Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నాన్న కోరిక

nannakorika

మాది ఆంధ్రా తెలంగాణ సరిహద్దులలో సుమారు వంద గడపలున్న   ఒక గ్రామం. చిన్న ఊరు కావడాన అందరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళమే దాదాపుగా.

పంటలు చేతికొచ్చి  కోతలు, కుప్ప నూర్పిళ్ళ సమయం కావడాన ఉదయాన్నే పొలాల దారి పడుతున్నారు రైతన్నలు.  మా పొలంలోనూ  కోతలపని పూర్తైంది. ఇంక నూర్పిళ్ళ పనే మిగిలింది. రోజూ ఉదయాన్నే నేనూ నాన్నా పొలానికి వెళ్ళడం పని చూసుకుని సాయంకాలానికి ఇంటికితిరిగి రావడం జరుగుతోంది.  

ఆరోజు ఎండ చాలా ఎక్కువగా ఉండడాన   నాన్నని ఇంటి వద్దనే ఉండమన్నా వినక నాతో పొలానికి వచ్చాడు. పనిలో మునిగి ఉన్న నాకు  ఉన్నట్లుండి ‘ఒరేయ్ అబ్బాయ్.... ’ అన్న పిలుపు విని తలెత్తి చూద్దును కదా అప్పటికే నాన్న ఉన్నచోటే ఓ పక్కకి ఒరిగిపోతున్నాడు
ఒక్క అంగలో వెళ్ళి పట్టుకునే లోగానే  నేలకి ఒరిగిపోయాడు. పెద్ద వయసు దానికి తోడు ఎండ , మైకం కమ్మినట్లుంది పాపం.  
‘నాన్నా.. నాన్నా‘ అని గాబరాగా పిలుస్తూ ఆయనను  లేపి నిలబెడదామని ప్రయత్నించాను కాని  సాధ్యంకాలేదు. వెంటనే దగ్గరలోనే  పనిచేసుకుంటున్న మనుషుల ని కేకేసి పిలిచి  వారి సాయంతో  నాన్నని ఎత్తుకుని  మా ఊళ్ళోని రెండు పడకలున్న  ఒక చిన్న ఆస్పత్రిలో చేర్పించాను.  

రక్తపుపోటు అధికమై  పక్షవాతం వచ్చిందనీ ,  కుడికాలూ కుడి చెయ్యీ పడిపోయాయని  చెప్పారు డాక్టర్. నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నాక  ‘మీ నాన్న బాగా కోలుకోవడానికి సమయం పడుతుంది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా  చూసుకో’ అన్నారు  డాక్టర్.  
సరేనని నాన్నని ఇంటికి తీసుకొచ్చాను. 

డాక్టర్ చెప్పినట్లుగానే నాన్నను కంటికి రెప్పలాగా చూసుకోసాగాము నేనూ , నా ఇల్లాలు  చంద్రిక.........

ఒకరోజు మధ్యాహ్నం ఒంటి  గంటకి నాన్నకి  అన్నం తినిపించడం అయ్యాక ‘మనం కూడా తిందాము రండి’ అని  చెప్పి వెళ్ళింది చంద్రిక . నాన్నకి  మందులు వేసి  వెళ్ళాను.

అన్నం తిని  మళ్ళీ  వచ్చిన నన్ను చూసి  ‘ఎందుకురా అబ్బాయ్ ఇక్కడకొచ్చావ్? వెళ్ళి ఓ కునుకు తియ్యరాదూ ’ అన్నాడు నాన్న
‘అలాగేలే నాన్నా ముందు నువ్వు కళ్ళుమూసుకుని విశ్రాంతిగా  పడుకో’  అని అక్కడే  ప్రక్కన కుర్చీలో కూర్చుని ఆనాటి  వార్తాపత్రిక తిరగేస్తూ మగత నిద్రలోకి జారుకున్నాను.

కొంతసేపటికి ‘ఒరేయ్ రంగడూ!’ అన్న పిలుపుకి  ఉలిక్కిపడి  ‘ఏం కావాలి నాన్నా?’ అంటూ దగ్గరగా వెళ్ళాను. 

‘నేనింక మళ్ళీ ఇదివరకటిలాగా లేచి తిరగలేనేమోరా? నా కోరిక తీరకుండానే  ఈ గుక్కెడుప్రాణం గాలిలో కలిసిపోతుందేమోరా?’  అంటూ కన్నీరు పెట్టాడు 

నిరాశతో  నిండిన నాన్న మాటలకి  గుండెల్లోంచి  దుఃఖం తన్నుకు వచ్చింది నాకు.

వెంటనే తమాయించుకుని ‘ఛ ఛ అలాంటిదేం జరగదు నాన్నా.  నువ్వు త్వరలోనే  మళ్ళీ మాములుగా లేచి తిరుగుతావని చెప్పారు డాక్టర్ . మరేం దిగులుపడకు. ఇంకపోతే నీకోరికంటావా అది తీర్చే బాధ్యత  నాది సరేనా?  హాయిగా  నిద్రపో’ అని ఓదార్చి  ఉబికివస్తున్న కన్నీరు ఆయనకు  కనపడకుండా  గబ గబా ఇవతలికి  వచ్చి వెక్కి వెక్కి ఏడవసాగాను ......

మా నాన్న సోమయ్య ఆ గ్రామంలో ఒక సన్నకారు రైతు. కల్లాకపటం తెలియని మనిషి. తనేదో తన పనేదో అంతే! వీలయితే నలుగురికి  సహాయపడే మనస్తత్వం .  ఆయన  ఒక్కగానొక్క కొడుకుని నేను . నా నాలుగేళ్ళ వయసులో అమ్మ  అనారోగ్యంతో  మరణిస్తే మళ్ళీ పెళ్ళి జోలికి పోక  నాకు  తల్లీ తండ్రీ తానే అయి  పెంచుకొచ్చాడు నాన్న.

అందుకు తగ్గట్టుగా నేను  కూడా  బుద్ధిగా చదువుకుని, నాన్నతో  కలిసి  పొలం పనులు చూస్తూ ఆయనకు  చేదోడు వాదోడుగా స్వగ్రామంలోనే ఉండిపోయాను.

పాతికేళ్ల వయసులో ప్రక్క గ్రామంలో ఒక తెలిసిన కుటుంబములోని అమ్మాయి చంద్రికను వివాహం చేసుకున్నాను.

పదవతరగతి వరకు చదువుకున్న చంద్రిక  పనీ-పాటలూ తెలిసినదే కాక  ఎంతో వినయ విధేయతలు కలిగిన అమ్మాయి.  నాన్నని  ఎంతో ఆదరంగా చూస్తుంది కూడా. 

నాన్నకి  వయసు పెరిగి ఓపిక తగ్గుతుండడంతో  ‘నువ్వు ఇంకా కష్టపడటం  ఎందుకు? హాయిగా ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకో’ అని ఆయనను  మరి పొలం జోలికి రానీయలేదు నేను.

వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది.....

ఒకరోజు నాన్న ‘ఒరేయ్ అబ్బాయీ యాత్రలు చేస్తే పుణ్యం వస్తుందట! నాకు ఎప్పటినుండో యాత్రలకి వెళ్ళాలని ఉందిరా. కానీ బాధ్యతల వలన ఇప్పటివరకూ వెళ్లలేకపోయాను . ఇప్పుడు నా బాధ్యతలు తీరాయి.  నువ్వు కూడా జీవితంలో స్థిర పడ్డావు.  మరి  నన్ను యాత్రలకి తీసుకువెళతావా?’  అని అడిగాడు .

నా చిన్నప్పటినుండీ, ఎప్పుడూ నాన్న నా గురించి తాపత్రయపడటమే చూసాను కానీ, ఆయన తనకంటూ  ఏనాడూ ఏదీ చేసుకోగాగానీ, కొనుక్కోగాగానీ  చూసి ఎరగను. అందుకే  ఇవాళ ఆయన యాత్రలకి తీసుకుని వెళ్ళమని  కోరిన వెంటనే  ఆనందంగా  ఒప్పేసుకున్నాను.
‘నీకు ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పు నాన్నా’ అని ఆయన చూడాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలన్నీ అడిగి తెలుసుకున్నాను.
నాన్న కోరిక ప్రకారం యాత్రలకయ్యే ఖర్చు లెఖ్ఖలు వేయగా  నా  తాహతుకి  మించి వచ్చింది .  చేతిలో పైకం చూస్తే కొంచమే ఉంది. అయినా ఎలాగైనా సరే  ఆయన  కోరిక తీర్చాలని నిశ్చయించుకున్నాను.

ఆ రోజు నుండి సాయంకాలంపూట ఒక కొట్లో పద్దులు రాయడానికి కుదురుకున్నాను. ఇటు చంద్రిక కూడా ఇంట్లో అప్పడాలూ వడియాలు చేసి పదిళ్ళలో  అమ్ముతూ , పొదుపుగా ఉంటూ నాకు సాయపడసాగింది.

ఒక ఆరునెలలు గడిచేటప్పటికి యాత్రలకి సరిపడా డబ్బు కూడవేయగలిగాము. ఇంక ప్రయాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టడమే తరువాయి...... 

ఆనాడు ‘కుప్పనూర్పిళ్ళు జరుగుతున్నాయి కదా ఇంట్లో కూర్చుని కూర్చుని నాకేమీ తోచడంలేదు  నేను కూడా నీతో  పొలానికి వస్తానురా అబ్బాయీ’ అన్న నాన్న మాట కాదనలేక పోయాను.

అయితే దురదృష్టంకొద్దీ అక్కడ నాన్న హఠాత్తుగా మైకం కమ్మి పడిపోయి పక్షవాతంతో మంచాన పడటం జరిగిపోయింది.అయితే  కొంతలో కొంత అదృష్టం మరీ  స్పష్టంగా కాకపోయినా మాట మాత్రం మిగిలింది.

యాత్రలకని కూడబెట్టిన సొమ్ము  నాన్న వైద్యం కోసం ఖర్చైపోయింది.

పోనీలే డబ్బుదేముంది మళ్ళీ కూడ బెట్టి నాన్నకి   కొంచం నయమయ్యాక  కనీసం దగ్గరలోని ఒకటి రెండు పుణ్యక్షేత్రాలైనా  చూపిద్దామని ఆశపడ్డాను.

కానీ నాన్న  లేచి తిరగడానికి చాలా సమయం పట్టవచ్చని డాక్టర్ చెప్పిన మాట గుర్తుకువచ్చి  చెప్పలేని నిరాశకు లోనయ్యాను. అందుకే ఆయన మాటలకి  అంత దుఃఖం వచ్చింది  నాకు .....

కన్నీరు కారుస్తూ ఆలోచనలలో మునిగి ఉన్న నాకు  వెనుకనుండి భుజంపైన ఓదారుస్తున్నట్లుగా చంద్రిక చెయ్యి పడగానే దుఃఖం మరింత ఎక్కువై ఆమెను కౌగలించుకుని ఏడ్చేసాను.

గత కొన్ని నెలలుగా  నాన్న ఆరోగ్యం గురించి, ఆయన యాత్రల కోరిక తీర్చాలని నేను  పడుతున్న తాపత్రయం చూసిన చంద్రికకి కూడా , నేను  అలా పసివాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే, కన్నీరు ఆగలేదు.

ఇద్దరమూ  అలాగే చాలాసేపటివరకూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండిపోయాము.

‘యాత్రలు చేసి వస్తే పుణ్యం వస్తుందిటరా....నా కోరిక తీరకుండానే చనిపోతానేమోరా......’ అన్న నాన్నమాటలే పదే పదే చెవులలో మారుమ్రోగుతుంటే నేను అశాంతికి లోనవడం గమనించినట్లుంది చంద్రిక.

అందుకే ఒకనాడు  ‘దిగులు పడకండి మామయ్య ఆరోగ్యం కొంతైనా మెరుగయ్యాక ఆయనని యాత్రలకి తీసుకుని వెళ్ళడం గురించి ఆలోచిద్దాము’ అని   సర్దిచెప్పింది చంద్రిక.

‘అవును అలాగే చేద్దాము’  అన్నాను .

ఆరునలలు కావడంతో మళ్ళీ ఒకసారి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళి ‘డాక్టర్ ఇప్పుడు నాన్న ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది?’  అని అడిగాను.
‘బలహీనమైన ఆయన శరీరం వయోభారంవల్ల ఎక్కువ శ్రమను తట్టుకోలేకపోతోంది. ఈ మందులు క్రమం తప్పక వాడండి ’ అని బలానికి మందులు రాసిచ్చారు  డాక్టర్. 

నేను చంద్రిక అహర్నిశలు చేసిన సేవలకి నాన్న ఆరోగ్యం కొంచం కుదుట పడింది.

నాన్న వైద్య ఖర్చుల నిమిత్తమై సొమ్ము అవసరమై సాగు చేస్తున్న పొలంలో ఒక అర ఎకరం అమ్మేయవలసి వచ్చింది. కొన్నాళ్ళకి నాన్న ఆరోగ్యం కొంచంమెరుగు పడడంతో మళ్ళీ ఆయన  కోరిక ఎలా తీర్చాలా అన్న విషయం పైకి ఆలోచన మళ్ళింది నాకు .

‘నాన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి  ఆయనను ఎక్కువ  శ్రమకు గురిచెయ్యడం అంత మంచిది కాదు. పుణ్యం కోసం యాత్రలే చేయనక్కరలేదు. ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి.  కనుక పుణ్యం సంపాదించాలనే ఆయన కోరిక తీర్చడానికి నాకు ఒక ఆలోచన  తట్టింది’ చంద్రికతో అన్నాను.

‘ఏమిటది?’

నా ఆలోచన చంద్రికకి  చెప్పాను. కానీ అది అమలు పరచాలంటే బోలెడంత డబ్బు కావాలి అని ఇద్దరికీ తెలుసు. మిగిలిన అర ఎకరం  పొలం అమ్ముదామంటే  అదే మా   జీవనోపాధి  కనుక  అమ్మలేను. 

చంద్రిక కొంచం ఆలోచించి ‘ఏమండీ మన పెళ్ళి సమయంలో మా పుట్టింటివారు నాకు కానుకగా ఇచ్చిన  100 గజాల స్థలం, నగలు ఉన్నాయి కదా అవి  ఇప్పుడు  ఉపయోగించుకుందాము’ అంది

‘వద్దు వద్దు  చంద్రికా.  నీకు పుట్టింటివారిచ్చిన ఆస్తిని వాడడానికి  నామనసు ఒప్పుకోవడం లేదు’ అన్నాను

‘ఫరవాలేదండీ , ఆ దేవుడు దయజూస్తే  ఇంతకు రెండింతలు సమకూర్చుకుందాము.   ప్రస్తుతం మామయ్య కోరిక తీర్చడం మీకే కాదు నాకు కూడా ముఖ్యం.

అయినా మీరేమీ నన్ను ఇవ్వమని అడగలేదుగా ! నాకు నేనుగా ఇస్తున్నాను. కాబట్టి వేరే ఆలోచన పెట్టుకోకుండా ముందు మనం అనుకున్నది త్వరగా జరిగేలా చూడండి’ అంటూ నన్ను సమాధాన పరిచింది చంద్రిక.

‘నీదెంత మంచి మనసు చంద్రికా’ అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాను.

వెంటనే చంద్రిక సూచన మేరకు మా  ఆలోచనని అమలులో పెట్టాను.

ఆరునెలలు గడిచాయి......

ఆ రోజు విజయదశమి. ఉదయం స్నానపానాలయ్యాక ఒక చక్రాల కుర్చీ తెచ్చి నాన్నని  నెమ్మదిగా చేతులలో ఎత్తుకుని  అందులో కూర్చోబెట్టి

‘నాన్నా! పద ఇవాళ నిన్ను అలా బయటకి షికారు తీసుకెళతాను’  అని ‘చంద్రికా నువ్వు కూడా తయారవ్వు’  ఆమెకు వంటగదిలోకి వినపడేలా అరిచి చెప్పాను.

‘ఆ  ఆ  అలాగే!’ అక్కడినుండే బదులిచ్చింది  చంద్రిక. 

ఎన్నడూ లేనిది ఇవాళ నేనూ చంద్రికా ఒకటే హడావిడి చేయడం ఏమిటో, ఆయనను  బయటకి తీసుకెళ్ళడమెందుకో నాన్నకు ఒక పట్టాన  అంతు పట్టలేదు.

అందుకే ‘నేనెందుకురా అబ్బాయీ నువ్వూ కోడలూ సరదాగా వెళ్ళి రండి’ అని నాన్న అభ్యంతరం చెప్పబోయాడు  కానీ నేను  ససేమిరా అనడంతో మరి మాట్లాడలేదు.

ముగ్గురం కలిసి సుమారు 100 గజాల స్థలంలో  కొత్తగా కట్టిన చిన్న పెంకుటిల్లు దగ్గరికి వచ్చాము. ఆ పరిసరాలు చిరపరిచితంగా అనిపించి వెంటనే గుర్తుకువచ్చిందేమో అది  తన కోడలు చంద్రిక కి పుట్టింటి వారు కానుకగా ఇచ్చిన స్థలమని అందుకే ‘‘ఇదేమిటీ?’ అన్నట్లుగా మా ఇద్దరివైపూ  ప్రశ్నార్థకంగా చూశాడు నాన్న.

సమాధానంగా  ఇద్దరం చిరునవ్వు నవ్వాము. 

ఆ ఇంటి గేటుకి  ‘సోమయ్య నివాసం’ అని వ్రాసి ఉన్న బోర్డు వ్రేలాడేసి  ఉంది. నాన్నకి చదువురాదు కనుక  అక్కడ రాసి ఉన్నది చదవలేకపోయాడు. ఆయనను  ఇంటి లోపలికి తీసుకునివచ్చాము .

అదే సమయంలో  నాన్న దృష్టి క్షణకాలంపాటు కేవలం పసుపుతాడుతో బోసిగా ఉన్న చంద్రిక  మెడపైన నిలవడం నా దృష్టిని దాటిపోలేదు. 
ఎప్పుడూ ఒంటిపేట చంద్రహారంతో నిండుగా ఉండే కోడలి మెడలో కేవలం పసుపుతాడు మాత్రమే ఉండడం చూసిన ఆయనకు విషయం కొంతవరకు అర్థమయ్యిందనుకుంటాను!  అది  ఆయనకు బాధ కలిగించిందని ఆయన నాకేసి చూసిన చూపులే తెలిపాయి.

అప్పటికే ఆ గ్రామంలోని పెద్దలు, నాన్న  స్నేహితులూ అందరూ అక్కడ కూడి ఉన్నారు. అందరికీ నాన్న యాత్రలకి వెళ్ళాలనుకోవడం... తదితర విషయాలన్నీ తెలుసును.  వాళ్ళందరినీ చూసి నాన్నకి   ఆనందం ఆశ్చర్యం కలిగాయి.

అందరూ గబ గబా నాన్నని  చుట్టుముట్టి ‘నువ్వెంత అదృష్టవంతుడివి సోమయ్యా! నీ కొడుకు కోడలు  ఈ ఇల్లు  కట్టించి దానికి నీ పేరు పెట్టారు. అంతేకాదు నీ పేరు  మీద రోజూ కనీసం అయిదుమంది అనాథలకి  ఉచితంగా భోజనం పెట్టేలా ఏర్పాటుచేసారు కూడా ! ఈవిధంగా నీ కోరిక తీర్చి నీకు బోలెడంత  పుణ్యంకూడా దక్కేలాచేసాడు నీ కొడుకు. ఇంతకంటే ఏ తండ్రికైనా ఏం కావాలి చెప్పు’ అంటూ పొగడ్తలతో  ముంచెత్తారు.

ఆశ్చర్యంగా చూస్తున్న నాన్నకు , ఇదంతా అయ్యేవరకూ ఈ విషయం  తన తండ్రి దగ్గర గోప్యంగా ఉంచమని రంగడు తమని ప్రాధేయపడ్డాడని  చెప్పారు స్నేహితులు.  

యాత్రలు చేసి పుణ్యం సంపాదించుకోవాలని ఉందని కోరితే ఎలాగైనా తన కోరిక తీర్చాలని నిశ్చయించుకుని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా  ఈ రూపంగా  తన కోరిక తీర్చిన కొడుకునైన నన్ను ,  పుట్టింటివారిచ్చిన ఆస్తిని సంతోషంగా  ఇచ్చి  నాకు  అన్ని విధాలా సహకరించిన చంద్రికనూ పదుగురి ఎదుటా వేనోళ్ళ పొగిడి మమ్మల్ని అక్కున చేర్చుకుని  ఆనందభాష్పాలు రాల్చాడు నాన్న.
నాన్న ముఖంలో అంతులేని సంతోషం చూసి ‘నాన్న కోరిక’ తీర్చగలిగామన్న  తృప్తి మా మనసులలో నిండిపోగా ఆనాటి  భోజనం  ఏర్పాట్లు చూడడానికని అటుగా కదిలాము నేనూ చంద్రికా.                  


                     

 

మరిన్ని కథలు
siksha