Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై మూడవ భాగం

Anubandhaalu telugu serial  twenty third Part

"నీకూ కళ్ళు తిరిగాయా? చూసావా మీరు తాగిన బీరులో మేం కలిపిన మత్తుమందు ఎంత చక్కగా పనిచేస్తోందో. వాడు పడిపోయాడు. నువ్వూ పడిపోతున్నావు. మా పని సులువైపోతుంది. అంటూ వికటంగా మళ్లీ నవ్వాడు.

ఆ నవ్వు చూస్తూనే ఏదో కుట్ర జరిగిందని గ్రహించేసింది శివానీ.

భయంతో శక్తినంతా కూడగట్టుకుంటూ అనంత్ దగ్గరకు వెళ్లింది.

"అన్నయ్యా లేవరా. వీళ్లేదో చెడు ఉద్దేశంతో ఉన్నట్టున్నారురా? లే అన్నయ్యా వెళ్ళిపోదాం..." అంటూ అనంత్ ని భుజాలు పట్టి కుదిపింది. బలవంతంగా కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం చేశాడు అనంత్. ప్రపంచం గిర్రున తిరిగినట్టుంది. వాళ్ల మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. లేవాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. శివానీకి అర్ధమవుతోంది. తను తెలివితప్పే పరిస్థితి వస్తోందని, అన్నాచెల్లెళ్ళ పరిస్థితి చూసి వెకిలిగా నవ్వాడు గణపతి.

"ఏమిటి అమెరికా నుంచి వచ్చావ్. అక్కడ డేటింగ్ చేస్తారటగా అమ్మాయిలు. ఇక్కడ డేటింగ్ చేయకూడదా? ఈ గణపతి కన్ను పడ్డాక ఎలాంటి పిల్లలయినా పక్కలోకి రావాల్సిందే. నువ్వేమిటి నేను తలచుకుంటే ఏ పిల్లా తప్పించుకోలేదు. ఇవాళ మా నలుగురికీ విందు భోజనం నువ్వే. నా పుట్టినరోజు కానుకగా నా ఫ్రెండ్స్ కి నిన్ను పంచుతున్నాను. రావే" అంటూ శివానీని పక్కకు లాగాడు. శక్తినంతా కూడదీసుకుని గణపతి చెంపమీద కొట్టింది శివాని. ఇంతలో పరిస్థితి గ్రహించి, చెల్లెలిని కాపాడుకోవడం కోసం శక్తినంతా బిగబట్టి లేచే ప్రయత్నం చేశాడు అనంతసాయి. అది చూసి మిగిలిన వాళ్ళు అతని మీద దాడి చేసి కొట్టారు. ఆశక్తుడై దెబ్బలు తిని మత్తుమందు ప్రభావంతో పూర్తిగా స్పృహ కోల్పోయాడు అనంత్.

శివానీకి తమ తప్పేమిటో అప్పటికిగానీ అర్ధం కాలేదు. పారిపోవాలని ప్రయత్నించినా ఒళ్ళు సహకరించడం లేదు. శక్తి కూడదీసుకోవడం అసాధ్యమైపోతుంది. తన అందమే తన శత్రువైంది. దుర్మార్గులు తన శీలాన్ని దోచుకోబోతున్నారు. నిలువునా మత్తు ఆవరిస్తోంది. ఆమె కళ్లవెంట కన్నీరు ప్రవహిస్తోంది. కాపాడమని అరవడానికి కూడా శక్తి చాలడం లేదు. గణపతి ఆమెను ఎత్తి బెడ్ మీద పడేశాడు. ఆమె మీద పడేందుకు ముందుగా వంగాడు.

ఇంతలో ఊహించని సంఘటన. ఎక్కడో కిటికీ అద్దాల భల్లున పగిలిన శబ్దం విన్పించింది. ఉలిక్కిపడి అటు చూశారంతా. అద్దం పగిలింది పక్క గది కిటికీ దగ్గర.

"కిటికీ అద్దం పగలగొట్టింది ఎవరో చూడండ్రా? ఆ గదిలోకెళ్ళి చూడండి?" అనరిచాడు గణపతి. మిగిలిన వాళ్ళు, అటు కదిలేలోపే లోనకొస్తూ కన్పించాడు ఓ యువకుడు. చేతిలో సెల్ ఫోన్ ని జేబులో వేసుకుంటూ "హలో ఎవ్రిబడీ... హౌ ఆర్ యూ" అంటూ పలకరించాడు.

"ఎంత ధైర్యం నీకు మా గెస్ట్ హౌస్ కి వచ్చి, మమ్మల్నే పరామర్శిస్తున్నావు?" అంటూ శివానీని వదిలి కోపంగా ముందుకు వచ్చాడు గణపతి.

"ధైర్యం గురించి మాట్లాడకు బ్రదర్. మీలాంటి గుంటనక్కలకి దొంగ దెబ్బ తీయడం తప్ప ధైర్యంగా పోరాడే ధైర్యం ఎక్కడుంటుంది.

"నా పేరు నవీన్. అది నా మరదలు. వాడు నా బావ. ఈ వివరాలు చాలనుకుంటా? నీకెంత ధైర్యం ఉంటే ఈ పిల్ల మీద చెయ్యివేస్తావురా?" అంటూ ఊహించని విధంగా గుద్దాడు ముఖం మీద. దెబ్బకు ముక్కు చితికి గొల్లున అరిచాడు గణపతి.

"ఒరేయ్ ఎం.పి. కొడుకు మీద చెయ్యి వేస్తావా? ప్రాణాలతో బయటకు పోలేవురా..." అని అరిచాడు.

"ఎం.పి.నా మీ నాన్న. ఎం.పీ., ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పిల్లలమని చెప్పుకోకండిరా... పరువులు పోతాయ్. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికొదిలేసి 40 వేల కోట్లు తిని జైల్లో కూర్చున్నాడొకడు. వాడికి సిగ్గులేదు, మీ నాన్నకు సిగ్గులేదు. వాడేమో వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొని ఇంకా చాలదని పార్టీ పెట్టాడు. మిగిలినవి దోచుకుందామని, మీ నాన్న వంద ఎకరాలు కబ్జా చేసి, నీలాంటి నీచుడ్ని కన్నాడు.

ఈ రోజుల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎం.పీ. లకు గౌరవం ఎక్కడుందిరా? దోపిడీ దొంగల్నెవరు నమ్ముతార్రా...?

అరేయ్ అరకుపట్టి, పొలం దున్ని రాటుదేలిన చేతుల్రా ఇవి. నా ప్రాణం తీసే సత్తామీకెక్కడిది? ఎం.పి. కొడుకువైతే నాకేమిటి? సి.యం. బామ్మర్దివైతే నాకేమిట్రా? మేం వున్నామన్న ధైర్యంతో మా మావయ్య వీళ్ళని మా వద్దకు పంపించాడు. వీళ్లని అమాయకుల్ని చేసి మోసం చేస్తే చంపేస్తాను. వీళ్లకెవరూ లేరనుకుంటున్నారా? మీయవ్వ రండ్రా! ఏమాత్రం చంపుతారో నేనూ చూస్తాను" అంటూ ఎడాపెడా ఇద్దరి ముఖాల్ని పడగొట్టాడు నవీన్.

బెడ్ మీద పడున్న శివానీకి తన బావ నవీన్ మాటలు వినబడుతున్నాయి. అతనిక్కడికి ఎలా వచ్చాడన్నది అలా ఉంచితే తమను కాపాడ్డానికే బావ వచ్చాడన్న సంతోషమే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ సంతోషంలోనే ఆమె స్పృహ తప్పిపోయింది. ఆలోపల గణపతి వర్గం ఎలాగైనా నవీన్ ను పడగొట్టాలని అతన్ని చుట్టముట్టేసింది. చేతికందినది నోటికందలేనట్టు శివాని అందాలతో తన మిత్రులతో పుట్టినరోజు చేసుకోవాలనుకున్న ఆశలకు విఘాతం కలగడంతో కోపంతో భగ్గుమన్నాడు. నలుగురు నవీన్ ని చుట్టుముట్టి పడగొట్టాలని చూశారు. అది సాధ్యంకాని పనని కాసేపటికే వాళ్లకు అర్ధమైంది. అదంతా దేనికి అనంతసాయి స్పృహలో ఉంటే వాళ్లని మట్టికరిపించేవాడు. ఐదు నిమిషాల సేపు ఆ రూమంతా అరుపులతో హోరెత్తింది. ఖరీదైన ఫర్నీచర్ ధ్వంసమైంది. గణపతి వర్గం నవీన్ చేతుల్లో చావు దెబ్బలు తింది. కొట్టడంలో వెనకా ముందూ చూడలేదు. నవీన్ విరగ్గొట్టి వదిలాడు. రక్తం చిందేలా కొట్టాడు. నలుగుర్నీ లాగి ఒకేచోట పడేశాడు.

"ఒరేయ్ ఎక్కడ్నుంచి వచ్చావురా? మా డాడీకి ఒక్కఫోన్ కొట్టానంటే చాలు... నువ్వు హైదరాబాద్ వదిలి బయటకు పోలేవు."

"ఇప్పుడు మీ నలుగుర్నీ చంపేసి మా వాళ్లను తీసుకుని వెళ్లిపోయాననుకో అప్పుడు ఏ సమస్యా ఉండదుగా? ఓ.కే. చంపమంటావా? మూలనున్న ఇనుపరాడ్ అందుకుంటూ
అడిగాడు. నవీన్ అతడి దూకుడు చూసి కంగారుగా వెనక్కి జరిగారు నలుగురూ.

"వద్దూ చంపొద్దు" అని అరిచాడు.

"రేయ్ మీకన్నా ముదుర్ని తప్పు చేస్తే జాయింట్లు తప్పించేయడం అలవాటు. కుర్రాళ్ళని జాలిపడి ఇంతటితో వదిలేస్తున్నాను. ఇక అసలు విషయానికొచ్చేద్దాం. మావాళ్ల దగ్గర తీసుకున్న మూడు లక్షలు ఎక్కడున్నాయి?"

"మూడు లక్షలా? లేదే మాకేం తెలుసు?" నసిగాడు గణపతి.

వాడి మాటలు పూర్తికాకముందే నవీన్ చేతిలో ఇనుప ఊచ దారుణంగా వాడి ముఖాన్ని తాకింది. ముఖం చీరుకుపోయి ప్రాణం పోతున్నట్టు అరిచాడు గణపతి.

"రేయ్ గణపతీ! బయట నీ మనుషులిద్దరూ, ఆ అమ్మాయిలిద్దరూ వాళ్ళిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఇక్కడైతే మీ కీచక పర్వానికి బాగుంటుందని మావాళ్ళని ఇక్కడికి నమ్మించి తీసుకువచ్చావ్. ఇప్పుడు ఇదే చోట మీరు అరిచినా, చచ్చినా మీ గోడు ఎవరూ వినరు. మూడు లక్షలు అసలు దానికి వడ్డీ ఓ యాభై వేలు మొత్తం మూడున్నర లక్షలు వడ్డీతో సహా అరగంటలో ఇక్కడుండాలి. లేదంటే మీ నలుగుర్నీ చంపి మా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను. వెంటనే డబ్బులు ఏర్పాటు చెయ్యి" అంటూ సోఫాలో కూర్చున్నాడు నవీన్.

ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించాడు గణపతి.

"ఏమిటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేసి డబ్బు పట్రామని చెప్పరా? మీ బాబుకి ఫోన్ చేస్తావో, ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తావో నీ ఇష్టం. అరగంటలో డబ్బు ఇక్కడుండాలి. ఫోన్లో డబ్బు గురించి తప్ప ఇంకేం మాట్లాడినా చస్తావ్. ఫోన్ చేయ్" అంటూ హెచ్చరించాడు నవీన్.

గణపతి తన సెల్ నుంచి ఎవడో ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు. మూడున్నర లక్షలు తీసుకొని వెంటనే గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పాడు.

ఇరవై నిమిషాల తర్వాత బయట అలికడయింది. నవీన్ తలుపు తీసాడు. చేతిలో బ్రీఫ్ కేస్ తో ఒక యువకుడు లోనకొచ్చాడు. వాడి చేతిలో బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు నవీన్. మూడున్నర లక్షలకి కేష్ రెడీగా ఉంది. వచ్చిన యువకుడు అక్కడి పరిస్థితి చూసి షాకయ్యాడు.

నువ్వు ఎవరో మంచివాడిలా ఉన్నావ్. ఇలాంటి వెధవలతో స్నేహం చేస్తే ఓ రోజు నీ గతీ ఇంతే. అంటూ కిటికీ అద్దం పగిలిన మధ్యగది డోర్స్ లాక్ చేసాడు నవీన్. మరదలు శివానీని ఎత్తి భుజంమ్మీద వేసుకున్నాడు. ఐరన్ రాడ్ ని చేతిలోనే పట్టుకున్నాడు.

పద వాడు నా బావ. వాడిని భుజానికెత్తుకొని నాతో రా" అంటూ ఓ యువకుడిని హెచ్చరించాడు. అతను మరోసారి చెప్పించుకోలేదు. అనంతసాయిని భుజంమ్మీద వేసుకొని బయల్దేరాడు. ఇద్దరూ బయటకు రాగానే ఆ గదిలో నలుగురిని అలాగే ఉంచి, గదికి తాళం వేసాడు. గెస్ట్ హౌస్ లోంచి వీధిలోకొచ్చాడు. పక్కనే చెట్టుకింద చీకట్లో ఉంది కారొకటి. ఆ కార్లో వెనక సీట్లో అనంతసాయిని పడుకోబెట్టించాడు. శివానీని ముందు సీట్లో పడుకోబెట్టాడు. డబ్బుతో ఉన్న బ్రీఫ్ కేస్ లోన పెట్టాడు. ఇక నువ్వు వెళ్ళిపో. ఆ వెధవల్ని బయటకు తీయకు. అది నీకే మంచిది కాదు. నీ దారిన వెళ్ళిపో అంటూ ఆ యువకుడికి హితవు చెప్పి, డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ అయ్యి, కన్ను మూసి తెరిచేలోగా వీధి మలుపు తిరిగింది. నవీన్ కు తెలుసు పరిస్థితి.

పొరపాటున గణపతి తన తండ్రికి ఫోన్ చేసి చెప్తే, పోలీసులు నగరం దాటే లోపలే తన కారుని ఆపేస్తారు. ఫ్రెండు కారు తీసుకొని అన్నాచెల్లెల్లిద్దరినీ ఫాలో చేసి వచ్చాడు కాబట్టి శివానీ పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. లేకపోతే పరిస్థితి ఏమిటి?

ఎక్కడా సిటీలో ఆగలేదు నవీన్. గంట లోపలే కారు నగర సరిహద్దుల్ని దాటి బయటకు వచ్చేసింది. ఒక డాబా హౌస్ దగ్గర కారాపి, కొద్దిగా టిఫిన్ తీసుకొని, టీ తాగి, తిరిగి ప్రయాణమయ్యాడు. ఆ కారు మున్నలూరు చేరుకునే సరికి రాత్రి సుమారు రెండు గంటలయ్యింది.

అనంతసాయికి తిరిగి స్పృహ వచ్చేసరికి మరునాడు ఉదయం తొమ్మిదిగంటలు దాటింది. మొదట ఏం జరిగింది? తను ఎక్కడ ఉన్నాడో ఏం గుర్తుకు రాలేదు. కళ్ళు మంటలు పుడుతున్నాయి. చెవుల్లో హోరు. తలంతా సూదులతో గుచ్చుకున్నంత నొప్పి. కళ్ళు తెరవడం కష్టమైంది. మూడు నిమిషాల తరువాత రాత్రి సంఘటనలు ఒక్కొక్కటి గుర్తుకురావడం ఆరంభించాయి. గణపతి పుట్టినరోజు అని చెప్పి గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లడం, మత్తుమందు కలిపిన బీరు తాగడంతో తను తల తిరిగి కూలబడడం, శివానీ... వాళ్ల గురి శివానీ అని అర్ధమైనా తను ఏం చేయలేకపోయాడు. వాళ్లు తనను దారుణంగా కొడుతుండగా స్పృహ తప్పింది. తరువాత తరువాత ఏమైంది? చెల్లాయి ఏమైంది?" శివానీ గుర్తుకురాగానే ఒక్కసారిగా అతన్ని ఆవరించుకున్న మత్తు విడిపోయినట్టయింది. దిగ్గున లేచి, కూర్చుని చుట్టూ చూసాడు.

ఆశ్చర్యం ఇది గెస్ట్ హౌస్ కాదు. మున్నలూరు డాబా ఇంట్లోని తన బెడ్ రూమ్. ఏమిటిది? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? పైగా తన వంటిమీద గాయాలకు ఆయింట్ మెంట్ పూసారు? ఒకటి రెండు చోట్ల బాండ్ ఎయాడ్ వేసారు. తను ఎలా వచ్చాడు ఇక్కడికి? చెల్లాయి ఏమైంది? ఒక్కసారిగా ఏర్పడిన టెన్షన్ లో శివానీ కోసం బెడ్ దిగాడు. కానీ ఒంట్లో కొంచెం కూడా శక్తిలేనట్టు తూలిపడిపోయాడు. తనను తాను నిగ్రమించుకుంటూ శక్తిని కూడదీసుకుని లేచి నిలబడాలని ప్రయత్నించాడు. సరిగ్గా అప్పుడే తలుపు తీసి గదిలోకొస్తున్న మహేశ్వరి ఆ దృశ్యం చూసి కంగారుపడింది.

"బావా... ఆగు... ఏమైంది?" అంటూ పరుగుపరుగున వచ్చి తిరిగి అతన్ని పడిపోకుండా పట్టుకొని లేపి అతడి చేతిని తన భుజంమ్మీద వేసుకుంది.

కట్టలు తెంచుకోబోతున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకున్నాడు అనంతసాయి.

"చెల్లాయి... చెల్లాయి... ఎక్కడుంది? ఎలా ఉంది?" అనడిగాడు తడబడుతూ.

"ఎలా ఉండడం ఏమిటి బావా?... తన గదిలో నిక్షేపంగా ఉంది. అయినా ఏమైంది నీకు? ఈ దెబ్బలేమిటి? రాత్రి ఇద్దరూ కలిసి రాలేదా? అంటూ అడుగుతుంటే ఆశ్చర్యపోవడం అనంత్ వంతయింది.

"ఏదో అద్భుతం జరిగింది. లేకపోతే తెల్లవారేసరికి తామిద్దరూ మున్నలూరులో ఉండడం ఏమిటి? మహీ ప్లీజ్ నన్ను శివానీ గదిలోకి తీసుకెళ్లు." అడిగాడు.

"ఏమైంది బావా? పడతావు జాగ్రత్త" అంటూ తన భుజంమ్మీద అతడి చేతిని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా నడిపించింది.

అలా జాగ్రత్తగా ఆమె తనను గది బయటకు నడిపిస్తుంటే తనకి ఇప్పుడేకాదు తన జావితానికే ఆమె ఆధారంగా నిలబడిన భావనేదో అతడి అంతరంగంలో వసంతరాగంలా విన్పించింది. కొంచెం కూడా బిడియపడకుండా ఆమె తనని హత్తుకొని నడిపిస్తుంటే ఇది ఏడడుగుల సంబంధమా? అనే అనుమానం కూడా కల్గింది. బావా మరదళ్ల అనుబంధంలో ఇంత తీపి బంధం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. మహేశ్వరి అతన్ని హాల్లోకి తీసుకొచ్చి పక్కనే ఉన్న శివానీ గదిలోకి తీసుకెళ్ళింది. అప్పుడే శివానీ లేచి ముఖం కడుక్కొని దీర్ఘాలోచనతో బెడ్ మీద పడుకుంది. లోనకోస్తున్న ఇద్దర్నీ చూసి లేచి కూర్చుంది.

"అన్నయ్యా! ఇప్పుడెలా ఉంది" ఒంట్లో కంగారును అణుచుకుంటూ అడిగింది.

"పరవాలేదు" అన్నాడు అనంతసాయి. అతన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది మహేశ్వరి.

"అసలేం జరిగింది రాత్రి? మీరెప్పుడొచ్చారు? మీరేదో దాస్తున్నారు." అంది అనుమానంగా మహేశ్వరి.

"అదేం లేదు మహీ. రాత్రి కొంచెం బీరు ఎక్కువై తూలిపడ్డాను. చిన్న చిన్న దెబ్బలు నో ప్రాబ్లమ్. తలపోటుగా ఉంది. కొంచెం టీ తెస్తావా?" అనడిగాడు అనంత్.

"సరే. మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడే తీసుకొస్తా బావా. ముందు వెళ్లి ముఖం, కాళ్లుచేతులు కడుక్కొని మంచినీరు తాగు. నీరసం తగ్గుతుంది." అంటూ సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహేశ్వరి.

మహేశ్వరి వెళ్లగానే ఇక దుఃఖం ఆపుకోలేక చిన్నగా ఏడ్చింది శివాని.

"సారీ చెల్లాయ్. ఆ రాస్కెల్స్ మనల్ని ఇంత మోసం చేస్తారనుకోలేదు. నిన్ను కాపాడలేని అసమర్ధుడినయ్యాను." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అనంత్.

"సమయానికి బావ రాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగాం. లేకపోతే వాళ్లు నిజం బయటపడుతుందని మన ప్రాణాలు తీసినా ఆశ్చర్యంలేదు" అంది దుఃఖం ఆపుకుంటూ.

తన చెవుల్ని నమ్మలేనట్టు చూశాడు అనంత్. చెల్లాయి ఏమిటి నువ్వంటున్నది. బావ నవీన్ అక్కడకొచ్చాడా? ఆత్రంగా అడిగాడు.

"రావడమేకాదు వాళ్లని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. అంతవరకే తెలుసు. తరువాత నేనూ తెలివితప్పి పడిపోయాను. లేచిచూస్తే నా గదిలో ఉన్నాను. కనీసం థాంక్స్ చెప్పాలన్నా తెల్లారి నా ముఖం చూడ్డానికి రాలేదు." అంది బాధగా.

నవీన్ సమయానికి వచ్చి శివానీని కాపాడాడని తెలీగానే గుండెల మీద పెద్ద బరువు తొలగిపోయినట్టు ఆనందంతో ఊపిరి తీసుకున్నాడు అనంత్. అయినా ఇంకా వీడని
సందేహంతో "ఆ గణపతి నిన్నేం చేయలేదు కదా... బావ వచ్చేసరికి..." అంటూ నసిగాడు.

"అన్నయ్యా! నాకేం కాలేదు. ఆ గణపతి నా వంటి మీద చెయ్యి వేసేలోపే బావ లోనకోచ్చేశాడు. అంతా కలలా ఉంది. ఖచ్చితంగా మనకేదో జరుగుతుందని ఊహించి మన వెనకే బావ హైదరాబాద్ వచ్చి ఉంటాడు. లేకపోతే చెప్పినట్టుగా సమయానికి గెస్ట్ హౌస్ కి రావడం అసాధ్యం.

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
illalu story by mungara shankara raju