Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue269/716/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)..

‘ఎన్‌.ఏ.డి.లో దిగాక ఏ.టి.ఎమ్‌లో డబ్బు డ్రా చేసుకోవాలి.’ అనుకుంటూ నోట్ల మధ్య ఉన్న మరో అరలోనుండి ఎటిఎమ్‌ కార్డు బయటకు తీసింది. వివిధ బ్యాంకుల ఏటిఎమ్‌ కార్డు లెక్కకు మించి ఉన్నాయి. ఒకో బ్యాంకు ఏటిఎమ్‌ లు రెండేసి కార్డులు ఉన్నాయి.

ఎన్‌.ఏ.డి దగ్గర ఏ బ్యాంకు ఏ.టి.ఎమ్‌ కనిపిస్తే ఆ కార్డులో డబ్బు డ్రా చెయ్యొచ్చులే అనుకుంటూ మళ్లీ కార్డులన్నీ చిన్న పర్సులాంటి బ్యాగ్‌లో ఉన్న మరో అరలో భద్రంగా దాచేసింది.

‘‘అమ్మా! వచ్చేసాం! ఇక్కడ దిగుతారా?’’ ఆటోని గిర్రున మలుపు తిప్పుతూ అన్నాడు ఆటోవాలా.

అప్పటికే ఆటో ఎన్‌.ఏ.డి. చేరుకోవడం...తిరిగి వెళ్లిపోవడానికి ఆటోని బస్సు స్టాండ్‌ కేసి మలుపు తిప్పేయడం జరిగి పోయింది.
టక్కున ఆటో దిగి అప్పటికే చేత్తో పట్టుకున్న వంద నోటు ఆటో డ్రైవర్‌ చేతికి ఇచ్చి గబ గబా వైజాగ్‌ వైపు వెళ్తోన్న బస్సు కోసం అవతలి వైపు బస్సు స్టాండ్‌ కేసి నడిచింది ఆమె.

‘‘పాపం! సోము ఎలా ఉన్నాడో! భగవంతుడా! ఆ పిల్లాడ్ని రక్షించు స్వామీ’’ మనసులో దేవుడ్ని ప్రార్థించుకుంది ఆమె. ఆ ఇద్దరు పిల్లల మీద తనకెందుకంత అవ్యాజమైన ప్రేమ కలుగుతోందో అర్థం కావటం లేదు. సోము చెప్పిన కథ విన్నాక మరింతగా వారి మీద అనురాగం పెరిగి పోయింది.

ఆలోచిస్తూనే బస్సు స్టాండ్‌ దగ్గర నిలబడింది.

బస్సులు వరుసగా వస్తున్నాయి. కిక్కిరిసి ఉన్న బస్సుకేసి చూసి ఎక్కలేక ఖాళీ బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడింది. కె.జి.హెచ్‌కి వెళ్ళే బస్సు 28 నెంబర్‌ గలవి మాత్రమే ఎక్కాలని ఎవరో పాసింజర్‌ని అడిగి తెలుసుకుంది.

ఎదురుగా అన్నపూర్ణ రెస్టారెంట్‌ బోర్డు కనిపించే సరికి అంత వరకూ ఎక్కడ దాక్కుందో ‘ఆకలి’ పులిలా విజృంభించింది. ఆకలి దహించే సరికి అటూ ఇటూ చూసింది ఆమె. బస్సు స్టాండ్‌ ప్రక్కనే పాన్‌ షాప్‌ కనిపించింది.

గబ గబా వెళ్లి రొట్టెలు కొనుక్కుంది. అక్కడికక్కడే రొట్టెల మీద కవరు చించేసి ఆబగా నాలుగు ముక్కలు నోట్లో కుక్కుకుంది. మిగిలినవి కవరులో చుట్టేసి బస్సులో కూర్చుని తీరిగ్గా తినొచ్చులే అనుకుంటూ తిరిగి బస్సు స్టాండ్‌లో నిలబడింది ఆమె.

గత నెల రోజులుగా ఇదే వరస. మధ్యాహ్నం ఏదో హోటల్లో నాలుగు మెతుకులు తినడం...రాత్రుళ్ళు రొట్టెలతో సరి పెట్టుకోవడం ఆమెకి అలవాటై పోయింది.

‘ఒంటరి తనం’  ఎంత భయంకరమో అర్థమైంది ఆమెకి. ఒంటరి ‘ఆడది’ కనిపిస్తే కబళిద్దామనుకునే మగ మృగాలు... ఒంటరి వ్యక్తికి నిలువ నీడ కూడా దొరకదని నిరూపిస్తూ తల దాచుకోవడానికి అద్దెకు కూడా గదులివ్వడం కుదరదనే లాడ్జీ నియమ నిబంధనలు. ఇల్లు వదిలిన దగ్గర నుండి రైల్వే స్టేషన్ లో ఉండే విశ్రాంతి గదుల్లోనే పడుకునేది. కాల కృత్యాలు తీర్చుకునేది.

దేవాలయాల్లో అయితే మూకుమ్మడి బస. అక్కడ...ఆ సత్రాల్లోనే సర్వస్వం.

అయితే, ఇవేవీ ‘ఆమె’ గమ్యాన్ని చేరుకోకుండా ఆప లేక పోయాయి. ఆమె గమనాన్ని సాగనివ్వకుండా అడ్డుకో లేక పోయాయి.
పదేళ్ళు  పెళ్లయిన పదేళ్ల తర్వాత

కళ్ళు తెరిచింది. కళ్ళు తెరుచుకుంది. కాదు....కాదు....కళ్ళు తెరిపించింది. తన మోడు వారిన జీవితానికి వెలుగు రేఖ... బీడు వారిన బ్రతుకులో ఆశ మొలక....చచ్చిపోదామనుకుని...బ్రతక లేక...బ్రతక లేక జీవచ్ఛవంలా బ్రతుకుతున్న తన కొన ఊపిరికి ఊపిరిలూదిన ఊసులు...పదేళ్ళు అంధకారంలో కొట్టుకులాడుతున్న వేళ....సూర్యోదయంలా వెసిన చల్లలటి కబురు.......

అదేగా తన అన్వేషణకి పునాది. అదేగా తన ఆరాటానికి ఆయువు....అదేగా తన ఈ వెతుకులాటకి బాసట...ఊరట.
‘ఆకలి’ తీర్చుకుని ఉపశమనం పొందుతూ ఊహల్లో ఊసులాడుకుంటూ బస్సు కోసం ఎదురు చూస్తూ బస్సు స్టాండ్‌లో ఉన్న సిమ్మెంటు దిమ్మ మీద కూర్చుంది ఆమె.

‘‘అమ్మా! మీరేనా ‘కె.జి.హెచ్‌’కి వెళ్లే బస్సు కోసం అడిగింది. అదిగో! ఆ బస్సే వచ్చింది.’’ అంటూ ఎవరో పాసింజర్‌ గట్టిగా అరిచి పిలిచే సరికి ఉలిక్కి పడి ఇహానికి వచ్చింది ఆమె.

గబుక్కున లేచి పరుగున వెళ్లి ఖాళీగా ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి కూర్చుంది ఆమె.

*****

రాత్రి ఎనిమిది గంటలవుతోంది.

పోలీస్‌ స్టేషన్‌ ఆవరణ అంతా  ఫిర్యాదు దారులతోనూ, ముద్దాయిలతోనూ కిక్కిరిసి పోయి వుంది. గుంపులు గుంపులుగా నిలబడి గుస గుస లాడుకుంటున్నారు. ఆ ప్రాంతానికి అదే పోలీస్‌ స్టేషన్‌.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ తన గదిలో కూర్చున్నాడు. ఉదయం జరిగిన సంఘటనలన్ని నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు.

కొండ ఘాట్‌ రోడ్‌లో జరిగిన ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయట పడ్డ కానిస్టేబుల్‌ హాస్పిటల్‌ నుండి నేరుగా పోలీస్‌ ప్టేషన్‌ కు వచ్చి ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని కలిసాడు.

ఆ బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాల పాలై హాస్పటల్‌ లో చికిత్స పొందుతున్నారని చెప్పాడు కానిస్టేబుల్‌.

బైక్‌ నుజ్జు నుజ్జు అయి పోయింది. స్టేషన్‌ బయట పాడు పడ్డ బైక్‌లు, కార్ల మధ్య తెచ్చి పడేసారు.

ఏక్సిడెంట్‌లో పాడై పోయిన బైక్‌ కోసం స్టేషన్‌ బయట కూర్చున్నాడు వరహాల శెట్టి.

రాముని ఓ మూల కూర్చోబెట్టారు. దొంగలు ముగ్గుర్నీ బట్టలు విప్పించేసి కట్‌ డ్రాయర్ల తో ‘సెల్‌’లో కూర్చోబెట్టారు.

నైట్‌ డ్యూటీకి వెళ్ల వలసిన పోలీసులు తమ తమ బీట్‌ బుక్కులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు.

పోలీస్‌ కమీషనర్‌ ఆఫీసు నుండి ఒకటే ఫోన్‌ కాల్స్‌. కొండ మీద దేవాలయం దగ్గర జరిగిన ముసలమ్మ మర్డర్‌ కేసులో శోధించి సాధించిన ఫలితం ఏమిటంటూ ఒకటే ఆరా!

ముసలమ్మని చంపింది ఎవరో అర్థం కావటం లేదు. కనీసం హత్యాయుధాన్ని కూడా కనిపెట్ట లేక పోయారు. కావాలని జరిగిన మర్డరో.....కాకతాళీయంగా జరిగిన మర్డరో అర్థం కావడం లేదు.

ముసలమ్మ  ‘వీలునామా’  ఏమైందో  కూడా  అంతు చిక్కటం లేదు.  ఆస్తి డాక్యుమెంట్లు,  ఆ ముసలమ్మ  రాసిన ఉత్తరాన్ని బట్టి ‘వీలునామా’ రాసిందన్నది వాస్తవం.

ముసలమ్మతో ఆ రాత్రి గడిపిన ‘ఆమె’ని పట్టుకో లేక పోయారు. కనీసం ‘ఆమె’ ఎవరో ఎక్కడుంటుందో కూడా కనిపెట్ట లేక పోయారు.
ఆలోచిస్తూనే బజర్‌ నొక్కాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

స్టేషన్‌లో కాపలాగా ఉండే సెంట్రీల్లో ఒకడు బజర్‌ వినపడగానే టక్కున ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు ప్రత్యక్షమయ్యాడు.

‘‘సార్‌!’’ వినయంగా సెల్యూట్ చేసాడు.

‘‘ఆ కుర్రాడెక్కడున్నాడు?!’’ అడిగాడు ఎస్సై.

‘‘స్టేషన్‌ లోనే ఉన్నాడు సార్‌?’’ అన్నాడు కానిస్టేబుల్‌.

‘‘ఆ విషయం నాకు తెలీదా?!  కుర్రాడ్ని ‘సెల్‌’ లో పెట్టారా అని అడుగుతున్నాను.’’ కోపంగా అన్నాడు ఎస్సై.

‘‘లేద్సార్‌! రైటర్‌ గారి రూమ్‌లో ఓ మూల ఏడుస్తూ కూర్చున్నాడు.’’ చెప్పాడు కానిస్టేబుల్‌.

‘‘వెళ్లి తీసుకురా!’’ హుకుం జారీ చేసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఎస్సై ఆర్డర్‌ వినీ వినగానే పరుగున వెళ్లి రాముని వెంటబెట్టుకు వచ్చాడు సెంట్రీ.

ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడుతూ చిరిగిన షర్టుతో కళ్లు ఒత్తుకున్నాడు రాము.

‘‘నీ పేరేమిటి బాబూ!’’ ప్రేమగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘రాము....రాము సార్‌!’’ వినయంగా అన్నాడు రాము.

‘‘ఏ.టి.ఎమ్‌లో డబ్బు దొంగిలించావా?’’ రాము కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘లేద్సార్‌! ఏ.టి.ఎమ్‌. కార్డుతో డబ్బు తీసాను. అది చూసి పోలీసులు దొంగనని పట్టుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు.’’ ఏడుపు గొంతుతో చెప్పాడు రాము.

‘‘ఏ.టి.ఎమ్‌ కార్డు నీదేనా?’’ అడిగాడు ఎస్సై.

‘‘కాద్సార్‌! అమ్మ గారిది!’’ అన్నాడు రాము.

‘‘మీ అమ్మ గారిదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

‘‘మా అమ్మ కాదు సార్‌? యాత్రకొచ్చారే. ఆ అమ్మ గారిది సార్‌!’’ చెప్పాడు రాము.

‘‘ఆవిడెవరు? నీకెలా తెలుసు?!’’ అడిగాడు ఎస్సై.

‘‘ఆవిడ దేవత సార్‌! నాకూ సోమూకి చెరో రెండు వేల రూపాయలు దానం చేసిన పుణ్యాత్మురాలు సార్‌?’’ ఆనందంగా అన్నాడు రాము.
‘‘అంత మాత్రానికే నిన్ను నమ్మి ఈ కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్నదా?’’ అడిగాడు ఎస్సై.

‘‘అవును సార్‌! నేనూ సోమూ బస్సు స్టాండ్‌లో ఉన్నప్పుడు కనిపించారు. రెండు వేల రూపాయల దానం చేసిన తల్లిని మర్చి పోలేం కదా సార్‌! ఆనందంగా వెళ్లి పలకరిస్తే నాకు ఏ.టి.ఎమ్‌. కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్నారు.’’ అన్నాడు రాము.

‘‘మరి, ఆవిడ ఏదీ?! నీ దగ్గర డబ్బు, కార్డు తీసుకోలేదేం?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అమ్మ గార్ని సోము గాడు మేము ఉండే పాడు బడ్డ రాజు గారి భవనానికి తీసుకు పోయాడు సార్‌!’’ అన్నాడు రాము.

‘‘అదే ఎందుకు? ఆవిడే ఏటిఎమ్‌లో డబ్బు  డ్రా చేసుకోవచ్చు కదా రామూ!’’ కుతూహలంగా రాము మొహంలో మొహం పెట్టి అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అవును కదా....’’ అని క్షణం ఆలోచిస్తూ నిలబడి పోయాడు రాము. తిరిగి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా హుషారుగా అన్నాడు.

‘‘ముందు ఏటిఎమ్‌ ఎక్కడుందని అమ్మ గారే అడిగారు సార్‌! నేనూ, సోము ఏ.టి.ఎమ్‌ అదిగో అంటూ చూపించాము. అక్కడ మీ పోలీసు జీపు చూసి అమ్మగారే నా చేతికి ఏటిఎమ్‌ కార్డు ఇచ్చి పిన్‌ నెంబర్‌ చెప్పి డబ్బు తెమ్మన్నారు. నేను వచ్చే వరకూ తొలి పావంచా మెట్ల మీద కూర్చుంటామన్నారు.’’ అన్నాడు రాము.

‘పోలీసు జీపు’ చూసి అనగానే ఉలిక్కి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘పోలీసు జీపు’ చూస్తే ఆవిడకెందుకు భయం కలిగింది? తప్పు చేసిన వాళ్ళు తప్పుడు ఆలోచనతోనే భయ పడాలి. అయితే ‘ఆవిడ’ ఎవరు?! దొంగా?! దొంగ అయితే ?! అంత డబ్బు ఏటిఎమ్‌లో ఎలా దాచుకో గలుగుతుంది? దోచుకున్న సొమ్ము బ్యాంకుల్లో దాచేసుకుందా?! దొంగలు కూడా ఏటిఎమ్‌లు ఎందుకు వాడ కూడదు? వాళ్ళు సమాజంలో వ్యక్తులేగా? ప్రజాస్వామ్యంలో ఓటున్న బలమైన శక్తులేగా?!

" ఆమె " ఎవరో పోలీసులు తెలుసుకోవడానికి ఒక్కొక్క ఆధారమే వారధి అవుతోందా...ఇక ఆమె తెలిసిపోవడం అనివార్యమా?? ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్