Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గూఢచారి చిత్రసమీక్ష

goodachari movie review

చిత్రం: గూఢచారి 
తారాగణం: అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ళ, ప్రకాష్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధుశాలిని, రవిప్రకాష్‌, సుప్రియ తదితరులు. 
సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల 
సినిమాటోగ్రఫీ: షానియల్‌ డియో 
దర్శకత్వం: శశికిరణ్‌ టిక్కా 
నిర్మాత: అభిషేక్‌ పిక్చర్స్‌ 
నిర్మాణం: అభిషేక్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 03 ఆగస్ట్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే

చిన్నప్పటినుంచే సీక్రెట్‌ ఏజెంట్‌ కావాలనుకుంటాడు గోపి (అడివి శేష్‌). తండ్రి చనిపోవడంతో మావయ్య సత్య (ప్రకాష్‌రాజ్‌), గోపిని పెంచి పెద్దవాడ్ని చేస్తాడు. సత్య, గోపి తండ్రి.. ఇద్దరూ సీక్రెట్‌ ఏజెంట్సే. అయితే గోపి తండ్రిలా గోపి కూడా సీక్రెట్‌ ఏజెంట్‌ అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాడన్న భయంతో గోపి పేరుని అర్జున్‌గా మార్చుతాడు. పెరిగి పెద్దవాడైన గోపికి సీక్రెట్‌ ఏజెంట్‌ అవ్వాలనే ఆకాంక్ష మాత్రం తగ్గదు. రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఉద్యోగం కోసం 170 సార్లు ప్రయత్నించి ఎలాగైతేనేం, సక్సెస్‌ అవుతాడు. కానీ, కొన్ని పరిణామాలతో అతనిపై దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. ఆ ముద్రని గోపి అలియాస్‌ అర్జున్‌ ఎలా చెరిపేసుకున్నాడు.? అసలు తీవ్రవాది అన్న ముద్ర ఎలా అతనిపై పడింది.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

అడివి శేష్‌ మంచి నటుడని కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో కన్పించి నటుడిగా మెప్పించాడు. ఏ పాత్రలో అయినాసరే తానేంటో నిరూపించుకోవడం అడివి శేష్‌ ప్రత్యేకత. 'పంజా'లో విలన్‌ క్యారెక్టర్‌ అయినా, 'రన్‌ రాజా రన్‌' సినిమాలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో అయినా, 'క్షణం' సినిమాలో పోషించిన పాత్ర అయినా.. అడివి శేష్‌ ఆయా పాత్రలో ఒదిగిపోయిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లు నటించి మెప్పించాడు. జగపతిబాబు పాత్ర సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ అనుకుంటే, సుప్రియ పాత్ర కూడా ఇంకో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌గానే చెప్పుకోవాలి. హీరోయిన్‌ శోభిత ధూళిపాళ్ళ మన తెలుగమ్మాయే. అయితే ఆమె పాత్ర లెంగ్త్‌ తక్కువగా వుంది. వున్నంతలో బాగానే చేసింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

జేమ్స్‌బాండ్‌ తరహా కథలు అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమాని ప్లాన్‌ చేసినందుకు అభినందించాలి. కథ, కథనం అన్నీ ఆకట్టుకుంటాయి. డైలాగ్స్‌ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళాయి. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా వుండడమే కాదు, హాలీవుడ్‌ స్టయిలింగ్‌లో కన్పించింది. ఒకే ఒక్క పాట వుంది, అది కూడా మెలోడీ. ఆకట్టుకునే పాట అది. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి.

సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపైనా కమాండ్‌ వుంది అడివి శేష్‌కి. అందుకే కథ దగ్గర్నుంచి, ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. దర్శకుడు శశికిరణ్‌ టిక్కా విషయానికొస్తే, వున్న పరిమితులకు లోబడి మంచి సినిమా చేయడానికి ప్రయత్నించాడు. మంచి ప్రయత్నాన్ని ఇంకాస్త డెడికేషన్‌తో చేయడానికి ప్రయత్నించినందుకు దర్శకుడ్ని అభినందించాలి. రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని కాదని, కొత్త తరహా సినిమా చేయాలన్న నిర్మాతల ఆలోచనకీ మంచి మార్కులు పడతాయి. సినిమా చూస్తున్నంతసేపూ కొత్త అనుభూతికి లోనవుతాం. హాలీవుడ్‌ స్థాయి సాంకేతిక విలువలు సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళతాయి. అయితే అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నాయనుకోండి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా అయితే చూశామన్న అనుభూతితో ప్రేక్షకుడు థియేటర్‌ నుంచి బయటకొస్తాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే

ఆకట్టుకునే 'గూఢచారి'

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka