Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: నర్తనశాల 
తారాగణం: నాగశౌర్య, కాశ్మీర పరదేశి, యామినీ భాస్కర్‌, జయప్రకాష్‌రెడ్డి, శివాజీ రాజా, అజయ్‌, సుధ, సత్యం రాజేష్‌ తదితరులు 
సంగీతం: మహతి స్వర సాగర్‌ 
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి కుమార్‌ 
నిర్మాత: ఉషా ముల్పూరి 
దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి 
నిర్మాణం: ఐరా క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 30 ఆగస్ట్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే

కళామందిర్‌ కళ్యాణ్‌ (శివాజీ రాజా) తనకు కుమార్తె పుట్టాలని కోరుకుంటాడు. చనిపోయిన తన తల్లి తన కుమార్తెగా పుట్టాలన్నది కళామందిర్‌ కళ్యాణ్‌ కోరిక. కానీ, అతని కోరిక ఫలించదు. అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయే నాగశౌర్య. తన తండ్రి కోసం తన కుమారుడ్ని అమ్మాయిగా పెంచుతాడు శివాజీ. చిన్నప్పటినుంచే అమ్మాయిలా పెరిగిన నాగశౌర్య, ఆడవాళ్ళ కోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ని స్టార్ట్‌ చేస్తాడు. ఓ సందర్భంలో మానస (కాశ్మీర పరదేశి)తో ప్రేమలో పడతాడు. మరోపక్క నాగశౌర్యని సత్యభామ (యామిని భాస్కర్‌) ఇష్టపడుతుంది. యామినికీ, నాగశౌర్యకీ పెళ్ళి చేయాలనుకుంటాడు కళామందిర్‌ కళ్యాణ్‌. ఆ పెళ్ళి నుంచి తప్పించుకుని మానసతో నాగశౌర్య పెళ్ళి ఎలా జరిగిందన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే

హీరో నాగశౌర్య కెరీర్‌లో విలక్షణమైన పాత్రల్ని ఎంచుకుంటూ దూసుకెళుతున్నాడు. నటుడిగా అతనికి ఈ సినిమాలోని పాత్ర కత్తి మీద సాము లాంటిదే. కానీ, చాలా ఈజ్‌తో చేసుకుపోయాడు. ఈ తరహా పాత్ర ఎంచుకున్నందుకు నాగశౌర్యని అభినందించి తీరాలి. అయితే అతని పాత్రను ఇంకా బలంగా దర్శకుడు రాసుకుని వుండాల్సింది. ఎంతటి బలమైన పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా వున్న నటుడ్ని దర్శకుడు అంతలా ఉపయోగించుకోలేకపోయాడు.

హీరోయిన్లలో ఇద్దరూ అందానికే పరిమితమయ్యారు. కాశ్మీర క్యూట్‌గా కన్పిస్తే, యామిని హాట్‌గా కన్పించింది. ఈ సినిమా తర్వాత యామినీ భాస్కర్‌కి హీటెక్కించే పాత్రలు చాలానే రావొచ్చు. కాశ్మీరకి హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలైతే వున్నాయి. శివాజీ రాజాకి మంచి పాత్రే దొరికింది. జయప్రకాష్‌రెడ్డి ఓకే. సత్యం రాజేష్‌, రాకెట్‌ రాఘవ తదితరులు తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. అజయ్‌ పాత్ర ఈ సినిమాలో కీలకం. ఆ పాత్రలో అజయ్‌ ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పిస్తారు.  కథ కొత్తదే అయినా దర్శకుడు దాన్ని వేగంగా చెప్పడంలో విఫలమయ్యాడు. సాగతీత సన్నివేశాలు ఎక్కువయ్యాయి. స్క్రీన్‌ప్లే పరంగా లోపాలున్నాయి. ఎడిటింగ్‌ ఇంకా అవసరం వుంది. నిర్మాణపు విలవలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే.

కొత్తదనంతో కూడుకున్న కథ వరకూ అభినందించి తీరాలి. అయితే దానికి తగినంత వినోదాన్ని జోడించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. చెప్పాలనుకున్న పాయింట్‌ని స్ట్రెయిట్‌గా చెప్పే క్రమంలో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్‌ కొట్టించకపోవడంలోనే సినిమా జయాజపయాలు ఆధారపడి వుంటాయి. ఇక్కడే ఈ సినిమా దర్శకుడు బోల్తా కొట్టేశాడు. అంతా డ్రమెటిక్‌గా అన్పిస్తుంటుంది. నాగశౌర్య లాంటి ఎనర్జీ వున్న హీరోతో ఇంకా ఎంటర్‌టైనింగ్‌ మూవీని చేసి వుండొచ్చు. కథలోనూ కావాల్సినంత కాన్‌ఫ్లిక్ట్‌ వుంది. ఓవరాల్‌గా సినిమా నిరాశపరుస్తుంది. నాగశౌర్య ఎఫర్ట్స్‌కి మాత్రం హేట్సాఫ్‌ చెప్పి తీరాల్సిందే.

ఒక్క మాటలో చెప్పాలంటే

నర్తనశాల.. పడింది డీలా.!

అంకెల్లో చెప్పాలంటే 2/5 

మరిన్ని సినిమా కబుర్లు
churaka