Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue278/733/telugu-serials/katyayani/kaatyayani/

 

(గత సంచిక తరువాయి)..... శ్రీకర్ రావు గట్టిగా అన్నాడు కాని. అందరి ముఖాల్లో ఆశ్చర్యంతో కూడిన అదే భావం ప్రస్ఫూటంగా కనిపిస్తోంది.

"అదేంటండీ" అయ్య వారు కూడా ఆందోళన, ఆశ్చర్యం కలగలిపిన స్వరంతో అడిగారు.

"మా ఒక్కగానొక్క అమ్మాయి కాత్యాయనిని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పసితనంలో గుండెల మీద నడిపించాను, పెద్దయ్యాక చేతులు పట్టుకుని నడక, నడత నేర్పాను. మనం ఎవరింటికైనా వెళ్లినప్పుడు ఒకటి రెండు రోజులు మించి ఉండలేం. మన ఇంటికి మనం వస్తేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆడపిల్లకు పెళ్లిచేసి అత్తారింటికంటూ తెలియని ఇంటికి పంపడమేంటో నాకు అర్థం కాదు. నేను ఇంతవరకు మా ఆవిణ్ని గట్టిగా ఒక్క సారీ కేకలెయ్య లేదు. ఈ ఇంట్లో తనకూ సమాన ప్రాతినిధ్యం ఉందని విశ్వసించాను. అలాగే అన్ని విషయాల్లోనూ ప్రవర్తించాను. కానీ అందరి ఆడవాళ్ల విషయంలో ఇలా జరుగుతుందని చెప్పలేం.

అత్తింట్లో అత్తగారు, మామగారు, ఆడబడుచులు, మరుదులు ఇలా వీరిలో ఏ ఒక్కరికి శారీరకంగా, మానసికంగా హింసించే మనస్తత్వం ఉన్నా, ఆ పిల్ల జీవితం పల్లేరు కాయల మీద నడకే. మొగుడే శాడిస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. దిన దిన గండం నూరేళ్లాయుష్హు. మండే నిప్పు కణికల మీద నడక. ఎన్ని బాధలున్నా మనసులో దాచుకుని భరించాలి. అందుకేనేమో బహుశా ఓర్పుకు ఆడది పర్యాయ పదమని మన వాళ్లు కితాబులిచ్చారు. మన సంస్కృతీ సంప్రదాయం గొప్పదంటారు కాని ఈ వివాహాల విషయంలో మాత్రం నాకెందుకో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది.

నా వరకూ నాకు మా అమ్మాయంటే పంచప్రాణాలు. చెబితే గొప్పలు చెబుతున్నాననుకుంటారు గానీ, ఒక రోజు గేటు నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు కాల్లో ముళ్లు దిగిందని, గేటు నుంచి మా గుమ్మం వరకూ బండలేయించాను. నా చిట్టి తల్లి తెలివైనదైనా, టెంత్ లో స్కూల్ ఫస్ట్ వచ్చినా, పై చదువులు చదివించ లేదు. ఎందుకంటే, ఏ కుర్రాడు ఉడుకు రక్తంతో మా అమ్మాయికి ఏం ప్రమాదం తలపెడతాడోనని. అలాంటివి జరగడం మాట అటుంచి, కనీసం ఊహించ లేను. గుండె కొట్టుకోవడం ఆగి పోతుంది. రోజూ పేపర్లలో టీవీల్లో న్యూసులు అవే కదా! అంతా అయ్యాక విచారణలు, శిక్షల వల్ల ఏమిటి ప్రయోజనం? చేతులు కాలాక చందమే..!

అసలు కన్యాదానం, పిల్లనివ్వడం పదాలు ఉపయోగించడం నాకు సుతరాము ఇష్టం ఉండదు. పిల్లను వస్తువుగా చూడబట్టే కదా మాటల్లో ఈ పైత్యాలు? పిల్లకి పెళ్లి చేసి ఏ మూలకో పంపిస్తే, ఆమె ఒంట్లో నలతగా ఉందంటే మేమిక్కడ ప్రశాంతంగా ఉండ గలమా? అత్తింట్లో పిల్లని ఆరళ్లు పెడుతున్నారంటే తట్టుకో గలమా? వెళ్లి చూడొచ్చు. సరి చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ ఉన్న ఊళ్లోనే పిల్ల పెళ్లి చేద్దామనుకుంటున్నాను. పిల్ల కంటి ముందు కనిపిస్తుంటుంది. రేపు మీ అబ్బాయితో పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇంకేమన్నా ఉందా? ఎప్పుడన్నా అమ్మాయికి ఒంట్లో బాగా లేదని, మొగుడూ-పెళ్లాల మధ్యా అపోహలు, అపార్థాలూ చోటు చేసుకున్నాయని తెలిస్తే ఇక్కడ మా గుండెలు బీటలు వారి పోతాయి. పోనీ అది రాత్రికి రైలో, బస్సో ఎక్కితే తెల్లారే సరికల్లా చేరుకునే ఊరు కాదు. ఖండాంతరాలు, సముద్రాలూ దాటి పోవడం.

దయ చేసి ఈ ఆడపిల్ల తండ్రి మనో వేదన అర్థం చేసుకుని నన్ను క్షమించండి. మంచి సంబంధం అంటే ఊఁ అన్నాను గాని, అబ్బాయి అమెరికాలో ఉంటాడని తెలియదు. తెలిస్తే ఇంత వరకూ రానిచ్చి, ఇబ్బంది పెట్టే వాడిని కాదు" ఉత్తరీయంతో కళ్లు తుడుచుకుంటూ జీర గొంతుకతో మనసులోని బాధను వ్యక్తం చేశాడు అచ్యుత రామయ్య గారు.

"అందరూ అలా ఆడపిల్లకి అన్యాయం చేసే వాళ్లే ఉంటారనుకుంటే ఎలాగండి? మాకు ఆడపిల్లలు లేరు అమ్మాయిని లక్ష్మీదేవిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. మా అబ్బాయి మీ అమ్మాయి గురించీ, మీ గురించీ విని పెళ్లి చూపులకు ఒప్పుకున్నాడు. మీరు మరొక్క సారి ఆలోచించండి."అంది పిల్లాడి తల్లి ప్రణతి.

"అవునండీ" అంది ఆమె తోటికోడలు.

"అయ్యా..నాకు మీ గురించీ తెలుసు, వారి గురించీ తెలుసు. ఇరు కుటుంబాలనూ పెళ్లి పేరుతో కలిపేసి చేతులు దులుపుకునే వాణ్ని నేను కాదన్న సంగతి మీకూ తెలుసు. మంచి సంబంధాలు, అదీ నాకు బాగా తెలిస్తేనే- ముందడుగు వేస్తాను. మనసులో ఎటువంటి సంశయాలూ పెట్టుకోక ముందడుగేయండి అచ్యుత రామయ్య గారూ" అన్నాడు అయ్యవారు సమాధాన పరుస్తున్నట్టుగా.

"నన్ను క్షమించండి అయ్యవారు. ఇప్పుడు మొహమాటానికి తలూపితే, తర్వాత మనశ్శాంతిని పోగొట్టుకుంటాను. దయ చేసి ఇబ్బంది పెట్టకండి" అన్నాడు చేతులు జోడిస్తూ

"ఆడపిల్ల తండ్రిగా మీ ఆవేదన అర్థం చేసుకున్నాం అచ్యుత రామయ్య గారూ, అందులో నాకూ తప్పేం అనిపించడం లేదు. బహుశా నాకు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఉన్నా మీలాగే ఆలోచించే వాడినేమో. మా మంచితనం మీద మీకు ఎంత నమ్మకం కలిగించినా, మీ మనసులో ఏర్పడే శూన్యాన్ని నింపలేం. మేము వెళ్లొస్తామండి" అంటూ లేచాడు.

అందర్నీ గేటు దాకా సాగనంపి, వాళ్లు వెళ్లి పోయాక ఇంట్లోకొచ్చి కూతురు వంక చూశాడు.

ఆమె కళ్లలో నీళ్లు.

***

కాత్యాయని కళ్ళనీళ్ళకు అర్థమేమిటి? తనపట్ల తండ్రికున్న ఆప్య్యాయతకు ఆనందభాష్పాలా? లేక ఆశపడిన అమెరికా సంబంధాన్ని తండ్రి కాదన్నందుకా?? ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే...

 

 

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్