Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

.పోనీ ఓసారి చూసొస్తే ఏం పోయిందీ - భమిడిపాటిఫణిబాబు

What about you

మనిషి బలహీనతలని   exploit  చేయడానికి ఈ రోజుల్లో చాలా మార్గాలు కనిపెట్టేశారు .. ఆత్మవిశ్వాసం లేకపోవడం వలనే, ఇంకోరిదగ్గరకి , సలహా కోసమో, లేక  పరిష్కారం కోసమో వెళ్ళడం పరిపాటయిపోయింది…. ఆరోగ్య విషయంలో వైద్యులూ, ఏదైనా తగాదా వస్తే  ప్లీడర్లూ అవసరమే, అందరికీ ఆ విషయాల్లో అంత పరిజ్ఞానం ఉండదు కాబట్టి…  అలాగని ప్రతీ విషయానికీ వెళ్ళడం ఎక్కువయింది ఈ రోజుల్లో…  వీటికి కారణాలెన్నో ఉండొచ్చు… ఈ రోజుల్లో సరిగ్గా ఈ బలహీనతనే , కొందరు తెలివైన వారు  exploit  చేసి డబ్బు చేసుకుంటున్నారు.
ఉదాహరణకి జీవితంలో ఏవైనా ఒడుదుడుకులు రావడం ఏమిటి, వెంటనే మనసులోకి వచ్చే ఆలోచన—జాతకం బావుండలేదేమో అని.. నిజమే, కానీ ఈ రొజుల్లో నిక్కచ్చిగా జాతకం చెప్పేవారు ఎంతమందున్నారూ? అసలు సిసలు జాతకం చెప్పగలిగేవారు, నోటిమాటద్వారానే ప్రసిధ్ధి చెందుతారు..

ఇది వరకటి రొజుల్లో చూసేవాళ్ళం కాదూ.. ఏ కొద్దిమందో నిష్ణాతులైఉండేవారు.. ఈ రోజుల్లో వీధికో జ్యోతిషాలయం… పైగా వీటిగురించి టీవీ ల్లో హొరెత్తించేసే ప్రకటనలు. వీరి ప్రకటనలు కూడా ప్రతీవాడికీ భయం పుట్టించేటట్టుంటాయి.. అవి వింటే/ చూస్తే  మన మీద మనకే ఓ అనుమానం రావడం తథ్యం.  “ ఏమో అందుకే మన రోజులు బావుండలేదేమో..పోనీ ఓసారి చూసొస్తే ఏం పోయిందీ… “ అనేసుకోవడం, ఆ జ్యోతిషాలయం నెంబరుకి ఫోను చేసి ఎపాయింట్ మెంట్ తీసుకోవడమూ.. జ్యొతిషం అన్నది ఒక శాస్త్రమే… అందులో సందేహం లేదు.  కానీ ఎంతమంది చెప్పిన జాతకాలు నిజం అవుతున్నాయో ఓసారి ఆలోచిస్తే తప్పేమిటీ?  ఉదాహరణకి ఆదివారాలు టీవీ ల్లో “ రాశిఫలాలు “ కార్యక్రమమే తీసుకోండి, ఒకరు చెప్పేదానికి ఇంకోరు చెప్పేదానికీ పొంతనుండదు. ఒకే రాశి వారికి ఒకరేమో “ ఈ వారం మీమాటకు తిరుగే లేదు”  అనీ, ఇంకో చానెల్ లో “ ఈ వారం ఈరాశి వారు ఒత్తిడికి లోనవుతారూ.. “ అంటారు. మొదటాయన చెప్పింది విని సంతోషించాలా, లెక రెండోవారు చెప్పింది విని, లేకపోయినా ఒత్తిడికి లోనవ్వాలా? అంతా  అయోమయం…

ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రహశాంతులు అని కొందరూ.. నిజమే మన భవిష్యత్తంతా ఆ గ్రహాల నడవడిక మీదే ఉంటుంది… పోనీ ఆ గ్రహశాంతేదో చేయించేస్తే సుఖపడతారా అంటే, అదీ అనుమానమే. ఏ పండగ తీసుకోండి, ప్రతీదానికీ ఏదొ ఒక వివాదం—ఫలానా పంచాంగంలో ఫలానా రొజే అంటారు, ఇంకో ఆయన  “ ఠాఠ్.. అది తప్పూ.. అసలు పండగ ఫలానా రోజే చేసుకోవాలీ..” అంటారు. పైగా వీటి గురించి మన టీవీల్లో  పెద్దపెద్ద చర్చాకార్యక్రమాలోటీ…. చివరకి సామాన్య ప్రజలకి అంతా అగమ్యగోచరంగా ఉంటోంది.   వీటన్నిటికీ కారణం ఏమిటంటే… “ చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే “

అలాగని జ్యోతిష శాస్త్రం తప్పని కాదు. వేదాల్లో వివరించారు, ఖగోళ శాస్త్రం చదివే కదా, మన పంచాంగాలు ఎన్నో సంవత్సరాల ముందునుండీ తయారు చేసేదీ?  ఈరోజుల్లో , ఎన్నో ఏళ్ళ నుండీ వస్తూన్న సాంప్రదాయాలు తప్పనడం ఓ  వేళాకోళంగా తయారయిందనడం లో సందేహం లేదు..  మన ప్రసారమాధ్యమాలు కూడా, వీటికి నిప్పురాజేయడంలో అదో పైశాచికానందం పొందుతున్నారు… చర్చలుండడం తప్పని కాదు, కానీ చర్చల మూలంగా ఏదో ఒకటి తేలాలిగా? ఈ చర్చల్లో తేలేదేమీ ఉండదు.. ఒకరిమీదొకరు బురదజల్లుకోవడం తప్ప. చివరకు మిగులుతున్నదేమిటంటే,  ఓ రకమైన   polarization  లాటిది.

పెళ్ళిసంబంధాలు చూసుకున్నప్పుడు, జాతకాలు చూసుకోవడం ఓ ముఖ్యభాగం గా ఉంటుంది. ఒకానొకప్పుడు, మన జ్యోతిష్కుడు , చక్రం వేసి, చెప్పారంటే, తిరుగుండేది కాదు. వారు చెప్పినవి అక్షరాలా నిజమయ్యేవి, మరి ఇప్పుడో? ఎన్నేసి జ్యోతిషాలు నిజం అవుతున్నాయంటారూ?   అలాగని ఇప్పటికీ నిష్ణాతులైన జ్యోతిష్కులు లేరని కాదు… ఉన్నారు, కానీ వారికి గుర్తింపుండదు. ఉన్నదున్నట్టు చెప్తే ఎవరికైనా నచ్చుతుందా?  ముఖస్థుతి మాటలే నచ్చుతాయి… ఉదాహరణకి మన రాజకీయ పార్టీల వారు ఉగాదినాడు నిర్వహించే “ పంచాంగ శ్రవణం “..  వాటిని వింటూంటే నవ్వొస్తుంది—ఎవడికి వాడే, తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటాడు..

ఈ రోజుల్లో ప్రతీదీ వ్యాపారాత్మకమైన కారణం తో, ఎవరికి వారే ధన సంపాదన కోసం, ఓ నాలుగు మంచిమాటలు చెప్పేయడం కూడా ఓ గొప్ప పెట్టుబడిగా తయారయింది..

మనసులు ప్రశాంతంగా ఉంచుకుని, అవతలవారికి కూడా మంచే జరగాలని కోరుకున్నంత కాలం జీవితం సజావుగా ఉంటుంది…
సర్వేజనా  సుఖినోభవంతూ….

మరిన్ని శీర్షికలు
Make yourself ready