Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue282/741/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి).... ‘కథలొద్దురా! అసలేమైందో చెప్పు!’’ అన్నాడు రైటర్‌.

‘‘అతను ఆమెని ఫాలో అవుతుంటే మేము అతని వెంట పడ్డాం సార్‌. అతను సెల్‌ ఫోన్‌ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు టక్కున పర్సు కొట్టేసి మేము అక్కడ నుండి క్రిందకొచ్చేసాం సార్‌. కొండ మీద బస్సు స్టాండ్‌లో మళ్లీ మా పని లో పడ్డాం’’ చెప్పాడు మూడో వాడు.

‘‘మర్చి పోలేని పర్సు అన్నారు. ఇదేనా మర్చి పోలేనిది?’’ వ్యంగ్యంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘కాదు సార్‌! మేము పర్సు కొట్టేసి కొండ బస్సు స్టాండ్‌లో వేరే వాళ్ళ దగ్గర చేతిలో కేష్‌ బ్యాగ్‌ చూసి అది ఎలాగైనా కొట్టేయ్యాని
చూస్తున్నప్పుడు...అతను గాబరాగా కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకొచ్చాడు. మేమున్న దగ్గరే ఓ మూల నిలబడ్డాడు. అతన్ని చూసి మేము భయంతో అతని వెనుకే ఉన్న అన్నదానం గోడ ప్రక్క దాగున్నాం. వాడు వెళ్ళే వరకూ జనాల్లోకి రాకూడదని గోడ వార నీడలో దాక్కున్నాం.’’ అన్నాడొకడు.

‘‘అయితే  ఇందులో విడ్డూరం ఏముంది?’’ అన్నాడు ఎస్సై.

‘‘సార్‌! అతను ఆమెకి కావలసిన వాడు కాదు సార్‌! ఆమెని చంపడానికి తిరుగుతున్న హంతకుడు.’’ అన్నాడు రెండో వాడు.

‘‘వ్వాట్‌?....’’ అదిరి పడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అవును సార్‌! కొండ బస్సు స్టాండ్‌లో నిలబడి ఎవరి తోనో మాట్లాడాడు. ఈ రాత్రికి ఆమెని ఎలాగైనా చంపేస్తానంటూ చెప్తుంటే మేము భయంతో గజ గజ వణికి పోయాం సార్‌. వాడి పర్సు మేమే దొంగిలించామని తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తాడేమోనని ఎంత భయపడి పోయామో’’ అన్నాడు మొదటి వాడు.

‘‘అవును సార్‌! అప్పుడే...అక్కడే....ఆ పర్సులో ఏముందోనని తీసి చూసాం సార్‌. మా కళ్ళు జిగేల్‌మన్నాయ్‌.’’ అన్నాడు రెండో వాడు.

‘‘ఆమె ఫొటో చూసారా?!’’ అడిగాడు రైటర్‌.

‘‘సార్‌! మీరెలా చెప్పారు సార్‌!’’ ఆశ్చర్యంగా అడిగాడు మొదటి వాడు.

‘‘ఓరి వెర్రి వెంగళప్పల్లారా! పర్సులో ఆమె ఫొటో ఉండబట్టే కదరా మీరీ కథంతా చెప్పుకు రావలసి వచ్చింది!’’ నవ్వుతూ అన్నాడు రైటర్‌.

‘‘ఫొటో చూసి కాదు సార్‌ మా కళ్ళు తిరిగింది. పర్సులో  ఉన్న రెండువేల రూపాయ నోట్లు చూసి ఎంత కట్ట ఉందో చెప్పరేం సార్‌!’’ అన్నాడు రెండో వాడు.

‘‘లక్షా ముప్ఫైవేలు...ఉంది సార్‌!’’ అన్నాడు మూడో వాడు.

‘‘అంత డబ్బు ఏం చేసార్రా!’’ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! ముగ్గురం సమానంగా పంచేసుకున్నాం సార్‌’’ తల దించుకుని చెప్పాడొకడు.

‘‘సరి సరి! రైటర్‌ గారూ! వీళ్ళు చెప్పిందంతా రికార్డు చెయ్యండి. ముసలమ్మ మర్డర్‌ మిస్టరీ అంతా విడి పోయినట్టే! ఆమెని చంపబోయి ఈ ముసలమ్మని చంపేసారు! అంత వరకూ ఓకే. అయితే ఈ హంతకుల్ని ఎలా పట్టుకోగలం? అదే అంతు చిక్కకుండా ఉంది. మీరు ఈ ఫొటోని నాలుగైదు కాపీలు తీయించి మన వాళ్లందరికీ ఇచ్చి సింహాచలం ప్రాంతంలో, కాంప్లెక్స్‌ ప్రాంతంలో వెదికించండి. నేను ‘ముసలమ్మ’ రాసిన డాక్యుమెంట్లు, వీలునామాల్లో రాసిన అడ్రస్‌ వెదుక్కుంటూ వెళ్తాను. ఆస్తిపత్రాలు, వీలునామా అయితే ఉన్నాయి. ఫిజికల్‌గా ఈ ఆస్తి ఎక్కడుందో....ఎవరి ఆధీనంలో ఉందో కూడా మనం రిపోర్ట్‌ రాయాలి కదా!

నేను ఇప్పుడే ‘ముసలమ్మ’ ఇచ్చిన అడ్రస్‌కి బయలుదేరుతాను. మీరు ఎలాగైనా ‘ఆమె’ని పట్టుకోండి. ఆమె దొరికితే కెేసు మిస్టరీ విడిపోతుంది.  హంతకులు, హత్యాయుధం దొరికితే మన బాధ్యత తీరి పోతుంది.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్సార్‌!.....నేను ఇక్కడ వర్క్‌ కంప్లీట్‌ చేస్తాను. మీరు వెళ్ళండి సార్‌!’’ అన్నాడు రైటర్‌.

‘‘సి.ఐ. గార్కి ఈ విషయమంతా రిపోర్టు చేసి వెళ్తాను. ఓకే వీళ్లని తీసుకెళ్ళండి.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

***********

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. హతురాలు ముసలమ్మ రాసిన వీలునామాలో ఉన్న అడ్రస్‌ ప్రకారం దానవాయి పేట వెళ్ళాలి. స్టేషన్‌లో నుండి బయటకు వస్తూనే ఆటో ఎక్కాడు. అడ్రస్‌ చెప్పి వెళ్లమన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఆజాను బాహుడైన అక్బర్‌ ఖాన్‌ కేసి ఓసారి చూసి మారు మాట్లాడలేదు ఆటో డ్రైవర్‌. సాధారణంగా అయితే మీటర్‌ మీద వీలు కాదు. వందో, ఏభై రూపాయలో ఇవ్వండి సార్‌ అని అడిగే ఆటో వాలా అక్బర్‌ ఖాన్‌ నిలువెత్తు విగ్రహం చూసి మనసు లోనే ఈయనెవరో పెద్ద ఆఫీసర్‌’లాగున్నాడనుకుని మౌనంగా ఆటో స్టార్ట్‌ చేసాడు.

‘‘మీటర్‌ ఆన్‌ చెయ్యవయ్యా!’’ ఆటోలో కూర్చుంటూనే అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..

‘‘మీటర్‌ పని చెయ్యదు సార్‌! మీరే చూసి ఇవ్వండి సార్‌!’’ అన్నాడు నమ్రతగా. సాధారణంగా రైల్వే స్టేషన్‌ నుండి దానవాయి పేటకి ఏభై రూపాయలకి తక్కువకి వెళ్ళడు. అదే చెప్పాలనుకున్నాడు. కానీ, అక్బర్‌ ఖాన్‌ కేసి చూసి అదీ చెప్ప లేక పోయాడు ఆటో డ్రైవర్‌.
‘‘ఓకే! అక్కడికెళ్లాక గొడవ చెయ్యవు కదా!’’ అన్నాడు ఎస్సై.

‘‘అదేంటి సార్‌! మీలాంటి పెద్దోళ్లతో గొడవెలెందుకు పెట్టుకుంటాం సార్‌?’’ అంటూనే ఆటోని ముందుకురికించాడు ఆటో డ్రైవర్‌.
పావు గంటలో దానవాయి పేటకు తీసుకు వచ్చాడు ఆటో.

ఇక్కడ ‘గాంధీ నగర్‌ ఉందా?!’’ అడిగాడు ఎస్సై.

‘‘ఈ ప్రక్క వీధే సార్‌!’’ చెప్పాడు ఆటో వాలా.

‘‘గాంధీ నగర్‌లో వేము సన్యాసి రావు గారింటికి వెళ్లాలి.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అలాగే సార్‌!’’ అంటూ గాంధీ నగర్‌ ఏరియాకి తీసుకు వెళ్లి ఓ పెద్ద భవనం ముందు ఆపాడు ఆటోని.

ఆటో దిగగానే ఆ బిల్డింగ్‌ చూసి ఆశ్చర్య పోయాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఇదేనా నేనన్న వేము సన్నాసి రావు గారి బిల్డింగ్‌?’’ అయోమయంగా ఆ భవనం కేసి చూస్తూ ఆటో డ్రైవర్‌ని అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అదిగో చూడండి సార్‌! ఆ బిల్డింగ్‌ పైనే పేరు రాసి ఉంది.’’ అంటూ బిల్డింగ్‌ కి పైన రాసిన పేరు చూపించాడు డ్రైవర్‌.
మూడంతస్థుల భవనం. పైన అందంగా చెక్కి ఉంది పేరు. ‘వేము సన్నాసి రావు దంపతుల నిలయం’ అని రాసి ఉంది. ఆ భవనం చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంలో రక రకాల మొక్కలు పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. డాక్యుమెంటు ప్రకారం వెయ్యి గజాల స్థంలో కట్టిన భవనం ఇది. రాజమండ్రి నగరం నడి బొడ్డున ఉంది. ‘చాలా విలువ గల ఆస్తి. అందుకే కొడుకు అనాథాశ్రమానికి ధారాదత్తం చెయ్యడానికి అంగీకరించటం లేదు’ మనసు లోనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఆటోకి ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌..

‘‘థేంక్యూ సార్‌!’’ అంటూనే ఏభై నోటు తీసుకుని వెళ్ళి పోయాడు ఆటో డ్రైవర్‌.

హుందాగా నడుచుకుంటూ బిల్డింగ్‌ దగ్గరకు వెళ్ళాడు.

‘‘ఎవరు కావాలండీ?’’ లోపల నుండి ఎవరో ఒకామె వచ్చి అడ్డగించి మరీ అడిగింది

‘‘సత్యవతమ్మ గారు.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సత్యవతమ్మ గారా?....మీరెవరు?!’’ ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

‘‘నేనెవరో చెప్తాను. సత్యవతమ్మ గారు ఎక్కడున్నారో చెప్పండి.’’ కావాలనే నిర్లక్ష్యంతో అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సత్యవతమ్మ గారు ఇక్కడ లేరు. మేము ఈ వాటాలో అద్దెకుంటున్నాము.’’ నెమ్మదిగా అంది ఆమె.

‘‘ఎక్కడుంటారు?’’ అడిగాడు ఎస్సై.

‘‘ఇప్పుడు లేరండి.’’ అందావిడ.

‘‘ఎక్కడుండేవారు?’’ రెట్టించి అడిగాడు అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో లోపల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చారు.

‘‘మీరెవరు సార్‌? సత్యవతమ్మ గారితో మీకేంటి పని?’’ లోపల నుండి వచ్చిన వ్యక్తులు ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ని నిలదీసారు.

‘‘మీరంతా ఎవరు?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ముందు నువ్వెవరో చెప్పవయ్యా?’’ అంటూ వాళ్ళు అక్బర్‌ ఖాన్‌ మీద తిరగబడ బోయారు.

అంతే! టక్కున జేబులో నుండి పోలీస్‌ ఐడెంటిటీ కార్డు తీసి వాళ్లకు చూపించాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

పోలీస్‌ ఐడెంటిటీ కార్డు చూస్తూనే వాళ్లందరూ అదిరి పడ్డారు.

‘‘మీరు....ఎస్సై అక్బర్‌ ఖాన్‌ గారా? విశాఖ పట్నం పోలీస్‌ కమీషనర్‌ ఆఫీసు నుండి వస్తున్నారా సార్‌!’’ వాళ్ళల్లో ఒక యువకుడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌ చూపించిన గుర్తింపు కార్డు చూసి ఆశ్చర్యంగా అడిగాడు.

‘‘ఎస్‌! ఇది వేము సన్నాసి రావు గారి బిల్డింగ్‌ కదా!’’ అడిగాడు.

‘‘అవును సార్‌!’’ అన్నాడా యువకుడు.

‘‘సత్యవతమ్మ గారు’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సన్యాసి రావు గారి భార్య సార్‌? ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేరు.’’ చెప్పాడా కుర్రాడు.

‘‘ఎక్కడున్నారు?’’ కావాలనే అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఏమో సార్‌! ఏడాదిగా ఆవిడ ఆచూకీ మాకు తెలీదు.’’ అన్నాడు మరొక వ్యక్తి.

‘‘మరి, మీరంతా ఎవరు?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘మేమంతా అ భవనంలో అద్దెకుంటున్నాం సార్‌?’’

‘‘అద్దె ఎవరికిస్తున్నారు?’’ అడిగాడు.

‘‘సన్నాసి రావు గారి పిల్లలు..ఇద్దరు అమెరికాలో ఉన్నారు సార్‌. వాళ్ల అకౌంట్‌లో వేసేస్తుంటాం.’’ అన్నాడు మరొకతను.

‘‘ఓకే! మరి సత్యవతమ్మ గారు ఎక్కడుండే వారు?’’ అడిగాడు ఎస్సై.

‘‘అదిగో సార్‌! ఆ మూల ఉన్న చివరి పోర్షన్‌లో.’’ అన్నాడు ఒకతను.

‘‘మరి సత్యవతమ్మ గారు కనిపించటం లేదని ఎవరైనా పోలీస్‌ రిపోర్ట్‌ ఇవ్వలేదా?.’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘లేదు సార్‌! అమెరికా నుండి వాళ్ళ ఇద్దరు పిల్లలు కుటుంబాలతో వచ్చారు. తల్లీ కొడుకు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. కొడుకు ఇక్కడ నుండి అమెరికా వెళ్లగానే ఆవిడ ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లి పోయారు. ఆ విషయం వాళ్ల పిల్లలకి అమెరికా ఫోన్‌ చేసి చెప్పాం కూడా.’’ అన్నాడొకతను.

‘‘సత్యవతమ్మ గారు చని పోయారు.’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

అక్బర్‌ ఖాన్‌ చెప్పింది వింటూనే అందరూ అదిరి పడ్డారు.

(చనిపోయింది సత్యవతమ్మగారేనా? ఎస్సై అక్బర్ ఖాన్ పొరపడ్డారా? కావాలనే అలా చెప్పారా??? ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్