Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

ఇందూరమణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..... http://www.gotelugu.com/issue284/745/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి).... బస్సు డ్రైవర్, కండక్టర్ ఒక్కరే కావడంతో బస్సు ఎక్కే పాసింజర్లు డ్రైవర్ దగ్గర టిక్కెట్ తీసుకుని లోపకెళ్లి కూర్చుంటున్నారు. బస్సు కదిలింది. నెమ్మదిగా కదులుతూ స్పీడందుకుంటోంది. ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ముందు సీట్లో కూర్చున్న ఎస్సై అక్బర్ ఖాన్ మీదకు వస్తున్నాడు.

అక్బర్ ఖాన్ ఇవతల సీట్లో కూర్చున్న ఒక స్త్రీ ఎందుకో వెనక్కి తిరిగి కత్తి పట్టుకున్న హంతకుడ్ని చూసి భయంతో కెవ్వున కేకేసింది. అదే సమయంలో వెనక సూది మొన లాంటి మేకు ఏదో కసుక్కున గుచ్చుకొనే సరికి ఉలిక్కి పడి మేల్కొన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.
అప్పుడే మెలకువ లోకి వచ్చిన ఎస్సై అక్బర్ ఖాన్ టక్కున తల తిప్పి చూసాడు. ఎవరో హంతకుడు పొడవాటి కత్తి పట్టుకుని తన మీదకి దాడికొస్తున్నాడని గ్రహించి ఒక్క ఉదుటున సీట్లో నుండి ఎదరకి ఒక్క గెంతు గెంతాడు.

అదే సమయంలో హంతకుడు ఎస్సై అక్బర్ ఖాన్ కూర్చున్న సీటు మీద కత్తితో దాడి చేసాడు. అక్కడ నుండి ఎస్సై అక్బర్ ఖాన్ తప్పించుకుని ముందుకు గెంతెయ్యడంతో ఆ కత్తి వేటు సీటుకు తగిలి సీటు సర్రున చిరిగి పోయింది.

ఎస్సై అక్బర్ ఖాన్ తప్పించుకోవడంతో హంతకుడు క్షణం నివ్వెర పోయి కత్తి పట్టుకుని కసిగా ఎస్సై అక్బర్ ఖాన్ కేసి చూసాడు.
బస్సులో  ఉన్న  బల్బు  వెలుగులో  హంతకుడ్ని తీక్షణంగా చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్. నెత్తురు మరిగిన పులిలా ఉన్నాడు.  ఎత్తుగా ఆరడుగుల భారీ విగ్రహం. కత్తి నిగనిగలాడుతుంది. పొడవుగా రెండు వైపులా పదునుతో తళ తళ మెరుస్తోంది. ఒక వేటుకి తల తెగి అవతల పడేంత జారుగా ఉంది కత్తి.

ఎస్సై అక్బర్ఖాన్ కూడా ఊహించనైనా ఊహించ లేదు. ఇంత భయంకరమైన సంఘటన ఎదురౌతుందని కలలో కూడా అనుకోలేదు.
డ్రైవర్ జరిగిందంతా తల తిప్పకుండానే ఓరకంట గమనిస్తూ బస్సుని స్లో చేస్తున్నాడు. బస్సులో ఉన్నవాళ్లంతా నిటారుగా నిలబడి భయం భయంగా హంతకుడి కేసి చూస్తున్నారు. ఇదంతా క్షణాల్లో జరిగి పోయింది.

‘‘డ్రైవర్! బస్సు ఆపకు. నెమ్మదిగా వెళ్లనీ.’’ హంతకుడి కేసి కన్నార్పకుండా చూస్తూనే అరిచాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘బస్సు ఆగితే హంతకుడు దిగి పారి పోవచ్చు. హంతకుడ్ని పారిపోనివ్వ కూడదు. ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలి!’ ఆలోచిస్తూ ఎలర్ట్ గా  నిలబడ్డాడు ఎస్సై అక్బర్ ఖాన్.

అంతే! మళ్ళా కత్తి పట్టుకుని విసురుగా ఎస్సై అక్బర్ ఖాన్ మీదకు వచ్చాడు హంతకుడు. రెప్ప వేయకుండా హంతకుడినే గమనిస్తున్న ఎస్సై అక్బర్ ఖాన్ టక్కున ప్రక్కకు తప్పుకున్నాడు. ఎస్సై అక్బర్ ఖాన్ ని పొడవ బోయి ఆ వూపులో డ్రైవర్ కేసి ముందుకు తూలి పడబోయాడు హంతకుడు. అదే అదునుగా ఎస్సై అక్బర్ ఖాన్ హంతకుడి నడుం మీద ఎగిరి బలం గా తన్నాడు. అలా ఎస్సై తన్నే సరికి ఎదురుగా గేటు దగ్గరకు వెళ్లి పడ్డాడు హంతకుడు.

అంతే! చటుక్కున లేచి పరిగెడుతున్న బస్సులో నుండి రోడ్డు మీదకు దూకేసాడు హంతకుడు. డ్రైవర్ కూడా ఊహించ లేదు. పరిగెడుతున్న బస్సులో నుండి హంతకుడు అలా దూకేస్తాడని అనుకోలేదు.

బస్సులో నుండి గెంతీ గెంత గానే క్రింద పడ్డాడు హంతకుడు. పరుగెడుతున్న బస్సులో ముందు గేటులో నుండి క్రిందకు దూకడం వలన హంతకుడు క్రింద పడీ పడగానే బస్సు వెనుక టైర్లు రెండూ అతని తలపై నుండి శరీరం మొత్తం మీద నుండి ఎక్కేసి ముందుకు ఈడ్చుకు  పోయాయి.

హంతకుడు బస్సులో నుండి దూకేయడంతో సడన్ గా చూసిన డ్రైవర్ టక్కున బ్రేకు వేసాడు. అప్పటికే బస్సు చాలా దూరం ముందుకు దూసుకు పోయింది.

హంతకుడు బస్సులో నుండి దూకెయ్య గానే పరిగెట్టుకుని డ్రైవర్ దగ్గరకొచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్. బస్సు ఆపమంటూనే గేటు దగ్గరకొచ్చి నిలబడి హంతకుడి కోసం చూసాడు.

అప్పటికే హంతకుడు క్రిందకు గెంతడం...క్రింద పడడం అతని మీద నుండి బస్సు టైర్లు ఎక్కెయ్యడం కళ్ళారా చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.
బస్సు ఆగి ఆగ్గానే క్రిందకు దిగి షాకయి రోడ్డు మీదే స్థాణువులా నిలబడి పోయాడు ఎస్సై అక్బర్ ఖాన్.

***

పోలీస్ కమీషనర్ ఆఫీసు.

కమీషనర్ సీరియస్ గా కూర్చున్నాడు. అతనికి ఎదురుగా టూటౌన్ సి.ఐ. గోపాలపట్నం సి.ఐ లు ఇద్దరూ ఒద్దికగా కూర్చున్నారు. టూటౌన్ ఎస్సై ఓ మూల నిలబడి ఉన్నాడు.

కమీషనర్ గదిలో నిశ్శబ్దం క్షణం భయంకరంగా రాజ్యమేలింది. కమీషనర్ గది బయట సెంట్రీలు కూడా లోపల ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

‘‘ఒక ఎస్సై మీద గూండా ఎటాక్ చేసాడంటే అది ఎవరికి నామోషి... మొత్తం డిపార్ట్ మెంట్ కి అగౌరవం కాదా! సి.ఐ. సత్యారావు గారూ! రాజమండ్రి ఎంక్వయిరీకి వెళ్తున్నానని మీకు ఎస్సై అక్బర్ ఖాన్ చెప్పలేదా?’’ సీరియస్ గా అడిగాడు కమీషనర్.

‘‘నాకు రిపోర్టు చేసే వెళ్లాడు సార్. కానీ...’’ నసుగుతూ చెప్పాడు సి.ఐ. సత్యారావు.

‘‘కాణీ...అణా...లేమిటి మధ్యలో! ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు.’’ కటువుగా అన్నారు కమీషనర్.

‘‘ఒక్కడే వెళ్తున్న విషయం నాకు తర్వాత తెలిసింది సార్!’’ తప్పు చేసిన వాడిలా తల దించుకుంటూ అన్నాడు సి.ఐ. సత్యారావు.
'‘అదృష్టం కొద్దీ తృటిలో తప్పించుకున్నాడు. అలర్ట్ గా లేకపోతే ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఎనీహౌ! ఈ సంఘటనలో తెలుసుకోవలసింది ఏమిటో మీకు అర్థమై ఉంటుంది కదా!’’ సీరియస్ గా అడిగాడు కమీషనర్.

‘‘సార్! శత్రువులు మన కదలికల్ని కనిపెడుతున్నారని అర్థమౌతోంది.’’ టక్కున సమాధానం చెప్పాడు సి.ఐ. సత్యారావు.

‘‘అంతేనా!’’ అడిగాడు కమీషనర్.

‘‘హంతకులు దేవాంతకుల్లా ఉన్నారు సార్! వాళ్ల టార్గెట్ యాచకులు కాదనిపిస్తోంది. ఇంకెవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలియాలి. తెలుసుకోవాలి.’’ టూటౌన్ సి.ఐ. అన్నాడు.

‘‘మన ఎస్సై మీద ఎటాక్ చేసాడంటే హంతకుడు కూడా భయపడుతున్నాడనే కదా!’’ అన్నారు కమీషనర్.

‘‘ఎస్ సార్! రాజమండ్రిలో మన ఎస్సై అక్బర్ ఖాన్ కి ఏదో క్లూ దొరికి ఉంటుంది. దాని ఆధారంగా హంతకులు పట్టుబడే అవకాశం ఉండి ఉండాలి. అందుకే ఎస్సై మీద ఎటాక్ ప్లాన్ చేసారు.’’ సాలోచనగా అన్నాడు సి.ఐ. సత్యారావు.

‘‘ఎస్! యూ ఆర్ కరెక్ట్! వాళ్లని మనం కనిపెట్ట లేక పోయాం. కానీ, వాళ్ళే మనల్ని ప్రతి క్షణం ఫాలో అవుతున్నారని రూఢీగా తెలుస్తోంది కదా! బీ కేర్ ఫుల్. ఎస్సై అక్బర్ ఖాన్ కి మీ సహాయ సహకారాలు అందించండి. ప్రతి రోజూ కేసు పూర్వాపరాలు తెలుసుకుంటూ పరిశోధన వేగవంతం చెయ్యండి! మీరూ మాకెందుకులే అని చేతులు దులిపేసుకోకండి. మీ స్టేషన్ పరిథిలో మీరూ పరిశోధన చేసి ఎస్సై అక్బర్ ఖాన్ కి సపోర్టు చెయ్యండి.’’ ఇద్దరు సి.ఐల కు చెప్పారు కమీషనర్.

‘‘ఎస్ సార్! అన్నవరం పోలీస్ స్టేషన్ లో పని పూర్తి చేసుకుని వచ్చేస్తున్నట్టు  నాకు ఫోన్ చేసి రిపోర్ట్ చేసాడు సార్. అతను రాగానే మీ దగ్గరకు పంపిస్తాను.’’ అన్నాడు సి.ఐ. సత్యారావు.

‘‘అక్కరలేదు. ఇన్వెస్టిగేషన్ లో ఉంటాడు. అతన్ని డిస్ట్రబ్ చెయ్యకండి. డే టు డే ప్రోగ్రెస్ తెలుసుకోండి. ఓకే. మీరిక వెళ్ళొచ్చు.’’ అన్నారు కమీషనర్.

ముగ్గురూ సెల్యూట్ చేసి గదిలో నుండి బయటకు వచ్చారు. ఎస్సై అక్బర్ ఖాన్ చేసింది ఏమీ బాగాలేదు. తానేదో సూపర్ హీరో లాగా కనీసం కానిస్టేబుల్ని వెంట బెట్టుకొని వెళ్ళకుండా ఒంటరిగా వెళ్లి....ఇదిగో...మనందరికి ఇలా తల వాచేలా చేసాడు.’’ గది బయటకు వస్తూనే కోపంగా అన్నాడు సి.ఐ. సత్యారావు.

‘‘వదిలెయ్యండి సార్! ఇలా జరుగుతుందని అతను కూడా ఊహించి ఉండడు. పోలీసులం కదా. మన మీదకు వచ్చే వాళ్ళెవరనుకుని ఉంటాడు. ఈ దెబ్బతో కాస్త ఒంగి ఒంగి నడుస్తాడులెండి.’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు టూటౌన్ సి.ఐ.

‘‘చూద్దాం!’’ అంటూ ముందుకు నడిచాడు సి.ఐ. సత్యారావు.

సిఐలిద్దరూ ఎవరి జీపులో వాళ్ళు ఎక్కి కూర్చున్నారు. టూటౌన్ ఎస్సై సెల్యూట్ చేసి ఇద్దరు సిఐని సాగనంపి తన బుల్లెట్ కేసి నడిచాడు.
సరిగ్గా అదే సమయంలో...

పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాడు ఎస్సై అక్బర్ ఖాన్.

అప్పటికే ఎస్సై అక్బర్ ఖాన్ పై ఎటాక్ జరిగిందని స్టేషన్ లో అందరికీ తెలిసి పోయింది. ఎస్సై అక్బర్ ఖాన్ స్టేషన్లో అడుగు పెట్టీ పెట్టగానే అందరూ అతన్ని చుట్టుముట్టి కుశల ప్రశ్నలతో ఊపిరి సలుప నివ్వ లేదు.

‘‘నాకేమీ కాలేదు...దయచేసి అందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లండి. రైటర్ గారూ! మీరోసారి ఇలా రండి.’’ అంటూ తన గది లోకి వెళ్ళి కూర్చున్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

రైటర్ వినయంగా వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు.

‘‘ఏమైంది? మన వాళ్ల నుండి ఏమైనా ‘ఆమె’ గురించి ఆచూకీ తెలిసిందా?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘లేదు సార్ కానీ, ఆమెని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా ఆమె ఫొటోని గుర్తు పట్టారు.’’ చెప్పాడు రైటర్.

‘‘ఎవరు?!....ఎవరెవరు ఆమెని గుర్తు పట్టగలుగుతున్నారు.’’ అడిగాడు ఎస్సై.

‘‘కొండపైన వరహాల శెట్టి రూఢీ గా ఈ ఫొటోలో ఉన్నది ఆమే అని చెప్పాడు సార్. హాస్పిటల్ లో ఉన్న యువకుల్ని కూడా కలిసాను సార్. వాళ్ళు కూడా వాళ్ళని గాయ పరిచింది ఈమేననిని వాంగ్మూలం ఇచ్చారు సార్. చివరికి కాంప్లెక్స్ లో ఉండే యాచకులంతా తమకు రగ్గులు ఇచ్చింది. ఆ రాత్రి తమతో గడిపింది ఈమె అని గట్టిగా చెప్పారు సార్!’’ చెప్పాడు రైటర్.

‘‘ఇంకా...మిగతా వారెవరూ ఆమె ఆచూకీ చెప్పలేక పోయారా?’’ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘ఒకతను...మెట్ల దారిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ పూజారి మాత్రం ఆమెని చూసానని.  ఈ ఫొటోలో ఉన్నది ఆమెనని చెప్తూ ఒక కొత్త విషయం చెప్పాడు సార్’’ అన్నాడు రైటర్.

‘‘ఏమిటా కొత్త విషయం?’’ ఆతృతగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.    

(మధ్యలో ఎస్సై అక్బర్ ఖాన్ పై దాడి చేయబోయిన వ్యక్తి ఎవరు? ఏ ఆచూకీ తెలియకుండా తననట తానే మృత్యు ఒడిలోకి జారిపోయిన ఆవ్యక్తి వివరాలు ఎలా తెలియాలి.....ఆమె గురించి వరహాల శెట్టి చెప్పిన వివరాలు కేసు దర్యాప్తుకి ఎంతవరకూ పనికొచ్చాయి? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్