Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Do spirits and demons scare you?

ఈ సంచికలో >> శీర్షికలు >>

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు - భమిడిపాటిఫణిబాబు

Inadequate to the backyard of the tree

పురాతన గ్రంధాల్లో చదివాము— వైద్య శాస్త్రంలో మన దేశంలో ఎందరో ఘనాపాఠీలుండేవారని… మన పెద్దలు తమ అనుభవంచేతనైనేమిటి,  ఆ గ్రంధాలు చదవడం వలన అయితేనేమిటి, తరతరాలుగా వనమూలికలనే ఉపయోగించి వైద్యం చేసేవారు. వీటిని ఎలా వాడాలో, ఏ మొతాదులో వాడాలో కూడా పుస్తకాల్లో వివరంగా ఉండేది… కాలక్రమేణా వంశపారంపర్యంగా సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా ఈ వనమూలికలు చాలా ప్రదేశాల్లో దొరికేవి. ఏ మూలిక దేనికి ఉపయోగిస్తుందో తెలిస్తే చాలు… ఇంట్లోనే  ప్రధమ చికిత్సలాటిది కానిచ్చెసి, అవసరాన్నిబట్టి ఏ  వైద్యుడివద్దకో తీసికెళ్ళేవారు..

అందుకనేనేమో మన చిన్నప్పుడు, ఏదెబ్బైనా తగిలి రక్తం కారుతూంటే, వెంటనే ఏ పసుపో అద్దేస్తే రక్తం కాస్తా కారడం ఆగిపోయేది. అలాగే ఏ కావిర్లు లాటివో వస్తే, అదేదో చెట్టు ఆకులు తెచ్చి, పసరు  ఓ నాలుగైదురోజులు తాగిస్తే, మామూలు గా అయిపోయేవారు. ఇంక పాము కాటులూ, తేలుకాట్లకీ అయితే , ఏవో మంత్రాలు వేస్తే, ఆ విషం కట్టుబడిపోయేది. “ మంత్రాలకి చింతకాయలు  రాల్తాయా”  అని ఇప్పటివారు హేళన చేయొచ్చు, కానీ రాలేవన్నది మాత్రం నిజం… అలాగే పెరిగిపెద్దయాము కదా.. ఏ పిప్పిపన్ను నొప్పో వస్తే ఓ లవంగం అక్కడ పెట్టుకుంటే, ఆ నొప్పి తగ్గేదిగా.  అవన్నీ ఈనాటివారు  విన్నప్పుడు నవ్వులాటగా కనిపించవచ్చు, కానీ ఈ లవంగాలతోనూ, ఈ పసుపుతోనూ తయారుచేసి, ఏదో బహుళజాతి కంపెనీవాళ్ళో , పెద్దపెద్ద  వ్యాపార ప్రకటనలతో హోరెత్తించేసి, తయారీ ఖర్చుకి నాలుగైదింతలు చేసి అమ్మినా, ఎగబడి కొనుక్కుంటారే కానీ, “ అరే ఇది మన పసుపే, మన లవంగమే కదా.. “ అని ఒక్కడూ ఆలోచించడు. ఒకానొకప్పుడు పళ్ళు తోముకోడానికి, బొగ్గో,  వేపపుల్లో వాడేవారు.. అవన్నీ  exploit  చేస్తూ,  “ మీ Tooth  paste  లో  Coal ఉందా,  Neem  ఉందా “ అని ప్రకటనరావడం తరవాయి, “ అబ్బ ఎంత మంచి పేస్టో.. “ అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఆ పేస్టే వాడ్డం… వీటికి సాయం , యోగా లో ప్రసిధ్ధిచెందిన ఆ పతంజలి గారేమో , బహుళజాతి కంపెనీలు తయారుచేసే ప్రతీ వస్తువునీ, మన దేశీయ పేరుపెట్టగానే , వాటి వెనక్కాల పడ్డం ఓ వేలం వెర్రైపోయింది…

ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆరొగ్యవిషయంలో, విదేశీ శాస్త్ర్జజ్ఞులు చెప్పిందే మన వాళ్ళకి వేదం… పోనీ మనవాళ్ళేదైనా చెప్తే వింటారా, అబ్బే .  అదేదో  విదేశీకంపెనీ ఓ మందుతయారుచేసిందంటే, వాళ్ళ దేశం లో అమ్ముడుబడ్డా లేకపోయినా, మనవాళ్ళు మాత్రం తప్పకుండా కొంటారు… ఎంతైనా ఫారిన్ కంపెనీదికదాండీ.. అంటూ.. అవే మూలాలతో దేశంలో ఎవరో తయారుచేస్తే దానిమొహం చూసేవాడుండడు…  ఆ విదేశీ శాస్త్రజ్ఞులు తక్కువ తిన్నారా ఏమిటీ?   యుగయుగాలనుండీ మన దేశంలో విరివిగా వాడుకలో ఉండే కొన్నిటిని,  ఏదో  research  పేరుతో “ హాఠ్ దాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యానికి హానికరం “ అంటాడు. అప్పుడెప్పుడో, మన పసుపు మీద అవాకులూ చవాకులూ మాట్టాడారు.. చివరకి వాళ్ళ విదేశీ కంపెనీలే తెలివితెచ్చుకుని, అదే పసుపు కి బ్రహ్మరధం పడుతున్నారు. ఈమధ్యన ఇంకోడెవడో “ కొబ్బరి నూనె విషంతో సమానం.. “ అన్నాడు. అంటే మనవాళ్ళు యుగయుగాలనుండీ కొన్ని చోట్లైతే వంటకి కూడా, వాడుతున్నది విషమా?  మనవాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదే?  ఆయనెవరో ఈమధ్యన  రొజూ ఓ మూడు నాలుగు చెంచాల కొబ్బరి నూనె తాగితే, ఎలాటి ఆరోగ్యసమస్యలూ ఉండవన్నారు. ఎవరిని నమ్మేదీ?

అసలు గొడవంతా ఎక్కడంటే, మనవాళ్ళు దేశంలో వైద్యవిద్య అభ్యసించి, పై చదువులకి విదేశాలు వెడతారే అక్కడొచ్చింది… పోనీ ఆ పైవిద్యేదో మన దేశంలోనే చదవొచ్చా అంటే, ఇక్కడేమో ప్రవేశానికే వందలకొద్దీ ఆటంకాలు, ఏవేవో అడ్డంకులు.., కాదూ కూడదంటే, ఏ  Private College  లోనో కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఈ గొడవంతా పడలేక, ఆ ఖర్చేదో పెట్టుకుంటే, హాయిగా విదేశీ   degree  దొరుకుతుందికదా అని, అక్కడకే లైను కట్టేస్తున్నారు. పైగా ఆ డాక్టరు  పేరు చివర ఓ విదేశీ degree  తగిలిస్తే, కాసుల వర్షమే కదా…

“ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు “ అన్న  లోకోక్తిలోంచి బయటపడితే తప్ప, మనకి బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు…
సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment