Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue273/723/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)...‘‘అన్నా....అన్నా....ఇప్పుడు....ఇప్పుడు అమ్మ గారెక్కడున్నారన్నా?....’’వార్డు బోయ్‌ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అడిగాడు రాము.

‘‘ఎక్కడుంటారో నాకు తెలీదురా!....కానీ....కానీ....నాకో ఫోన్‌ నెంబరు ఇచ్చింది. నువ్వు వస్తే ఫోన్‌ చెయ్యమని ఇచ్చిందావిడ.’’ అంటూ ఫోన్‌ నెంబర్‌ కోసం జేబులో నుండి సెల్‌ తీసాడు వార్డు బోయ్‌.

‘‘ఇంకా ఏం చెప్పారన్నా?’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘ఆమె చెప్పిందంతా రామూ కి చెప్పాలా? వద్దా? వీడి దగ్గరున్న పాతిక వేలు అబద్ధం చెప్పి లాగేసుకుంటేనో. ఏ.టి.ఎమ్‌ కార్డు కూడా వీడి దగ్గరే ఉంటుంది. అది కూడా లాగేసుకుంటేనో?!

ఆలోచనలతో సతమతమవుతూ రాము కేసి పరీక్షగా చూసాడు వార్డు బోయ్‌.

‘‘ఏంటన్నా అలా చూస్తున్నావ్‌! అమ్మ గారేం చెప్పారో చెప్పన్నా?’’ ఆతృతగా అడిగాడు రాము.

ఇంతలో నర్సు పరుగున అక్కడకు వచ్చింది.

‘‘డాక్టర్సు రౌండ్స్‌కి వస్తున్నారు. బి అలర్ట్‌....’’ అంటూ అంతే వేగంగా మరో వార్డు కేసి పరిగెట్టింది నర్సు. ఆమె వెనుకే బిలబిలమంటూ వచ్చిన నలుగురైదుగురు నర్సులు ఎవరి వార్డు ల్లోకి వాళ్ళు పరుగులు పెడుతున్నారు.

‘‘నువ్విక్కడే ఉండరా! నేను వార్డులో ఉండాలి.’’ అంటూ వార్డు బోయ్‌ కూడా ఎమర్జెన్సీ వార్డు లోకి పరుగందుకున్నాడు.

సరిగ్గా అదే సమయంలో..............

హాస్పిటల్‌ సూపరిండెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ హుందాగా మెళ్ళో స్టెతస్కోప్‌ వేసుకుని చక చకా ముందుకు నడుస్తుంటే ఆయనకి అటూ ఇటూ పది మంది డాక్టర్లు అంతే వేగంతో అనుసరిస్తూ ఆయన చెప్పింది వింటూ వార్డు కేసి వస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు దగ్గరకొచ్చి ఆగారు.
వార్డు బోయ్‌ వినయంగా డోర్‌ తెరిచి పట్టుకున్నాడు.

కే. జి. హెచ్‌. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ తో పాటు మిగతా డాక్టర్లంతా ఎమర్జెన్సీ వార్డు లోకి అడుగు పెట్టాడు. అప్పటికే ఇద్దరు నర్సులు ఎమర్జెన్సీ వార్డులో సిద్ధంగా ఉన్నారు.

ఎమర్జెన్సీ వార్డు బయట వరండాలో బెంచీ మీద కూర్చున్న రాము ఆతృతగా అంతా గమనిస్తూ కూర్చున్నాడు.

‘దేవుడా! మా సోమూ గాడు కళ్ళు తెరిచి నాతో నవ్వుతూ మాట్లాడేలా చెయ్యి స్వామీ!’ మనసు లోనే సింహాద్రి అప్పన్నకు మొక్కుకున్నాడు రాము.

అదే క్షణంలో...

డాక్టర్లంతా సోము మంచం చుట్టూ మూగి పరీక్షిస్తూ నిలబడ్డారు. సోము ‘కేస్‌ షీట్‌’ చూస్తున్న సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ భృకుటి ముడి పడింది.

‘‘వ్వాట్‌?’’ ఆందోళనగా అరిచాడు డాక్టర్‌ రామ్‌ కుమార్‌.

జూనియర్‌ డాక్టర్లంతా ఆయన కేసి ఆశ్చర్యంగా చూస్తూండి పోయారు.

****************

రామకృష్ణా బీచ్‌

ఆమె బస్సు ఎక్కి వెళ్ళి పోగానే పళ్ళు పట పటా కొరుక్కున్నాడతను. పరుగెత్తినా బస్సు అందుకో లేక పోయాడు.

‘ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడని వెదకాలి? ఎటు వెళ్తోంది ఆమె? తన యజమానికైతే వాగ్ధానం చేసాడు. ఆమెను చంపే మీ దగ్గరకొస్తానని ఆవేశంగా అరిచాడు. కానీ, ఇప్పుడెటని వెళ్ళాలి. ఆ బస్సు నేరుగా సింహాచలం వైపే వెళ్తుంది. ఆమె తిరిగి సింహాచలం చేరుకుంటుందా?
ఆలోచిస్తూనే సెల్‌ తీసి వన్‌ నెంబర్‌ నొక్కాడు. స్పీడ్‌ డయల్‌. అంతే! ఎవరికో రింగ్‌ వెళ్తోంది.

‘‘ఏరా రంగా!.... ఏమైంది?’’ ఆతృతగా అడుగుతున్నారెవరో.

‘‘అన్నా!  నువ్వెక్కడున్నావు?’’ అడిగాడతను.

‘‘జగదాంబ థియేటర్‌ దగ్గర పడిగాపులు పడుతున్నాను.’’

‘‘నాకు అదిక్కడ రామకృష్ణా బీచ్‌లో కనిపించింది.’’

‘‘ఆ! కనిపించిందా?! కడతేర్చేసావా?’’ ఆనందంగా అట్నుంచి అడిగాడు ఆగంతకుడు.

‘‘అదును కోసం చూసానన్నా ఇంతలో అది తప్పించుకుందన్నా.’’ నీళ్ళు నములుతూ చెప్పాడు రంగా.

‘‘అదునెందుకురా! అవకాశం దొరికాక ఎవరైనా మీన మేషాలు లెక్కిస్తారా? మనం కిరాయి హంతకులం. మనకి ముహూర్తాలు...షరతులేంట్రా రంగా! నీకు మతి పోయిందా?’’ అట్నుండి అరిచాడతను.

‘‘అన్నా! అయి పోయింది. తప్పయి పోయింది. అదిప్పుడు సింహాచలం బస్సు ఎక్కింది. జస్ట్‌ మిస్‌!....ఏం చెయ్యాలో అర్థం కాక నీకు ఫోన్‌ చేసాను.’’ అన్నాడు రంగా.

‘‘ఏం చేద్దాం? అక్కడేదన్నా బస్సు రెడీగా ఉంటే ఎక్కెయ్యి. ఆమె ఎక్కిన బస్సు సింహాచలం వెళ్తుంది నిజమే! కానీ, ఆమె మధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరో...రైల్వే స్టేషర్‌ దగ్గరో దిగేస్తే....?!’’ అవతల నుండి అతనన్నాడు.

‘‘మధ్యలో ఎందుకు దిగుతుందన్నా? అయినా ఇక్కడే...ఈ ప్రదేశాల్లోనే ఎందుకు దిగుతుంది? మరెక్కడన్నా దిగొచ్చు కదా?’’ అయోమయంగా అన్నాడు రంగా.

‘‘ఓరి వెంగళప్పా! ఇప్పుడు టైమ్‌ ఎంతయింది. రాత్రి పది దాటి పోతోంది. ఈ రాత్రికి ఆమె ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలంటే ఆమెకి అనువుగా ఉండేవి ఈ రెండు ప్రదేశాలే.’’ అన్నాడు అవతలి వ్యక్తి.

‘‘అన్నా....సింహాచలం వెళ్లదంటావా?’’ అనుమానంగా అన్నాడు రంగా.

‘‘వెళ్లినా వెళ్ళొచ్చు. మనం ముందు ఈ రెండు చోట్ల క్షుణ్ణంగా వెదుకుదాం. ఇక్కడ దొరక్క పోతే అక్కడికే వెళ్తుంది. అట్నుంచి అలా వెళ్దాం.’’ స్థిరంగా అన్నాడు అవతలి వ్యక్తి.

‘‘అన్నా! నువ్వు గ్రేటన్నా! నేను ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర దిగి వెతుకుతాను. నువ్వు....’’ అంటుండగానే అవత వ్యక్తి హుషారుగా ‘‘నేను రైల్వే స్టేషన్‌ దగ్గరకు వెళ్తాను. డన్‌!’’ అంటూనే ఫోన్‌ కట్‌ చేసాడు.

రంగా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఈ రోజు  ఈ రాత్రి ఎలాగైనా ‘ఆమె’ని హతమార్చాలి. స్థిరంగా అనుకుని రామకృష్ణా బీచ్‌ బస్సు ప్టాప్‌ లో నిలబడ్డాడు కసాయి గూండా రంగా.

*************

డాక్టర్లంతా వార్డు లోకి వెళ్లడం చూసిన రాము ఆందోళనతో బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాడు. వార్డు బోయ్‌ కూడా లోపలే ఉన్నాడు. లోపల ఏం జరుగుతోందో తెలీక గుండెలు అర చేత్తో పట్టుకు కూర్చున్నాడు రాము.

‘‘వ్వాట్‌?! ఈ కుర్రాడికి ఇప్పటికే తెలివి రావాలే! ఇంకా రాలేదంటే ఆశ్చర్యంగా వుంది. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది కదా!’’ కేస్‌ షీట్‌ చూస్తూ అసహనంగా అన్నాడు సూపరింటెండెంట్‌ రామ్‌ కుమార్‌.

‘‘సార్‌! డాక్టరు గారు రాసిన మందులన్నీ టైమ్‌ ప్రకారం ఇస్తున్నాం సార్‌!’’ నర్సు వినయంగా చెప్పింది.

‘‘నర్స్‌! వెంటనే ఈ ఇంజక్షన్‌ చెయ్యండి. అర గంటలో మెలకువ రావాలి. లేదా? పేషెంట్‌ కోమాలోకి వెళ్లి పోయే అవకాశం ఉంది. క్విక్‌.’’ అంటూ కేస్‌ షీట్‌లో ఇంజక్షన్‌ పేరు రాసి ఆ తర్వాత వాడాల్సిన మందులు కూడా రాసి నర్సు చేతికిచ్చాడు డాక్టర్‌ రామ్‌ కుమార్‌.

డాక్టర్‌ చెప్పినట్టే పరుగున వెళ్లి సిరంజితో వచ్చింది నర్సు. సోముకి ఇంజక్షన్‌ చేసాక మిగతా పేషెంట్లను చెక్‌ చేస్తూ ఎమర్జెన్సీ వార్డు లో నుండి మరో వార్డు లోకి వెళ్లి పోయారు డాక్టర్లందరూ.

‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది నర్సు. వార్డు బోయ్‌ బయటకు వచ్చి రాము ప్రక్కనే కూర్చున్నాడు.

‘‘అన్నా! మా సోముకి ఎలా ఉందన్నా?’’ ఆతృతగా అడిగాడు రాము.

‘‘మీ వాడి సంగతేమో గాని....మాకైతే గుండెలు జారి పోయాయిరా నాయనా! పెద్ద డాక్టర్‌ అందర్నీ అదర గొట్టి ఒదిలేసాడ్రా! అర గంటలో మీ వాడికి తెలివొస్తుంది. రావాలి.’’ రాము భుజం మీద చెయ్యేసి చెప్పాడు వార్డు బోయ్‌.

‘‘నిజమా అన్నా!’’ ఆనందంగా అన్నాడు రాము.

‘‘అవునొరేయ్‌! అంత డబ్బు ఎక్కడ దాచావురా? చూస్తుంటే చొక్కా చిరిగి పోయి ఉంది. ఫేంటు చూస్తే ఓ కాలు పొట్టి ఓ కాలు పొడవు దేనికీ జేఋన్నట్టు లేదు.’’ రాము ఒళ్ళంతా తడమ బోతూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అన్నా....అన్నా...ఊరుకో అన్నా!’’ అంటూ దూరంగా జరిగాడు రాము.

రాముని ఆపాద మస్తకం చూస్తూ కూర్చున్నాడు వార్డు బోయ్‌.

ఈ గుంటడ్ని మోసం చెయ్యడం చాలా కష్టం. ఏం చెప్పినా నమ్మడు. ఆవిడ చెప్పినట్టు చెప్తే గాని దారికి వచ్చేలా లేడు. దేశ ముదురు గాడిలా ఉన్నాడు’ అనుకున్నాడు వార్డు బోయ్‌.

‘‘ఏంటన్నా! అలా చూస్తున్నావ్‌!’’ వార్డు బోయ్‌ తననే పరీక్షగా చూస్తుంటే ఆడపిల్లలా సిగ్గు పడుతూ అన్నాడు రాము.

‘‘నీకో నిజం చెప్పాల్రా! చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. చెప్తే నాకేటి లాభమా అని’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అన్నోయ్‌! ఏం చెప్పకన్నాయ్‌ నాకు భయంగా వుంది. ముందు మా సోము గాడికి ఎలా వుందో చెప్పన్నా’’ మనసు ఏదో కీడు శంకించే సరికి భయంగా అన్నాడు రాము.

‘‘ఛ! ఛ! అదేం కాదురా! మీ సోము గాడి విషయం కాదు. వేరే ఇంకోటి. నీకు లాభం...నాకు నష్టం. ఏం చేద్దాం! చెప్పమంటావా?! వద్దంటావా?!’’ గమ్మత్తుగా రాము కేసి చూస్తూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘లాభమా? నాకా?...చెప్పన్నా....చెప్పన్నా....చెప్పు!’’ ఆతృతగా వార్డు బోయ్‌ దగ్గరకు జరుగుతూ అన్నాడు రాము.

‘‘మీ అమ్మ గారు కలిసారన్నానా!’’

‘‘అవును!’’

‘‘నీ దగ్గర డబ్బుందని చెప్పారన్నానా?’’

‘‘అవును!’’

(వార్డు బోయ్ ఏం చెప్పబోతున్నాడు? అది వాస్తవమా, వనచనకు ప్రయత్నమా? ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం
ఒంటిగంట దాకా ఆగాల్సిందే........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్