Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anaganagaa aa roju

ఈ సంచికలో >> కథలు >> అపాయంలో ఉపాయం

apayam lo upayam

సీటులో కూర్చుని హమ్మయ్య అని నిట్టూర్చాను. చేతిలో ఉన్న బ్యాగ్ ను గట్టిగా నా గుండెలకు హత్తుకున్నాను. నా ఎదురుగా నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో ముగ్గురు పల్లెటూరు బైతులు. ముతక పంచే లాల్చీ వేసుకున్నారు. నాలుగవ వ్యక్తి కిటికి దగ్గర కూర్చున్నాడు. బలంగా లావుగా ఉన్నాడు. నీలం రంగు వెలిసిపోయిన జీన్స్ దాని మీద నల్ల రంగు టీషర్ట్ వేసుకున్నాడు. చప్పున చూస్తే ఎవరికి అతని మీద సదభిప్రాయం కలగదు.

అతని చూపులు నా నడుం మడత మీద ఉన్నట్టు గ్రహించాను. వెంటనే చీర సరి చేసుకున్నాను. ఇప్పుడు అతని చూపులు నా బ్యాగ్ మీద పడింది. దాని వైపు ఒక్క క్షణం పాటు తదేకంగా చూశాడు. ఎందుకో అతని వాలకం చూస్తుంటే నాకు భయంగా ఉంది. దానికి కారణం ఆ బ్యాగ్ లో లక్ష రూపాయలు ఉన్నాయి. నాన్న గారి ట్రీట్ మెంట్ కోసం తీసుకు వెళుతున్నాను. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు నాన్న స్నేహితుడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. నాన్నకు జ్వరంలో ఉందని చెప్పాడు. కాని భయపడవలసింది ఏం లేదని కూడా చెప్పాడు. దాంతో నా మనస్సు నెమ్మదించింది.

నిజానికి ఒక నెల రోజులు ముందు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాలి. అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ పని తల మీద పడింది. దాంతో ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండిపోయాను. ఇంటికి వెళ్ళటానికి తీరిక లేక పోయింది. ఈ రోజు అనుకోకుండా నాన్నగారి స్నేహితుడు కాల్ చేశాడు. నాన్న ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. ఈ సాకుతో అయిన నాన్న గారిని చూడవచ్చని తోచింది. అందుకే యం.డి దగ్గరకు వెళ్ళి నాలుగు రోజులు సెలవు కావాలని అడిగాను. యం.డి మంచి మూడ్ లో ఉన్నట్టు ఉన్నాడు. వెంటనే సెలవు గ్రాంట్ చేశాడు. 

నేను ఇంటికి వచ్చే సరికి ఎనిమిది గంటలైంది. మా ఊరు పేరు పావురాలపల్లి. హైదరాబాదుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచీకరణ పుణ్యం వల్ల నగరాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ది చెందాయి. మా ఊరు కూడా బాగానే డెవలప్ అయింది. కాని ట్రాన్స్ పోర్ట్ మాత్రం అంతగా అభివృద్ది కాలేదు. మా ఊరికి ఒక ఎక్స్ ప్రెస్ రైలు ఒక ప్యాసింజర్ రైలు మాత్రం ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్స్  ప్రెస్ రైలులో వెళతాను. ప్రతి సారి నాకు రిజర్వేషన్ దొరికేది. అందుకే ఈ సారి కూడా దొరుకుతుందని ఆశించాను. కాని నా అంచన తప్పయింది. ఈ సారి నాకు రిజర్వేషన్ దొరకలేదు. ఇక మిగిలింది ప్యాసింజర్ రైలు. ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ రైలులో ప్రయాణం చెయ్యలేదు. బస్సులో కూడా ప్రవర్తించాను. వాటిలో కూడా సీట్లు అయిపోయాయి. ఇక గత్యంతరం లేక ప్యాసింజర్ లో బయలుదేరాను. ఈ రైలుకు దొంగల బండి అని ఇంకో పేరు కూడా ఉంది. 

దానికి కారణం ఈ రైలులో బాగా దొంగతనాలు జరుగుతాయి. ప్రయాణికులు డబ్బు, విలువైన వస్తువులు కొట్టేస్తారు. అందుకే ముందు నాకు భయం వేసింది. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. పైగా లక్ష రుపాయలు క్యాష్ ఉంది. నిజానికి అంత డబ్బు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. నాన్న గారిని పూర్తిగా చెకప్ చేయించాలని నా ఉద్దేశం. ఖర్చు ఎంతయిన ఫర్వాలేదు. నాన్న గారు ఆరోగ్వంగా నవ్వుతూ ఉండాలి. అదే నా తపన. నా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. నాకు చిన్న తనంలోనే తల్లి పోయింది.  ఆ లోటు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అవకాశం ఉన్నా ఇంకో పెళ్ళి చేసుకోలేదు. ఆ వచ్చిన ఆమె నన్ను ఎలా చూసుకుంటుందో అని భయం ఆయనకు.

ప్యాసింజర్ రైలు వేగం అందుకుంది. సమయం దాదాపు పదకొండున్నర కావస్తోంది. చాల మంది ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు కాని నేను పావురాల పల్లి చేరాను. అంత వరకు ఈ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఎదురుగా ఉన్న పల్లెటూరు వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. ఆ రౌడి మాత్రం ఆ ప్రయత్నం చెయ్యటం లేదు. నా వైపు తదేకంగా చూస్తున్నాడు. అతని చూపులు కంపరమెత్తిస్తున్నాయి. ఒంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టు అనుభూతి కలుగుతుంది.

అతని చూపులు నా మనీ బ్యాగ్ మీద స్దిరంగా ఉంది. నేను ఎప్పుడు నిద్రపోతానా అని కాచుకుని కూర్చున్నాడు. నేను గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత నా బ్యాగ్ తీసుకోవాలని అతని ఉద్దేశం. ఏదైన ప్రాజెక్టు చేస్తున్నప్పుడు రాత్రంతా మేలుకుని ఉండటం నాకు అలవాటు. కాని ప్రయాణం చేస్తున్నప్పుడు మేలుకోవటం నా వల్ల కాదు. నాకు తెలియకుండానే నిద్ర లోకి జారుకుంటాను. ఒక గంట రెండు గంటలు నిద్రను ఆపుకోగలను. కాని తెల్లవారేంతవరకు మేలుకుని ఉండలేను. అలాగని ధైర్యంతో నిద్ర పోలేను. నా డబ్బు నా కళ్ళముందు కదులుతోంది. ఇంక నిద్ర ఎలా పడుతుంది.

ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాను. కొంచం సేపయిన తరువాత లేచి లావెట్రిలోకి వెళ్ళాను. మొహం కడుక్కుంటు ఆలోచనలో పడ్డాను. పది నిమిషాల తరువాత నాకు బుర్రలో ఫ్లాష్ వెలిగింది. సంతోషంతో నా మొహం వికసించింది. అంత వరకు పడుతున్న టెన్షన్ దూరమైంది. ఇది రిస్క్ తో కూడుకున్న పని. ఆ విషయం నాకు తెలుసు. కాని ప్రస్ధుతం ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు. డబ్బు సంచిని దాచటానికి నాకు ఇంతకంటే అనువైన స్ధలం ఇంకోకటి లేదు.

చిరునవ్వుతో నా సీటులోకి వచ్చి కూర్చున్నాను. అప్పటికే ప్రయాణికులు చాల మంది నిద్రలో జోగుతున్నారు. కాని అతను మాత్రం ఇంకా నిద్ర పోలేదు. కనీసం నిద్రకు ఉపక్రమించలేదు. నా మొహంలో చిరునవ్వు చూసి మాత్రం కొంచం ఖంగు తిన్నాడు. నా వైపు అదో విధంగా చూశాడు. తరువాత లేచి లావెట్రి వైపు సాగిపోయాడు. వాడి ఉద్దేశం నేను అంత డబ్బును అక్కడ దాచి ఉంచవచ్చని. అలా అనుకోవాలనే నా ఉద్దేశం. అది చాల తొందరగానే తీరింది.

అతను అటు వెళ్ళగానే నా చేతులు చకచక పనిచేశాయి. నా మనీ బ్యాగ్ పదిలంగా దాచేశాను. తరువాత హాయిగా కళ్ళు మూసుకున్నాను. అయిదు నిమిషాల తరువాత అతను వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అతని మొహంలో అసహనం కనిపించింది. నేను పట్టించుకోలేదు. హాయిగా కళ్ళు మూసుకుని పడుకున్నాను. పది నిమిషాలలో గాఢ నిద్రలోకి జారుకున్నాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.

నేను తిరిగి నిద్ర లేచే సరికి బాగా తెల్లవారిపోయింది. కంపార్ట్ మెంట్ దాదాపు ఖాళీ అయింది. చేతి గడియారం చూసుకున్నాను. ఏడున్నర కావస్తోంది. ఇంకో అరగంటలో నా ఊరు వస్తుంది. క్యాజువల్ గా రౌడి వైపు చూశాను. అతను నా వైపు చాల కోపంగా చూస్తున్నాడు.  దానికి కారణం ఏమిటో నాకు తెలుసు. రాత్రి నేను నిద్రపోయిన తరువాత మనీ బ్యాగ్ కోసం వెతికిఉంటాడు గురుడు. కాని అది కనిపించి ఉండదు. దాంతో ఆ బ్యాగ్ నేను ఎక్కడ పెట్టానో అని తల బద్దలు కొట్టుకుని ఉంటాడు. నా ఇంకో బ్యాగ్ ను వెతికినట్టున్నాడు. కాని తొందరలో జిప్పు మూయలేదు. లోపల నా సామాను చిందర వందరగా ఉంది.

అరగంట సేపు ఓపికగా కాచుకున్నాను. క్రమంగా పావురాలపల్లి దగ్గరయింది. ఇక బ్యాగ్ తీసుకునే సమయం వచ్చింది. పది నిమిషాల తరువాత ట్రయిన్ పావురాలపల్లిలో ఆగింది. నేను మెల్లగా లేచి అతని దగ్గరకు వెళ్ళాను.

“కొంచం లేస్తారా “అని తియ్యగా నవ్వుతూ అడిగాను.

“ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు అతను.

“ముందు మీరు లేవండి. తరువాత మీకే తెలుస్తుంది”అన్నాను.

అతను ఆశ్చర్యపడుతునే లేచాడు. నేను అతని హోల్డాలో చెయ్యి పెట్టి నా మనీ బ్యాగ్ ను తీసుకున్నాను. విజయగర్వంతో అతని వైపు చూశాను.

తెల్లగా సున్నం కొట్టినట్టు అతని మొహం పాలిపోయింది.

“దొంగల భయం నుంచి నా డబ్బును కాపాడుకోవటానికి నాకు ఇంతకంటే మార్గం దొరకలేదు. మీ వల్ల నా డబ్బు క్షేమంగా ఉంది ద్యాంక్స్ “అని దిగాను.

అతని రియాక్షన్ ఎలా ఉందో నేను చూడలేదు. అది నాకు అనవసరం. నా డబ్బు క్షేమంగా ఉంది అది చాలు నాకు.

మరిన్ని కథలు