Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue280/737/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి).... ‘‘ఎస్సార్!’’ వినయంగా అన్నాడు ఎస్సై.

‘‘మీరు గ్రహించారో లేదో! రెండు చోట్ల మర్డరయింది యాచకులే. ఒకే విధంగా హత్య గావింపబడ్డారు. విచిత్రంగా హత్యాయుధం కూడా విడిచి పెట్టకుండా హంతకులు పట్టుకు పోయారు.’’ నలుగురికీ తన ఆలోచన విశ్లేషణ విడమర్చి చెప్పారు పోలీసు కమీషనర్.

‘‘నిజమే సార్!’’ నలుగురూ ఒకరి తర్వాత ఒకరు అన్నారు. కమీషనర్ గారన్నట్టు సింహాచలం కొండ మీద, ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర చంపబడ్డది యాచకులే! ఇది యాదృచ్ఛికమో లేక ఎవరో కావాలనే చేస్తున్నారా? ఎందుకు?’ ఆలోచిస్తూ మౌనంగా కమీషనర్ కేసి చూస్తూండి పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఇంకో విచిత్రమేమిటంటే  ఇక్కడ కూడా ఒక ‘స్త్రీ’ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఐ మీన్ ప్రమేయం అంటే అదే చోట ఒక ‘స్త్రీ’ యాచకులందరికీ రగ్గులు కొని ఇవ్వడమే కాకుండా ఆమె కూడా అక్కడే వాళ్ల తోనే పడుకుందని ప్రత్యక్ష సాక్షులు కథనం. సింహాచలం కొండ మీద కూడా హతురాలితో ఒక స్త్రీ సన్నిహితంగా మెలిగిందని చివరగా ఆ ‘హతురాలి’ తో మాట్లాడింది కూడా. ‘ఓ స్త్రీ’ అని మనకు తెలిసింది. ఈ రెండింటిలోనూ ఉన్న ‘స్త్రీ’ ఒక్కరేమోననిపిస్తోంది నాకు.’’ నలుగురికేసి చూస్తూ అన్నారు పోలీస్ కమీషనర్.

కమీషనర్ కేసు పూర్వాపరాలు చెప్తుంటే నలుగురూ అవాక్కయి చూస్తూండి పోయారు.

‘‘మిస్టర్ అక్బర్ ఖాన్! మీ కేసు ఎంత వరకూ వచ్చింది?! ‘ఆమె’ని పట్టుకోగలిగారా? ఇంకేమన్నా పురోగతి సాధించారా?!’’ ఉన్నట్టుండి ఎస్సై అక్బర్ ఖాన్ కేసి చూస్తూ అడిగాడు పోలీస్ కమీషనర్.

‘సార్! ‘ఆమె’ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కొంత మందిని గుర్తించాం సార్. అందులో ఇద్దరు మన కానిస్టేబుల్ తో పాటు ‘ఆమె’ని వెంబడిస్తూ ఘాట్ రోడ్ లో ఏక్సిడెంట్ కు గురైన విషయం తమకు తెలుసు. మిగతా వారితో కలిసి మన కానిస్టేబుల్స్‘ఆమె’ కోసమే గాలిస్తున్నారు సార్.’’ వినయంగా చెప్పాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఖాన్! కాంప్లెక్స్ లో జరిగిన ఇద్దరు యాచకుల మర్డర్ ఇన్వెస్టిగేషన్ కూడా నీకే అప్పగిస్తున్నాను. ఈ లోగా పోస్టు మార్టన్ రిపోర్ట్ కూడా వస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వు ఎప్పటికప్పుడు మీ స్టేషన్ సి.ఐ. గారితో చర్చిస్తూ ఇన్వెస్టిగేషన్ త్వరిత గతిని పూర్తి చెయ్యండి. టూటౌన్ ఎస్సై మీకు కేసు వివరాలు ఇస్తారు.’’ క్లుప్తంగా చెప్తూ ఇక మీరు వెళ్లొచ్చన్నట్టు లేచి నిలబడ్డారు పోలీస్ కమీషనర్.

కమీషనర్ సీట్లో నుండి లేచి నిలబడడం తోనే నలుగురు పోలీసు అధికారులు ఛటుక్కున లేచి నిలబడ్డారు.

‘‘ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు.’’ మీటింగ్ హాల్లో నుండి తన కేబిన్ లోకి వెళ్లి పోయారు పోలీస్ కమీషనర్. ఆయన వెనుకే పి.ఏ. సెంట్రీలు  కూడా పరుగున వెళ్లారు.

****

పోలీసు కమీషనర్ ఆఫీసు నుండి నేరుగా స్టేషన్ కు చేరుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. కమీషనర్ గారి ఆదేశానుసారం టూటౌన్ ఎస్సై దగ్గర కాంప్లెక్స్ లో జరిగిన జంట హత్యల ఉదంతం అంతా రికార్డు చేసుకుని స్టేషన్ కు చేరుకున్నాడు.

అంతా ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఎక్కడైనా...ఎప్పుడైనా హత్య జరిగిందంటే రాజకీయ కక్షతోనే. ఆస్తి గొడవల్లోనో....డబ్బు లావాదేవీల్లోనో ఇలా జరుగుతుంటుంది. కానీ, ఇక్కడ ఎలాంటి లావాదేవీలు కాన రాలేదు. ఎవరికీ సంబంధం లేని అనాథల్లాంటి యాచకుల హత్యలు!

ఈ రెండు సంఘటనల్లో ఒకే ఒక వ్యక్తి కేవలం ఒక స్త్రీ ఇన్వాల్వ్ అయి ఉందా. ఆమె సమక్షం లోనే ఈ హత్యలు జరిగాయనిపిస్తోంది. ఎవరామె?!

అప్పటికే మధ్యాహ్నం కావస్తోంది.   ఉదయం వెళ్లిన రైటర్ పత్తా లేకుండా పోయాడు. నిన్న రాత్రి కుర్రాడితో వెళ్లిన కానిస్టేబుల్స్ స్టేషన్లో రిపోర్టు చేసి ఇళ్లకు వెళ్లి పోయినట్టున్నారు. వాళ్ల నుండి చిన్న సమాచారం కూడా లేదు.

కమీషనర్ గారు బాధ్యతంతా తన మీద వేసారు. కాంప్లెక్స్ లో జరిగిన మర్డర్ల మిస్టరీ కూడా నేనే ఛేదించాలంటారు. రెండు సంఘటనలు...మూడు హత్యలు ఒకే మోస్తరుగా జరిగాయంటారు. ఒకే మోటివ్ తో జరిగిన హత్యలంటారు. అన్నిటి కంటే ముఖ్యమైన విషయం రెండు చోట్ల ఓ స్త్రీ ఇన్వాల్వ్ మెంట్ కనిపించడం ఛాలెంజింగ్ గానే ఉంది. కానీ, ఎలా ఈ కేసు సాల్వ్ చెయ్యడం? ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు.

ఆలోచిస్తూ తల పట్టుక్కూర్చున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్. సి.ఐ. గారు మాత్రం ముసి ముసిగా నవ్వుకుంటూ కమీషనర్ దగ్గర ‘ఎస్సార్’ అంటూ సెల్యూట్ చేసి వచ్చేసారు. భారం...భాద్యత అంతా నాదే అన్నట్టు అతని కేమీ సంబంధం లేనట్టూ వచ్చేసారాయన.

అదే సమయంలో....

స్టేషన్ లో అడుగు పెట్టారు రైటర్, మరో కానిస్టేబుల్. వాళ్లతో పాటు నలుగురు మగాళ్ళు, ఇద్దరాడవాళ్ళు ఉన్నారు. అందర్నీ స్టేషన్లో ఓ మూల కూర్చోమని తమతో పాటు తీసుకు వెళ్లిన దొంగలిద్దర్నీ సెల్ కి  తోసి ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గర కొచ్చాడు  రైటర్.

రైటర్ని చూడగానే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఎస్సై అక్బర్ ఖాన్ కి.

‘‘రండి రైటర్ గారూ! మీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఉదయం ఎప్పుడో వెళ్లారు కదా! ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను.’’ ఆనందంగా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

దొంగలు ముగ్గురూ మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టారు సార్! వాళ్లిచ్చిన వివరాల ప్రకారం యాత్రీకుల దగ్గర దొంగిలించిన వస్తువులన్నీ ఎవరెవరికి అమ్మారో వాళ్ళందర్నీ లాక్కొచ్చాం సార్! వారి దగ్గరున్న ప్రాపర్టీని కూడా స్వాధీనం చేసుకున్నాం సార్. ఈ దొంగలు నివసించే స్థావరానికి కూడా వెళ్ళి అక్కడ దొరికిన చిన్నా పెద్దా వస్తువులన్నీ ఈ గోనె సంచిలో మూట గట్టుకుని వచ్చేసాం సార్.’’ క్లుప్తంగా చెప్పాడు రైటర్.

‘‘వెల్డన్! పెండింగ్ లో నున్న చాలా కేసులు పరిష్కారం అయిపోతాయి. మీరు స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు, అవి ఎవరి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారో వారి వివరాలు ఒక పట్టికలో తయారు చేయండి.’’ అన్నాడు

‘‘ఎస్సార్!  ఈ గోనె సంచిలో ఉన్న చిన్న చిన్న ఆర్టికల్స్ కూడా మనకి ఈ దొంగల స్థావరంలో దొరికాయి కదా! వీటి వివరాలు ఎలా రాయమంటారు?’’ వినయంగా అడిగాడు రైటర్.

‘‘ఎలాంటి వస్తువులు? విలువైనవైనా?!’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

‘‘మీరే చూడండి సార్!’’ అంటూనే తన వెనుకే గోనె సంచి పట్టుకుని నిలబడ్డ కానిస్టేబుల్ కేసి చూసాడు రైటర్.

రైటర్ కళ్ళ తోనే సైగ చేసే సరికి తన భుజం మీదున్న గోనె సంచిలో వస్తువులు ఎస్సై అక్బర్ ఖాన్ గదిలో ఆయనకి ఎదురుగా క్రింద కుప్పలా పోసాడు కానిస్టేబుల్.

సీట్లో రిలాక్స్ గా కూర్చున్న ఎస్సై అక్బర్ ఖాన్ ఉత్సాహంగా లేచి నిలబడి టేబుల్ మీద రెండు చేతులు ఆన్చి ఒంగొని మరీ పరిశీలనగా చూసాడు.

‘లెదర్ పర్సు, వ్యానిటీ బ్యాగ్లు , చీరలు, జాకెట్లు ఒకటేమిటి ఏవేవో చెత్తా చెదారం అంతా మోసుకొచ్చేసినట్టున్నారు’ మనసు లోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘ఇదంతా ఏంటయ్యా! ఈ చెత్త అంతా ఎందుకు తెచ్చారూ?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘కొన్ని కేసుల్లో విక్టిమ్స్ ఇచ్చిన వివరాల్లో బ్యాగ్లు, పర్సులు, బట్టలు పోయాయని ఇచ్చారు కదా సార్! వాటికి ‘రికవరీ’ సొత్తుగా చూపించొచ్చని అక్కడ పూచిక పుల్ల కూడా వదలకుండా గోనె సంచిలో ఎత్తుకొచ్చాము.’’ చెప్పాడు రైటర్.

‘‘ఓకే! ఓకే! ఇందులో ఏమన్నా మివైన వస్తువులుంటే వెతికి ‘ప్రాపర్టీ’ లిస్టులో రాయండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘అలాగే సర్!’’ అంటూ రైటర్, కానిస్టేబుల్ ఇద్దరూ క్రింద కూర్చుని పర్సులన్నీ పోగేసి అందులో ఒక్కొక్కటి తీసి ఖాళీగా ఉన్నవి అన్నీ ఓ ప్రక్క పడేస్తున్నారు.

ఏదో క్రైం ఫైల్ తిరగేస్తూ మధ్య మధ్యలో వారిద్దరికేసి ఓర కంట చూస్తూ పనిలో నిమగ్నమై పోయారు ఎస్సై.

ఒక్కొక్క పర్సు తీసి చూసి విసిరేస్తున్న రైటర్ ఓ పర్సు తీసి చూసి ప్రక్కకు పడెయ్య బోతూ అందులో ఉన్న అందమైన అమ్మాయి ఫొటో చూసి ఒక్కసారే షాకయి మళ్లీ మరో సారి అదే పర్సు తెరిచి ఆ అమ్మాయి ఫొటో చూసి ముగ్ధుడై పోయి క్షణం చూపు మర్చుకో లేక పోయాడు రైటర్.

రైటర్ తదేకంగా ఏదో పర్సు చూస్తూ ఉండి పోవడం గమనించిన ఎస్సై అక్బర్ ఖాన్ చటుక్కున తల ఎత్తి మరింత పరిశీలనగా చూసాడు.    ఎవరో అందమైన అతివ. సినిమా నటిలా వుంది. రైటర్ చేతిలో పర్సు...ఆ పర్సులో ఫొటో చూసి ఎస్సై అక్బర్ ఖాన్ కూడా ముగ్ధుడై పోయాడు.

‘‘రైటర్ గారూ! ఏదీ ఓ సారి చూడనివ్వండి.’’ చేస్తోన్న పని ఆపేసి చూస్తున్న ఫైల్ మూసేసి రైటర్ కేసి చెయ్యి చాపాడు ఎస్సై అక్బర్ ఖాన్.  రైటర్ చటుక్కున లేచి నిలబడి పర్సుతో పాటు ఉన్న ఫొటో ఎస్సై అక్బర్ ఖాన్ చేతికి అందించాడు.

పర్సులో ఓ అరలో భద్రంగా ఉన్న ఫొటో అలాగే చూస్తూ తనని తానే మైమరచి పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘పాపం! ఎవరిదో ఈ పర్సు’’ విచారంగా అన్నాడు ఎస్సై.

‘‘యాత్రీకుల దగ్గరే కదా సార్ వీళ్ళు కొట్టేసేది...డబ్బు తీసేసి పర్సులు, బ్యాగులు, ఇలా పడేస్తారు.’’ అన్నాడు రైటర్.

‘‘సరి సరి. మిగతా చెత్తంతా ఏరి అవసరమైనవి ఉంచి మిగతావి డస్ట్ బిన్ లో పడెయ్యండి.’’ అంటూ పర్సు మాత్రం తెరిచి ఆ అమ్మాయి ఫొటో కనపడేటట్టు తన టేబుల్ మీద పెట్టాడు ఎస్సై అక్బర్ ఖాన్.

చూస్తున్నంత సేపూ పదే పదే చూడాలనిపించే ఆకర్షణీయమైన మొహం....మిల మిల మెరుస్తూ చూపరులను కవ్విస్తున్న పెద్ద పెద్ద నేత్రాలు...సన్నగా సంపంగి పువ్వులా ఉన్న నాసికం...కోల మొహం...చిన్న చుబుకం...విశాలమైన నుదురు...మిల మిలా ఒంగి ఉన్న ఒత్తైన కనుబొమ్మల మధ్య కంది గింజంత బొట్టు తళతళా మెరుస్తోంది.    ఎవరో గొప్పింటి అమ్మాయే! అమ్మాయంటే అమ్మాయి కాదు. ముప్ఫై ముప్పై అయిదేళ్ళ మధ్య వయసుంటుంది. విరహోత్కంఠితలా ఉంది. తన కంటే ఐదారేళ్ళు పెద్దే ఉంటుంది. మనసులోనే అనుకున్నాడు.

రైటర్, కానిస్టేబుల్ ఇద్దరూ చక చకా క్రింద పడ్డ ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ పనికి రానివి ప్రక్కన పడేస్తున్నారు. వ్యానిటీ బ్యాగ్ లు, పర్సుల్లాంటివన్నీ జాగ్రత్త చేసి గుడ్డ సంచుల చిక్కాల్లాంటివి అన్నీ చెత్త కుప్పలా పోగు పెడుతున్నారు ఇద్దరూ. అందులో ప్లాస్టిక్ కవరుతో చుట్టిన కాగితాలు కనిపించాయి రైటర్ కి.  

పోలీసులను ఆకర్షించిన ఆమె.....ఈ కథలోని అజ్ఞాత వ్యక్తి ఒకరేనా.....ఇక వివరాలు తెలిసిపోవడమే ఆలస్యమా.....ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం దాకా ఆగాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani