Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అనగా అనగా ఆ రోజు

anaganagaa aa roju

సాయంత్రం ఆరు గంటలు దాటింది. బస్సు స్టాప్ లో రద్దీ పెరుగుతోంది. దగ్గర లోనే చిన్న పిల్లల స్కూల్ ఉంది కాబోలు...వాళ్ళ కోసం వచ్చిన పెద్ద వాళ్ళతోనూ, పిల్లలతోనూ బస్సు స్టాప్ నిండి పోయింది. బస్సు మిస్ అవుతామేమో, ఇంటికి చేరడం లేట్ అవుతుందేమో అనే ఆత్రుత నిండిన ముఖాల తోను, పరిగెడుతున్నంత వడి వడిగా వస్తూన్న ఆడవాళ్ళ తోనూ, తాపీగా నిల్చుని కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయే వాళ్ళని పరిశీలిస్తూ వెనకగా నిల్చున్న మగాళ్ళతోనూ బస్సు స్టాప్ కళకళలాడుతోంది. కాలు మోపే జాగా కనిపించ లేదు. బస్సు స్టాప్ నుంచి పదడుగులు దూరంగా వచ్చి నిల్చున్నా. చిన్న వాళ్ళ రష్ తగ్గితే గాని బస్సు ఎక్కలేననుకున్నాను.ఇంతలో కలకలం...దూరంగా బస్సు కనిపించింది. పిల్లలందరూ రెడీ గా ఉన్నారు. బస్సు ఆగడమేమిటి, పొలోమని ఒక్కళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కేసారు. కండక్టర్ గంట కొట్టేసాడు. చేతిలో కర్రతో ఒక ముసలాయన నిలబడిపోయాడు. ఆయన ముఖంలో నిస్సహాయత.. డ్రైవరు బస్సు ఆపి పిలిచాడు ఆయనని .. ఆ ముసలాయన బస్సు ఎక్కి కూర్చున్న తరువాతే బస్సుని ముందుకు తీసుకెళ్లాడు.

ఇక్కడ వాళ్ళు‘మంచి వాళ్ళేనన్న మాట.’ ఒక ఫీలింగ్ కలిగింది. బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. బస్సు స్టాప్ లో రష్ తగ్గినట్టే అనిపించింది. నేను ఎదురు చూస్తున్న బస్సు జాడ లేదు. చేతిలో ఫోన్ లో చూసా...గూగులమ్మ ప్రకారం ఆ బస్సు అరగంట కొకటి రావాలి. దాదాపు నలభై నిముషాలు దాటింది నేను వచ్చి. చుట్టూ చూసా.  మళ్ళీ రష్ పెరిగింది. సడెన్ గా నా దృష్టి  కొంంచెం దూరంలో  గుండ్రంగా నిల్చుని ఉన్న గుంపు మీద పడింది. గట్టి గట్టిగా వినిపిస్తున్నాయి వారి మాటలు. పూర్తిగా అర్ధం అవ్వలేదు గాని, ఎవరో పడిపోయారని మాత్రం అర్ధం అయ్యింది.

వస్తున్నారు...చూస్తున్నారు...వెళుతున్నారు. గుంపు పెద్దదౌవుతోంది..గోల ఎక్కువైంది...లో లోపల ఆత్రంగా ఉంది. మానవ సహజం...ఏమైందోనని..మళ్ళీ బెరుకు..నా చూపు మాటి మాటికీ అటే వెళుతోంది. రెండడుగులు అటేసాను. ఇప్పుడు సృష్ఠంగా కనిపించింది. ఎవరో మనిషి పడిపోయి ఉన్నాడు. అటు వెళ్ళాలా..వద్దా.. వెళితే...ఏమవుతుంది? అసలే కొత్త చోటు.....తెగించి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలన్నా…..జేబు తడుముకున్నా.. తేలికగా ఉంది నెలాఖరు....నాలో నేను తర్జన భర్జనలు.. ఉండబట్టలేక పోయాను...చూద్దాం అసలు ఏమైందో... గబ గబా నా అడుగులు ఆ వైపు పడ్డాయి.

'మధ్య వయస్కుడిలా ఉన్నాడు. అక్కడక్కడా మెరుస్తున్న తెల్ల వెంట్రుకలు...నీట్ గా ఉన్నాయి అతని బట్టలు. చదువుకున్నవాడిలాగే కనిపించాడు. కాళ్ళకి ‘షూస్'  ..బోర్లా పడిపోయి ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తున్నారు..ఎవరూ ముందుకు రావడం లేదు. ఉండబట్ట లేక నేనే అన్నాను. పోలీససులకి చెబితే బాగుంటుందేమో'' ఎవరు మాట్లాడలేదు. మరొక సారి అన్నాను..‘పాపం ఈయన

ఎక్కడుంటాడో.....వీళ్ళ వాళ్ళకి కబురు ఎలా అందుతుంది.....ఈ చుట్టుపక్కలే ఉంటాడా…..... అటాక్ ఏవైనా వచ్చిందా... అసలు బతికున్నాడా..’రకరకాలుగా నా ఆలోచనలు.. దగ్గరకు వెళ్ళి, అతనిని దీక్షగా చూసాను.  ఊపిరి ఆడుతోంది.  ఎవరో నన్ను వెనక్కి లాగారు.’ టచ్ చెయ్యకు...లేనిపోని గొడవలొస్తాయి’ సహాయం చెయ్యాలన్నా.. సంకోచమే ….  పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది...హాస్పిటల్ కి తీసుకెళితే....లేదులే ముందు పోలీసులకి చెపితే’అదే మంచిది  అనిపించింది. చుట్టూ చూసాను..నన్ను వెనక్కి లాగిన మనిషి నా చెయ్యి వదిలేసాడు.

‘పోలీసులతో వ్యవహారం. నువ్వే వెళ్లి పిలుచుకు రా...అదిగో  ఎదురుగానే ఉంది పోలీస్ స్టేషన్'… నా వైపు చూడకుండా ఉచిత సలహాలు చాల మందే ఇచ్చారు. ఎవరూ నాతో రావడానికి ముందుకి రాలేదు. ఆ క్షణంలో నాకు వేరే ఇంకేమీ గుర్తుకు రాలేదు. నేను ఎవరికో వస్తానని చెప్పానని, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారని పూర్తిగా మర్చి పోయాను. నా మనసులో ఒకటే ఆలోచన. సరైన సమయంలో వైద్య సహాయం అందితే ఒక ప్రాణం నిలబడుతుందని. నా'మూర్తి'లా నడి రోడ్డు మీద, దిక్కు మొక్కు లేకుండా , అనాథలా పడి ఉండకూడదని. దైర్యం చేసి, రోడ్డు దాటి అటు పక్కన ఉన్న పోలీస్  స్టేషన్ కి వెళ్ళాను.

'మూర్తి'....వాడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధతో నా గుండెలు విలవిలలాడుతాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. చదువులు వేరైనా, మా స్నేహం అలాగే ఉంది. ఆ రోజు....నేను లేటుగా మార్నింగ్ వాక్ కి బయలుదేరాను. వాడు అప్పటికే జాగింగ్ ముగించి వస్తూ కనిపించాడు. ఒకరినొకరు పలకరించుకున్నాం. నేను నా రొటీన్ వాకింగ్   పూర్తి చేసి వచ్చేటప్పటికి గంట పైనే అయింది. బర్కత్ పురా దగ్గర ఫుట్ పాత్ దగ్గర పెద్ద గుంపు ..వెళ్ళి చూస్తే' నా మూర్తి' పడి ఉన్నాడు. మామూలే..

పోలీసులు వ్యవహారం అని ఎవరు ముందుకు రాలేదు. నేను, మరో ముగ్గురు కలిసి అంబులెన్సుకి ఫోన్ చేసి, అది వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపలే అంతా అయిపొయింది .హార్ట్ అటాక్...చాల తీవ్రంగా వచ్చిందిట.. ఒక్క పదిహేను నిముషాల ముందు తీసుకొచ్చినా ఫలితం ఉండేదని డాక్టర్లు అన్నారు. నా ‘మూర్తి ‘శాశ్వతంగా అందరికీ దూరం అయ్యాడు. ఆ రోజు నేను వాకింగ్ కి వెళ్లకుండా వాడితో పాటే ఉంటే

బాగుండేదేమో....ఇంట్లో ఉంటే అసలు తెలిసేదే కాదేమో...నా ఆలోచనలు నా వశంలో లేవు. ఆ క్షణం లోనే నిశ్చయించుకున్నా..ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారికి సకాలంలో నేను చెయ్యగల సహాయం చేస్తానని. అలా సహాయం చేసే అవకాశాలు చాలానే వచ్చాయి. స్నేహితుల సహకారం తో దాదాపు పదిహేను జీవితాలని కాపాడ గలిగాము. ఉద్యోగం కోసం ముంబై వచ్చాను. పరిసరాలతో ఇంకా పరిచయం అవలేదు. నా ప్రయత్నం చేద్దామని పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేసాను. చిన్న పోలీస్ స్టేషన్. ఎక్కువ హడావిడి లేదు. సినిమాల్లో చూపించే సెట్టింగ్ లేదక్కడ. మామూలు గవర్నమెంట్ ఆఫీస్ లా ఉంది. నాలుగు టేబుళ్లు ఉన్నా, ఇద్దరే కనిపించారు. గది గుమ్మం దగ్గరగా ఉన్న టేబుల్ ముందు ఆగాను.

‘హా బోలో. .. తల ఎత్తకుండా అడిగాడు చేతిలో ఉన్న రిజిస్టర్ లో చూస్తూ..'హా బోలో'. కరుగ్గా ఉందీ సారి…..ఉలిక్కి పడ్డా.. యూనిఫామ్ లో ఉన్నఆ పోలీసు నన్నే అడుగుతున్నాడు... చెప్పాను.. రోడ్డుకి అటు పక్క ఉన్న గుంపుని చూపించాను కూడా...’ వస్తే  బాగుంటుంది.’.. అన్నాను అంత వరకు సాదాగా ఉన్న అతని ముఖంలో విసుగు సృష్టంగా కనిపించింది..పొద్దున్నించి చేస్తున్నా, పని తరగడం లేదు. ఆక్సిడెంట్ కేసా…..దొమ్మి కేసా ....దే.....రోడ్డు మీద ఎవరో పడిపోతే రిపోర్ట్ చేయడానికి వచ్చావా..వెళ్ళవయ్యా వెళ్ళు...నాది నీది టైం వేస్ట్ చెయ్యకు.'నేను కదల్లేదు. ఒక్క సారి వచ్చి చూడండి.'..బతిమాలాను.' జావ్ జావ్' అన్నాడు...రిజిస్టర్ చూస్తూ.. నేను కదల్లేదు. మరొకసారి రిక్వెస్ట్ చేశాను. జవాబు చెప్పలేదు. ఇంక మాట్లాడేదేమి లేదన్నట్లుగా మౌనంగా ఉన్నాడు. నేను ఒక బాధ్యత గల ఉద్యోగినని తెలియ చెప్పాలని నా జేబులోంచి 'భారత ప్రభుత్వ మూడు సింహాల' గుర్తింపు కార్డు' చూపించాను. నన్నే గమనిస్తున్నట్లున్నాడు అక్కడున్న ఇన్స్పెక్టర్. వచ్చాడు. మళ్ళీ వివరించాను.

నాతో ఆ పోలీస్ ని పంపించాడు… మనస్ఫూర్తిగా కృజ్ఞతలు చెప్పాను..విసుక్కుంటూనే వచ్చాడు ఆ పోలీస్ కానిస్టేబుల్.'ముంబై వాళ్ళు మంచివారే' మనసులో   అనిపించింది. నాలోని 'పౌరుడు ' గర్వంగా కాలర్ సర్దుకున్నాడు. పోలీస్ ని చూడగానే అక్కడక్కడా దూరంగా నుల్చున్న వారందరు దగ్గరకి వచ్చారు..గుంపు ఇంకొంచెం పెద్దదైంది. గోల గోలగా మాట్లాడుతున్న వారందరు సైలెంట్ గా అయిపోయారు. పోలీస్ చుట్టూ మూగిన వాళ్ళందరిని చూసి ' అందరు కొంచం దూరంగా వెళ్ళండి' అన్నాడు. నేను పోలీస్ వెనకే ఉన్నాను. వంగి ఆ బోర్లా పడ్డ మనిషి ని తిప్పాడు... తదేకంగా చూసాడు..'ఫాట్...' చాచి పెట్టి గూబ గుయ్ మనేలా ఒక్కటిచ్చాడు. గుంపు అందరు కొంచం దూరం జరిగారు. నేను 'పడిపోయిన అతనికి' దగ్గరనే ఉన్నాను. అదేదో 'వాణిజ్య ప్రకటనలోలా అవాక్కయ్యాను..దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తాడేమో అనుకుంటే....

ఇదేంటి? ఇలా కొట్టాడేమిటి? చెప్పొద్దూ..నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏదో అనబోయాను.

ఇంతలో…

ఆ పడిపోయిన మనిషి లేచి, తల వంచుకొని, అటూ ఇటూ చూడకుండా, తూలుతూ, ఏమి కానట్లే లేచి వెళ్ళిపోయాడు. నాకు నోట మాట రాలేదు. గొంతుకేదో అడ్డం పడ్డట్లయింది. నమ్మశక్యం కాలేదు. ఇలా కూడా అవుతుందా….బేవాడా'….' నా వైపు తిరిగి' సాబ్..తాగుబోతు గాడు....డోస్ ఎక్కువై పడ్డాడు...ఇలాంటి వాళ్ళ కోసం మీ టైం, మా టైం ఎందుకు పాడు చేస్తారు...ఇంకో గంట ఆలా పడుంటే వాడే లేచి పోయి ఉండేవాడు,' ' చలో చలో ' అంటూ మూగిన గుంపుని చెదర గొట్టాడు..

' థాంక్ యు ' చాల నిజాయితీ గా అన్నాను. సాబ్. ముంబై కొత్తా..... . ...ఇలాంటివి చూసి చూడకుండా ఉంటే మంచిది'  అని రోడ్డు దాటాడు..

...ఏదో అయి పోతుందని  చోద్యం చూస్తున్న వాళ్ళందరూ నిరుత్సాహంగా వెనుతిరిగారు..కొంత మంది నన్ను చూపించి నవ్వుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా

నాకు మాత్రం ఆ సంఘటన నుండి తేరు కోవడానికి కొద్ది సమయం పట్టింది. సడెన్ గా వచ్చిన చల్ల గాలి 'మంచి పని చేసావు' అన్నట్లుగా నా భుజం తట్టింది అభినందిస్తున్నట్లుగా. ఈ లోపల నేను ఎక్కవలసిన బస్సు వెళ్ళి పోయింది.

ఇది ఏ ఒక్కరి అనుభవమో కాదు, ఏ ఒక్కసారి ఎదురయ్యే సంఘటనో కాదు....ఎక్కడోచోట ప్రతివారికీ ఎదురయ్యేదే....మందు డోసు ఎక్కువై ఇలా రోడ్ల పక్కన పడిపోవడం, వారిని చూసి ఎవరికో ఏదో అయిపోయిందని నాలాంటి వాళ్ళు...సారీ సారీ...మానవత్వం ఉన్న ప్రతివాళ్ళూ కంగారు పడడం ఆ తర్వాత విషయం తెలిసి ఇంతేనా అనుకోవడం....కానీ, ఇలాంటి మందుబాబుల వల్ల నిజంగా ఏమన్నా జరిగి పడిపోయిన వాళ్ళకూ నాన్నా పులి లాంటి ప్రమాదమే ఉంది.... అది ఇలాంటి సామాజిక బాధ్యత లేని మందుబాబులకు ఎలా తెలిసేది.....

మరిన్ని కథలు
apayam lo upayam