Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue271/720/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి).... శరణ్య, తేజ, అనిరుద్ సుశీల ఇంట్లో కూర్చున్నారు. సుశీల ఆమె భర్త ఒక సోఫాలో కూర్చున్నారు. సమయం ఐదున్నర కావస్తోంది. భార్యా భర్తలిద్దరూ ఆఫీస్ కి లీవు పెట్టి శరణ్య కోసం ఎదురు చూస్తున్నారు. శరణ్య తో పాటు ఆమె భర్త మూడో వ్యక్తీ రావడంతో కొంచెం రమణ ఖంగు తిన్నట్టు అనిపించింది. సుశీల మాత్రం ఆదరంగా ఆహ్వానించింది. పరస్పర పరిచయాలు, కుశల ప్రశ్నలు అయాక గాయత్రి ఎలా వెళ్ళి పోయింది చెప్పింది సుశీల.

గాయత్రి తన ఇంట్లో పది వేల రూపాయలు తీసుకుని తన భర్త ఆఫీస్ నుంచి వచ్చే సరికి ఇంట్లోంచి పారి పోయిందని, అతను ఆఫీస్ నుంచి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు, బీరువా తలుపు తెరచి ఉందని, వెంటనే తనకి ఫోన్ చేసాడని, తను మరునాడు ఉదయం వచ్చానని, పోలీస్ రిపోర్ట్ ఇస్తే శరణ్య పరువు పోతుందేమో అని ఇవ్వ లేదని, అందుకే శరణ్యకే ఫోన్ చేసానని కధలుగా చెప్పింది.

ఏ బీరువా లోంచి తీసిందని అనుకుంటున్నారో ఆ బీరువా,  వాళ్ళింటికి, గాయత్రి పోర్షన్ కి మధ్యలో ఉన్న తలుపు, గాయత్రి ఉన్న పోర్షన్ చూపించింది. గాయత్రి కొన్ని ముఖ్యమైన సామాను తీసుకుని కొన్ని వదిలేసింది. ఇల్లంతా చిందర వందర గా ఉంది. గది మధ్యలో చీపురు కట్ట పడి ఉంది.

తేజ శరణ్య మొహం లోకి ప్రశ్నార్ధకంగా చూసాడు. చీపురు కళ్ళ సైగలతో చూపించాడు. శరణ్య తల పంకించి వంగి చీపురు తీసి గోడకి పెట్టింది. కొన్ని పుల్లలు కింద పడి  ఉన్నాయి.

అక్కడి నుంచి మళ్ళి సుశీల పోర్షన్ లోకి వెళ్లి రమణ మొహంలోకి చూస్తూ అడిగింది “ఆ రోజు మీరు ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకి వచ్చారు..”
రమణ కొంచెం తడబడి “ఆ రోజు బాగా లేట్ అయింది మేడం ... మీరు రాలేదు కదా ఏ క్షణాన అయినా వస్తారని ఆరున్నర వరకూ  ఎదురు చూస్తూ ఆఫీసులోనే ఉన్నాం నేను సూపరింటెండెంట్ గారు ... ఆరున్నరకి బయలు దేరి ఇంటికి వచ్చే సరికి నాకు వణుకు వచ్చింది.. ఎం చేయాలో తెలియక చాలా సేపు నిస్త్రాణగా కూర్చుని అప్పుడు సుశీలకి ఫోన్ చేసాను. అందుకే సుశీల మర్నాడు వచ్చింది.. లేక పోతె వెంటనే బయలు దేరి వచ్చేది” అన్నాడు.

శరణ్య, తేజ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అనిరుద్ నిటారుగా ఉన్నవాడు కొంచెం కదిలి అసహనం ప్రదర్శించాడు.

సుశీల లేచి “కాఫీ తెస్తాను మేడం”  అంటూ కిచెన్ వైపు వెళ్లబోతుంటే “వద్దండి.. ఇప్పుడేం వద్దు.. తేజకి అర్జెంటు పని ఉంది మేము వెళ్ళాలి” అంటూ తను లేచి తేజ, అనిరుద్  వైపు చూసింది..

అనిరుద్ లేస్తూ “ పోలీస్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా ఇలా వదిలేస్తే ఇంకా ఏమేం తప్పులు చేసి నీ పరువు తీస్తుందో” అన్నాడు.

శరణ్య అవును అన్నట్టు తల పంకించి “ముందు నేను ఎస్ ఐ తో మాట్లాడతా.. తరవాత మీకు ఫోన్ చేస్తా స్టేషన్ కి వద్దురు గాని” అని సుశీలకి చెప్పి బయలు దేరింది.

కారులో కూర్చున్నాక డ్రైవర్ కి చెప్పింది “ఆఫీస్ కి పోనీ ...”

“అలాగే మేడం” అన్నాడు డ్రైవర్.

“వాళ్ళ మాటలు నమ్మేలా లేవు ఏదో దాస్తున్నారు ఇద్దరూ ... ఏదో జరిగిందనిపిస్తోంది” అన్నాడు తేజ.

“నాకూ అలాగే అనిపిస్తోంది అందుకే పోలీస్ రిపోర్ట్ అన్నాను” అన్నాడు అనిరుద్.

“పది నిమిషాల్లో తెలుస్తుంది వాళ్ళు చెప్పేది ఎంత నిజమో”  అంది శరణ్య. కారు ఆఫీస్ ప్రాంగణం లోకి రాగానే బంట్రోతు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసాడు. శరణ్య నేరుగా తన ఛాంబర్ కి వెళ్ళింది.. తేజ, అనిరుద్ ఆఫీస్ అంతా పరికిస్తూ ఆమె వెనకాల వెళ్లారు.
అప్పటికి స్టాఫ్ అందరూ వెళ్ళి పోయారు. అకౌంటెంట్, సూపరింటెండెంట్ మాత్రం అప్పుడే సర్దుకుంటున్నారు వెళ్ళడానికి. శరణ్యని చూడగానే ఆవిడ ఆ సమయంలో రావడంతో కంగారు పడుతూ వచ్చారు.

కాసేపు వాళ్లతో పెండింగ్ వర్క్స్ గురించి చర్చించి, కాజువల్ గా అడిగినట్టు అడిగింది “ అందరూ ఆఫీసుకి సరిగా వస్తున్నారా.  కాజువల్ లీవ్ పెట్టిన వాళ్ళవి రిజిస్టర్ లో రికార్డ్ చేస్తున్నారా. ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్ , లీవు రిజిస్టర్ లు తీసుకు రండి” అంది సూపరింటెండెంట్ తో.
అంతకు ముందు ఫ్రెంచ్ లీవులు, పర్మిషన్ లు అడ్డు అదుపు లేకుండా ఉండేవి.. అవన్నీ కట్ చేసి స్ట్రిక్ట్ చేసింది శరణ్య.. ప్రతి కాజువల్ లీవు రికార్డ్ అవాలి.. అత్యవసరం అయితే తప్ప పర్మిషన్ లు ఇవ్వ కూడదు. ఫ్రెంచ్ లీవు ప్రశ్నే లేదు.

అతను వేగంగా వెళ్లి రిజిస్టర్ల తో వచ్చాడు.

శరణ్య అటెండెన్స్ రిజిస్టర్  తీసుకుని రమణ పేరు ఉన్న దగ్గర చూసింది. 

మూడు రోజుల క్రితం అంటే సోమవారం అతని సంతకం లేదు. మిగతా అందరి సంతకాలు ఉన్నాయి.

“సోమ వారం రమణ గారు రాలేదా” అడిగింది.

సోమ వారం ... అతను గుర్తు చేసుకుంటున్నట్టు ఆలోచిస్తుంటే అకౌంటెంట్ అన్నాడు “అవును రాలేదు తల నొప్పిగా ఉందని ఫోన్ చేసాడు నేనే మాట్లాడాను.”

ఐసి అంటూ రిజిస్టర్ లు ఒక సారి తిరగేసి వాళ్ళ వైపు జరిపి లీవు “లెటర్ ఇచ్చారా” అడిగింది.

“లేదు మేడం తీసుకుంటాను” నమ్రతగా అన్నాడు సూపరింటెండెంట్. కొన్ని ఫైల్స్ చూసి, సంతకాలు పెట్టి ఇచ్చేసి “నేను నెక్స్ట్ మండే వస్తాను” అంటూ లేచింది.

అప్పటి దాకా శరణ్య అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ముగ్ధులై చూస్తున్న తేజ, అనిరుద్ ఆమెని అనుసరించారు.

కారులో కూర్చున్నాక అంది శరణ్య.. “రమణ పెద్దవాడు.. నెమ్మది మనిషి .. కానీ ఏదో అబద్ధం మాత్రం చెప్తున్నాడు. ఏమై  ఉంటుందో తెలియడం లేదు. ఆ రోజు అంటే గాయత్రి వెళ్ళి పోయిన రోజు అతను లీవ్ పెట్టాడు. ఇంట్లో ఉన్నాడో , ఎక్కడికైనా వెళ్ళాడో, ఎం జరిగిందో ఈ అమ్మాయి కనిపిస్తే కాని చెప్ప లేను.. ముందు గాయత్రి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి . ఒక్క సారి అంగన్ వాడికి వెళ్దాము”. అప్పుడే ఆవిడ ఫోన్ మోగింది. శరణ్య అన్సరింగ్ బటన్ నొక్కింది.

అవతలి నుంచి “ అమ్మా నమస్కారం ...నేను కనక దుర్గమ్మ వారి దేవాలయం ఆఫీస్ ఇన్ చార్జి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను” అని వినిపించింది.

“నమస్కారమండి చెప్పండి” అంది శరణ్య.

“ అమ్మా ఇక్కడ ఒకమ్మాయి వచ్చింది అని  ఒక్క నిమిషం అంటూ  ఆగి అవతల ఎవరినో నీ పేరేంటి అని అడిగాడు.. మళ్ళి శరణ్యతో గాయత్రిట మూడు రోజుల నుంచి ఈ దేవాలయంలో అటూ, ఇటూ తిరుగుతూ తల దాచుకుంది. మీ దగ్గరకు తీసుకు వెళ్ళమని అడుగుతోంది” అన్నాడు.

శరణ్య ఒక్కసారి గట్టిగా “గాయత్రా.” అంది

“అవునమ్మా చేతిలో పిల్లవాడు ఉన్నాడు” అన్నాడు అతను.

శరణ్య తేజ వైపు చూసి “గాయత్రి దొరికింది” అని “అక్కడే ఉండమనండి నేను వస్తున్నాను” అంది. డ్రైవర్ కి విజయవాడ పోనీ అని చెప్పి తేజా వైపు చూసింది.

శరణ్య గాయత్రిని కలుస్తుందా.. గాయత్రి రమణ చేసిన అఘాయిత్యాన్ని శరణ్యకు చెప్తుందా....   తెలుసుకోవాలంటే వచ్చేశుక్ర వారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే.. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana