Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గీత గోవిందం చిత్రసమీక్ష

geetagovindam movie review

చిత్రం: గీత గోవిందం 
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, నాగబాబు తదితరులు. 
సంగీతం: గోపీ సుందర్‌ 
సినిమాటోగ్రఫీ: మణికండన్‌ 
దర్శకత్వం: పరశురాం 
నిర్మాత: బన్నీ వాస్‌ 
నిర్మాణం: జిఎ2 పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 15 ఆగస్ట్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే

ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు విజయ్‌ గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ). తానెంత పద్ధతైనవాడో, అంతే పద్ధతైన అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటాడు. అచ్చంగా అలాంటి అమ్మాయి గీత (రష్మిక మండన్న) విజయ్‌కి ఎదురవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా ఆమె దృష్టిలో 'రోగ్‌' అనే ముద్ర వేయించుకుంటాడు విజయ్‌. ఇక అక్కడినుంచి ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి అతను పడే పాట్లు మిగతా కథ. అసలు 'రోగ్‌'గా విజయ్‌, గీత దృష్టిలో ఎందుకు కన్పించాడు? ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? గీత, విజయ్‌ సిన్సియారిటీని తెలుసుకుందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

విజయ్‌ మరోసారి తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఏ పాత్ర ఇచ్చినాసరే, అందులో పరకాయ ప్రవేశం చేసెయ్యడం విజయ్‌ దేవరకొండకు వెన్నతో పెట్టిన విద్య. కామెడీ టైమింగ్‌ అదిరిపోయింది. రొమాంటిక్‌ సీన్స్‌లో చెలరేగిపోయాడు. ఓవరాల్‌గా ఇది కంప్లీట్‌ విజయ్‌ షో అని నిస్సందేహంగా చెప్పొచ్చు. సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటున్నందుకు విజయ్‌ని అభినందించి తీరాలి. 
హీరోయిన్‌ రష్మిక ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. కళ్ళతోనే అన్ని హావభావాల్నీ పలికించేసింది. ఆమె తన నటనతో ఈ సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళిందనడం నిస్సందేహం. విజయ్‌ సరసన పెర్‌ఫెక్ట్‌ జోడీగా సెట్టయ్యింది. అందంతో, అభినయంతో మంచి మార్కులు సంపాదించుకుంది రష్మిక. వెన్నెల కిషోర్‌ పాత్ర సినిమాకి అదనపు అడ్వాంటేజ్‌. కడుపుబ్బా నవ్వించాడీ కమెడియన్‌. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేసి మెప్పించారు.

కథ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, కథనంతో దర్శకుడు కట్టి పడేశాడు. సరదా సరదా సన్నివేశాలతో సినిమాని నడిపించేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా కన్పించింది. సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెబితే ఇంకా బావుండేదేమో. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా వర్క్‌ చేశాయి.

ఓ సాధారణ కథని సరైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో పరుగులు పెట్టించడం కూడా ఓ కళే. ఆ విషయంలో దర్శకుడు చాలావరకు సక్సెస్‌ అయ్యాడు. నటీనటుల నటనా ప్రతిభని దర్శకుడు సరిగ్గా వాడుకున్నందుకు అభినందించాలి. నేల విడిచి సాము చేయకుండా, సాధారణ కథతోనే మంచి ఎంటర్‌టైనర్‌ అందించాడు దర్శకుడు. నటీనటులు సైతం, సినిమా వేగానికి తమ నటనా ప్రతిభను జోడించి.. ప్రేక్షకుల్ని అలరించారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ సినిమాకి ప్రధాన బలం. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా దర్శకుడు సినిమా తీసి మెప్పించాడు గనుక, కమర్షియల్‌ రిజల్ట్‌ సూపర్బ్‌గా వుండనుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

గీత గోవిందం.. ఆద్యంతం వినోదం

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka