Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue281/740/telugu-serials/katyayani/katyayani/

 

(గత సంచిక తరువాయి)...."కాత్యాయని మా అమ్మాయి కాదు. ప్రాణం. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పెళ్లయితే అమ్మాయి అమెరికా వెళ్లి పోవాలని తెలిసి, పొద్దున్న ఒక సంబంధాన్ని దణ్డం పెట్టి తిప్పి పంపాను. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి కాక పోయినా కనీసం మామూలుగా అయినా కష్ట పెట్టకుండా చూసుకోవాలి. అవన్నీ మీరనే సంబంధంలో ఉంటే అభ్యంతరం లేదు" అన్నాడు.
"మీ అమ్మాయంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలియదూ. అమ్మాయి మీకెంతో నాకూ అంతే. చెప్పానుగా నాకు కూతురు ఉంటే అతనికి ఇచ్చి చేసే వాడి నని. మంచి కుర్రాడు. అమ్మాయి సుఖ పడుతుంది. పూచీ నాది" అన్నాడు రాజా రావు గారు.

"అయితే సరేనండి వచ్చే ఆదివారమూ మంచి రోజే, ఉదయం అమ్మాయిని చూసుకోడానికి రమ్మనండి. ఏవంటావు యశోదా?" భార్యనడిగాడు. ఆవిడ అంగీకార సూచకంగా తల ఊపింది నవ్వుతూ.

లోపలి కెళ్లి ఆ వార్త కూతురి చెవిలో వేసింది.ఆమె సిగ్గుతో ముడుచుకు పోయింది.

ఆదివారం.

ఉదయం 10 గంటలు.

తెల్లవారు ఝామున మొక్కలకు నీళ్లు పోయడంతో అవి ఫ్రెష్ గా పూలతో గాలికి సన్నగా ఊగుతున్నాయి. కళ్లాపి జల్లడంతో కమ్మటి మట్టి వాసన ఊపిరితిత్తుల్ని ఉత్తేజ పరుస్తోంది. గేటు ముందు, ఇంటి ముంగిటా కాత్యాయని వేసిన ముగ్గు ఎక్కడా తప్పని ఒంపులతో, తెల్లగా మెరిసి పోతూ ఆమెలోని చిత్రకారిణిని పరిచయం చేస్తున్నాయి.

రాజా రావు గారు, ఆయన భార్య, కమలాకర్, వాళ్లమ్మా కాత్యాయనిని చూసుకోడానికి వాళ్లింటికి వచ్చారు. వాళ్లని సాదరంగా లోపలికి ఆహ్వానించి కూచోబెట్టాడు అచ్యుత రామయ్య గారు.

కమలాకర్ ఐదున్నర అడుగుల పొడవుతో మంచి రంగుతో, చక్కటి ముఖ వర్చస్సుతో బ్లాక్ ప్యాంట్ మీద వైట్ షర్ట్ వేసుకుని చూడ చక్కగా ఉన్నాడు. అతని తల్లి సాధారణ నేత చీరలో, కళ్లకి నల్ల కళ్ల జోడు పెట్టుకుని గౌరవ ప్రదంగా, కాస్త హుందాగా ఉంది. లోపల అగరొత్తుల పొగ గుబాళిస్తోంది. సీ డీ ప్లేయర్ లోంచి మంద్రంగా వేణు గాణం వినిపిస్తోంది.

"మీ ఇంట్లోకి వస్తే గుళ్లోకి వచ్చినంత అనుభూతి కలుగుతోంది" అన్నాడు రాజా రావు గారు మాటలకు అంకురార్పణ చేస్తూ.

"ఎన్నో ఏళ్ల నుంచి ఇది మా అలవాటు. మొక్కుబడిగా కాకుండా చక్కగా, ఆహ్లాదంగా తీర్చి దిద్దిన ఇంటి వాతావరణంలో, మనసుతో పూజ చేసి ప్రశాంత చిత్తంతో బయటకు అడుగు పెడితే కాగల కార్యాలన్నీ అవలీలగా నెరవేరుతాయి. మనిషి ప్రశాంతత తన చుట్టూ ఉన్న పరిసరాలని కూడా ప్రశాంతం చేస్తుంది. మనిషికి అన్నింటి కన్నా ముఖ్యం మానసిక ప్రశాంతత అని మేము నమ్ముతాం" అన్నాడు.రాజా రావు గారు కమలాకర్ ను, వాళ్లమ్మను పరిచయం చేశారు.

"నమస్కారం సార్. నా గురించి రాజా రావు గారు మీకు ముందే చెప్పుంటారు. మా పరిస్థితులూ చెప్పుంటారు. క్షమించండి మా అమ్మ గారు ఎక్కువగా మాట్లాడ లేరు. అందు చేత నేనే మాట్లాడుతున్నాను. ఏవీ అనుకోవద్దు. అమ్మని, నన్నూ, ఇంటినీ చూసుకునే అమ్మాయి కావాలి. మీ అమ్మాయిని గుడిలో చూశాను. తన నడవడిక నన్ను కట్టి పడేసింది. ఈ రోజుల్లో ఈ సిటీలో అంతటి వినయం ఉన్న పిల్లలుండడం చాలా అరుదు. అందుకే  నేను ఆమెని వెంబడించి మీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్నాను, అందుకు నన్ను క్షమించాలి. చక్కటి అనుబంధ బాంధవ్యాలతో మనుషుల విలువ తెలుసుకుని మసలుకునే వ్యక్తులు మీరు. మీ గురించి అడిగితే, మీ పాలతను, పేపరతను మొదలు దణ్నం పెడుతున్నారు. అంతటి ఉన్నత, ఉదాత్త వ్యక్తిత్వాలు, స్వభావాలున్న మీరు గొప్పవాళ్లు.

చాలా కాలం నుంచి నేనూ మా అమ్మా, పరిస్థితులు పెట్టిన పరీక్షలకు తట్టుకో లేక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మా ఇంట్లోకి ప్రశాంతత నడిచి రావాలి. మా హృదయాలకు మాటలు, చేతల నవనీతం పూసి చల్ల బరచాలి. అది మీ అమ్మాయే చేయ గలుగుతుంది. చాలా మంది కుర్రాళ్ల లాగా నేను మీ అమ్మాయి అందం చూడ లేదు. వ్యక్తిత్వాన్నే పరిశీలించాను. చేతులెత్తి నమస్కారం చేయాలనిపించే సంస్కార వంతులు. నాకొచ్చే జీతానికి మీ అమ్మాయి సుఖ పడుతుంది. తనను జాగ్రత్తగా చూసుకుంటాం. మీ అమ్మాయిని చూసుకోడానికి పోయిన ఆదివారం ఓ పెద్ద సంబంధం రావడం చూశాను. అదృష్టవశాత్తు వాళ్లని కాదన్నారు. ఇహ ఆలస్యం చేయ కూడదని పోయిన ఆది వారమే రాజా రావు గారిని మీతో మాట్లాడమని తొందర చేశాను. తండ్రి లాంటి వారు ఆయన, నా మాట మన్నించి మాట్లాడడానికి మీ ఇంటికొచ్చారు. మీరు ‘ఊ’ అంటే మీ అమ్మాయిని పిలిపించండి. ఫార్మాలిటీ కోసం చూస్తాను. కట్నాలూ, కానుకలు ఏవొద్దు. నా సైడు నుంచి ఎప్పుడో ఓ కే. మీ నిర్ణయం మీదే ఆధార పడి ఉంది. ఏవంటావు అమ్మా"అన్నాడు.

ఆవిడ మౌనంగా, ముఖాన్ని కాస్త  ఆనందంతో వెలిగించి తల ఊపింది.

అచ్యుత రామయ్య గారు ఆగకుండా మాట్లాడిన ఆ అబ్బాయి వంక కొద్ది సేపు చూశారు. ఆలస్యం చేస్తే అమ్మాయి ఎక్కడ మిస్ అవుతుందో అన్న ఆత్రుత అతని మాటల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు చెప్పిన మాటలకు అబ్బాయి కట్టుబడి ఉంటే అమ్మాయి నిజంగానే సుఖ పడుతుంది. కేవలం మాటలే అయితే మాత్రం, జీవితం ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం.

యశోదమ్మకి సౌంజ్ఞ చేశారు. ఆవిడ లోపలికి వెళ్లి  కాఫీ గ్లాసుల ట్రే తో కూతుర్ని పట్టుకొచ్చింది. అందరికీ కాఫీలిచ్చాక, తనూ కూచుంది.
"బాబూ, అమ్మాయిని ఏవన్నా అడుగుతావా, తనను ఏవన్నా ప్రశ్నలు అడగాలనుకుంటోందేమో మీ అమ్మ గారిని కూడా అడుగు" అన్నాడు అచ్యుత రామయ్య గారు.

"చూసేది, అడిగేది ఏం లేదండి. నా మనసులో ఎప్పుడో తను అందమైన దృశ్యంలా నిలిచి పోయింది"

"అమ్మాయీ నువ్వు కూడా అబ్బాయిని ఏవన్నా అడుగుతావా? సిగ్గు పడకు ఇది మీ ఇద్దరి జీవితాలకీ సంబంధించింది" చిన్నగా నవ్వుతూ అన్నారు రాజా రావు గారు.

కాత్యాయని నెమ్మదిగా తల పైకెత్తింది. అతణ్ని చూసింది. బావున్నాడు. ఇందాక లోపలి నుంచి అతని మాటలు వింది. మాటకారి, చలాకీగా అనిపించాడు. ముఖ్యంగా తనకి పెళ్లి చేసే తండ్రికి భారం కాడు. కాదనే కారణాలు కనిపించడం లేదు.

"ఒక్క విషయం మాట్లాడాలి" అంది.

అచ్యుత రామయ్య గారితో సహా అందరూ ఆశ్చర్య పోతూ ఆమె వంక చూశారు.

"అడగండీ.."అన్నాడు కమలాకర్.

అతనికీ ఆశ్చర్యంగా ఉంది " ఏం మాట్లాడుతుందా" అని.

కాత్యాయని కమలాకర్ తో ఏం మాట్లాడబోతోంది? అది అంగీకారంగానా? అనుమానంగానా?? పెళ్ళిబాజాలు మోగబోతున్నాయా, సంబంధం వెనక్కి పోబోతోందా?? తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం ఒంటిగంటదాకా ఆగాల్సిందే..  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్