Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
will watch at home

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు, విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu tour

బృహధీశ్వరాలయం,శ్రీరంగం
బృహధీశ్వరాలయం గురించి చెప్పుకుంటున్నాం కదా!

ఈ కోవెల యీశ్వరునిదే అయినా విష్ణుమూర్తి, పరాశక్తి కి కూడా ప్రాముఖ్యత యిచ్చి కట్టినట్లు యిక్కడ వున్న విగ్రహాలను చూస్తే తెలుస్తుంది. విగ్రహాలు అని వీటిని అనొచ్చా? సజీవంగా మన ముందు నిల్చున్నట్లున్న మూర్తులు, ఒక్కమారు నిద్ర లోంచి లేచి కాలో చెయ్యో కదుపుతారేమో అని అనిపించక మానదు. ఆ చెక్కడంలో శిల్పులు చూపిన నైపుణ్యం నేనేమని చెప్పగలను, అవయవాలను మలచిన తీరుగాని, దుస్తులు, ఆభరణాలు, ముంగురులు, సిగ యెన్ని చెప్పను, దేనికదే సాటి. మొత్తం మందిరం 240 మీటర్ల పొడవు, 121.9 మీటర్ల వెడల్పు గల చతురస్రాకారపు రాతి గద్దె పై నిర్మింప బడింది. ఈ మందిర నిర్మాణం ‘కుంజర మల్లన్ రాజ రాజ పెరు అచ్చన్‘ అనే అతని నేతృత్వంలో జరిగినట్లు గా చరిత్రలో లిఖించ బడింది.

ముఖ్య మందిరానికి ఎదురుగా ‘నంది మండపం‘ లో వున్న నంది ఎంత సజీవంగా వుంటుందో చెప్పలేం. ఆ నందిని తాకకుండా ముందుకు పోలేం. నంది విగ్రహానికి చుట్టూరా ఫెన్స్ కట్టబడింది. 2 మీటర్ల యెత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు వున్న యీ నంది బరువు 25 టన్నులు, నంది ఏక శిలా నిర్మితం. నంది విగ్రహం, నంది మెడకు కట్టిన గొలుసులు, గంటలు నిజంవేమో అని అనిపిస్తాయి. బసవన్నా అని పిలవగానే రంకెవేస్తూ లేస్తాడేమో అన్నట్లు వుంటుంది. ఈ మందిరంలో వున్నన్ని నంది విగ్రహాలు మరెక్కడా చూడ లేదు. వందకు పైబడి చిన్నా పెద్దా నంది విగ్రహాలు వున్నాయి.

నంది మండపానికి యెదురుగా మహా మండపం, అక్కడకి చేరుకోడానికి రాతి మెట్లు అంటే మహా మండపం నంది మండపం కన్నా ఎత్తులో వుంటుంది. మహా మండపంలో స్థంభాలు వాటి మీద వున్న శిల్పాలు, ఆర్చ్ లు మెడ నొప్పులు పెడుతున్నా తల కిందికి దించాలని అనిపించదు. ఒక్కో స్థంభం మీదా యెన్నెన్నో దేవతా విగ్రహాలు, లోపల బృహత్ శివలింగం, మన దేశంలో వున్న అతి పెద్ద శివలింగం ఇదేనేమో. ఈ శివ లింగం కూడా ఏక శిలా నిర్మితమట, ద్వారానికి యిటూ అటూ నిలబడ్డ నిలువెత్తు ద్వార పాలకులు, ఈ మందిరంలో వున్నంత సేపూ యీ శిల్పాలను చెక్కిన శిల్పులను యెన్ని మార్లు తలచుకుంటామో లెక్క లేదు.

ఈ మందిరంలో చూడ వలసిన మరో పెద్ద విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కంచు నటరాజు.
ఉప మందిరాలలో వినాయకుడు, కార్తికేయుడు, సభాపతి, దుర్గ, సంధికేశ్వరుడు వుంటాయి.
గర్భగుడి వెలుపలి గోడకు దక్షిణామూర్తి, లింగోద్భవం, భైరవి, సరస్వతి, దుర్గ, వినాయకుడు, విష్ణుమూర్తి, గజలక్ష్మి, శివపార్వతులు, భిక్షాటన, వీరభద్ర, కాలకంఠ, నటరాజ, చంద్రేశ్వర, అర్ధనారీశ్వర, గంగాధర, శివాలింగన మూర్తి ముఖ్యంగా చూడదగ్గవి.
ఈ విగ్రహాల ముఖాల లోని హావ భావాలు చూడ ముచ్చటగ వుంటాయ. ముఖ్యంగా లింగోద్భవంలో దేవీ దేవతల ముఖాలలో విస్మయం, దక్షిణా మూర్తి లోని శాంతం, అలంకరించుకుంటున్న అప్సరస ముఖం లోని విలాసం యిలా అన్ని మూర్తుల లోనూ ముఖాన్ని చెక్కడంలో శిల్పులు చూపిన నైపుణ్యం అద్భుతమనే చెప్పాలి.

ఇక రెండో అంతస్తులో వున్న 81 నాట్య భంగిమలు చూసి తీరాలి తప్ప వర్ణించడం నా వల్ల కాదు.
భరత నాట్య శాస్త్రం ప్రకారం 108 నాట్య భంగిమలు వున్నాయి, అందులో 81 భంగిమలను శిల్పులు యెందుకు చెక్కారు, మిగతా వాటిని విడిచి పెట్టడం వెనుక యేమైనా కారణాలు వున్నాయా? లేక శిల్పులు 108 చెక్కితే కొన్ని ప్రైవేటు ఆస్తులుగా మారాయా? లేక విదేశాలకు తరలించ బడ్డాయా? అన్న ప్రశ్నలు నన్ను వేధించేయి.

చాలా చోట్ల మందిరం లోని విరిగిన శిల్పాలకు చేసిన అతుకుల పని చాలా అసహ్యంగా కనిపించింది.
మైసూరు సుల్తానుల దండయాత్రలలో హిందూ మందిరాలను ద్వంసం చేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యమవడంతో చాలా చోట్ల మందిరాలు బాగా దెబ్బతిన్నాయి, కొన్ని మందిరాలు నేల మట్టమవగా కొన్ని మసీదులుగా మార్చబడ్డాయి (ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో) ఆంగ్లేయుల పరిపాలనలో ఆంగ్లేయులు శిల్ప సంపదను పరిరక్షించాలనే సంకల్పంతో ఖండిత శిల్పాలకు అతుకులు వేసేరు, కాని అతుకుల పని అసహ్యంగా వుంది. ఈ మందిరంలో దిక్పాలకులు ఎనిమిది మందికి ఎనిమిది మందిరాలు నిర్మించేరట, దిక్పాలకుల శిల్పాలు ప్రతిష్టించేరట, అలాగే సప్తమాతృకల విగ్రహాలు వుండేవట, ఇప్పుడు మాత్రం సూర్యుడు, చంద్రుడు, వారాహి దేవతల ఖండిత శిల్పాలు మాత్రమే వున్నాయి.

బయటి ప్రాకారం గోడకి గదులు కట్టబడి వున్నాయు, ఈ గోడలపైన తూటా దెబ్బలు కూడా కనబడతాయి. 12 వ శతాబ్దంలో ఫ్రెంచ్ వారికి ఆంగ్లేయులకు జరిగిన యుధ్దంలో ఫ్రెంచ్ వారు యీ కోవెలని ఆయుధాగారంగా ఉపయోగించుకున్నారట. ఆ యుధ్దం సమయం లోనే ఫ్రెంచి వారు  ప్రహరీ గోడ నిర్మించేరుట, ఆ సమయములోనే మందిరం చుట్టూ వున్న కందకం తవ్వించేరేమో? మందిరం లోపల చేతి పనుల వస్తువుల అమ్మే దుకాణాలు వున్నాయి.

ఈ మందిరం యెంతచూసినా తనివితీరదు.
బృహధీశ్వరాలయం లో జరిగే భరత నాట్యోత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందేయి.
ప్రతీ సంవత్సరం జరిగే త్యాగరాజోత్సవాలు 15 కిలోమీటర్ల దూరంలో వున్న ‘తరువైయారు‘ లో జరుగుతూ వుండడం వల్ల తంజావూరు ముఖ్య కూడలిగా రూపుదిద్దుకుంది.

ఇంక తంజావూరుకి చుట్టు పక్కల వున్న ముఖ్య మందిరాల గురించి చెప్పుకుందాం. తమిళనాడు గురించి తలచుకోగాన ముందుగా మనకి గుర్తొచ్చేవి బృహధీశ్వరాలయం తరువాత శ్రీరంగం. మనం కూడా ఆ క్రమంలోనే వెళదాం.

తంజావూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న శ్రీ రంగం లో బ్రహ్మాండమైన విష్ణు మందిరం వుంది. వైష్ణవులు దీనిని ఇలలోని వైకుంఠంగా భావిస్తారు. ఈ మందిరంలో రంగనాథ స్వామి కొలువై వున్నాడు.

తంజావూరు నుంచి శ్రీరంగం వెళ్లే దారంతా వరి పొలాలు, అరటి తోటలు కొబ్బరి తోటలతో  పచ్చగా వుంటుంది. శ్రీరంగం కావేరి, కావేరీ యొక్క ఉప నదుల మధ్యలో చిన్న ద్వీపంలా ఏర్పడిన ప్రదేశం కాబట్టి నేల మంచి సారవంతమై వరి సాగుకి అనుకూలంగా వుంటుంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఓ పది కిలోమీటర్ల దూరం నుంచి కొబ్బరి తోటల మధ్య నుంచి కోవెల గోపురం కనిపిస్తూ వుంటుంది.

చెన్నై నుంచి శ్రీరంగానికి రైలు మార్గం కూడా వుంది.
ప్రపంచంలో పూజలు జరుగుతున్న మందిరాలలో యిది అతి పెద్ద మందిరంగా చరిత్రలో ప్రసిధ్దికెక్కింది. శ్రీరంగాన్ని దర్శించుకోని వైష్ణువులు ఇలలో వుండరు. వైష్ణవుల 108 దివ్య దేశాలలో ఇది అతి ముఖ్యమైనది. ఈ మందిరంరంలో శ్రీరంగ నాథుడు శేష తల్పం మీద నిద్రిస్తున్నట్లుగా వుంటాడు.

నాయనార్లలో ప్రసిధ్దులైన నాదముని, యమునాచార్యులు, రామానుజాచార్యులు తమ భక్తి తత్వాన్ని యిక్కడ నుంచే మొదలు పెట్టినట్లుగా వైష్ణవులు చెప్తారు.

ఈ మందిరం పూర్తిగ ద్రవిడ శిల్పకళతో నిర్మింప బడింది. సుమారు 155 ఎకరాల విస్తీర్ణంలో 50 మందిరాలు, 21 గోపురాలు, 39మండపాలు ఎన్నో పుష్కరిణిలతో నిర్మింప బడింది. ఈ మందిరం 14 వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో పాంఢ్య రాజ్యం లోని మందిరాల వలె పడగొట్ట బడింది. దేవుని ఆభరణాలు కొల్లగొట్టబడ్డాయి. 14, 16 శతాబ్దాల మధ్య ఈ మందిరం మరుగున పడి పోయింది, తిరిగి 16, 17వ శతాబ్ధాలలో ముందువున్న మందిరం కంటే పెద్ద మందిర నిర్మాణం చేసినట్లు చరిత్ర కారుల అంచనా.

కావేరి నదీ తీరాన వున్న పంచరంగ క్షేత్రాలలో యిది ఆఖరుది, దీనిని అంత్య రంగ క్షేత్రమని అంటారు. మొదటది ఆది రంగక్షేత్రంగా పిలువ బడే శ్రీరంగ పట్నం.

శ్రీరంగం గురించిన మిగతా వివరాలు వచ్చేసంచికలో చదువుదాం...

మరిన్ని శీర్షికలు
gandhi jayanti cartoons