Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue270/718/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ‘‘మీ గది లోకి ఈ గన్ ఎలా వచ్చింది రాము?’’ అనునయంగా అడిగాడు ఎస్సై. పాడుబడ్డ భవనంలో దొరికిన గన్ చూపిస్తూ అడిగాడు.

‘‘అదా! ఎక్కడిది సార్! ఆ పాడుబడ్డ బంగ్లాలో దొరికిందా? బొమ్మ తుపాకీనా సార్?’’ ఉత్సాహంగా అన్నాడు రాము.

‘‘ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది?’’ గద్దించి అడిగాడు ఎస్సై.

‘‘ఏమో సార్! మా సోమూగాడు కూడా కొనలేదు. కొంటే నాకు చెప్తాడు కదా! ఏదైనా మా ఇద్దరూ కలిసే కొంటాం...  ఉంటాం... ఆడుకుంటాం. వాడుకుంటాం. అందులో రీలుందా సార్!’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘రామూ! ఇది బొమ్మ తుపాకీ కాదు. ప్రాణాలు తీసే నిజం తుపాకీ. ఇది మీ గదిలోకి ఎలా వచ్చింది?’’ అసహనంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అమ్మో! నిజం తుపాకీయే?! ఇలాంటివి సినిమాల్లో చాలా సార్లు చూసాను సార్! ఇది మా దగ్గరకెలా వచ్చిందో తెలీదు సార్! అమ్మ తోడు’’ నెత్తి మీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు.

‘‘సోమూ తెచ్చాడా?!’’ అడిగాడు ఎస్సై.

‘‘లేద్సార్! వాడూ తేలేదు. వాడూ నేను రాత్రీ పగలు కలిసే ఉంటాం కదా!’’ అన్నాడు రాము.

‘‘ఆలోచించు....బాగా ఆలోచించు. విదేశీ భక్తులు దేవుడి దర్శనానికి వచ్చినపుడు వారి దగ్గర దొంగిలించారేమో కదా!’’ అన్నాడు ఎస్సై రామూ కేసి అదోలా చూస్తూ.

‘‘సారూ! మేము ముష్టోళ్ళమే గాని ముఠాగాళ్లం కాదు సార్! దొంగతనం మా ఇద్దరికీ చేత కాదు. అమ్మా అయ్యా దానం చెయ్యండయ్యా అంటూ కాళ్లా వేళ్లా పడి అడుక్కుంటామే గాని అడక్కుండా ఒక్క పైసా ముట్టమండీ.’’ కోపంతో తల ఎగరేస్తూ గుండెల్లోనుండి తన్నుకొస్తున్న దు:ఖాన్ని అదిమి పట్టి అన్నాడు రాము.

రామూ మాటల్లో నిజాయితీ గ్రహించాడు ఎస్సై అక్బర్ ఖాన్.

బజర్ నొక్కి సేంట్రీని పిలిచాడు.

‘‘ఈ కుర్రాడ్ని పంపించెయ్యండి. ఈ కుర్రాడి దగ్గర తీసుకున్న ఏ.టి.ఎమ్ కార్డు, డబ్బు తిరిగి ఇచ్చెయ్యండి.’’ అంటూ రామూ కేసి నవ్వుతూ చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆనందంతో ఉప్పొంగి పోయాడు రాము.

‘‘నిన్ను నీ గది దగ్గర దించేస్తాడు మా కానిస్టేబుల్. ఆ డబ్బు జాగ్రత్త.’’ రాము కేసి చూస్తూ అన్నాడు ఎస్సై.

‘‘సార్! మా సోముని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసారో...నేను కూడా వాడి దగ్గరకు వెళ్తాను సార్! పాపం! వాడిప్పుడు ఎలా ఉన్నాడో’’ బెంగగా అన్నాడు రాము.

‘‘ఈ డబ్బుతో ఎలా?! జాగ్రత్తగా దాచుకో గలవా?’’ అడిగాడు ఎస్సై.

‘‘ఏం ఫర్లేదు సార్! నా ఫేంటు లోపల మరో ఫేంటు ఉంది. అందులో దాచేస్తాను. అమ్మగారిని కలిస్తే ఇచ్చేస్తా’’ అన్నాడు రాము.
డబ్బుకోసం ఆవిడ రాముని ఎలాగైనా కలుస్తుంది. ‘పాడుబడ్డ భవనం’ లో అయితే ఈ రాత్రికే కలిసేది. వీడు హాస్పిటల్ కి  వెళ్తానంటున్నాడు. ఎలా?! ఆలోచిస్తూ సెంట్రీ కేసి చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘రామూ! నువ్వెళ్లి రైటర్ దగ్గర నిలబడు. మా కానిస్టేబుల్ని నీతో పంపిస్తాను. హాస్పిటల్ దగ్గర దించేసి వచ్చేస్తాడు. సరేనా!’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అలాగే సార్!’’ అంటూ ఎస్సై గదిలో నుండి బయటకు వెళ్లి పోయాడు రాము.

‘‘సార్! ఏదో చెప్పబోయారు.’’ ఎస్సై ముందు వినయంగా నిలబడి అడిగాడు సెంట్రీ.

‘‘రైటర్ దగ్గరున్న ఏ.టి.ఎమ్. కార్డు రెండు ప్రక్కలా జెరాక్స్ తీయించండి. ఆ కుర్రాడికి వాడి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చెయ్యండి. అలాగే వాడి డిబ్బీ కూడా ఇచ్చెయ్యండి. నువ్వెళ్లి రైటర్ని పంపించు.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

సెంట్రీ వెళ్ళిన అర నిమిషం లోనే రైటర్ వచ్చాడు.

‘‘ఆ కుర్రాడి వస్తువులన్నీ ఇచ్చేసాక వాడి వెనుక మన కానిస్టేబుల్స్ ని ఇద్దర్ని సివిల్ డ్రస్ లో పంపించు. వాడిని నీడలా వెంబడించాలి. ఈ కుర్రాడికి ఏ.టి.ఎమ్. కార్డు ఇచ్చి డబ్బు తెమ్మన్న ‘ఆమె’ వీడ్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చాన్స్ మిస్ చెయ్య కూడదు. ఈ ‘పిస్టల్’ ఆమెదే అయితే చాలా ప్రమాదం. ఆ స్త్రీ ఏ ఉగ్రవాద సంస్థకో చెందినదైతే మరీ ప్రమాదం. అందుకే మన వాళ్లని చాలా ఎలర్ట్ గా ఉండమను.’’ చెప్పాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘సార్! ఏ.టి.ఎమ్. డబ్బు ఇవ్వకుండా మన కస్టడీలో ఉంచితే మంచిది కదా!’’ నసుగుతూ అన్నాడు రైటర్.

‘‘ఎందుకు?! దాని వలన ఉపయోగం ఏమిటి?! ఏటిఎమ్ కార్డు ఎలాగూ మనం జెరాక్స్ తీయిస్తాం కదా! ఆ ఆధారంతో బ్యాంకులో సంప్రదించి అది ఎవరి పేరున ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ముందు ఆ స్త్రీ ఎవరో కనిపెట్టాలి. రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలి. నేను చెప్పినట్టు చెయ్యండి.’’ చిరాగ్గా అన్నాడు ఎస్సై.

మరి మారు మాట్లాడకుండా వెనుదిరిగాడు రైటర్.

‘‘రైటర్ గారూ!.... జస్ట్ ఏ మినిట్!’’ వెను దిరిగి వెళ్లి పోతున్న రైటర్ ని పిలిచాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ పిలుపు వినగానే టక్కున ఆగి వెనక్కి వచ్చాడు రైటర్.

‘‘ఆ దొంగ కథ ఏం చేసారు?’’ అడిగాడు ఎస్సై.

‘‘అదే ఆలోచిస్తున్నా సార్! ఆ బ్యాగ్ ఎవరిదో తెలీదు. అందులో చీరలు తప్ప ఏమీ లేవు. కాకపోతే మన దగ్గర చాలా కేసు పెండింగ్ లో ఉన్నాయి. నగలు పోయాయని కొందరు, నగదు పోయిందని కొందరు ఇలా చాలా మంది భక్తుల నుండే చాలా ఫిర్యాదులు అందాయి, వీళ్లని నాలుగు తన్ని కనుక్కుంటే గాని వీళ్ళు నిజం చెప్పరు.’’ అన్నాడు రైటర్.

‘‘అలాగే ! మీరా పనిలో ఉండండి! ఇక నేను ఇంటికి వెళ్తాను. ఏదన్నా అర్జెంటు పనుంటే కాల్ చెయ్యండి.’’ అంటూ సీట్లో నుండి లేచాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఎస్ సార్!’’ అంటూ సెల్యూట్ చేసాడు రైటర్.

**************

కె. జి. హెచ్ ముందు బస్సు దిగింది ఆమె.

ఎత్తైన భవనాలు.  బ్రిటీష్ కాలం నాటి రాతి కట్టడాలు. బిల్డింగ్ ప్రవేశ ద్వారం కేసి చూసింది. ఎత్తుగా ఉన్న పై అంతస్థు పైన ‘కింగ్ జార్జ్ హాస్పిటల్’ అని చెక్కి ఉంది.

ఆ ప్రాంతం అంతా ప్రైవేట్ హాస్పటల్స్, మెడికల్ షాపు, డయాగ్నసిస్ సెంటర్ లతో కళకళలాడుతోంది.

ఎటు చూసినా జనం...ఎక్కడ చూసినా కార్లు, బైకులు. రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలు. నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్ లోపలకు వెళ్ళింది. ఓ.పి. ప్రక్కనే ఎమర్జెన్సీ వార్డు కనిపించింది.

ప్రమాదాల వలన గాయపడే వారిని గాని అత్యవసర వైద్యం అవసరమైన ప్రాణాంతక రోగులు గాని ముందుగా ఎమర్జెన్సీ వార్డు లోనే చికిత్స అందించి రోగ తీవ్రతను బట్టి సాధారణ వార్డుకు పంపిస్తారు. సోముకి తల మీద బలమైన గాయమైంది. సృహ లేదు. ఎమర్జెన్సీ వార్డుకే తీసుకు వచ్చి ఉంటారు అనుకుంటూ నేరుగా ఎమర్జెన్సీ వార్డు దగ్గరకెళ్లింది.

వార్డు బయట ఒకతను ఆమెను అడ్డగించాడు.

‘‘ఎవరు కావాలి?’’ నిష్కర్షగా అడిగాడు వార్డు బోయ్.

‘‘ఇప్పుడే ఒక ఏక్సిడెంట్ కేసు వచ్చింది కదా! చూద్దామని.’’ అటూ ఇటూ దిక్కులు చూస్తూ అంది ఆమె.

‘‘ఇప్పుడా....ఈ అరగంటలో ఆరు కేసులు అవే వచ్చాయి. అన్నీ బైక్ ఏక్సిడెంట్లు, కారు ఏక్సిడెంట్లు కేసులే....అందులో ఎవరు మీ తాలూకా?’’ ఆమెని ఎగాదిగా పరిశీలనగా చూస్తూ అడిగాడు వార్డు బోయ్.

వార్డు బోయ్ వాలకం కని పెట్టిన దానిలా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ జిప్ తీసి  వంద నోటు అతని చేతిలో పెట్టింది.

‘‘చెప్పండమ్మా! మీ తాలూకా వాళ్లెవరో చెప్తే నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకు వెళ్తా.’’ వినయంగా వంగి అన్నాడు వార్డు బోయ్.

‘‘వంద’ ఎంత వందనాన్ని తెచ్చింది’ అనుకుంది మనసు లోనే.

‘‘పదేళ్ళ కుర్రాడు....తల మీద గాయంతో ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యాడు.’’ చెప్పింది ఆమె.

‘‘ఓ అదా! కుర్రాడు....పాపం తల మీద ఎవరో గట్టిగానే కొట్టారట కదా! డాక్టర్లు అంటుంటే విన్నాను. అదిగోనమ్మా ఆ మూల బెడ్ మీద ఉన్నాడు.’’ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సోముని చూపిస్తూ అన్నాడు వార్డు బోయ్.

సోము ఎక్కడున్నాడో చెయ్యెత్తి చూపించిన వార్డు బోయ్ కేసి కృతజ్ఞతగా చూసింది ఆమె.

‘‘పోలీసులే తెచ్చి జాయిన్ చేసారు. ఇక్కడే ఇంత వరకూ ఒక కానిస్టేబుల్ ఉండేవాడు. ఆకలేస్తోంది. కాస్త ఎంగిలి పడి  వస్తానంటూ బయటకు  వెళ్లాడమ్మా. పోలీసోడొచ్చేలోపు  మీరు  ఆ  కుర్రాడ్ని  చూసి వచ్చెయ్యండి! పోలీసులసలే

మంచోళ్ళు కాదు! ఎందుకు పంపించావంటే నా ఉద్యోగం పోతుంది. ఎందుకొచ్చిన తంటా. బేగా ఎళ్లొచెయ్యండమ్మా!’’ అంటూ ఆమెని లోపలకు పంపించాడు వార్డు బోయ్.

తలకి కట్టు కట్టి ఉంది. ఒంటి మీద స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు సోము. ఇంకెక్కడా గాయాలు లేవు.

నెమ్మదిగా చేతి మీద తట్టింది ఆమె.

ఉులుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడు సోము. ఒక్క క్షణం భయంగా చూసింది ఆమె. ‘పాపం! తన వలన ఈ స్థితికి వచ్చాడు!’ మనసు లోనే అనుకుంది.

సోము దగ్గర నుండి వెనక్కి వచ్చేసింది ఆమె.

‘‘అమ్మా! ఆ కుర్రాడ్ని చూసారా? ఏ వెధవలు కొట్టారో గానీ, చాలా బలంగా కొట్టారు. చాలా కుట్లు పడ్డాయి.’’ చెప్పాడు వార్డు బోయ్.

‘‘చూసాను.’’ అంటూ ఒకడుగు ముందుకు వేసి ఆలోచిస్తూ క్షణం నిలబడింది ఆమె.

‘‘చెప్పండమ్మా! నాకేదో చెప్పానుకుంటున్నారు కదా! ఫర్లేదు చెప్పండి’’ ఆమె అలా ఆలోచిస్తూ అయోమయంగా నిలబడడం చూసి అన్నాడు వార్డు బోయ్.

వార్డు బోయ్ అలా అనే సరికి ఒక్క సారే అదిరి పడింది ఆమె. తన మనసులో మాట కనిపెట్టేసినట్టే ఎలా మాట్లాడుతున్నాడు. ఈ వార్డు బోయ్ ఎవడో గాని మహా ఘటికుడే!’’ అనుకుంది ఆమె.

‘‘చిన్న సహాయం చేస్తావా?’’ అడిగింది ఆమె.

‘‘అయ్యో! అదెంత మాట చెప్పండమ్మా!’’ అన్నాడు వార్డు బోయ్.

(పోలీసులతో 'ఆమె ' ఆడుతున్న దాగుడు మూతలకు తెర పడినట్టేనా? సోమూ మీద వాత్సల్యంతో హాస్పిటల్ కి చేరుకున్న ఆమె కథ కంచికేనా?? ఈ సస్పెన్స్ వచ్చే శుక్రవారం దాకా.....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?