Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...  http://www.gotelugu.com/issue278/734/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి).... ఎవరో ఇద్దరు చెరో రగ్గు కప్పుకుని ఆదమరచి నిద్రపోతున్నారు. ఇద్దర్లో ‘ఆమె’ ఎవరో ఎలా గుర్తించడం? ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

‘‘నిన్న రాత్రిలా ఒకర్ని చంపబోయి ఒకర్ని చంపితే బాస్‌ మనల్ని బ్రతకనివ్వడు. రగ్గు తీసి చూద్దామా?’’ ఒకడు నెమ్మదిగా రెండో వాడి చెవిలో గుసగుసగా అన్నాడు.

‘మరేం చేద్దాం? ఇందులో....ఈ ఇద్దరిలో ‘ఆమె’ ఎవరో ఎలా తెలుస్తుంది?’’ మొదటి వాడు అడిగాడు.

‘‘అనుమానం ఎందుకు? ఇద్దర్నీ చంపేద్దాం! మనక్కావలిసింది ఒక్కరే. కానీ తప్పదు. ఈ రోజు ఎలాగైనా పని పూర్తి చేస్తానని ‘బాస్‌’ దగ్గర వాగ్ధానం చేసాను.’’ కసిగా అన్నాడు రెండోవాడు.

‘‘సరే! కత్తి తియ్యి.’’ అన్నాడు మొదటి వాడు.

అంతే!

పొడవాటి కత్తి తీసి ఒకరి గుండెల్లో బలంగా దించాడు. అంతే వేగంగా కత్తి సర్రున లాగి రెండో వ్యక్తి తేరుకునే లోపు ఆ వ్యక్తి గుండెల్లో కత్తితో పొడిచాడు రంగా.

ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు కెవ్వున అరిచే సరికి అక్కడ పడుకున్న వాళ్లంతా అదిరి పడి రగ్గులన్నీ ప్రక్కకు విసిరేసి లేచి కూర్చున్నారు. హతులిద్దరూ గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచారు.

ఆగంతకులిద్దరూ కత్తి తీసుకుని రోడ్డు మీదకు పరుగందుకున్నారు.

********

షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర వరండాలో ఎవరో ఇద్దర్ని ఘోరంగా హత్య చేసారన్న వార్త గుప్పుమంది.

కాంప్లెక్స్‌లో ఉన్న ప్రయాణీకులంతా తండోపతండాలుగా హత్యాప్రదేశానికి వచ్చి గుమిగూడి చోద్యం చూస్తూ నిలబడ్డారు.

హత్యా వార్త అందగానే పోలీసులు ఆగమేఘాల మీద  వచ్చి అక్కడకు చేరుకున్నారు. టూటౌన్‌ ఎస్సైతో పాటు వచ్చిన కానిస్టేబుళ్ళందరూ గుమిగూడిన జనాల్ని కంట్రోల్‌ చెయ్య లేక పోతున్నారు.

అప్పటి కింకా తెల్లవార లేదు. చీకటి నెమ్మదిగా మందగిస్తోంది. తెల్లవారు ఝామున నాలుగ్గంటలు కావస్తోంది.

సిటీ బస్సు కూడా డిపో నుండి ఒక్కొక్కటి వరుసగా కాంప్లెక్స్‌ కు వచ్చి చేరుకుంటున్నాయి. కాంప్లెక్సు వరండాలో రాత్రి నుండి ఉన్న యాచకులనందర్నీ వరుసగా ఓ మూల నిలబెట్టారు పోలీసులు. అందరూ రగ్గులు కప్పుకుని భయం భయంగా మరణించిన ఇద్దర్నీ చూస్తూ నిలబడ్డారు.

కప్పుకున్న రగ్గుల్లో పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే హత్య చేయబడినట్టుంది. పాపం చలికి రగ్గులు ముసుగారా కప్పుకుని పడుకున్నట్టున్నారు.

మొహాలు చూడకుండా కసిగా చంపేసాడంటే హంతకుడు ఎంతటి నర రూప రాక్షసుడో అర్థమౌతోంది. హతుడొక్కడేనా లేక ఇద్దరు ముగ్గురున్నారా?

ఆలోచిస్తూనే ‘హతులు’ కప్పుకున్న రగ్గులు తొలగించి చూసాడు ఎస్సై అక్భర్‌ ఖాన్‌. ఇద్దరూ ఆడా...మగా...! అమ్మాయి పాతికేళ్ల పిల్లలా ఉంది. మగాడికి నలభై యేళ్ళుంటాయి.

ఇద్దరి గుండెల్లో బలమైన కత్తి పోట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రక్తం ధారలై పారినట్లుంది. ఆ ప్రాంతమంతా రక్తమే. రగ్గులు రెండూ రక్తంతో తడిసి పోయాయి.

ఇంతలో నార్త్‌ ఏ.సి.పి. రావడంతో పోలీసులు అలర్టయ్యారు. హత్యా ప్రదేశం చుట్టూ మూగిన ప్రయాణీకుల్ని చెల్లాచెదురుగా చెదరగొట్టి అసిస్టెంట్‌ పోలీస్‌ కమీషనర్‌ని హత్యా ప్రదేశానికి తీసుకు వెళ్ళారు పోలీసులు.

ఫోరెన్సిక్‌ నిపుణులు హత్యా ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. టూటౌన్‌ ఎస్సై ఆ రాత్రి అక్కడ జరిగిన ఉదంతమంతా ప్రత్యక్ష సాక్షులైన యాచకులందర్నీ అడిగి నోట్‌ చేసుకుంటున్నాడు.

ఆ రాత్రి ఆ వరండాలో హతులతో పాటు పడుకున్న యాచకుందర్నీ ఏ.సి.పి. కి చూపించాడు ఎస్సై.

ఆడా, మగా, ముసలి వాళ్లతో పాటు ఒకరిద్దరు చిన్నపిల్లలు కూడా వాళ్లళ్లో ఉన్నారు. అందరూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో భిక్షమెత్తుకునే యాచకులే. అందర్నీ పరిశీలనగా చూసాడు నార్త్‌ ఏ.సి.పి. ధనరాజ్‌. ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు ఏసిపి. మళ్ళీ మళ్ళీ యాచకులందరి కేసి పరిశీలనగా చూసాడు. సందేహం లేదు. యాచకులందరి దగ్గరా ఒకే రకమైన రగ్గులు కనిపిస్తున్నాయి. ఎలా?! ఎవరైనా వీరికి దానంగా ఇచ్చి ఉండాలి. ఒకే సారి ఇంత మందికి...ఇన్ని రగ్గులు కొని ఇచ్చారంటే ఏదైనా సంస్థ అయి ఉండాలి. అన్నీ కొత్తగా ఉన్నాయి. అంటే ఈ మధ్యే....ఒకటి రెండు రోజుల్లో అందుకున్నవే! ఆలోచిస్తూనే టూటౌన్‌ ఎస్సైని కళ్లతోనే దగ్గరకు రమ్మని పిలిచాడు ఏ.సి.పి.

‘‘వాళ్లందరి దగ్గరా చూసావా?! రగ్గులన్నీ ఒక్కలాగే ఉన్నాయి. అన్నీ కొత్తవే! ఎలా వచ్చాయో?! ఎవరిచ్చారో?! ఆరా తియ్‌’’ అన్నాడు ఏ.సి.పి.

ఏ.సి.పి. గారి ఆలోచనకి ఎస్సై మనసులోనే నవ్వుకున్నాడు.

‘ఆ రగ్గులకి...ఈ మర్డర్లకి ఏమిటి సంబంధం?! ఎవరో పుణ్యాత్ములు వీరికి రగ్గులు దానం చేసి ఉండొచ్చు. ఆ వివరాలు మనకెందుకు?’ మనసులోనే అనుకున్నాడు ఎస్సై. కానీ, ఏ.సి.పి గారి ఆర్డర్‌! తప్పదు కదా అనుకుంటూ యాచకుల దగ్గరకు వెళ్లాడు టూటౌన్‌ ఎస్సై.

యాచకులంతా గజ గజా వణికి పోతూ ఓ మూల గోడనానుకుని నిలబడ్డారు ఎన్నడూ లేనిది...ఎప్పుడూ చూడనిది.... తమలో ఇద్దరు హత్యకు గురి కావడం వారిలో చెప్ప లేనంత ఆందోళన కలిగిస్తోంది.

పోలీసు అధికారి ఏదో చెప్పడంతో ఎస్సై తమ కేసే నడుచుకుంటూ రావడం చూసి యాచకులందరిలో భయం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.

‘‘రోజూ మీరంతా ఇక్కడే పడుకుంటారా?’’ అందరి ముందు అటూ ఇటూ తిరిగుతూ అడిగాడు ఎస్సై. ఎస్సై ప్రశ్నకి అందరూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏం చెప్తే ఏం ముంచుకొస్తుందోనని అందరూ మౌనంగా తలలు దించుకున్నారు.

‘‘చెప్పండి! మీరందరూ ఇలా మౌనంగా ఉంటే అందర్నీ లాక్కుపోయి సెల్‌లో పడెయ్యాల్సి వస్తుంది.’’ కోపంగా అడిగాడు ఎస్సై.

‘‘రోజూ...రోజూ అంటే...ఈ ప్రాంతంలో ఉంటే ఇక్కడే పడుకుంటామండి.’’ నసుగుతూ చెప్పాడొక యాచకుడు. టక్కున ఆగి ఆ యాచకుడి కేసి చూసాడు ఎస్సై.

ఒక కాలు లేదు. ఊతకర్ర చంకలో పెట్టుకుని నిలబడి ఉన్నాడు. మనిషి చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నా ‘అవిటి వాడు’ కావడంతో పాపం బిచ్చ గాడిగా మారి పోయి ఉంటాడు.

‘‘సరే! మీ అందరికీ ఈ రగ్గులు ఎలా వచ్చాయి?’’ అందరి కేసి పరిశీలనగా చూస్తూ అడిగాడు ఎస్సై.

‘‘రగ్గులా....?!’’ అందరూ ఒక్క సారే ఆశ్చర్య పోయారు.

‘‘అవును! రగ్గులే! ఒకేలా ఉన్నాయి. అన్నీ ఒక్కసారే కొన్నట్టున్నాయి. మీకీ ‘రగ్గులు’ ఎవరు దానం చేసారు?’’ ఏ.సి.పి. గారి ఆర్డర్‌ కనుక ఆడగక తప్పదన్నట్టు కాకతాళీయంగా అడిగాడు ఎస్సై.

‘‘రగ్గులా?’’ మళ్లీ అందరూ ఒక్క సారే అవాక్కయి పోతూ అడిగారు.

‘‘ఏం ఎందుకలా అందరూ ఆశ్చర్య పోతున్నారు?’’ ఈసారి ఎస్సై ఆశ్చర్య పోతూ అడిగాడు.

‘‘ఈ రగ్గులు కప్పుకున్న వాళ్ళు చచ్చి పోతారా సార్‌?’’ యాచకుల్లో చిన్నపిల్ల భయంగా ఎస్సై కేసే చూస్తూ అడిగింది.

‘‘చచ్చి పోవడమా? ఎందుకలా అడుగుతున్నావ్‌?’’ ఆ  పిల్ల ప్రశ్నకి మళ్లీ ఆశ్చర్య పోయాడు ఎస్సై. హత్య కావింప బడ్డ శవాల చుట్టూ సుద్ద ముక్కతో గీతలు గీస్తున్నారు కానిస్టేబుల్స్‌. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ ప్రాంతంలో దొరికిన ప్రతి వస్తువు మీద వేలి ముద్రల కోసం అన్వేషిస్తున్నారు.

శవాల మీద ‘రగ్గులు’ తీసి ప్లాస్టిక్‌ కవర్లలో భద్రపరుస్తున్నారు ఫోరెన్సిక్‌ సిబ్బంది.

హత్య చేయబడ్డ యాచకులిద్దరి కేసి పరిశీనగా చూస్తూ నిలబడ్డాడు ఏ.సి.పి.

ఎస్సై తన పని చేసుకు పోతున్నాడు. ఏ.సి.పి గారు చెప్పిన ప్రకారం యాచకులందరినీ విచారిస్తూ నిలబడ్డాడు. ఎస్సై ప్రక్కనే ఒక కానిస్టేబుల్‌ రైటింగ్‌ పేడ్‌ మీద యాచకులు చెప్పిన వివరాలు ఒక్కటీ పొల్లు పోకుండా రాసుకుంటున్నాడు.

ఎస్సై తిరిగి అడిగిన ప్రశ్నకి ఆ పిల్ల టపీమని సమాధానం చెప్పింది. మరి, ఆ ఇద్దర్నీ ఎవరో చంపేస్తే....మాకీ రగ్గులు ఎలా వచ్చాయి. ఎవరిచ్చారేంటని అడుగుతున్నారెందుకండి?’’ అంది.

ఆ పిల్ల అలా సమాధానం చెప్పేసరికి ఎస్సైకి కూడా నవ్వాగలేదు. ఈ పిచ్చి ప్రశ్న తనది కాదు. సాక్షాత్తు ఏ.సి.పి. గారిది ఆ పిల్ల మాటలకి నవ్వొచ్చినా బయట పడకుండా మనసు లోనే నవ్వుకుని ఒక్క సారే గంభీరంగా మారి పోయాడు ఎస్సై.

‘‘నీ యక్ష ప్రశ్నలు ఇంకాపు. ఈ రగ్గులు ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చారు?!’’ కోపం నటిస్తూ అడిగాడు ఎస్సై.

‘‘రాత్రే ఈ రగ్గులు కొనుక్కున్నాం.’’ చెప్పిందొక ముసలి వ్యక్తి.

‘‘రాత్రే కొన్నారా? అందరూ ఒక్క సారేనా?!’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

‘‘అవును. అందరం ఒక్కసారే కొనుక్కున్నాం.’’ అన్నారందరూ ఒక్కసారే.

అందరూ ఒక్కసారే అలా అనేసరికి దూరంగా ఉన్న ఏ.సి.పి.కి వారి మాటకు విస్తుపోతూ వారి దగ్గరకు వచ్చాడు.

‘‘నిజం చెప్పండి. వీటికి డబ్బు ఎవరిచ్చారు?’’ కోపంగా అడిగాడు ఏ.సి.పి.

‘‘మాతోనే పడుకుంది. మా మనిషే. అదే అందరికీ తలో ఒక రగ్గు కొనిపెట్టింది.’’ మరో యాచకుడన్నాడు.

‘‘ఎవరా మనిషి? ఏదీ?! మీలో ఎవరూ ఆ మనిషి?’’ కోపంగా ఏ.సి.పి. గద్దించి అడిగేసరికి అందరూ ‘ఆమె’ కోసం తమలో తాము వెదుక్కున్నారు.

‘‘ఇక్కడే...అదిగో...ఆ స్తంభం దగ్గరే పడుకుంది. చనిపోయిన ఆ పిల్ల  ఆమెతోనే పడుకుంది’’ అందరిలోకి రాత్రి ఆమెని గమనించిన మరో యాచకుడు చెప్పాడు.

‘‘ఏదీ? ఆవిడ ఎక్కడుంది?! మీలో ఎవరావిడ?’’ ఎస్సై కూడా కల్పించుకుని ప్రశ్నించాడు.
అందరూ అందర్నీ తేరిపారా చూసుకున్నారు. రాత్రి అందరికీ రగ్గు కొనిపెట్టిన ఆడమనిషి కనిపించ లేదు.
‘‘అయ్యా! రాత్రి మాతోనే పడుకుంది. ముందు మాలో ఒకరికి రగ్గు కొని ఇచ్చింది. అందరం అడిగే సరికి తలో రగ్గు కొని ఇచ్చింది. మా మనిషే అనుకున్నాం.’’ అన్నాడో యాచకుడు.
 
 
రగ్గులు కొనిచ్చిన " ఆమె " ఆ తర్వాతెప్పుడు అక్కడ్నుంచి మాయమయ్యింది? మరొక్కసారి గురితప్పిన ఆమె సురక్షితంగా (ప్రాణాలతో బయటపడినట్టేనా? ఆమె ఎక్కడికి చేరుకుంది?? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే....)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani