Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nammakam

ఈ సంచికలో >> కథలు >> నిలువెత్తు సంస్కారం

niluvettu samskaram

ఆఫీసులో గోడ గడియారం పదిన్నర చూపుతున్నది.

ఒక్కోరూ ప్రభుత్వ కోశాధికారి కార్యాలయం[ట్రెజరీ ఆఫీస్]లోకి రాసాగారు.

ముందుగా వచ్చి ఆఫీసు ముందున్న మునగ చెట్టు నీడలో ముసలి ముత్యాలమ్మ కూర్చునుంది తనకు కావల్సిన ఉద్యోగి కోసం నిరీక్షిస్తూ.

పదకొండు గంటల ప్రాంతంలో జవాన్ జగదీష్ వచ్చాడు.

ముత్యాలమ్మను చూసి" ఏమే ముసల్దానా! అప్పుడే వచ్చావా!మా ప్రాణాలు తియ్యను" అంటూ లోపలికెళ్ళాడు.

అటెండర్ అమృత రావు మరో పది నిముషాలకు వచ్చాడు. ముత్యాలమ్మను చూశాడు.

"ఏం ముసలీ! తెల్లారిందీ!. ఇంకా ఎంత కాలం పెన్షన్ తీసుకుంటావే! ఇంకా పిలుపు రాలేదా!" అని నవ్వుతూ లోపలికెళ్ళాడు.

పేరు ముత్యాల రావే గానీ ముందుగా ముడుపులివ్వందే లోపలికి కాలైనా కదపనివ్వడు.

మరో పది నిముషాలకు గబగబా నడుచుకుంటూ గణేష్ వచ్చాడు. అతడే ముత్యాలమ్మకు కావల్సిన వాడు. ముత్యాలమ్మను చూసి, "ఏవమ్మా! వచ్చావా! నాకంటే ముందే!కూర్చోనుండు." అంటూ లోనికెళ్ళాడు.

ముత్యాలమ్మ కూర్చున్న బండ రాతి మీద చెట్టు నీడ తగ్గి పోయి ఎండ పడుతుండగా లేచి లోపలికెళ్దామనుకుంది. వెళ్ళీ లాభం లేదని ఆమెకు తెల్సు.అందుకే చీర కొంగు తల చుట్టూ తిప్పి కప్పుకుని మళ్ళా కూర్చుంది రాతి మీద.

ఇంకో పది నిముషాలకు ట్రెజరీ ఆఫీసర్ మోటార్ బైక్ మీద వచ్చి దిగాడు, ముత్యాలమ్మను చూశాడు.

"ఏమ్మా! ఎండలో కూర్చున్నావ్! వరండాలోకెళ్ళి కూర్చో." అంటూ లోపలికెళ్ళాడు.

అంతే ఎవరి పనుల్లో వారుండిపోయారు. ఎవ్వరూ ఆమెను లోపలికి పిలిచిందే లేదు... ముడుపుల్లేవుగా!

ఎప్పుడో ఉదయం వచ్చేముందు తిన్న రెండు ఇడ్లీలూ, బస్సు దిగి రెండు కిలోమీటర్లు నడిచి వచ్చిందేమో అరిగి పోయాయి.

ఆకలేస్తున్నది, దాహమూ వేస్తున్నది ముత్యాలమ్మకు.

ఈ రోజు పని కాక పోతే రేపు మళ్ళీ రాను ఆమె వద్ద బస్ చార్జీకి రూకల్లేవు. వేలి ముద్రలు పడక వారం నుంచీ వస్తూనే ఉంది.బస్సుకు పైసలు పోస్తూనే ఉంది.

కడుపులో అన్నంగా పడాల్సిన రూకలు బస్సు పాలవుతుంటే ఏమీ చేయ లేక మౌనంగా ఉంది. ఎప్పుడో మిడ్ వైఫ్ గా రిటైరైన ఆనాటి పెన్షన్ రోజూ గంజి త్రాగను మాత్రం సరిపోతాయి. చేతి ముద్రలు అరిగి పోడం తన తప్పా? డెబ్బై ఐదేళ్ళకు ఇంకా వ్రేలి ముద్రలేముంటాయి. పూర్వం చదువుకోని వారు వ్రేలి ముద్రలు వేసే వారు.భూమి గుండ్రంగా ఉందని మళ్లా వ్రేలి ముద్రల కాలం వచ్చింది. వయస్సులో ఉండగా మంత్రసాని పని చేస్తూ ఎందరికో ప్రాణాలు పోసింది. తాను కానుపు చేసిన తల్లులూ బిడ్దలూ తన పట్ల ఎంత ప్రేమ చూపే వారు. వద్దన్నా ఏవేవో ఇచ్చేవారు. వాటిని తాను తీసుకోక ఆస్పత్రికి వచ్చే పేద తల్లులకు, నిరుపేద గర్భవతులకూ ఇచ్చేసేది.

తన పొట్టకింత అన్నం వండుకుని తినేది. ఆ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే జీతం తనకు సరిపోయేది.

కాదు కాదు సరిపెట్టుకునేది ముత్యాలు.

'ప్రభుత్వం తన నిజాయితీ సేవలను గుర్తించి అవార్డూ ప్రదానం చేసింది. ఐతే అవన్నీ ఈ వయస్సులో దేనికీ పనికి రాకుండా పోయాయి. ఇంకా బతికున్నావని అడిగే ఈ కుర్ర కుంకలకు బతుకు గురించీ ఏం తెల్సు!. వృత్తి పట్ల నిజాయితీ ఏం తెల్సు? వృత్తినే దైవంగా భావించే వారి మనస్సులెంత హాయిగా ఉంటాయో వీరికెవరు చెప్తారు.' అనుకుంటూ కూర్చునుంది.

తినేందుకేమైనా, పండైనా దొరుకుతుందేమోని తల త్రిప్పి చూస్తూ ఉంది. కళ్ళు మసకలైనందున ఎక్కడా స్పష్టంగా ఏమీ కనపడ లేదు. పైగా ఎండ! రోజూ మాట్లాడే వ్యక్తులను మాత్రం వారి స్వరాన్ని విని ఎవరైందీ గుర్తించ గలదు ముత్యాలమ్మ. 

ఇంతలో ఒక కారు వచ్చి చెట్టు క్రింద ఆగింది. దాన్లోంచీ ఒక సూటూ బూటూ వేసుకున్న దొర లాంటి వ్యక్తి దిగాడు. కారు తలుపేసి పక్కనే ఉన్న ముత్యాలమ్మను చూశాడు.

కొద్ది సేపు గమనించి పరిశీలనగా చూసి, ”అమ్మా! మీరు ముత్యాలమ్మ గారు కదూ! ఔనా !" అంటూ దగ్గరగా వచ్చి చేయి పట్టి మాడి పోతున్న బండ మీద కూర్చును న్న ఆమెను లేపాడు.

"ఇక్కడ మండే ఎండలో ఉన్నారేమమ్మా! అక్కడ వరండాలో కూర్చోలేక పోయారూ! అసలెందుకిక్కడ కూర్చున్నారు? పదండి లోపలికి" అంటూ చేయి పట్టి నడిపించ బోయాడు.

"అయ్యా! తమరెవరో నాకు తెలీడం లేదు. ఈమధ్య కళ్ళు మసకలొచ్చి రోజూ వినే గొంతుకలు మాత్రం ఎవరో తెలుస్తున్నాయి. ముఖాలు గుర్తు పట్టలేనయ్యా!" అంది అతడి ముఖాన్ని తేరి పార చూస్తూ.

"అమ్మా! ముప్పై ఏళ్ళ క్రితం, ఆ రోజు బంద్. పురిటి నొప్పులొస్తున్న నిండు గభిణిని ఆస్పత్రికి తీస్కెళ్ళడానికి ఆటోలు కూడా దొరకని పరిస్థితి...అంబులెన్సుకు కాల్ చేద్దామన్నా, అదీ రాలేని పరిస్థితి... కూడా మూసేసి ఉన్న సమయాన మా అమ్మ ప్రసవ సమయమైతే ఎవ్వరూ సహాయం చేసే వారు లేక మా ఇంటి వారు అవస్త పడుతుంటే, ఎవరో మీ పేరు చెప్పగా, మిమ్మల్ని పిలవగానే వచ్చి మా అమ్మ గారికి ప్రసవం చేసి నా ప్రాణాలు, అమ్మ ప్రాణాలు కాపాడారు. మీరు నా జీవన దాత." అంటూ వంగి ముత్యాలు పాదాలకు నమస్కరించాడా వ్యక్తి.

"బాబూ నీవు వర్ధన్ కదూ ! గుర్తొచ్చింది బాబూ! బావున్నావా నాయనా!" అంటూ అతడి చెయ్యి పట్టుకుని ప్రేమగా నిమిరింది ముత్యాలమ్మ.

"మీ దయ వల్ల బతికి బట్టగట్టి బావున్ననమ్మా! ఆ రోజు మీరు వచ్చి సాయం చేయక పోతే అమ్మా నేనూ కూడా బతికే వాళ్ళం కాదుట. మీ కోసం అమ్మ మీరుండే ఇంటికెళ్ళి ఇటీవల చూసింది. ఎక్కడి కెళ్ళింది ఏవ్వరూ చెప్పలేక పోయారు. ఎక్కడుంటున్నారు! అసలు ఇక్కడెందుకున్నారమ్మా! మీరు కాపాడిన ఈ ప్రాణి  ఇప్పుడో పెద్ద ఆఫీసర్." అన్నాడు వర్ధన్  అనే ఆ వ్యక్తి.

"నాయనా! పెన్షన్ కోసం వ్రేలు ముద్రలు వేయాలిట కదా! వేళ్ళు అరిగి పోయి పడలేదయ్యా! రోజూ వారంగా వస్తున్నాను. అన్నం కోసం దాచుకున్న డబ్బులు  బస్సు టికెట్ కోసం ఖర్చై పోయాయి . ఈరోజైనా పనవుతుందేమోని ఎదురు చూస్తూ కూర్చున్నాను. "మరి లోపలి వాళ్ళకు తెల్సా! మీరిక్కడున్నట్లు."

"తెలుసయ్యా! మసకలైనా వారి గొంతుకలు గుర్తు పట్టాను. ముందు ఆఫీసు జవానొచ్చాడు,. ఆ తర్వాత అటెండరొచ్చాడు, తర్వాత క్లర్క్ వచ్చాడు. చివరగా ఆఫీసర్ గారొచ్చారు.ఇప్పుడు మీరొచ్చారు." అంది బోసి నోటితో నవ్వుతూ  ముత్యాలమ్మ.

"మీకు కళ్ళు మసకలు కదా! ఎలా కనిపెట్టారు ఎవరెవరో!"

"దాందేముంది బాబూ! వారి పిలుపును బట్టీ కనిపెట్టాను. సంస్కారం అలా పిలిపిస్తుంటుంది నాయనా! అది వారి తప్పు కాదు. దానికేంలే బాబూ! ముసల్దాన్ని నన్నెలా పిల్చినా ఫరవాలేదులే!  అమ్మగారిని అడిగానని చెప్పు."అంటున్న ముత్యాలమ్మను "పదండి లోపలికి మీ పనెందుకు కాదో చూద్దాం, ఆ తర్వాత మా ఇంటికెళ్దాం. మిమ్మల్ని చూస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది." అంటూ చేయి పట్టుకుని నడిపిస్తున్న నిలువెత్తు సంస్కారాన్ని అనుసరించింది ముత్యాలమ్మ.  

మరిన్ని కథలు