Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.. http://www.gotelugu.com/issue274/726/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)..‘‘అది నీ దగ్గరే ఉంచేసుకోరా...ఇంకెవరికీ ఇవ్వక్కర్లేదు. అని అన్నారని నీకు చెప్ప లేదుగా’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అర్థమయ్యేటట్టు చెప్పన్నా!’’ చిరాగ్గా అన్నాడు రాము.

‘‘ఒరేయ్‌ మొద్దూ! మీ అమ్మ గారే ఆ పాతిక వేలు  నిన్ను తీసేసుకోమని చెప్పార్రా!’’ రాము భుజాలు పట్టుకుని కుదుపుతూ చెప్పాడు వార్డు బోయ్‌.

‘‘నన్నా!ఎందుకూ?! ఈ డబ్బు అమ్మ గారిదే కదా!’’ ఆశ్చర్యంగా అన్నాడు రాము.

‘‘సోము గాడికి బాగు లేదు కదా! హాస్పిటల్లో ఖర్చుంటాయని...అవి నీ దగ్గరే ఉంచి అవసరమైతే ఖర్చు పెట్టుకోమని చెప్పార్రా!’’ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘నిజమా?!....ఇంత డబ్బు నాకే ఇచ్చేసారా? నమ్మ లేక పోతున్నానన్నా... నిజంగా నమ్మ లేక పోతున్నాను.’’ ఆనందంగా అన్నాడు రాము.

‘‘నమ్మితే నమ్ము...నమ్మక పోతే నాకిచ్చెయ్‌. నాకైతే కిందా మీదా ఆరు జేఋలున్నాయి...చూడు!’’ వెటకారంగా జేఋ చూపిస్తూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘పో అన్నా! నన్ను మరీ చిన్న పిల్లాడ్ని చేసేస్తున్నావ్‌. డబ్బు నాది కాదని తెలిసినా చూడు ఎంత జాగ్రత్తగా దాచానో’’ అంటే ఫేంటు లోప ఉన్న మరో నిక్కరు పై ఫేంటు విప్పదీసి మరీ చూపిస్తూ ‘‘ఇంక ఈ డబ్బు నాదైతే గుండెల్లో పెట్టుకు దాచుకుంటానన్నా!’’ అంటూ పై షర్టు విప్పి లోపల ఉన్న జేబు లోపల ఉన్న బనీను చూపించాడు రాము.

‘‘అమ్మో!....అమ్మో?!....ఎంత ఖతర్‌నాక్‌ గాడివిరా!’’ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు వార్డు బోయ్‌.

‘‘ఛ! ఊరుకో అన్నా!... అన్నా! అమ్మగారింకేం చెప్పారన్నా?’’ ‘జేబులో డబ్బుతో పాటు ఏ.టి.ఎమ్‌ కార్డు కూడా తన దగ్గరే ఉంది. దాన్ని తన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకొస్తున్నాడు. పోలీసు బారి నుండి సురక్షితంగా కాపాడుకొచ్చాడు. అది అమ్మ గారికి చేర్చా.’ మనసు లోనే అనుకున్నాడు రాము.

‘‘చెప్పారు.’’అంటూ రహస్యంగా రాము మీదకు ఒంగి గుసగుసగా గొణుగుతూ చెప్పాడు వార్డు బోయ్‌.

‘‘అన్నా....కొంచెం...ఇంకొంచెం గట్టిగా చెప్పన్నా! ఒక్క ముక్క వినపడ లేదంటే నమ్ము.’’ వార్డు బోయ్‌ కి మరింత చేరువగా జరిగి అతని మీద పడ్డట్టు రాసుకుంటూ కూర్చుని అడిగాడు రాము.

‘నీ దగ్గర ఏ.టి.ఎమ్‌ కార్డు ఉంది కదా! అది నా చేతికిమ్మన్నారు. కార్డు భద్రం గానే ఉంది కదా?’’ అడిగాడు వార్డు బోయ్‌.

‘‘ఆ!...ఉందన్నా! ఇస్తే....అది నిన్ను తీసేసుకోమన్నారా?!’’ ఆశ్చర్యంగా అడిగాడు రాము.

‘ఎగస్ట్రాలొద్దురొరేయ్‌! నాతోనే కామెడీ చేస్తున్నావా? డబ్బు నీకా? ‘ఖాళీ కార్డు’ ముక్క నాకా అదెందుకురా నాలిక గీసుకోడానికి. దాని తాళం కూడా నీకు తెలిసుంటుంది కదా! అది చెప్పు! నచ్చినంత గీక్కుంటా!’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు వార్డు బోయ్‌.

వార్డు బోయ్‌ మాటలు విని ఫకాలున నవ్వాడు రాము.

‘‘ఏందిరోయ్‌! నీకు నవ్వొచ్చే మాటలేమున్నాయిరా! కార్డు ముక్క ఒక్కటే ఎందుకురా...! దాంతో దాని పిన్‌ నెంబరు చెప్పమన్నా! దానికి ఆ నవ్వేందిరా!...’’ చిరు కోపం ప్రదర్శిస్తూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘నీ మాటలు విని కాదన్నా! ఇందాక నన్ను స్టేషన్‌ నుండి తీసుకు వచ్చారే...ఆ పోలీసులు గుర్తొచ్చి...నవ్వుకున్నా!’’ అన్నాడు రాము.రాము నోట పోలీసుల మాట వినగానే త్రుళ్లి పడ్డాడు వార్డు బోయ్‌.

‘‘పోలీసులా! వాళ్ళెవర్రా! ఇందాక నిన్ను తీసుకొచ్చినోళ్లా?’’ అమ్మో!....అమ్మో! నంగనాచిలా ఉన్నావు. అప్పుడే... పోలీసుతో సావాసాలేట్రా!’’ భయంగా అన్నాడు వార్డు బోయ్‌.

‘‘సావాసం కాదన్నా! వాళ్ళే నన్ను దొంగననుకుని లాక్కు పోయారు. నిజం తెలుసుకుని వదిలేసారు.’’ చెప్పాడు రాము. వార్డు బోయ్‌కి బుర్ర తిరిగి పోయింది. ఆవిడ ముందే చెప్పింది ఎవరూ చూడకుండా...ఎవరికీ అనుమానం రాకుండా రాము దగ్గర నుండి ఆ ఏ.టి.ఎమ్‌ కార్డు తీసుకోమంది. వీడు చూస్తే పోలీసులతో వచ్చాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. ఏ గొడవా లేక పోతే ఆవిడే వచ్చి వీడి దగ్గర ఏటిఎమ్‌ కార్డు తీసుకోవచ్చు కదా! తనకి అంత డబ్బు ఇస్తానందంటే...ఇది ప్రమాదకరమైన పనేనన్నమాట. అమ్మో!...నిజంగా....ఆమె అన్నట్టు ఎవరైనా రామూని, నన్ను గమనిస్తున్నారా?! ఏమో!

ఆ అనుమానం మనసులో మెదగానే టక్కున బల్ల మీద నుండి లేచాడు వార్డు బోయ్‌. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వార్డు ముందున్న వరండా అంతా తిరిగి ఏ మూలన ఎవరైనా నక్కి ఉన్నారేమో అని తిరిగి తిరిగి చూసాడు.

ఎవరూ అనుమానాస్పదంగా కనిపించ లేదు.వార్డు బోయ్‌ ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు రాముకి. హాస్పిటల్‌ అంతా నిశ్శబ్దంగా ఉంది. వార్డు ముందు వరండాలో ఎక్కడా పిట్ట మనిషి లేడు. ఎమర్జెన్సీ వార్డు ముందే తన లాగ నలుగురైదుగురు బల్ల మీద పడుకుని ఉన్నారు.

బల్ల మీద నుండి లేచి వార్డు బోయ్‌ వెనకాలే వెళ్లాడు రాము. వార్డు బోయ్‌ భయం భయంగా నాలుగు మూలలా దూరి....దారి పొడుగునా ప్రతి బల్ల ఇరుకున ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ గాలిస్తున్నాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఎమర్జెన్సీ వార్డులోనుండే ఉండుండి క్షతగాత్రులు బాధతో చిన్నగా మూలుగుతున్న మూలుగులు చిన్నగా విన్పిస్తున్నాయి. వార్డు ముందున్న నడవా అంతా ఈ చివర నుండి ఆ చివర వరకూ వెళ్లి చూసాడు వార్డు బోయ్‌. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించ లేదు. బల్ల మీద పడుకున్నవాళ్లంతా ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు. వరండా అంతా వెదికాడు. ఎమర్జెన్సీ వార్డును ఆనుకుని ‘ఓ.పి.’ ఉంది. చిన్న చిన్న రోగాలకు అక్కడికక్కడే మందులు రాసి ఇచ్చే వార్డు అది.

అక్కడే బయట నుండి రావడానికి ప్రధాన ద్వారం ఉంది. ఆ ప్రధాన ద్వారం ముందు పెద్ద హాలు. పేషెంట్లని చూడ్డానికి వచ్చే వాళ్ళు బయట రూమ్‌ లు  దొరక్క అవస్తలు పడ్డవాళ్ళు ఆ హాల్లోనే పడుకుంటారు. ఒక్క రోజు కోసం రూమ్‌ లు అద్దెకు తీసుకోలేని వాళ్లంతా అక్కడే విశ్రమిస్తారు.

ప్రధాన ద్వారం ముందున్న హాలులో పడుకున్న వాళ్లని గమనిస్తూ నడుస్తున్నాడు వార్డు బోయ్‌.వార్డు బోయ్‌ కి తెలీకుండా అతని వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లిన రాము ఒక్కసారే ‘అన్నా!’ అని అరుస్తూ వెనక నుండి వార్డు బోయ్‌ నడుం పట్టుకున్నాడు. హఠాత్తుగా వెనుక నుండి ఎవరో నడుం పట్టుకుని అరిచే సరికి అదిరి పడి అంతెత్తున ఎగిరి పడ్డాడు వార్డు బోయ్‌.

‘‘ఒరేయ్‌ నీకు బుద్ధుందా! ఎవరో అని ఝడుసుకు చచ్చాను.’’ కోపంగా రాముని తిడుతూ అన్నాడు వార్డు బోయ్‌.

‘అది కాదన్నా! ఉన్నట్టుండి నువ్వు ఎందుకలా కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావో అర్థం కాక’’ నీళ్ళు నములుతూ అన్నాడు రాము.

‘‘ష్‌! అరవకు! నెమ్మదిగా మాట్లాడు. ఎవరైనా వింటారు. నువ్వెళ్లి అక్కడ కూర్చో! నేను వస్తాను.’’ రాము భుజం మీద చెయ్యేసి తోస్తూ అన్నాడు వార్డు బోయ్‌.

‘‘అలాగే అన్నా!’’ రామూ కూడా గుస గుస గా అని ఎమర్జెన్సీ వార్డు ముందున్న బల్ల దగ్గరకు వెళ్ళి పోయాడు.

‘ఎందుకైనా మంచిది. ఓ.పి. వార్డు ముందున్న మెయిన్‌ గేటు ముందు హాల్లో కూడా చూసొస్తే పోలా!’ మనసు లోనే అనుకున్నాడు వార్డు బోయ్‌. నెమ్మదిగా ఎమర్జెన్సీ వార్డు ప్రక్కనే ఉన్న అవుట్‌ పేషెంట్స్‌ వార్డు ముందు నుండి ముఖ ద్వారం దగ్గరకు వెళ్ళాడు. మెయిన్‌ గేటు నుండి ముఖ ద్వారం వరకూ పెద్ద హాలు, హాలంతా నలుమూలా పేషెంట్ల తాలూకా బంధువులతో నిండి పోయి ఉంది. హాల్లో ట్యూబ్‌ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. హాల్లో నలుమూలలా ఒకరిద్దరు చొప్పున క్రింద దుప్పట్లు పరుచుకుని నిద్ర పోతూ ఉన్నారు.

అప్పటికే రాత్రి పదకొండు గంటలు కావస్తోంది. పెద్ద డాక్టర్‌ గారు ఆకస్మిక తనిఖీ  వలన గానీ లేకపోతే ఈ సరికి తను కూడా వార్డులో ఏదో మూల పడుకునే వాడే. ‘ఆమె’ అప్పగించిన పని వలన ఆ కుర్రాడితో మాట్లాడుతూ మచ్చిక చేసుకుని తనకు కావలసింది రాబట్టాలనుకున్నాడు.  కానీ, పోలీసుల కన్ను వాడి మీద ఉందన్న అనుమానం కలగ గానే మెదడు మొద్దు బారి పోయింది. మనసంతా అల్లకల్లోలం అయి పోయింది.

ఆ మేడమ్‌ గారు ముందే హెచ్చరించారు. ఎవరి కంటా పడకుండా పని కావాలన్నారు. అంటే దాని ఉద్దేశం ‘పోలీసు దృష్టిలో అనే అయుంటుంది. అందుకే ఆమె అంత భయ పడి చెప్పింది. ఇతరులెవరైనా అయితే ‘ఆమె’ ఎందుకంతలా భయపడుతుంది?! కొంప దీసి తానీ గొడవల్లో ఇరుక్కోవటం లేదు కదా! అయినా, ఇందులో గొడవేముంది. ఆ కుర్రాడి దగ్గర ఏటిఎమ్‌ కార్డు తీసుకుని ఆమెకి అందించడమేగా...దానికి ప్రతిఫలంగా రెండున్నర లక్షలు...రెండు వందల ఏభై వేల రూపాయలు...తన ఏడాది జీతం....ఒక్క సారే చేతికందుతాయంటే...ఎంత రిస్క్‌ అయినా తప్పదు.  కొంచెం జాగ్రత్తగా...మరి కొంచెం అప్రమత్తంగా ఇంకొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే చాలు.ఆలోచిస్తూనే హాలంతా వెదికాడు. అందరూ ఆదమరచి నిద్ర పోతున్నారు. ద్వారానికి దారి ఒదిలేసి అటూ ఇటూ ఆక్రమించేసి పడుకున్నారంతా.అందర్నీ వరుసగా పరిశీలిస్తూ...అనుమానం కలిగిన దగ్గర ఆగి నిలబడి వాళ్ళు పేషెంట్ల బంధువులేనని నిర్ధారణ చేసుకుని నడుస్తున్నాడు.
    ఓ మూల ఒక యువకుడు క్రింద ఎలాంటి దుప్పటి పరుచుకోకుండా నేల మీదే అటూ ఇటూ దొర్లుతున్నాడు. మనిషిని చూస్తే పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడు. ఆద మరచి నిద్ర పోతున్నాడా అన్నట్టు అటో కాలు ఇటో కాలు బార్లా చాపి మొహం మీద అడ్డంగా మోచేత్తో కళ్ళు మూసుకుని రెండో చేయి బార్లా చాపి పడుకున్నాడు.

‘ఎవరో యువకుడు...పాపం! హాస్పిటల్‌లో అతని వాళ్ళు ఎవరున్నారో?’ అనుకుంటూ తిరిగి వార్డుకి చేరుకుందామని మెయిన్‌ ద్వారం దగ్గరకు వచ్చాడు వార్డు బోయ్‌. అవతల మరో కుర్రాడు కూడా ఆ యువకుడి లానే బందోబస్తుగా ఉన్నాడు. ఆ యువకుడు కూడా ఆద మరిచి నిద్ర పోతున్నాడు.

(ఆదమరిచి నిద్రపోతున్న ఆయువకులెవరు? అసలు వాళ్ళు రోగుల బంధువులేనా? వాళ్ళ నిద్ర నిజమేనా??? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?