Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Book Review - chamatkara shloka manjari

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంచీలు... మానవ సంబంధాలూ... - భమిడిపాటి ఫణిబాబు

bags and relations

ఈరోజుల్లో అంటే గొప్పగా ల్యాప్ టాప్పు బ్యాగ్గూ, ఇంకోటేదో సింగినాదం బ్యాగ్గూ అని పేర్లు పెట్టారుకానీ, వీటన్నిటినీ సంచీలనేవారు. పైగా తలో పనికీ ప్రత్యేకంగా ఉండేవి. ఏదో ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు కూరలు దొరకడానికి మాల్సూ, రైతుబజార్లూ వచ్చేయికానీ, ఇదివరకటి రోజుల్లో వారానికీ ఓ ఆదివారమో, గురువారం నాడో పెట్టే సంతలే దిక్కు. ఆ సంతకి తీసికెళ్ళే సంచీలని "సంత సంచీలు" అనే వారు. ఏ ఆదివారమో ఆ సంచీ పట్టుకుని వెళ్ళారంటే, హాయిగా వారానికి సరిపడా కూరలు వచ్చేసేవి. వారం మధ్యలో చుట్టాల్లాటివారొచ్చినా గొడవుండేది కాదు. అంతగా తక్కువయినా, ఏ పెరట్లోంచో ఓ అరిటికాయ కోసుకుని వేపడం చేస్తే పనైపోయేది. మహ అయితే ఓ పది రూపాయలతో సంచీనిండుగా కూరలొచ్చేవి. ఈ రోజుల్లో మనం పెట్టే ఖరీదుకి జ్యాదాసే జ్యాదా ఓ జేబురుమ్మాలు చాలు. మరీ ఏ పాతకాలం నాటి నాలాటివారో ఓ సంచీ పట్టుకుని వెళ్ళినా, ఈరోజుల్లో ఖరీదులకి , సంచీలు నిండడం మాట దేవుడెరుగు, ఏదో వేసవికాలంలో నూతుల్లో నీళ్ళలాగ, లేక ఏడాది పొడుగునా సొసైటీల్లో ఉండే "బోరింగు బావి" లాగో, ఎక్కడో అట్టడుగున చేతికి తగులుతాయి. పోనీ ఇన్ని తిప్పలూ పడి తెచ్చినా, ఇంట్లో చివాట్లూ, "ఇదేవిటండీ ఓ పూట వేపుడికైనా వస్తాయా ఈ బెండకాయలూ.." అనో, "ఈ వారంలో మీ నాన్నగారిదో, అమ్మగారిదో తిథి కూడానూ, ఓ నాలుక్కూరలైనా లేకపోతే బావుంటుందా.. " అనో. అందుకే కాబోసు ఈ రోజుల్లో వాటిని కూడా ఏ మఠాల్లోనో పెట్టేసికుంటున్నారు. ఈ కూరల గొడవొకటి తప్పుతుంది. దానితో ఆ "సంత సంచీలు" చరిత్రలో కనుమరుగపోయాయి.

స్కూలుకి వెళ్ళేటప్పుడు పుస్తకాలు పెట్టుకోడానికి "పుస్తకాల సంచీ" సరే సరనుకోండి. పైగా ఆడపిల్లలకి ఈ సంచీల్లో పుస్తకాలు తీసికెళ్ళడానికి నామోషీ. మరీ కాలేజీలదాకా కాకుండా, స్కూలు స్థాయికే పరిమితమయ్యేవి ఈ పుస్తకాల సంచీలు. సంచీ ఎంత నిండుగా ఉంటే, అంతబుధ్ధిమంతుడిలా చెలామణీ అయేవారు మొగపిల్లలు ఆరోజుల్లో. పైలా పచ్చీసుగాళ్ళు హాయిగా ఏ చొక్కాలోపలో ఓ చిత్తుపుస్తకమో పెట్టుకుని వచ్చేసేవారు, ఎప్పుడు పడితే అప్పుడే క్లాసునుండి చెక్కేయొచ్చని. కానీ ప్రస్తుతకాలంలో చూడండి, ప్లే స్కూలు మొదలూ, స్కూల్లో చదువు పూర్తయేదాకా, ప్రతీ ఆడా, మొగా అని తేడాలేకుండగా, అందరి వీపులమీదా ఓ పుస్తకాల బస్తా చూస్తూంటాము. వాళ్ళని చూస్తే జాలేస్తూంటుంది ఒక్కోసారి. అదేం సరదాయో, ఇదివరకే హాయీ, ఆ రోజు ఏ పిరీయడ్ ఉంటే దానికి సంబంధించిన పుస్తకాలతో సరిపోయేది. ఇప్పుడు "జ్ఞాన్ కా ఖోజ్" పేరుపెట్టి, ఇంట్లో ఉన్న పుస్తకాలూ, నోట్సులూ మోసుకెళ్ళాలనుకుంటాను. పైగా వీపు మీద వాళ్ళు మోసే బరువుతో, జీవితంలో భవిష్యత్తులో వాళ్ళు మోసే "సంసార బరువులు" లకి కూడా అలవాటు పడతారేమో.

వీటిలాగే కనిపించేవి ముద్దుగా "Back Packs "అంటారుట. ఈరోజుల్లో ఉద్యోగాలకి వెళ్ళే ప్రతీవారి వీపుమీదా దర్శనం ఇస్తూంటాయి. బస్సుల్లో అయితే మరీనూ, ఓ పిప్పళ్ళ బస్తా లాటిది ఒకటి వేల్లాడతీస్తాడు, వాడి చేతులు బాగానే ఉంటాయి. వచ్చిన గొడవల్లా వెనక్కాల నుంచునేవాళ్ళకే, ఇద్దరు నుంచునే చోట్లో, వీడూ వీడి వీపుమీద ఉండేదీ ఓ ఇద్దరి స్థానం ఆక్రమించేయడంతో, బస్సుల్లో ఇరవైమందికి బదులుగా పదిమందే నుంచునే స్థలం మిగులుతోంది. అదృష్టం బాగుండి కూర్చోడానికి సీటు దొరికినా ఏదో సీటు చివరగా కూర్చోడం తప్ప, సౌఖ్యంగా కూర్చునే అవకాశం కూడా దొరకదు, కారణం సగం సీటు వీడి వీపువెనక్కలుండే Back Packs ఆక్రమించేస్తాయి. ఇంకో గొడవేమిటంటే, స్పర్శాజ్ఞానం కూడా ఉండదు, నెత్తిమీద హెల్మెట్లలాగే.

ఇప్పుడంటే టూత్ పేస్టులకీ అలవాటు పడిపోయారు కానీ, పైగా వీటిలో రకాలు కొన్నీ- మీ పేస్టులో ఉప్పుందా అనే అమ్మడొకత్తీ, మా పేస్టు శుధ్ధ వెజిటేరియన్ అనే ప్రచారం ఇంకొకరూ ఇలా రకరకాల పేస్టులు, కానీ ఆ రోజుల్లో పళ్ళు తోముకోడానికి ఓ వేపపుల్ల, లేదా శ్రేష్ఠమైన కచిక. కాలక్రమేణా "పళ్ళపొడులు" అవీ వచ్చేయి. అందులో "నంజన్ గూడు" వారిదైతే లోక ప్రసిధ్ధం అనుకోండి. ఎర్రగా ఉండేది. ఓ చిన్న కాగితం సంచీలో పోసి అమ్మేవారు. దానికోవైపు ఓ చిల్లు లాటిది చేసి, దాంట్లోంచి, ఓ అరచేతిలో వేసికుని, రెండో చేయి కి సంబంధించిన చూపుడు వేలితో తోముకోడం, దానికి ఓ రుచీ పచీ ఉండేదికాదు.. తరువాత్తరువాత కొన్ని కంపెనీలు ఈ పళ్ళపొడుల్లోకీ దూరాయనుకోండి, ఉదాహరణకి "కాల్గేట్" వాళ్ళు, ఇదిమాత్రం తెల్లగా ఓ మోస్తరు రుచిగానే ఉండేది, దీనికో డబ్బా, ఆ డబ్బాకి ఓ నాలుగు చిల్లులూ, ఓ సూదిపిన్నీసుతో చిల్లులు చేసేవారు. ఊరికే పిల్లలు తినేస్తున్నారని, రెండే చిల్లులు చేసేవారు. కానీ ఎన్నిచెప్పినా నంజన్ గూడు వారు తయారుచేసే పళ్ళపొడికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అంత ఖరీదుకూడా ఉండేది కాదు, అన్నిటిలోకీ ముఖ్యం, ఓ జోలా లాటిదాంట్లో వేసికుని ఇంటింటికీ వెళ్ళి అమ్మేవారు. దానితో దానికి "పళ్ళపొడి సంచీ" అని ఓ పేరొచ్చేసింది. ఏదో హాయిగా భుజానికి వేళ్ళాడేసికుందుకు సదుపాయంగా ఉంటుంది కదా అని, ఎప్పుడైనా వాడినా, "అదేమిట్రా పళ్ళపొడులు అమ్మేవాడిలాగ ఆ దిక్కుమాలిన సంచీ ఏమిటీ.." అనే దాకా పేరు తెచ్చుకుంది, ఆ పళ్ళపొడి సంచీ.

ఈ రోజుల్లో అంటే సామాన్లూ అవీ తీసికెళ్ళడానికి అవేవో కార్గోలూ, కొరియర్లూ కానీ, మళ్ళీ వీటిల్లో లారీల మీద.. తప్పు తప్పు ట్రక్కులమీద తీసికెళ్ళేవి కొన్నీ, విమానాలమీద వెళ్ళేవి కొన్నీనూ, ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఓ ఊరునుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే బస్సులే గా, కొత్తకాపరానికి వెళ్ళే పిల్లలకి , తీసికెళ్ళే సామాన్లన్నీ, ఓ "సిమ్మెంటు బస్తా" లో మూటకట్టేసి, ఓ దబ్బనంతో పురికొస కుట్టు వేసేసి, ఏ బస్సు టాప్పుమీదో వేసేసేవారు. దానిపైన సిరాలో ముంచి, ఓ పుల్లతో మన పేరుకూడా వ్రాసేవారు, మళ్ళీ మారిపోకుండగా. ఆవిధంగా, సిమ్మెంటు బస్తాలు ఈ చిన్న చిన్న వాటికీ, బియ్యం బస్తాలైతే పాత్ర సామాన్లకీ ఉపయోగపడేవి. కాలక్రమేణా, ఆ గోని బస్తాలు మాయం అయిపోయి, ప్లాస్టిక్కువాటిల్లోకి వచ్చేశాయి. కానీ, ఆ గోనిబస్తాల నాణ్యత మాత్రం ఉండడం లేదు.

ఇవి కాకుండగా ఆరోజుల్లో ప్రొద్దుటే "శీతారామాన్నాభ్యోన్నమహ" అంటూ భిక్షకు వచ్చే యాయవార బ్రాహ్మల సంచీలు ఇంకో రకం. వీటన్నిటికీ మించి, సంచీ చూడగానే తెలిసిపోయే అరవ్వారి సంచీలు ఇంకో రకం. ఎప్పుడూ పసుపుపచ్చ రంగులో ఎర్రటి అక్షరాలతో ఏవో వ్రాసి ఉండే సంచీలు. ఇప్పటికీ, die hard తమిళులు , ఎవరేమనుకున్నా వాటితోనే బజారుకి వెళ్తారు. అదీ cultural heritage ని రక్షించుకోవడమంటే. వాళ్ళని చూసి నేర్చుకోవాలి.

ఇవన్నీ ఒక ఎత్తైతే, చందనా వారూ, బొమ్మనా వారూ, వారి దుకాణాల్లో కొన్న బట్టలు పెట్టి ఇచ్చే "చక్కల సంచీలు" నిఖార్సైన గోనెపట్టాతో తయారుచేసి, వాటికి వెదురు తో చేసిన హ్యాండిల్స్, అలనాటి సిమెంటు, బియ్యం బస్తాలని గుర్తుచేస్తూంటాయి. వీటిని రైలు ప్రయాణాల్లో స్టేషన్ లోని క్లోక్ రూమ్ములలో పెట్టుకోడానికి వీలుండదు, తాళాలు లేని కారణంగా, విమానాల్లో వెళ్ళేటప్పుడు ఉంచుకునే hand baggage స్థాయీ వీటిది! ఇన్ని రకాల సంచీల గురించి చెప్పుకుని, ఆనాటి రోజుల్లో రైలు ప్రయాణాలు చేసేటప్పుడు, మంచినీళ్ళు పోసికుని, కిటికీకి బయట వేళ్ళాడకట్టే కాన్వాసు సంచీల గురించి స్మరించుకోకపోవడం మహా పాపం లోకి వస్తుంది. ఇప్పుడంటే బిస్లెరీలూ అవీ వచ్చేయికానీ, ఆరోజుల్లో ప్రయాణాల్లో మంచినీళ్ళు కావాలంటే మరచెంబులూ, ఈ కాన్వాసు బ్యాగ్గులే కదా గతి ! ఎంత చల్లగా ఉండేవో వాటిలోని నీళ్ళు. ఏ ఫ్రిజ్జీ దానిముందర బలాదూరే. కావల్సినన్ని నీళ్ళు పట్టేవి.

మనుష్యులు సుఖాలకి అలవాటు పడ్డారుగా, మొదట్లో ఏ కాలో బెణికితే "కాపడం" పెట్టమనేవారు. ఓ కుంపటీ, దానిమీద ఓ గిన్నీ, దాంట్లో మరుగుతున్న నీళ్ళూ, దాంట్లో ఓ గుడ్డ ముంచడం, నీళ్ళు పిండేసి కాపడం పెట్టుకోవడం. నాగరికత అభివృధ్ధి చెందడంతో ఈ "కాపడాలు" కొత్త రూపం లోకి వచ్చేయి. గిన్నే, కుంపటీ, గుడ్డా వెళ్ళిపోయి, వాటికీ ఓ రబ్బరు బ్యాగ్గు వచ్చేసింది hot water bag అని. హాయిగా దాంట్లో మరుగుతూన్న నీళ్ళు నింపేసి, ఎవడికివాడే కాపడం పెట్టేసికోవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే "సంచీల" కి మానవ జీవితాల్లో ఎంత ముఖ్యమైన స్థానమో తెలిసిందా? అప్పటికీ ఆడవాళ్ళు వాడుకునే హ్యాండు బ్యాగ్గుల గురించి చెప్పుకోనే లేదు. ప్రపంచంలోని చిన్నా చితకా అన్ని వస్తువులూ దీంట్లో పడతాయి. హ్యాండ్ బ్యాగ్ లేకుండా, ఆడవారు వీధిలో కనిపించరు. మళ్ళీ వాటిల్లోనూ రకరకాల ఆకారాలూ, పర్సుకో అరా, సెల్ ఫోనుకో అరా, చిల్లరకో అరా, డబ్బులకో అరా. ఎంత చెప్పినా అత్యవసర పరిస్థితుల్లో మనల్ని bail out చేసేది వాళ్ళేగా...

మరిన్ని శీర్షికలు
Haasya Nata Navabu - Rajababu