Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope july 13th to july 19th

ఈ సంచికలో >> శీర్షికలు >>

అసలు రోగం తెలిసేదీ… - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

 ఒకానొకప్పుడు మనకి ఏదైనా అనారోగ్యంచేస్తే,   ఏ ఊళ్ళో ఉంటే ఆఊళ్ళో ఉండే ఓ వైద్యుడిదగ్గరకు వెళ్ళడమో, వేళ్ళగలిగే ఓపిక లేకుంటే, ఇంటికే పిలిపించేసుకోవడమో చేసేవాళ్ళం. పాపం ఆ డాక్టర్లూ, కుటుంబంతో ఉండే సంబంధబాంధవ్యాలను బట్టి వచ్చేవారు కూడానూ… ఓ బ్యాగ్గూ, దాంట్లో కావలిసిన సరంజామా, ఏవో కొన్ని అత్యవసరమైన మందులూ ఉండేవి. నూటికి తొంభై పాళ్ళు, రోగి నాడిని పరీక్షించి, రోగ నిర్ధారణ చేయగలిగేవారు.. అవసరమైన మందేదో , అక్కడికక్కడే ఇచ్చేసేవారు. మహా అయితే, ఇంకోమందేదైనా కావల్సొచ్చినా, ఎవరినో  హాస్పిటల్ కి వచ్చి తీసుకెళ్ళమనేవారు… 

ఇంటికి వచ్చి చూసివెళ్ళినందుకు ఫీజుకోసం కూడా చూసుకునేవారు కారు.. రోగం నయంచేయడమే ముఖ్యోద్దేశంగా ఉండేది… మందులదుకాణాలకికూడా అంతగా వెళ్ళాల్సొచ్చేదికాదు.. తమదగ్గరే, ఏ   medical representative  ఇచ్చిన మందులే , ఉచితంగా ఇచ్చేవారు. వైద్యానికి ఏ పొరుగూరికో వెళ్ళాల్సిన అవసరాలు కూడా, ఎక్కడో అక్కడక్కడ తప్పించి ఉండేది కాదుకూడానూ…. జీవనశైలీ, తినేతిండీ, అంత క్రమబధ్ధంగా ఉండేవి మరి… ఈ వైద్యవిధానంలోనే,  ఎలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని పధ్ధతులు ఉండేవి. ఎవరికి వేటిమీద నమ్మకం ఉందో, ఆ వైద్యుడిదగ్గరకే వెళ్ళేవారు. ఎంతైనా రోగం తగ్గాలంటే, ముందు వైద్యుడిమీద నమ్మకం, గురీ ఉండాలిగా.. ఈ డాక్టర్లే కాకుండా,  R M P  లు  అని ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారనుకోండి, వీరు ,  ఓ సైకిలుకి , ఓ తోలుపెట్టి,  అందులో ఏవో చిన్నచిన్న మందులూ, అవీ వేసుకుని, చుట్టుపక్కలుండే చిన్న చిన్న  villages  కి వెళ్ళేవారు… అక్కడ జనాలకి మరీ ఆధునిక వైద్యసదుపాయాలు ఉండకపోబట్టి. వీళ్ళే, రోగ నిర్ధారణ చేసి, మెరుగైన వైద్యానికి , పట్టణంలో ఉండే, ఏ పెద్ద డాక్టరుదగ్గరకో పంపేవారు. వీరికి ఫీజు , రోగిబంధువుల నుండీ, ఏ  పెద్ద డాక్టరుదగ్గరకి పంపాడో, ఆయన దగ్గర నుండీ కూడా… రోజూ ఏ ఇంజక్షనో ఇవ్వాల్సివచ్చినా, ఈ   RMP   డాక్టరే చూసుకోవడం. ఊరికే పరుగులెత్తాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా ఆరోజుల్లో, వైద్యులుకూడా , మరీ ఈ రోజుల్లోలాగ కాకుండా, ఊరికి ఓ అరడజనుమందుండేవారు.. కాలక్రమేణా, ప్రభుత్వాలు చిన్నచిన్న ఊళ్ళలో.   Primary Health Centres   తెరిచారు .. అక్కడో వైద్యుడూ, ఓ కాంపౌండరూ, ఓ నర్సూ ఉండేవారు.. మారుమూల ఊళ్ళైతే, విళ్ళల్లో ఎవరో ఒకరు ఉండేవారుకారు…ఇంకో విషయమేమంటే, ఆరోజుల్లో వైద్యవిద్య కూడా, జనాలకి అందుబాటులోనే ఉండేది.

ఆర్ధిక స్థోమతని బట్టి, ఏ  వైజాగ్ లోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, హైదరాబాదులోనో,  MBBS  చేసేసి,  ఉన్న ఊళ్ళోనే    practice  మొదలెట్టేసేవారు.కాలక్రమేణా, ప్రతీ దానితోపాటూ, వైద్యవిద్య, డాక్టర్లూ,  హాస్పిటళ్ళూ, రోగాలూ కూడా  కొత్తకొత్త దారులు తొక్కడం మొదలయింది…  ఒకానొకప్పుడు, మహా అయితే లక్షరూపాయల్లో పూర్తయే వైద్యవిద్య ఇప్పుడు కోట్లలోకి దిగింది. సీటు కావాలంటే డబ్బు, హాస్పిటల్ తెరవాలంటే డబ్బు, ఆధునిక పరికరాలు సమకూర్చాలంటే డబ్బు, .. ఇలా ప్రతీదీ డబ్బుతో ముడిపడ్డంతో, , ఖర్చుపెట్టిన డబ్బు, తిరిగి ఎలా సంపాదించాలా అనేదే ,  bottom line  అయిపోయింది. అలాగని సరైన వైద్యం చేయడంలేదని కాదు… చేస్తున్నారు.. కానీ ఇదివరకటి   personal touch  అనేది ఎక్కడా కనిపించదు. దానికి సాయం రోగాలుకూడా, మన జీవనశైలితోపాటే, ఖరీదైపోయాయి… సంపాదన బట్టే రోగమూనూ.. రోగాన్నిబట్టి హాస్పిటళ్ళూ..మనిషి నెత్తిమీదుండే జుట్టు నుంచి, కింది కాళ్ళ గోళ్ళదాకా, ఏరోగం వచ్చినా, దానికో ప్రత్యేక చికిత్స.. ఏదో బొటనవేలు నొప్పెడుతోందని, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కైనా వెళ్తే, నానారకాల పరీక్షలూ చేసి, చివరకి గుండె లో స్టెంటులు వేసే రోజులు… నిజమే పరిక్షలన్నీ చేస్తేనే కదా అసలు రోగం తెలిసేదీ…

ఇవేకాకుండా, ఈరోజుల్లో శరీరంలోని తేడాలు ఉదాహరణకి… రక్తపోటు (  Blood Pressure ),  సుగరు లెవెల్స్ తెలుసుకోడానికి, స్వయంగా చేసుకునే పరికరాలు కొని ఇంట్లో పెట్టుకోవడం ఓ  కొత్త జాడ్యం గా మారింది.. గంటగంటకీ టెస్టు చేసేసికోవడం, మరీ పెద్దవారైతే, ఇంట్లోవాళ్ళందరినీ కంగారు పెట్టేయడం… ఆ పిల్లలేమో, ఈ రిజల్ట్శ్ గురించి నెట్ లో వెదికేయడం, హాస్పిటల్ కి పరిగెత్తడం… ఓ అర్ధం పర్ఢం ఉండదు.. ఎవరికి వారే డాక్టర్లనుకోవడం..  Health conscious  గా ఉండాలి, కాదనరెవరూ… కానీ మరీ ఇంత విపరీతంగానా? గర్భం దాల్చిందో లేదో కూడా ఇంట్లోనే తెలుసుకోవచ్చుట… మరి ఇంక కోట్లు ఖర్చుపెట్టి  డాక్టరయిన వారి గతేమిటీ….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pratapabhavalu