Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adrshyashakti

ఈ సంచికలో >> కథలు >> నాన్న

nanna

“నాన్నా.....” కాస్త నసుగుతూ పిలిచాడు వెంకటేష్

“ఏంటో చెప్పరా! .....”  అన్నాడు చలపతి పేపర్ తిరగేస్తూ.

“నాన్నా... ఖర్చులు పెరిగాయి, కాస్త మీ పెన్షన్ లో నుంచి నెల నెల డబ్బులు సర్ద గలరా?” అని అడిగాడు వెంకటేష్.

“ఒరేయ్, నీవు సంపాదించ లేని టైములో నేను నిన్ను కష్టపడి చదివించి సమర్థుడిని చేశాను, కాబట్టి ఇప్పుడు నన్ను పోషించడం నీ బాధ్యతే కాదు చట్టం కూడా.  కాదు అంటావా, చెప్పు...వెళ్లి ఫ్యామిలీ కోర్ట్ లో నన్ను బాగా చూసుకోవడం లేదని కంప్లైంట్ ఇస్తాను “  అన్నాడు చలపతి.

“అంత వరకు ఎందుకులే నాన్న, మీరు మీ పెన్షన్ డబ్బులు ఇవ్వనవసరం లేదు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను” అని అక్కడి నుంచి వెళ్ళి పోయాడు వెంకటేష్.

“అదేంటండీ మీ నాన్న అలా మాట్లడతాడు, కనీసం కొడుకుకు సాయం చేద్దామన్న మనసు లేదు, వెంటనే ఇల్లు వదిలి వెళ్లి ఏదన్నా ఒల్దేజ్ హోంలో చేరమని చెప్పండి, మనకు కాస్తైన భారం తగ్గుతుంది ” అంది వెంకటేష్ బార్య మధుమతి.

“అబ్బా! ఆయన సంగతి నీకు తెలియదే, మనం అలా అన్నామని వెళ్లి ఫ్యామిలీ కోర్ట్ లో కంప్లైంట్ చేసాడంటే నా పని గోవింద. గతంలో నా సైకిల్ పోయినందుకు అయన చేసిన గలాభాకు భయ పడి చివరకు ఎస్ ఐ కొత్త సైకిల్ తన సొంత డబ్బులతో కొని ఇచ్చాడు తెలుసా, అందుకనే మనం అయన విషయంలో నోరు మూసుకొని వుండడం మంచిది” అన్నాడు వెంకటేష్ మధుమతితో.

***********

“ఇక్కడ చలపతి ఎవరు?” అడిగాడు అటెండర్.

“నేనే” అన్నారు తాత, మనవడు ఒకేసారి.

“అదేంటి ?” అన్నాడు అటెండర్ ఆశ్చరంగా.

“బాబు వీడు నా  మనవడు, తాత పేరే మనవడికి  పెట్టు కోవడం మా ఆచారం, మీరు కంగారు పడకండి” అన్నాడు పెద్ద చలపతి.
“సరే గాని ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు వెళ్ళండి” అని చెప్పి అటెండర్ వెళ్ళి పోయాడు.

“చూడండి, మా రూల్స్ అన్ని ముందే చెప్పాను కదా, మీకు సమ్మతమైతే వెళ్లి రూములు చూసుకోండి అడ్మిషన్ ఇచ్చేస్తా, అలాగే ఈ అథారిటీ లెటర్ లో సంతకం చేసిన వాళ్లనే లోపలికి పంపిస్తాం. దీన్ని మీకు కావలసిన వాళ్ళతో సంతకం చేయించి తీసుకొని రండి” అని ఫార్మ్స్ ఇచ్చింది ప్రిన్సిపాల్.

ఫార్మ్స్ తీసుకోని తాత, మనవడు అక్కడి నుచి బయలుదేరి వెళ్ళి పోయారు.

***********

“నాన్నా మీరు నిన్న రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళారా?” అడిగాడు వెంకటేష్.

“అవును, అయితే ఏంటి? “ అన్నాడు చలపతి నిర్లక్ష్యంగా.

“నాన్న మీరు నాకు ఆర్థిక సాయం చేయక పోయినా పరవా లేదు, కాని మీరు చేసే ఇలాంటి పనుల వల్ల మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది” అన్నాడు వెంకటేష్ కాస్త కోపంగా

“అయినా ఆయనతో మాటలెందుకు, ఈ తతంగం అంతా చూస్తుంటే ఈయన గారికి ఇంకో మకాం వున్నట్టుంది, అందుకే పెన్షన్ డబ్బులు కూడా మనకు ఇవ్వకుండా, అక్కడ ఇస్తున్నాడు. మిగిలిన పొలమో పుట్రనో వాళ్ళకెవరికో రాసివ్వడానికి రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లి మన కంట పడ్డాడు” అంది మధుమతి.

“చెప్పు నాన్న మీ కోడలు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వు “ అన్నాడు వెంకటేష్  పెద్ద చలపతి మాత్రం తనకేమి పట్టనట్లు పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు.

“అదిగో చూసారా బండారం బయట పడే సరికి రెండో ఇంటికి పోవడానికి సిద్దం అవుతున్నాడు” అంది మధుమతి కోపంగా ఈ తతంగాన్ని చూస్తున్న వెంకటేష్ కొడుకు చిన్న చలపతి “నాన్న ఇంక చాలు ఆపండి, తాతయ్య గురించి ఇంకొక్క మాట అన్నా బాగుండదు, అయన గురించి మీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు. అన్ని విషయాలు నాకు తెలుసు, ఇన్నాళ్ళు తాతయ్య చెప్పొద్దంటే ఆగి పోయాను.”
అయన నెల నెల పెన్షన్ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా ఆ డబ్బులను పోగేసి మన కోసం ఒక ఫ్లాట్ కొన్నాడు, ఆరోజు రిజిస్ట్రేషన్ కోసమే రిజిస్టర్ ఆఫిసకు వెళ్ళాడు. ఫ్లాట్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ పేరు మీద వీలునామా వ్రాసాడు.  అంతే కాదు ఆయన మీరు కోరుకున్నట్లే ఓల్డ్ ఏజ్ హోంలో చేరుతున్నాడు” అన్నాడు ఆవేశంగా.

“బాబూ చలపతీ! ఎందుకు నాన్నా అంత ఆవేశం, ఇప్పుడేమైందని” అంటూ చిన్న చలపతిని ఓదార్చాడు పెద్ద చలపతి. “చూడు బాబు నేను నెల నెలా నీకు డబ్బులు ఇవ్వడం లేదని భాద పడుతున్నావు కదా అందుకే నీకు కొంచెమైనా ఆర్థిక భారం తగ్గించడానికే ఈ ఫ్లాట్ కొన్నాను.ఆ ఫ్లాట్ మీ ఆఫీసుకు చాల దగ్గర. ఈ ఫ్లాట్ వల్ల నీకు నెల నెల అద్దె ఖర్చు మిగులుతుంది, పైగా ఆఫీస్ దగ్గరే కాబట్టి బండి పెట్రోల్ ఖర్చు కూడా ఆదాయే కదా. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఎటు ఓల్డ్ ఏజ్ హోంలో చేరుతున్నకదా నా ఖర్చు పూర్తిగా మిగులే, చూసావా నీకు ఎన్ని లాభాలో”  అంటూ వీలునామా కాగితాలు వెంకటేష్ చేతిలో పెట్టి, బాబు అందులోనే అథారిటి లెటర్ వుంది నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే........ చూడాలనిపిస్తేనే ఓల్డ్ ఏజ్ హోంకి రా “ అంటూ వెంకటేష్ భుజం తట్టి అప్పటికే సర్డుకొని వున్న పెట్టె తీసుకొని ఓల్డ్ ఏజ్ హోం కు బయలు దేరాడు పెద్ద చలపతి. 

ఇన్నాళ్ళ పెంపకంలో తండ్రిని అర్థం చేసుకోనందుకు నిశ్చేష్టుడై నిలుచుండి పోయాడు వెంకటేష్.

మరిన్ని కథలు