుల్నీ చూశాను.

డౌన్ టు ఎర్త్ పెర్సన్ డా: శ్రీహరి ఎర్త్ లో డౌన్ కెళ్లిపోయినా, మానవత్వంలో, మంచితనంలో ఎవరెస్ట్ అంత ఎత్తుకెదిగారు.

"మీనోటి చలవన నేను దర్శకుణ్నయాను శ్రీహరి గారూ... మీ నోటితో మీరే 'మగధీర' సినిమాలో అన్నట్టు మీరు మళ్ళీ పుట్టండి - మీరే అని మాకు తెలిసేలా పుట్టండి... ఫ్లీజ్..."

(వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
thandra paparayudu - bahubali