Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mokkubadi

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కార శ్లోక మంజరి : పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - chamatkara shloka manjari
పుస్తకం: చమత్కార శ్లోక మంజరి
రచన: మల్లాది హనుమంత రావు
వెల: రూ 60/-
ప్రతులకు: +919949340236, 040-23569222

"మాయాబజార్" సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక వజ్రం. దానికి నాశనం లేదు, విలువ తరగదు. అది మహాభారతంలోని పాత్రలని తీసుకుని అల్లిన కల్పిత కథ- "శశిరేఖా పరిణయం" నాటకం ఆ చిత్రానికి మూలం. భారతంలో శశిరేఖ లేదు. ఆ సంగతి తెలిసినవాళ్లని కూడా ఆ సినిమా మెప్పించకుండా ఉండదు. కథ నిజమా, ఉత్తిదా అన్న దాని కంటే చూసే వాళ్లకి కలిగే రససిధ్ధే ప్రధానం. అది సినిమా అయినా, నవల అయినా, కథ అయినా, చమత్కారమైనా.

హిందీ సాహిత్యంలో అక్బర్-బీర్బల్ కథలు, తెలుగులో తెనాలి రామకృష్ణ కథలు ఆ బాపతే. మెదడుకు పదును పెడుతూ పిల్లల్ని, పెద్దల్ని రంజింపజేస్తాయి..అలాగే సంస్కృతంలో భోజ-కాళిదాసుల మధ్య అల్లిన అనేకమైన చమత్కార శ్లోకాలు కూడా.

భోజుడు అనగానే కాళిదాసు, కాళిదాసు అనగానే భోజుడు గుర్తురావడం సహజం. 16 వ శతాబ్దానికి చెందిన బల్లాల సేనుడు (బల్లాల దేవుడు) వ్రాసిన "భోజ ప్రబంధం" ఈ భోజ-కాళిదాస సాహిత్యానికి మూలం. ఆ తర్వాత కృతికర్త్యేతరచ్యుతి కారణంగా ఎక్కడెక్కడో, ఎవరెవరో మేధోమధనం చేసి పుట్టించిన సంస్కృత చమత్కారాలు భోజ-కాళిదాసులకి ఆపాదించి కథలుగా చెప్పుకోవడం సంస్కృతిలో భాగం అయిపోయింది కొన్ని శతాబ్దాలుగా. నిజానికి చారిత్రాత్మకంగా భోజుడు-కాళిదాసు ఒక కాలం వాళ్ళు కాదు. భోజరాజు కంటే కాళిదాస మహాకవి ఏకంగా వెయ్యేళ్ల పూర్వుడు. ఈ విషయం జనానికి తెలీదని కాదు. తెలిసే జనమెరిగిన పాత్రలతో కథలు, చమత్కారలు చెబితే బాగుంటుందని ఒక ప్రయోగం చేసాడు. "భోజ ప్రబంధం" కథల్లో భోజ కాళిదాసులతో పాటు బాణుడు, మయూరుడు, భవభూతి, చోరుడు, మల్లినాథుడు ఇలా ఒకరి కాలంతో ఒకరికి సంబంధం లేకుండా ఉన్న వాళ్లు చాలా మంది దర్శనమిస్తారు. వీళ్లందరి మధ్యా సంభాషణలు, విద్వత్స్పర్థలు, గెలుపోటములు..ఇలా అన్నీ తగిలించి జనం మీదకి వదిలాడు బల్లాల సేనుడు. అది ఇన్ని శతాబ్దాలైన జనం గుండెల్లో ఆడుతూనే ఉంది. కలియుగాంతం దాకా ఆడుతుంది.

గతంలో కొన్ని తెలుగు చాటువుల పుస్తకాల్లో ఈ భోజ-కాళిదాస శ్లోకాల్ని కూడా కొన్ని చేర్చి అచ్చేసేవారు. అన్నీ ఒక చోట దొరకడం కష్టంగా ఉండేది. కొన్ని దశాబ్దాల క్రితం ఒకటి రెండు వచ్చినా కాలక్రమంలో అలభ్యాలుగా మిగిలిపోయేవి. అటువంటి చక్కని చమత్కార కథల్ని సంస్కృత సాహితీ ప్రియులకి, తెలుగు సాహితీ ప్రియులకీ, సామాన్యులకి కూడా దగ్గరయ్యే విధంగా ఒక చోట చేర్చి, సంకలనం చేసి, అర్థ తాత్పర్యాలు, వ్యాఖ్యానం రాసారు మల్లాది హనుమంతరావు. ఒకరకంగా చెప్పాలంటే దీనిని సంకలనం అనేకంటే "రచన" అనడమే సబబు. ఎందుకంటే అక్కడా ఇక్కడా విన్నవి, చదివినవి తనదైన శైలిలో చెప్పారు కనుక...

ఈ 127 పేజీల పొత్తంలో ఒక్క పేజీ కూడా విస్మరించగలిగేది లేదు. ఒక్కోటి ఒక్కో రస బిందువు. స్థాలీపులాకంగా రెండు చెప్పి ముగిస్తాను. కేవలం విషయం చెప్తాను. కథ మీరు పుస్తకంలో చదువుకోండి.

"చ" అనే అక్షరం లేకుండా ద్రౌపదికి పాండవులు ఏమౌతారో కాళిదాసు చెప్పాల్సొచ్చింది. "అయన చెప్పేదేమిటి? అంతోటి ప్రశ్నకి మేమే చెప్తాం సమాధానం..."భర్తలు" అవుతారు అంటారా?"  అలా చెప్తే కాళిదాసు ఎందుకవుతాడు? ఇలా చెప్పాడు:

"ద్రౌపద్యాః పాండుతనయాః
పతి దేవర భావుకాః
ధర్మరాజో న దేవరః
సహదేవో న భావుకః"

అర్థం: "ద్రౌపదికి పాండవులు భర్తలు, మరుదులు, బావలూను. అయితే ధర్మరాజు ఎప్పటికీ మరిది కాలేడు, సహదేవుడు ఎప్పటికీ బావ కాలేడు".

ద్రౌపది ధర్మరాజుని భర్తగా అనుకుంటే మిగిలిన నలుగురూ మరుదులు అవుతారు, సహదేవుడిని భర్తనుకుంటే మిగిలిన నలుగురూ బావలవుతారు. భీముడిని భర్తనుకుంటే అర్జున, నకుల, సహదేవులు మరుదులు...ధర్మరాజు బావానూ..ఇలా చూసుకుంటూ వెళ్లండి.. అందరు భర్తలే.. కాని ఎప్పటికీ ధర్మరాజు మరిది, సహదేవుడు బావ కాలేరు..అదీ చమత్కారమంటే!!

అలేగే మరొకటి: కాళిదాసు, దండి తాంబూలం కోసం ఒక దుకాణానికి వెళ్లారట. దండి ముందుగా సున్నం కావాలని అడుగుతూ ఆ దుకాణంలోని అమ్మాయిని ఇలా అడిగాడట- "తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే" (ఓ పూర్ణ చంద్రుడిలాంటి ముఖం గల చిన్నదానా! త్వరగా సున్నం ఇప్పించు). వెంటనే కాళిదాసు "పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే" (చెవుల వరకు వ్యాపించిన విశాలు నేత్రాలు గల దానా! బంగారు వన్నెగల తమలపాకులు కూడా ఇప్పించు).

ఆమె ముందుగా కాళిదాసుకు తమలపాకులిచ్చి, తర్వాత దండికి సున్నం ఇచ్చిందట. "ముందుగా నేనడిగితే ఆయనకు ఇచ్చావేంట"ని అడిగాడట దండి. దానికి ఆమె "మీరిద్దరూ మహాకవులు, చమత్కారులు. మీలో ఎవరు గొప్పో చెప్పే స్థాయి నాకు లేదు. ముందు మీరు 3 "ణ" లు వచ్చేలా ఒక వాక్యం చెప్పారు. తర్వాత ఆయన 5 "ణ" లు వచ్చేలా మరో వాక్యం చెప్పారు. మూడణాల కంటే ఐదణాలు పెద్ద బేరం కదా అని అగ్ర తాంబూలం ఆయనకిచ్చా" అని చమత్కరించింది ఆ అమ్మాయి.

ఇంకా చెప్పమంటారా? నా అత్యుత్సాహంతో అన్నీ ఇక్కడే లీకయిపోతే పుస్తకం అమ్ముడు కాకపోవచ్చు. అప్పుడు రచయిత మల్లాది హనుమంతరావుగారు నా ఇంటికి వచ్చి నన్ను మొట్టికాయ మొట్టి వెళ్లొచ్చు. ఆ కష్టం ఆయనకి, నాకూ కూడా వద్దు. ఇలాంటివి ఈ పుస్తకంలో ఇంకో 36 కథలు, అందులో చాలా శ్లోకాలు ఉన్నాయి. కావాలనుకుంటే కొని చదువుకోండి.

గమనిక: ఇంతకీ పైన చెప్పుకున్న రెండో కథలో తమలపాకులు బంగారు వర్ణంలో ఉండడమేమిటి అని నన్ను అడక్కండి. నా బుధ్ధికి అందలేదు. అందులో కూడా ఏదైనా మర్మమైన చమత్కారం ఉందేమో మీలో ఎవరైనా చెబితే తరిస్తాను.
మరిన్ని శీర్షికలు
bags and relations