Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

kaatyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..  http://www.gotelugu.com/issue276/730/telugu-serials/katyayani/kaatyayani/

యథాప్రకారం సూర్యుడుదయించాడు.

రామనామ కాలనీ బద్ధకంగా ఒళ్లు విరుచుకుంది. 

ఆ కాలనీలో ఓ నాలుగొందల గజాల స్థలం, చుట్టూతా కర్రలతో కట్టిన దడి, చెక్క గేటు, మధ్యలో తెల్లటి సున్నం వేసిన చక్కటి రెండుగదుల ఇల్లు. ఇంటి చుట్టూ రక రకాల పూలు, పళ్ల మొక్కలు చూడంగానే ఎవరికైనా అందులో ఉండాలనిపిస్తుంది. ఆ ఇంట్లో అచ్యుతరామయ్యగారు, ఆయన భార్య యశోదమ్మ. కూతురు కాత్యాయని ఉంటారు. ఆ స్థలానికి యజమాని ఆనందరావు, ఒకప్పుడు అచ్యుతరామయ్యగారి సహోద్యోగి. ఆనందరావు మారిషస్ లో జాబ్ రావడంతో ఆ స్థలం ఎవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయంతో రెండు గదులు వేసి, అచ్యుతరామయ్యగారి మంచితనం, నిజాయితీ చూసి తను తిరిగొచ్చేవరకూ అ ఇంట్లో ఉచితంగా ఉండి, ఆ స్థలాన్ని భద్రంగా కాపాడే బాధ్యతను ఆయన మీద పెట్టాడు.

అచ్యుతరామయ్యగారికి నలభై ఏళ్లు కొద్దిగా బక్కగా, దబ్బపండు ఛాయతో ఉంటాడు. సంసృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ పాటించే నిఖార్సయిన మనిషి. పద్దెనిమిదేళ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ టెక్నీషియన్ గా పనిచేసి, ఆ సంస్థ రెండేళ్ల క్రితం ఆర్థికంగా పతనమవడంతో బయటికొచ్చేశాడు. మొదటి నుంచి పొదుపరి అవడంవల్లనూ, డబ్బును జాగ్రత్తగా దాచుకోవడంవల్లనూ ఆ కుటుంబం పెద్దగా ఇబ్బంది పడలేదు. అచ్యుతరామయ్యగారు తనకు వచ్చిన పి ఎఫ్, గ్రాట్యుటీ డబ్బును పోస్టాఫీసులో వేసి, నెల నెలా ఇంట్రస్ట్ వచ్చేలా చూసుకున్నాడు.

దానికితోడు ఓ చిన్న కంపెనీలో తక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య యశోదమ్మకి భర్త ఎంత చెబితే అంత. పెళ్లి చేసుకుని అత్తింట అడుగుపెట్టాక ఇహ పుట్టింటి ఊసెత్తలేదు ఆవిడ. సాక్షాత్తూ భర్తలో సగభాగం పొందిన పార్వతీదేవే! ఇహ కూతురు కాత్యాయని పసిమి ఛాయతో మెరిసిపోయే కుందనపు బొమ్మ. తల్లిదండ్రుల చాటు బిడ్డ. తండ్రి ఆమెను టెంత్ వరకే చదివించి ‘చూడమ్మా, ఏదో నాకొచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం లాక్కొస్తున్నాను. నిన్ను ఇంతకు మించి చదివించలేకపోడానికి ఇదో కారణం. ఇంకో కారణం ఏంటంటే ఇవాళ రేపటి రోజులు బాగాలేవు. బయటి వాతావరణం ఆడపిల్లలకు అస్సలు క్షేమకరంగా ఉండట్లేదు.

ఆడపిల్లల్ని కొడవళ్లతో నరకడాలు, వాళ్ల ముఖాలపై ఆసిడ్ పోయడాలు, ఏంటమ్మా, ఈ దారుణాలు? పేపర్లలో చదువుతూ, టీ వీల్లో చూస్తున్నప్పుడల్లా ప్రతి ఆడపిల్ల తండ్రి ఒళ్లూ గగుర్పొడుస్తోంది. అంతా అయ్యాక ఆ ఘాతుకాలకు ఒడిగట్టిన కుర్రాళ్లని ఉరి తీసినా, పోయిన అమ్మాయిల ప్రాణాలు తిరిగొస్తాయా? అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు తిరిగిరాని లోకాలకి వెళ్లిపోతే, అన్నేళ్లూ పెంచిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో ఏమైపోవాలమ్మా? అందుకే తెలివైన దానివైనా నిన్ను పై చదువులు చదివించలేని అసమర్థుడుగా మారాడు ఈ తండ్రి. అంతేకాకుండా ఉన్నతమైన చదువులు చదివిస్తే, నీ కన్నా పెద్ద చదువు చదివిన కుర్రాడిని బోలెడంత కట్నం ధారబోసి తేలేని అశక్తుణ్ని. ఏవనుకోకమ్మా’ అని చెమ్మగిల్లిన కళ్లను తుండుగుడ్డతో తుడుచుకున్నాడు. తండ్రి మాటలతో మనసుభారమైన కాత్యాయని, ఆయన మాటకు కట్టుబడింది.

అచ్యుతరామయ్యగారి కుటుంబం రోజూ నాలుగున్నరకే లేస్తుంది. యశోదమ్మ, కూతురు కాత్యాయనీ లేచి వాకిల్లోని కసువు ఊడ్చి, ఇల్లు శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి, దేవుని విగ్రహాలు, సామాగ్రీ కడిగి శుభ్రంచేసి ఇంటిల్లిపాదీ స్నానాలు చేసి, పెరట్లోని మందార, చామంతి, తులసీదళాలు కోసి, దాదాపు గంట సేపు మనసుపెట్టి పూజచేస్తారు. దేవుళ్లు కొలువుండే షెల్ప్ పసుపు, కుంకుమ, పూల అలంకరణతో కనులపండువగా ఉంటుంది. ఇది ఏ ఒక్కరోజో జరిగే తంతు కాదు నిత్యకృత్యం. అందుకే వాళ్లు సాధారణంగా ఎక్కడికీ వెళ్లరు. వెళ్లినా ఒకటి రెండు రోజుల్లో ఇంటికొచ్చి తమ నిత్యకృత్యాల్లో పడిపోతారు.

ఆరోజు కూడా-

’అమ్మా, కాత్యాయని పూజకు అన్నీ సిద్ధం చేశావా?’ అన్నాడు అచ్యుతరామయ్యగారు.

’ఇందాకే దేవుళ్లకు బొట్లు పెట్టి దీప, ధూపాలు వెలిగించి పూజకు అన్నీ సిద్ధం చేశాం నాన్నగారూ’ అంది కాత్యాయని.

అచ్యుతరామయ్యగారు అక్కడికి వచ్చి పీటమీద కూర్చుని ఆచమ్యానికి సిద్ధమై ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా..’అంటూ ఎడం చేతిలో ఉద్ధరిణి పట్టుకుని, దాంతో పంచపాత్రలోని నీటిని తీసుకుని కుడిచేతిని గోకర్ణంలా చేసి అందులో పోసుకుని చప్పుడు చెయ్యకుండా నోట్లో పోసుకున్నాడు. తర్వాత యథావిధిగా షోడశోపచార పూజ చేశాడు. దేవునికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, హారతిచ్చాడు. హారతిని అందరూ  కళ్లకద్దుకున్నాక తీర్థ ప్రసాదాలు తను తీసుకుని భార్యకి, కూతురికీ ఇచ్చి సంతృప్తిగా తను పూజ చేసిన దేవుళ్ల వంక చూసి "అసలు మనిషి పూజ ఎందుకు చెయ్యాలో తెలుసామ్మా? ‘ఈ సకల చరాచర సృష్టినీ సృజించిన నీముందు నేను పిపీలికామాత్రుణ్ని, మేము బతకడానికి పంచభూతాలు, అనేక వనరులు ఇచ్చావు. ఇదిగో నీ గొప్పతనాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా మేము పూజచేసి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మమ్ములను కాస్త కనిపెట్టుకుని ఉండు‘ అని విన్నవించుకోవడం. భగవంతుణ్ని సదా స్మరించే వ్యక్తికి ఆభిజాత్యం తలకెక్కదు. రుజువర్తనతో, మానవతామూర్తిగా ఉంటాడు" అని లేచి నుంచున్నాడు.

"అన్నట్టు ఇవాళ ఆదివారం కదూ, పదకొండుగంటలకి మనమ్మాయిని చూసుకోడానికి పెళ్లివారొస్తారని వేణుగోపాలస్వామి ఆలయం పూజారి చెప్పాడు కదా. కాస్త వెలుగొచ్చాక నేను బయటకి వెళ్లి స్వీటు, హాటు పట్టుకొస్తాను, ఇంకా ఏవన్నా కావాలా?" భార్యని అడిగాడు.
వద్దన్నట్టుగా తలూపిందావిడ.

టేప్ రికార్డర్ లో సన్నగా ఆదిత్య హృదయం పెట్టాడు.

అంతలో పాలతను తలుపు కొట్టడంతో గిన్నెతో వెళ్లిన ఆవిడకి పాలుపోస్తూ ’ఇలా పొద్దుగాల్నే మీ ఇంట్లో పాలుపోయడానికి వచ్చి అగరొత్తుల పొగ పీలుస్తూ, సన్నగా ఇనిపించే దేవుడి పాటలు ఇంటే మనసెటో పోతది, రోజిట్టే గడిసిపోతదమ్మా’అని చెప్పాడు. ఆవిడ "బాబూ ఇవాళ ఇంకో లీటరు పాలు ఎక్కువ పోయవూ, అమ్మాయిని చూడ్డానికి మగపెళ్లి వారొస్తున్నారు" అంది. "అట్టాగా అమ్మా, ఇదిగోండి, ఇంకో అరలీటరు ఎక్కువే పోస్తన్నాను. ఎంతమందొస్తారో మీకు తెలవదు కదా!"అని పాలు పోసి వెళ్లిపోయాడు. పది నిముషాల తర్వాత వచ్చిన పేపరతను అచ్యుతరామయ్యగారికి పేపరిస్తూ "అందరికీ పేపరు ఇళ్లలోకి ఇసిరేత్తా, మీకు మాత్రం ఇట్టా సేతుల ఇవ్వబుద్దవుతాది. మీ ఇల్లు గుడిలెక్క గొడతదయ్యా’ అని వెళ్లిపోయాడు. ఆ మాటలు రోజూ వాళ్లూ అనడం. వినడం మామూలైంది. సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండొచ్చుగానీ మనుషుల మధ్య ఉండకూడదన్నది అచ్యుతరామయ్యగారి సిద్దాంతం.

ఆయన బయటకెళ్లి స్వీటూ, హాటూ కొనుక్కొచ్చాడు.

సూర్యుడు ఆకాశంలో పైపైకి ఎగబాకుతూ సమయం పది నిముషాలు తక్కువ పదకొండుకు చేర్చాడు. మనుషులతో సహా ఇళ్లంతా పెళ్లివారికోసం ముస్తాబైంది.

పదకొండుగంటల ఐదు నిముషాలు.

వారింటి గేటు ముందు కారు ఆగింది.

ఆ చప్పుడు విని గేటు తియ్యడానికి వేగంగా వెళ్లాడు అచ్యుతరామయ్యగారు.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్