Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.. http://www.gotelugu.com/issue275/727/telugu-serials/anveshana/anveshana/

 

అటూ ఇటూ ఇద్దర్నీ తల తిప్పి చూసి ఎవరో మనకెందుకులే అనుకుంటూ ద్వారం ముందుకు అడుగేసిన వార్డుబోయ్‌ ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు.

గబాలున  వెనక్కి  వచ్చి  ఆ ఇద్దర్ని మళ్లీ పరిశీలనగా చూసాడు. ఇద్దరి తలలు దగ్గరగా కత్తిరించేసి డిప్ప కటింగ్‌లా ఉన్నాయి.  అదిరిపడ్డాడు. అనుమానం లేదు. వాళ్లిద్దరూ పోలీసులే. అనుమానం చావక నెమ్మదిగా ఒకడి దగ్గరకు వెళ్లి ఒంగొని చూసాడు. ఆ యువకుడ్ని చూస్తూనే షాక్‌ తగిలినట్టు ఉలిక్కిపడి గబగబా వార్డు దగ్గరకు వచ్చేసాడు.

రాము వెంట వచ్చిన యువకులిద్దరిలో వీడూ ఒకడు. అంటే ఆ రెండో వాడు కూడా ఆ ఇద్దరిలో వాడే. వీళ్లే రాముని హాస్పటల్‌ దగ్గర దించేసి వెళ్లారు.

అప్పుడు రాత్రయి పోయింది. ఇంటికి పోయి ఉదయం వద్దామనుకోవడం స్పష్టంగా విన్నాడే. అదంతా నాటకమా?! దేని కోసం వీరిలా నాటకాలు ఆడుతున్నారు? ఎవరి కోసం ఇలా మాటు వేసి దాక్కున్నారు?

అమ్మో! ఇప్పుడెలా?! ఏం చేద్దాం? వాళ్లిద్దరూ మాటు వేసి....మాటు వేసి అలసిపోయి గాఢ నిద్ర లోకి జారుకున్నట్టున్నారు.

ఇదే అదును. తన పని కానిచ్చేయ్యాలి.

మనసులోనే స్థిరంగా అనుకున్నాడు వార్డు బోయ్‌. వార్డు ముందు బల్లమీద కూర్చున్నాడు. గుండె దడదడలాడుతోంది. కాళ్ళు చేతులు ఎందుకో వాటంతటవే వణుకుతున్నాయి. మనసుని ధిటవు చేసుకున్నాడు.

ఎదురుగా బల్ల మీద పడుకున్న రాము కేసి చూసాడు. పడుకున్నాడా? పడుకున్నట్టు నటిస్తున్నాడా?!’ అని మనసు లోనే అనుకుంటూ రాము దగ్గరకు వెళ్ళాడు వార్డుబోయ్‌.

రాముని నెమ్మదిగా తట్టి లేపాడు వార్డుబోయ్‌. రాము స్పందించ లేదు. గురక పెడుతూ గాఢంగా ఊపిరి పీల్చి వదులుతున్నాడు.

‘వీడిప్పుడే పడుకోవాలా?! ఎలా?! వాళ్ళు లేచే లోగా వీడి దగ్గర ఏ.టి.ఎమ్‌ కార్డు తీసుకోవాలి. ఉదయం ఆరో గంటకి ఎలాగూ డ్యూటీ దిగిపోతాడు. ఇంటికి వెళ్ళాక ఆవిడకి ఫోన్‌ చేసి ఎటిఎమ్‌ కార్డు అందచెయ్యొచ్చు. మనసులో ప్లాన్‌ సిద్ధం చేసుకున్నాడు వార్డు బోయ్‌.
ఇంతలో ఎవరో లేచిన శబ్దం. ఏవో గుసగుసలు విన్పించేసరికి ఉలిక్కిపడ్డాడు వార్డుబోయ్‌. పరుగున వెళ్లి తన బల్ల మీద కూర్చుని కునుకు పాట్లు పడుతున్నట్టు నటిస్తూ ఓ.పి. దగ్గర గేటు కేసి చూసాడు.

ఓ.పి. ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం కేసి చూస్తూనే అదిరిపడ్డాడు వార్డుబోయ్‌. హాల్లో పడుకున్న యువకులిద్దరూ ద్వారం దగ్గర నిలబడి ఎమర్జన్సీ వార్డు కేసే చూస్తున్నారు.

వార్డుబోయ్‌ వాళ్లని చూస్తూనే గజగజా వణికపోతూ బల్లమీద కాళ్ళు ముడుచుకుని కూర్చుని కళ్లు మూసుకున్నాడు. ఎవరో ఇటే వస్తున్న అడుగుల శబ్దం...లయ బద్ధంగా విన్పిస్తూ రానురాను దగ్గరౌతుంటే భయంతో బిగుసుకుపోతున్నాడు వార్డుబోయ్‌. ‘కొంపదీసి వాళ్ళకి తన మీద అనుమానం రాలేదు కదా’ అనుకున్నాడు.  టక...టక...టక్‌...టక్‌...అడుగు శబ్దం...నెమ్మదిగా దగ్గరౌతోంది.   ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకున్నాడే గాని ‘చెవులు’ రెండూ రిక్కించి వింటున్నాడు వార్డుబోయ్‌.

***

బస్సులో కూర్చుందే గాని మనసు మనసులో లేదు. అతను ఎవరో...ఎందుకు నన్ను వెంటాడుతున్నాడో అర్థం కావటం లేదు. అత్తమ్మ కూడా ఆందోళన పడుతోంది.

ఆలోచిస్తుండగానే ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర బస్‌స్టాప్‌లో ఆగింది సిటీ బస్సు. ప్రయాణీకులు ఒకరిద్దరు దిగారు. దిగాలా వద్దా అని ఆలోచిస్తూ సీట్లో నుండి టక్కున లేచింది.

అంతే! గబాలున బస్సు కదులుతుండగానే ఒక గెంతు గెంతి బస్సులో నుండి దిగిపోయిందామె.

రైల్వేస్టేషన్‌ కంటే బస్సు కాంప్లెక్సే నయమనుకుంది. చకచకా నడుచుకుంటూ కాంప్లెక్స్‌ లోపలకు వెళ్లింది. దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ ఓ మూల ఉన్నాయి. దగ్గర దగ్గర గ్రామాలకు పట్టణాల కు వెళ్ళే బస్సులు వరుసగా ప్లాట్‌ ఫారము దగ్గర ఆగి ఉన్నాయి.    బస్సుస్టాండ్‌ అంతా తిరిగి తిరిగి ప్రయాణీకులు విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి వచ్చింది.

తెల్లవారు ఝామున బస్సు ఎక్కే ప్రయాణీకుల బ్యాగులు తల దగ్గర పెట్టుకుని కూర్చునే కునికిపాట్లు పడుతున్నారు.
అక్కడ నుండి ఆ ప్రక్కనే ఉన్న కేంటీన్‌ దగ్గర కొచ్చింది. లోపల చాలా మంది టిఫిన్లు, కొందరు భోజనాలు చేస్తున్నారు. ఓ ప్రక్కన కేంటీన్‌ బయట టీ స్టాల్‌ ఏర్పాటు చేసారు. ఎక్కువ మంది అక్కడే నిలబడి ‘టీ’ త్రాగుతున్నారు.

అర్థరాత్రి కావస్తోంది. కాంప్లెక్స్‌ అంతా అలికిడిగా వుంది. హైదరాబాద్‌ వెళ్ళే బస్సు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నిండి పోతున్నాయి. ఎంక్వయిరీ కౌంటర్‌లో ఉన్నతను బస్సుల నెంబర్లు చెప్తూ మైకులో అరుస్తున్నారు.

కేంటీన్‌ని ఆనుకుని ఉన్న షాపులన్నీ ఒక్కొక్కటి మూసేస్తున్నారు. ఆ వరుసంతా చివరి వరకూ రకరకాల షాపులు. ఆ షాపు ముందు వరండాలో అక్కడక్కడ యాచకులు చలికి వణికిపోతూ కాళ్ళు ముడుచుకుని పడుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా చీకటిగా వుంది. వరండాలో ఆ మూల నుండి కేంటీన్‌ వరకూ వరుసగా ఉన్న స్తంభాల ప్రక్కన చలికి దొరక్కుండా దాక్కున్నట్లు దాక్కుని యాచకులంతా నిద్రపోతున్నారు. ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వరండా అంతా ఆక్రమించి పడుకొని ఉన్నారు యాచకులు.

వాళ్లంతా యాచకులో తనలా వలస వచ్చేసిన దేశదిమ్మరులో ఎవరికి తెలుసు. నిలువ నీడలేని అభాగ్యులు.మనసు లోనే బాధపడుతూ చీకట్లో ఓ మూల నక్కి నిలబడింది. దూరంగా కేంటీన్‌ సందడిగా వుంది. ఎదురుగా  ఉన్న  స్తంభం ప్రక్కనే ఒకావిడ పాపం చలికి గజగజా వణికిపోతూ చీర చెంగే తల నిండుగా కప్పుకుని స్తంభానికి చేరగిలబడి పడుకుంది.

ఆమె కూడా చలికి తట్టుకోలేకపోతోంది. నిద్ర మాత్రం ముంచుకొస్తోంది. శరీరం కూడా బాగా అలసిపోయింది. రోజంతా ఉరుకులు పరుగులే కదా అనుకుంది ఆమె.

వరండాలో నిలబడి రోడ్డు మీదకు చూసింది. ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి క్రింద నుండి అడపాదడపా ఒకటీ రెండు బస్సులు బస్సు స్టాప్‌లో ఆగి వెళ్తున్నాయి. తానిప్పుడు అక్కడే కదా బస్సు దిగింది అని అనుకుంటూ రోడ్డు ప్రక్కనున్న షాపు కేసి చూసింది.

ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి క్రింద పెద్ద పెద్ద స్తంభాలను ఆనుకుని చిన్న చిన్న ఫుట్‌పాత్‌ దుకాణాలు. ఒక్కొక్కటి మూసెయ్యడానికి సామాన్లు సర్దుకుంటున్నారు.

ఎదురుగా రగ్గు, స్వెట్టర్లు అమ్ముతున్నారు. గబగబా అక్కడకు  వెళ్ళింది. చిన్నవి మంచివి రెండు రగ్గులు తీసుకుంది. పాపం! ఆవిడకి ఒకటి ఇద్దాం అనుకుంటూ రెండూ బేరం ఆడి డబ్బులు ఇచ్చింది. రెండు వేల నోటు తీసుకుని మిగిలిన చిల్లర ఇచ్చాడు బీహారీ కుర్రాడు. రెండూ పట్టుకుని వచ్చి ఒక రగ్గు ఆమె దగ్గరకు వెళ్ళి తట్టిలేపి చేతిలో పెట్టింది.

ఆ యాచకురాలు ఆశ్చర్యంగా ఆమెకేసి చూసింది. వరండాలో అక్కడక్కడ చలికి ఒణికిపోతూ పడుకున్నవాళ్ళు ఒకరిద్దరు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి ఆనందంతో టక్కున లేచి ఆమె దగ్గరకు పరిగెట్టుకు వచ్చారు.

‘‘అమ్మా! మాకూ ఒక రగ్గు కొనిపెట్టమ్మా. చలికి తట్టుకోలేక పోతున్నామమ్మా!’’ అంటూ కాళ్లావేళ్లా పడ్డారు. ఆమెకు మనసు చివుక్కుమంది.

‘‘సరే! ఇక్కడ పడుకున్న వాళ్ళు ఎంతమందో వెళ్లి లెక్క చూసి చెప్పండి. అందరికీ కొంటాను. సరేనా?!’’ తన దగ్గరికి వచ్చి రగ్గు కొనమని ప్రాథేయపడ్డ వ్యక్తికి చెప్పిందామె.

అతను, తనతో వచ్చిన మరో యాచకుడితో వరండా అంతా తిరిగి అందర్నీ లెక్కపెట్టుకుని ఆమె దగ్గరకు వచ్చాడు.

‘‘అమ్మా! ఈ వరండాలో పడుకున్నవాళ్లంతా కలిపితే ఇరవై మంది కూడా లేరమ్మా’’ అన్నాడు ఒక వ్యక్తి.

‘‘మీతో కలిపి లెక్కపెట్టారా?’’ అడిగింది ఆమె.

‘‘మా ఇద్దరితో కలిపినా పంతొమ్మిది మంది అయ్యాం తల్లీ!’’ అన్నాడతను.

‘‘రండి! నాతో మీరిద్దరూ రండి.’’ అంటూ ఆ ఇద్దర్నీ తీసుకుని బీహారీ వాళ్ల దగ్గరకు వెళ్లింది. రగ్గులన్నీ ఒక్కలాగే ఉన్నాయి. తాము తీసుకున్న సైజులో అందరికీ రగ్గులు కొని వాళ్లకు అప్పగించింది. ఆ ఇద్దరూ రగ్గులు మోసుకొచ్చి వరండాలో పడుకున్న వాళ్లందరికీ ఒక్కోటి పంచి పెట్టారు.

యాచకులందరికీ రగ్గులు కొంటున్న ఆమెని చూసి వర్తకులైన బీహారీలు ఆనందంతో ఉప్పొంగి పోయారు. మౌనంగా వారికి డబ్బు చెల్లించేసి వరండాలోకి వచ్చింది. అప్పటికి అందరూ నిద్రలో నుండి లేచిపోయారు. అందరూ  రగ్గులు  కప్పుకుని  ఆమె దగ్గరకు  వచ్చి  కృతజ్ఞతలు చెప్పారు. బాగా ముసలి వాళ్ళు  నువ్వు చల్లగా ఉండాలమ్మా!’’ అంటూ దీవించి ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

యాచకుల్లో ఒకామె యవ్వనంలో ఉంది. పాతికేళ్ళు కూడా నిండి ఉండవు. యాచకుందరికీ రగ్గులు కొన్న ఆమెని చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారే ఇంత మందికి ఇన్ని రగ్గులు కొందంటే ఆమె దగ్గర ఎంత డబ్బుందో కదా అనుకుంది.

ఆమె రగ్గు కప్పుకుని ఓ మూల కూర్చుంది కప్పుకున్న దుప్పటినే సగం క్రింద పరిచి సగం కప్పుకుని కూర్చుంది. బయట వీధి లైట్ల కాంతిని స్తంభాలు అడ్డేస్తున్నాయి. క్రీ నీడలో కునికి పాట్లు పడుతూ కూర్చుంది ఆమె.ఆమెకి కొద్ది దూరంలో ఉంది వయసులో ఉన్న యువ బిచ్చగత్తె. నెమ్మదిగా లేచి ఆమె ప్రక్కకు వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయిని చూసి ఆమె చిన్నగా నవ్వి పలకరించింది.

‘‘మీరు....ఇక్కడ...’’ సంశయంగా అడిగింది యువ యాచకురాలు.

ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

‘‘బస్సు మిస్సయింది. ఇక ఈ రాత్రికి బస్సు లేదు. అందుకని....’’ నసుగుతూ చెప్పింది ఆమె.

‘‘మరి మీ బ్యాగ్‌లు.... బట్టలు....ఏవీ?’’ అడిగింది ఆ యువ యాచకురాలు.

వార్డు బాయ్ ని ఆ యువకులిద్దరు ఏమైనా చేస్తారా.. తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kaatyayani