Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu telugu serial  twenty third Part

ఈ సంచికలో >> సీరియల్స్

ఇల్లాలు - ముంగర శంకరరాజు

illalu story by mungara shankara raju

పట్టణం నడిబొడ్డులో కిక్కిరిసిన ఇండ్ల మధ్య వుంది ఆ యిల్లు. అది సత్రం లాంటి యిల్లు. అందరూ దాన్ని 'చాకమ్మ దేవిడీ' అంటారు. ఆ వూరిలో అద్దె కొంప కావలసినవారు చాకమ్మ దేవిడీని తడిమితే చేటంత చోటు దొరక్కపోదు.

తెల్లవాని కాలంలో అది ఒక బందిఖానా. ఇప్పుడు నల్లవాని యేలుబడిలో 'కాపురాల ఖానా' గా పేరు మార్చుకొని కామందు చాకమ్మకు కల్పవృక్షంలా నెల నెలా డబ్బులు రాల్చి పెడుతూంది.

మధ్య బయలు, బయల్లో చేదబావి. బావికి కొంచెం యెడంగా చుట్టూ గువ్వ గూళ్లలాంటి గదులు, ఒకో గదిలో ఒకో కాపురం. అన్నీ కలిసి పదకొండు కాపురాలు, ఆడా మగా - పిల్లా పిసుకూ అంతా 'వెరశి యాభై మంది' చాకమ్మ దేవిడీలో తలదాచుకుంటున్నారు, గొడుగంత గోవర్ధనగిరికింద మొత్తం గొల్లపల్లె ఒదిగిట్లుగా, వానాకాలంలో పిసపిస - ఎండాకాలంలో ఒరుసుకుంటూ తప్పుకుంటూ శాపగ్రస్తుల్లా ఒద్దికగా కాపురాలు చేసుకుంటున్నాము.

కుడిచేతి ప్రక్క నాలుగోగడి (గని) లో నేనూ, సుభద్రా, పెద్దోడూ, చిన్నోడూ, చంటిదీ వెరశి అయిదుమంది అయిదేండ్లుగా ఉంటున్నాము.

ఎండాకాలం రాత్రుల్లో భోజనాలవుతూనే గబగబా గూళ్ళలోనుండి వెలికి వచ్చి బయల్లో బావిచుట్టూ పక్కలు వేసుకుని పడుకుంటాము.

ఆ రోజు రాత్రి తొమ్మిదయింది. ఉక్కబెడుతూంది. పేరుకుగూడా గాలి లేదు. సన్నాపన్నా గాలివున్నా, కాళ్లీడ్చుకుంటూ సందులు దాటి ఆ గొందిలోనికి చొచ్చుకురాలేదు. చంటిదానికి అమ్మ వారు పోసింది. గదిముందు వరండాలో ఉయ్యాల్లో పొర్లుతూంది. నేను చెయ్యి కడుక్కుంటూనే చాపా - దిండూ లేసికొని బావిదగ్గర బయల్లోకి వచ్చేశాను.

గంట చుట్టూ కప్పలు చేరినట్లు అప్పటికే అక్కడ చాలామంది మగవారు బావి చుట్టూ తమతమ తావుల్లో పక్కలు పరచుకొని ఉక్కగా విసురుకుంటూ చుట్టలూ, సిగరెట్లూ ముట్టించుకొని బాతాఖానీ సాగిస్తున్నారు.

అక్కడ ఎవరి చోటు వారిదే. మరోకరు ఆక్రమించుకోరు. ఆయా కుటుంబాలవాళ్ళు తమ తమ తావుల్లో అట్లా సర్దుకొని పడుకుంటారు.

అప్పటికే అక్కడ పడక వేసుకొని సిగరెట్టు కాలుస్తూ కూర్చొనివున్న రామమూర్తి "రండి మాష్టారూ, భోజనాలయ్యాయా!" అంటూ ఆహ్వానించాడు. నన్ను చూసి.

"ఈ వేడికి అన్నం ఎక్కడ సయిస్తుందండీ, ఒకే దగగా వుంది. నీళ్ళతోనే సగం కడుపునిండిపోయింది." అంటూ వెళ్ళి రామ్మూర్తి పక్కన కూర్చున్నాను.

రామ్మూర్తి సర్వే ఆఫీసులో పని చేస్తున్నాడు. ఈ వూరికి ట్రాన్స్ ఫర్ చేయించుకొని వచ్చి సుమారు నాలుగు నెలలయ్యాయి. ఇల్లు దొరకనందున భార్యను బిడ్డనూ పల్లెలో బావమరిది దగ్గర వదిలి ఇక్కడ హోటలు కూడుతింటూ గృహాన్వేషణ సాగించాడు.

కాలికి బలపం కట్టుకుని అదేపనిగా, వెతగ్గా వెతగ్గా కడకు చాకమ్మ దేవిడీలో గువ్వగూడంత చోటు దొరికింది. బ్రతికానురా దేవుడా అనుకున్నాడు. మరుదినమే పల్లెకు పరుగెత్తి వెళ్లి భార్యా బిడ్డను తెచ్చుకున్నాడు.

వారూ వచ్చి వారం రోజులే అయింది.

ఇద్దరం సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నాం.

"ఎట్లావుంది ఇల్లు, కొంచెం ఇబ్బందిగా వుంటుందనుకుంటాను." అని మాట వరసకు పరామర్శించాను.

"ఊరూరూ తిరిగే ఉద్యోగులం సౌకర్యా లెక్కడికని! ఈ నాటికైనా ఇంత చోటు దొరికింది. ఇదే పదివేలు. నాకంటే మా ఆవిడ మహా సంతోషంగా వుందండీ. ఏదో అంతఃపురానికి వచ్చినట్లుగా ఆవిడ సంబరపడుతూంది. ఇన్నాళ్ళూ విధిలేక వాళ్ళ వదినెగారి దగ్గర వదిలి వచ్చినా, ఆమె వీర్ని పురుగును చూసినట్లు చూసిందట. చెట్టు కిందయినా ఇంత కూడు వండుకొని పడివుంటాను. ఇక్కడ ఈసడింపులూ పొడుపులు పడలేకుండా వున్నాను. అంటూ వారానికో ఉత్తరం వ్రాసిందంటే నమ్మండి. ఆ వదినెగారి నీడవదిలి ఇక్కడికి వచ్చినప్పటినుంచీ మా రుక్మిణి మహదానందంగా వుందండీ." అంటూ చెప్పుకొచ్చాడు రామ్మూర్తి.

అలా పిచ్చాపాటీ సాగిస్తూ చాలాసేపు గడిపాము. ఇళ్ళల్లో దీపాలన్నీ ఒకోటిగా ఆరిపోతూవచ్చాయి. ఆడవాళ్ళు గూడా సామాన్లు సర్ది - దీపాలు ఆర్పి - గదులకు గడెలు పెట్టి - బయల్లో తమతమ వాళ్ళున్న చోట్లకు వచ్చి 'ఇస్సో' మంటూ నడుములు వాల్చారు. పదిగంటలయినా గాలి పోలిక లేదు. చుట్టూ గోడల్లోంచి వెచ్చగా సెగ తగుల్తూంది. చెమటకు ఒంటిమీద గుడ్డ అతుక్కుపోతూంది. మగవాళ్ళు బనీను ఆడవాళ్ళు రవికెలు పెరికి పారేసి విసనకర్రలు ఆడిస్తూ ఉపశమనం పొందుతున్నారు.

సుభద్ర గదిముందు వరండాలోనే ఉండిపోయింది. బయల్లోకి రాలేదు. ఉయ్యాల్లో ఉన్న చంటిదాన్ని కనిపెట్టుకొని గోడకు చేరగిలబడి కునుకు తీస్తూంది పాపం. నేనూ యెప్పుడు నేలబడతామా అనుకుంటున్నా.

"భలే ఉక్కగా వుంది మాష్టారూ, ఈ రాత్రి కిక్కడ పడుకోవడం నా వల్ల కాదండి. వీధిలోకి వెళ్ళితే కొంచెం ఊపిరైనా ఆడుతుంది." అంటూ రామ్మూర్తి తన పక్క చుట్టుకొని దేవిడీ గడలు దాటి బైట వీధిలోకి వెళ్ళిపోయాడు.

నాకు నిద్ర ముంచుకొస్తూంది. కూచున్న చోటనే చాప దొర్లింది పడి పొయ్యాను. పడుకందే తడవు కళ్ళు మూతలుపడ్డాయి.

రాత్రి ఎంతయిందో తెలియదు. గాఢ నిద్రలో వున్నా. కొంచెం ప్రక్కకు పొర్లాను. నా ఒంటికి మరొక మెత్తని శరీరం రాసుకుంది. ఇంకెవరు! సుభద్ర వచ్చి పడుకొని వుంటుంది. ఆదమరచి తృప్తిగా నిద్రపోతూంది - అనుకున్నా.

అప్పటికి పల్చగా మంచు పడనారంభించింది. కొద్దిగా చలిపెట్టినట్లు తోచింది. నిద్రమత్తులో కళ్ళు మూసుకునే తలగడ కిందవున్న శాలవ తీసి సగం సుభద్రకు కప్పి సగం నాపైకి లాక్కున్నా. మగత నిద్రలో అంతవరకే తెలుసు నాకు.


****    ****    ****   ****


మళ్లీ కళ్ళు తెరిచి చూచేటప్పటికి భళ్ళున తెల్లవారిపోయింది. ఆడవాళ్ళు ఇళ్ళముందు కళ్ళాపి చల్లుతున్నారు. గబగబాలేచి చాపా - దిండూ చుట్టుకుని ఇంటిలోకి నడిచాను.

వరండాలో చంటిది ఉయ్యాల్లో నిద్ర పోతూంది. ప్రక్కనే సుభద్ర నేలపై తెలిలేకుండా పడివుంది. ఎడమచేతిలో పట్టుకున్న ఉయ్యాలతాడు పట్టుకున్నట్లే వుంది.

"ఏమిటీ మొద్దునిద్ర! లే, తెల్లారి పోయింది," అంటూ తట్టి లేపాను సుభద్రను. ఆమె బెదిరినట్లు చివుక్కున లేచింది. అయ్యో అంటూ బారడెక్కిన ప్రొద్దు చూచి సిగ్గుపోయింది.

"చంటిది రాత్రంతా కన్ను మూయలేదు. నలుగుతూ, నసుగుతూ పొర్లుతూనే వుండింది. ఉయ్యాలతాడు వదిలుంటే ఒట్టు. నాలుగైంది నేనూ కన్ను మూసేటప్పటికి." అని పలుకుతూ సుభద్ర బద్ధకంగా ఇంటిలోకి వెళ్ళింది.

ఆ పలుకు తీరు నన్ను చక్కలిగింత బెట్టినట్లుగా తోచింది.

"ఆహా, ముదియ యెంత ముచ్చటగా బొకుతూంది!" అని ఫక్కున నవ్వబోయాను. అంతలో టకీమని ఆపిపొయ్యాను.

బుర్రలో ఆలోచన అడ్డుపడింది.

వెంటనే నలువంత నెవ్వెరపాటు.

"మరి సుభద్ర చెపుతూంది నిజమా! అయితే... అయితే... రాత్రి నా ప్రక్కన పడుకుంది సుభద్ర కాదా!... మరి... మరి...'

అంతే, ఆపైన బుర్ర బొత్తిగా పనిచెయ్యలేదు. ఆలోచన - ఆశ్చర్యం - విచికిత్సా - మెదడు గోడల్ని గోకడానికి ఆరంభించాయి.

సంగతి సున్నితమైంది. అప్పటికి సుభద్రముందు మౌనంగా ఉండిపోయాను.


****    ****    ****   ****


ఆ పగలంతా పాఠశాల్లో అన్యమనస్కంగా గడిపాను.

సాయంత్రం బడినుండి ఇంటికి వస్తూనే -

"మన పక్క వాటాలో వున్న రుక్మిణమ్మ వెళ్ళిపోయిందండీ" అనింది సుభద్ర కాఫీ చేతికి అందిస్తూ.

"ఏ రుక్మిణమ్మ?" అలవోకగా ప్రశ్నించాను.

"రామ్మూర్తిగారి భార్యండీ. వచ్చి వారంరోజులు కూడా కాలేదు. ప్రొద్దున్నే బిడ్డను వెంటబెట్టుకొని పల్లెకు వెళ్ళిపోయింది."

"ఏదో పనివుండి వెళ్లుంటారు? విశేషమేముంది?"

"అదిగాదండీ. చెప్పాచెయ్యకుండా చప్పున వెళ్ళిపోయింది. రుక్మిణమ్మ చాలా మంచిదండీ. ఈ నాల్గురోజులూ నాకెంతో సాయపడింది. బాగా కలుపుగోలు మనిషి. జబ్బుతో వున్న మన చంటిదాన్ని యెంత బాగా చూచిందని. పొద్దున్నే బస్సుకు వెళ్ళిపోయిందట.

అలాంటి సౌజన్యంగల పొరుగింటావిడ వెంటనే వెళ్ళిపోయినందుకు సుభద్ర నొచ్చుకుంటూ చెప్పింది.

సుభద్ర చెప్పింది విన్నాను. కొంత తెలుసుకున్నాను.

కాఫీ తాగి మౌనంగా బైటికి వచ్చాను.

రామ్మూర్తి ఆఫీసునుండి వస్తూ ఎదురుపడ్డాడు. మనిషి చికాగ్గా అగుపించాడు. నన్ను చూచి అన్నాడు - తనలో తాను వదురుకుంటున్నట్లు -

"ఈ ఆడవాళ్ళు బలే చిత్రమయిన వాళ్లండి. వాళ్ల మనస్తత్వాలు అర్తమయిచావవు. మచ్చుకు చూడండి, మా ఆవిడ బుర్రలో ఉన్నట్లుండి యే పురుగు తొలిచిందో - 'నేను ఈ సత్రం కొంపలో ఒక్క క్షణముండలేను. పల్లెకు పోతున్నా. వేరు ఇల్లు దొరికినప్పుడు జాబు వ్రాయండి, వెంటనే వస్తాను' అని చెప్పి ప్రొద్దున లేస్తూనే బిడ్డను చంకబెట్టుకుని వెళ్ళిపోయింది. ఈ దినం ఇల్లు బాగాలేదని చక్కా వెళ్ళిపోయింది. ఈ ముదనష్టపు కొంపలో మరో యిల్లు నేను ఎక్కడ వెదికి చావను?" అంటూ వాపొయ్యాడు ఆయన నాముందు.

విన్నాను మౌనంగా తప్పుకొని వెళ్లిపోయాను.


****    ****    ****   ****


ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. వెళ్ళి వీధి అరుగుమీద ఒంటరిగా కూర్చున్నా. వెళ్ళిపోయిన రుక్మిణమ్మను గురించిన ఆలోచన నన్ను వికలచిత్తుణ్ణి చేసింది.

రుక్మిణమ్మ తటాలున - ప్రొద్దున మరొకరికి ముఖం చూపించలేక వెళ్లిపోయింది కారణం మనసుకు వచ్చి - తెలుసుకొని - మరీ క్రుంగిపోయాను.

అయినా ఈ రహస్యం ఎవరికి చెప్పను. ఎట్లా చెప్పగలను! సుభద్రకు చెప్పలేను. రామ్మూర్తికి చెప్పలేను. కడకు నేను సైతం మనసుకు తెచ్చుకోలేను. అది ఆ తల్లిపట్ల అపచారమే అవుతుంది. ఆప్రియమైన సంఘటన అలా అసంకల్పితంగా జరిగిపోయింది.

ఈ దుర్ఘటనకు నేను కారణమే కావచ్చు. కానీ నేనుగా యెరిగి యే దోషమూ చేయలేదు. ఇంతకూ నేను చేసిన తప్పు!

నిన్న రాత్రి రామ్మూర్తి మామూలుగా పడుకునేచోట బద్దకించి నేను పడుకోవడమే. మరచి నిద్రపోవడమే.

రుక్మిణమ్మ ఇంటిపనులన్నీ ముగించి - పొద్దుపోయాక - అలసటతో వచ్చి మామూలుగా భర్త పక్కమీదకి వచ్చి మేనువాల్చి ఉంటుంది. ఆదమరిచి నిద్రపోయి వుంటుంది.

వేకువనే లేచినపుడు - నిజం తెలుసుకున్నప్పుడు - నిలువునా కూలిపోయి వుంటుంది.

మగనాలి మళ్లీ మొహం చూపెట్టలేక ప్రొద్దున్నే ఇల్లు విడిచి వెళ్లిపోయింది.

ఆమె ఇల్లాలు.

ఆ విధంగా మొగం దాచుకుంది.
 


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్